6, ఏప్రిల్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 669 (కనము, వినము, పలుకము)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.


ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. శ్రీగురుబ్యోనమ:

    గురువుగారూ చందస్సు అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
    ఆటవెలది, తేటగీతిలోను ప్రయత్నించవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. కవి మిత్రులకు మనవి....
    ఈ జోజు సమయాభావం వల్ల కొన్ని వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడం కాని, నిన్నటి పూరణలను పరామర్శించడం కాని చేయలేక పోతున్నాను. మన్నించండి. వీలైతే సాయంత్రం వ్యాఖ్యానిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుబ్యోనమ:

    వినయము కలిగినవారై
    జనులకు హితములను గూర్చు చరితార్థులకున్
    అనుచితమనదగు విషయము
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  5. పెను దిశలఁ దనువు లాగుచు
    మనమున భారమ్ము మోప మాయా వశమై
    తన యింద్రియములు ; ధృతితో
    కనము వినము పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి
  6. అనయము త్రికరణశుద్ధిగ
    దనుజత్వము దల్పజేయు దారుణకృత్యా
    అనుచితవాక్యాలెన్నడు
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  7. టైపు చేయడంలో చిన్న పొరపాటు జరిగింది. నావ్యాఖ్యను క్రింది విధంగా సవరించ వలసినదిగా ప్రార్థన.
    అనయము త్రికరణశుద్ధిగ
    దనుజత్వము దల్పజేయు దారుణకృత్యా
    లనుచితవాక్యాలెన్నడు
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  8. మన గాంధీజీ సూక్తుల
    హనుమంతుని భక్తు లనట నా సంజ్ఞలతో
    కనుడీ యవ్వారికి చెడు
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    కనము వినము పలుక మనెడు జ్ఞానులకు న
    తుల్ పొనర్తు వారి త్రోవలోనె
    నడతు మెన్నడేని చెడు విషయమ్ముల
    కనము వినము పలుకగా దలపము

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు. నాదొక చిన్న మనవి. ఒక బ్లాగు నిర్వాహకులుగా మీ బాధ్యత మీకు గలదు. అందుచేత ఇందు పాల్గొనుచున్న ప్రతి ఒక్కరు తమ తమ పేరును తప్పక ప్రకటించవలసినదే. ఆకాశ రామన్న పలకులకు ఇందు ఎటువంటి తావు నీయ నక్కరలేదు. అజ్ఞాత అనే పేరుతో వచ్చిన వాటినన్నిటినీ మీరు ఎట్టి మొగమాటము లేకుండా తొలగించవలసిందే. స్వఛ్ఛందముగా తమ పేరు ప్రకటించుచూ ఎవరు పాల్గొంటే వారిని మాత్రమే మీరు ఆదరించవచ్చును. ఈ విషయములో నేను నా యొక్క పరిధిలోనే ఉన్నాను అనుకొనుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. తనువును కృశింప జేయుచు,
    మనము మఱియు నింద్రియములు మాయలె యనుచున్,
    ఘనులగు ఋషులై మనుచున్
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గారికి,
    నమస్సులు. మీకు ఒక మెయిల్ ద్వారా కొన్ని పద్యాలు పంపి యున్నాను. దయయుంచి చదవ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  12. శ్రీమతి లక్ష్మీదేవి గారి పూరణ చాల బాగున్నది. మంచి భావము. శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మనజన్మము దుర్లభమది
    ఘనతను పొందంగ వలయు కర్మల వలనన్
    కనుకన్ చెడుసంగతులను
    కనము, వినము, పలుక మనెడి జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  14. నావ్యాఖ్యను క్రింది విధంగా సవరించ వలసినదిగా ప్రార్థన.
    మనపుట్టుక దుర్లభమిది
    ఘనతను పొందంగ వలయు కర్మల వలనన్
    కనుకన్ దుస్సంగతులను
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  15. అనయము మంచిని జేతును
    వినయముగా నుండు నెపుడు పెద్దల యె డ లన్
    ననుచిత భావపు భాషను
    కనము వినము పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి
  16. గనులు తినెడి ఘనులు మరియు
    జనుల ధనము తినెడి ఘనులు జాతికి బరువై
    కనుల యెదుట నడయాడగ
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్!!

    ("నతుల్" > వ్యంగ్యార్థములో)

    రిప్లయితొలగించండి
  17. ఈనాటి సమస్యకు నా పూరణం:

    కం. ధ్యానము యోగము వినుమా!
    అనుదిన మభ్యాసమిచ్చు ఆరోగ్యములన్
    ధ్యాన పరులయ్యు, చెడులను
    కనము,వినము,పలుకమ నెడు జ్ఞానులకునతుల్.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ జి. సహదేవ్ గారూ!
    అయ్యా మీరు ప్రాస నియమమును పాటించలేదు. 2వ అక్షరము "న" వేసినంత మాత్రమున చాలదు. దానికి ముందున్న అక్షరము అన్ని పాదములలో ఒకే లాగున ఉండవలెను - అనగా ప్రతి పాదములోని తొలి అక్షరము దీర్ఘముగా నయినను లేక హ్రస్వముగ గానైనను ఉండాలి. 1 3 పాదములలో తొలి అక్షరము దీర్ఘము మరియు 2, 4 పాదములలో తొలి అక్షరము హ్రస్వమును మీరు వేసేరు. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. కనక కశిపు నానతిపై
    జనులందరు వాని పేరు జపియించు తరిన్
    ఘనమైనను హరి యితరము
    కనము,వినము,పలుకమ(నిన) నెడు జ్ఞానులకునతుల్.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ఈ నాటి సమస్యలో యతి సరిపోయినదా ?
    యిది యే యతి యనబడును ?
    దయజేసి వివరించమని ప్రార్థన !

    రిప్లయితొలగించండి
  21. మనుజులయందున మాసరి - ( కనము )
    నినుగెల్చితిమిదియెచూడు నిజమను పల్కుల్ - ( వినము )
    వినకూడని విషయంబుల - ( పలుకము )
    కనము, వినము, పలుక, మనెడు జ్ఞానులకు నతుల్.

    నిజము + అను పల్కుల్

    ముఖ్యంగా శ్రీ తిరుపతి వేంకటకవులను దృష్టిలో పెట్టుకొని వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ వసంత కిశోర్ గారికి,

    నమస్సులు. క - "క" వర్గానికి ( క, ఖ, గ, ఘ, జ్ఞ ) యతి చెల్లుతుంది. సర్వప్రధాన యతి. అదే విధంగా చ - "చ" వర్గానికి ( చ, ఛ, జ, ఝ ఞ ) లకు యతి చెల్లుతుంది. సర్వప్రధాన యతి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీయుతులు పండిత నేమని గార్కి,
    కృతజ్ఞతలు.నా పూరణమును సరిజేయుచున్నాను.
    కం. వినుమా ధ్యానము యోగము
    అనుదిన మభ్యాసమిచ్చు ఆరోగ్యములన్
    ఘన సాధన జేయుచు, చెడు
    కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ సరస్వత్యై నమః:
    శ్రీ వసంత కిశోర్ గారూ! నమస్కారములు.
    "జ్ఞ" అనే అక్షరమునకు ఈ క్రింది అక్షరములతో యతి సరిపోవును:

    క, ఖ, గ, ఘ, చ, చ, జ, ఝ, శ, ష, స, న, ణ

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ సరస్వత్యై నమః:
    శ్రీ జి. సహదేవ గార్కి నమస్కారములు:

    ప్రాస గురించి మరియు, యతి గురించి వివరములను మీరు తెలుకొనవలెనన్నచో తగిన పుస్తకములను చదవండి. ఆలాగుననే పురాతన కవుల కావ్యములను చదవండి. మంచి ధారాశుద్ధి కూడ మీకు అలవడును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. శ్రీయుత పండిత నేమని గారి సలహా నా లాంటి వారికి మిగుల ఆచరణీయం. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! ఈనాటి సమస్యను అందరూ ఒకే స్ఫూర్తితో పూరించేరు. చెడును కనము, వినము, పలుకము అనుచూ. గాంధీజీ సూక్తి "చెడు కనవద్దు, వినవద్దు, పలుకవద్దు" 3 కోతుల బొమ్మలు పెట్టి ఇలాగే ఉంటుంది - అదే ఈ సమస్యకు ఆధారము.

    1. శ్రీ శ్రీపతి శాస్త్రి గారికి ముందుగా ఇది ఏ ఛందస్సో అనుమానము వచ్చినది. అయినా పూరణ బాగున్నది - అనుచితమనదగు విషయము కనము .. .. అని పూరించేరు.

    2. తమ్ముడు డా. నరసింహమూర్తి శారీరిక, మానసికములైన ఇబ్బందులలో నుండునెడ ధైర్యముతో కనము .. .. అని పూరించెను. బాగున్నది.

    3. శ్రీ సత్యనరాయణ మూర్తి గారు : 2 విధములుగ పూరించేరు. బాగున్నవి.

    4. శ్రీమతి లక్ష్మీ దేవి గారూ ఋషి విధానమును ప్రస్తావించేరు. చాల బాగున్నది.

    5. శ్రీ సుబ్బా రావు గారు అనుచిత భావపు భాషను కనము -- -- అని పూరించేరు. బాగున్నది.

    6. శ్రీ జిగురు సత్యనారయణ గారు క్రమాలంకారముతో వ్యంగ్యార్థముతో నేటి సమాజిక ధోరణిని ప్రస్తావించేరు. చాల బాగున్నది.

    7. శ్రీ సహదేవ్ గారు చెడును కనము -- అని పూరించేరు. బాగున్నది.

    8. శ్రీ మిస్సన్న గారు - హిరణ్యకశిపుని పాలనను వ్యాఖ్యానించేరు. బాగున్నది.

    9. శ్రీ సంపత్కుమార శాస్త్రి గారు క్రమాలంకారముతో పూరించేరు. బాగున్నది.

    అందరకీ శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    నేటి పూరణలన్నిటిలోనూ మీ పూరణ సందర్భోచితంగా, యదార్థ భావాన్ని ప్రతిబింబిస్తూ అలరారుతున్నది.

    రిప్లయితొలగించండి
  29. సంపత్ కుమార్ శాస్త్రిగారికీ నేమానివారికీ ధన్యవాదములు !
    అయ్యా !
    నా అఙ్ఞానానికి మన్నించాలి !

    అనుస్వారయతి (బిందుయతి): ప్రతివర్గములోను మొదటి
    నాలుగక్షరములకు పూర్వము నిండుసున్న లున్నచో
    వానికి ఆయా వర్గానునాసికముతో యతి చెల్లును !

    పైగా అక్కడ కనుపించు చున్నవి రెండూ కూడా"చ" వర్గా క్షరములు !
    దీనికి "క,ఖ, గ ,ఘ "లతో యతిమైత్రి ఎలా కుదురుతోందో
    నాకర్థం కావడం లేదు !

    రిప్లయితొలగించండి
  30. తనలోని పరమాత్మను గని
    మనసున తపియించి తనరు మహాత్ములకున్ !
    తనమన ప్రాణము మాయని
    కనము , వినము , పలుక , మనెడు , జ్ఞానులకు నతుల్ !

    రిప్లయితొలగించండి
  31. శ్రీ సరస్వత్యైనమః:
    శ్రీ వసంత కిశోర్ గారికి నమస్కారములు.
    నేను ప్రస్తావించినది "జ్ఞ" అను అక్షరమునకు ఏ ఏ అక్షరములతో యతి చెల్లుతుందో అని మాత్రమే. అనుస్వార యతికి దీనికి ఎట్టి సంబంధము లేదు. మీరు ఒకదానికి మరొకటి కలుపకండి. నేను చెప్పినది ఔనో కాదో పూర్వ కవుల ప్రయోగములను బట్టి నిర్ధారించుకొనండి. ఎట్టి ప్రమాణము లేనిదే నేను ఎన్నడూ ఏ విషయము గురించి మాటాడను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  32. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    "జ్ఞ" అను నక్షరమునకు యతి గురించి ఈ క్రింది సూత్రములు గలవు:

    1. తద్భవ వ్యాజ యతి: దీని ప్రకారము జ్ఞ కు న మరియు ణ లతో యతి చెల్లును.

    ఉదా: జ్ఞాని చేతోంబుజాత శోణకర యనగ
    జ్ఞాతి విద్వేషి నృపనాశనకర యనగ

    2. విశేష యతి: జ్ఞ కారమునకు క, ఖ, గ, ఘ లు యతి చెల్లును.

    ఉదా: జ్ఞానికి నుపదేశ విధి బ్రకాశము సేయం

    ఈ విశేషయతి ప్రకారము బిందుపూర్వకము కాకుండగనే కకారాదులు జ్ఞకారమునకు యతి చెల్లును.

    3. సంయుక్త యతి: జ్ఞ సంయుక్తాక్షరము కావున చ, ఛ, జ, ఝ, శ. ష, శ లతో కూడ యతి చెల్లును.

    ఈ విషయములు తెలుగు అకాడెమీ వారి ప్రచురణ: ఛందః పదకోశము అను గ్రంథమునుండి గ్రహింపబడినవి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. మా అన్నగారి భావమునే ,నా చిన్ని బుఱ్ఱ భాషలో ;

    వనచరములు మూడింటిని
    ఘనతరముగ దిద్ది నాడు గాంధీ నాడున్
    అనువర్తనఁ జెడు నెప్పుడు
    గనము,వినము,పలుకమనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి
  34. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ......

    వినుమా మేమీ నియమము
    ననవరతము విడువ బోము ననుచును భువిలో
    మనసున నిగ్రహమున చెడు
    కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

    రిప్లయితొలగించండి
  35. నేమానివారికి
    శ్రమకోర్చి నా సందేహమును తీర్చినందులకు
    ధన్యవాద వందన శతములు!
    నా వద్ద నున్న "సులక్షణ సారము" లో ఈ విశేష యతి గురించిన వివరములు
    లేనందువలన ముమ్ములను శ్రమ పెట్టవలసి వచ్చినది !
    సులక్షణ సారమున లేనివీ , అప్పకవీయమున గలవని ఒక 8 వళ్ళ పేర్లను మాత్రము చెప్పుట జరిగినది ! అందీ విశేషయతి కూడా గలదు !
    ఒఠ్ఠి పేరుమాత్రమే గలదు ! వివరములు లేవు !

    వీలయిన ఈ క్రింది మిగిలిన 7 వళ్ళకు వివరములు చెప్ప గోరెదను !
    1)ప్రాణి విరామము
    02)అనుస్వార సంబంధ యతి
    03)అనునాసికాక్షర యతి
    4)ప్రత్యేక యతి
    5)రాగమ సంధి వడి
    6)పంచమీ విభక్తి యతి
    7)ప్లుతయుగ విశ్రమము
    8)విశేషవళి
    మరియొకసారి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  36. ధనకనకాదుల నెప్పుడు,
    వినదగని పలుకుల నెపుడు వీనుల తోడ,
    న్ననృత వచనముల నెప్పుడు,
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి
  37. ధృతరాష్ట్రుఁడు:

    మనమున సోనియనుంచుచు
    తనమాటయె యాజ్ఞయనుచు తత్పరమౌచున్
    తననెదురించెడి వాక్యము
    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్

    రిప్లయితొలగించండి