7, ఏప్రిల్ 2012, శనివారం

సమస్యాపూరణం - 670 (కౌగిలింతలే కవులకు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కౌగిలింతలే కవులకు ఘనత నొసఁగు!

ఈ సమస్యను సూచించిన గుండా సహదేవుడు గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. సరస శబ్దార్థ వైచిత్ర్య సరళి మెరయ
    కావ్యరత్నమున్ వెలయించు కతన వేడ్క
    శ్రీ యశోభామ తమకాన జేరి గూర్చు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు

    రిప్లయితొలగించండి
  2. సరస శబ్దార్థ వైచిత్ర్య సరళి మెరయ
    కావ్యరత్నమున్ వెలయించు కతన వేడ్క
    శ్రీ యశోభామ తమకాన జేరి గూర్చు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు

    రిప్లయితొలగించండి
  3. అద్భుతం గా చెప్పారండి.కవుల యశోభామ గురించి.
    ఇప్పుడు మాతృవాత్సల్యము చూడండి.

    వివిధ పదజాల నైపుణి వేడ్కసేయు
    కవుల, కవయిత్రి గణముల కనినవేళ
    పలుకు తల్లి వాత్సల్యము బరగ నిచ్చు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు.
    2
    హనుమ! వినుమయ్య , నీవిక ననుజుడయిన
    భరత సముడవనుచు రామ భద్రుడిచ్చె
    కౌగిలింత; లేకవులకు ఘనత నొసగు
    రామ కథలను పలుకుట రమ్యముగను.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ వారి చిలిపి తనములే శ్రీ మతి కి మోదము నొసగు
    భ్రమర ఝుంకారమే పువ్వుకు తమక మొసగు
    జయ జయ నాదములే నాయకునికి ఇంపు నొసగు
    మెచ్చుకోలు కౌగలింతలే కవులకు ఘనత నొసగు !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. నేమాని వారూ , లక్ష్మీదేవిగారూ
    మహా అద్భుతంగా చెప్పారు కౌగిలింతల గురించి !

    రిప్లయితొలగించండి
  6. 1. అదను చూపించి, సంతోష మెదను నింపి
    మలయమారుత మందించు మహితములగు
    కౌగిలింతలే - కవులకు ఘనతనొసగు
    కావ్యసృష్టిని చేయించు క్షణము లోన.
    2. లలితపదముల భావజాలమ్ముతోడ
    చేయబడినట్టి రచన సుస్థిరత నంద
    సంతసంబున సద్యశ:కాంత యిచ్చు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు.

    రిప్లయితొలగించండి
  7. ప్రేమ గొప్పది పావన మైన దిలను
    ప్రేమ చిహ్నంబు జంటల ప్రేమి కులకు
    కౌగి లింతలే , కవులకు ఘనత నొసగు
    కావ్య రచనంబు రసమయ కలిత మైన .

    రిప్లయితొలగించండి
  8. తే. గీ. సరస సాహిత్య గోష్టుల మెరయ బల్క!
    శిష్య కవులను దీవించు శ్రేష్టు లైన
    గురుగణంబుల వాత్సల్య పూరి తంపు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు.

    పెద్దలకు ప్రణామములు తప్పులున్న తెలియజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సరస్వత్యైనమః:
    శ్రీ జి. సహదేవ్ గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యమునకు ఈ క్రింది సవరణలు సూచించుచున్నాను.

    1. శ్రేష్ఠులు (ఒప్పు) శ్రేష్టులు (తప్పు)
    2. 3వ పాదములో ప్రాస యతి వేద్దామనుకొనినారు. సరిపోలేదు. పాదమును ఇలాగ మార్చండి:
    "గురుగణంబుల వాత్సల్య భరితములగు"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. మదిని విరిసిన భావముల్ మమత లిడగ
    కావ్య కన్యను గారాబు కూతు రనుచు
    పోతనంతటి భక్తుడు పొంగి పోవ
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు !

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శ్రీ సహదేవ గారూ!
    గోష్ఠి (ఒప్పు) గోష్టి (తప్పు) గా తెలిసి సవరించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    అయ్యా శ్రీ వసంత కిశోర్ గారూ! నమస్కారములు.
    నా యొద్దనున్న ఛందః పదకోశము అనే పుస్తకము నుండి మీరడిగిన విషయములకు వివరములను వ్రాయుచున్నాను.

    1. ప్రాణి విరామము:
    హల్లులతో కూడియున్న అచ్చులకు కూడా మైత్రి యుండవలెను. అందుచేత ఇది ప్రాణియతి అని చెప్పబడినది: (ప్రాణులు = అచ్చులు).
    ఉదా: కలశాబ్ధి గంభీర కాంచనాచల ధీర
    కాళియోరగవైరి కైటభారి

    2. అనుస్వార సంబంధ యతి:
    బిందుపూర్వకములైన టవర్గములోని మొదటి 4 అక్షరములు (ంట, ంఠ, ండ, ంఢ) అట్లే బిందుపూర్వకములైన తవర్గములోని మొదటి 4 అక్షరములకు (ంత, ంథ, ంద, ంధ) క్రమ నిరపేక్షముగా యతి చెల్లును.
    ఉదా: .. .. ..పెక్కు చం
    దాలం బండు నొకప్పుడున్ దరుగదింటంబాడియున్ బంటయున్

    3. అనునాసికాక్షర యతి:
    టవర్గములోని మొదటి 4 అక్షరములు బిందుపూర్వకములై (ంట, ంఠ, ండ, ంఢ) నకారమునకు, అట్లే తవర్గములోని మొదటి 4 అక్షరములు బిందు పూర్వకములై (ంత, ంథ, ంద, ంధ) ణకారమునకు యతి చెల్లును.
    ఉదా: మనుసంతతి మండన భం
    డన నిర్జిత కార్తవీర్య నరనాయక ఖం
    డన పంక్తిస్యందన నం
    దన చందన చక్రవారణల సత్కీర్తీ!

    రిప్లయితొలగించండి
  13. పెద్దల సలహా ప్రకారం సవరణ:
    ఆంగ్లములో టైపు చేయటము వలన జరిగిన తప్పులకు చింతిస్తూ,
    తే.గీ. సరస సాహిత్య గోష్ఠులమెరయఁబల్క!
    శిష్య కవులను దీవించు శ్రేష్ఠులైన
    గురు గణంబుల వాత్సల్య భరిత ములగు
    కౌగిళింతలే కవులకు ఘనత నొసగు

    రిప్లయితొలగించండి
  14. ప్రత్యేక యతి:
    ఒక పదములో 'అదీ అను పదమునకు జరుగుసంధి వికల్పము. సంధియందు అది, అని లోని అకారములు లోపించును. లోపించని యప్పుడు యకార మాగమ మగును. ఉదా: చేతి + అది = చేతిది, చేతియది. ఇట్టి ఉభయ రూపములలో రెందవ రూపమునందు "య" కారమునకే యతి చెల్లును. ఇట్లు యతిచెల్లినచో 'ప్రత్యేకయతీ అని అప్పకవి చెప్పినాడు.
    ఉదా: అరయ శార్ఙంబు హరిచేతియది యనంగ
    దివ్య చాపంబు శూలిచేతిది యనంగ

    రాగమ సంధి యతి:
    బీద + ఆలు, జవ + ఆలు వంటిచోట రేఫాగమము వచ్చి బీదరాలు, జవరాలు ఇత్యాదిగా సంధిరూపము లేర్పడును. ఇట్టి రాగమ సంధి రూపములలో ఉత్తర పదాద్యచ్చుకేకాక ఆగమముగా నున్న రేఫకు కూడా యతిచెల్లును.
    ఉదా: ఈ లలన వేలుపుం జవ
    రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో

    2. ఇంతలు కన్నులుండ .. .. .. యే
    కాంతము నందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా

    రిప్లయితొలగించండి
  15. నవరసమ్ముల నింపి గుణాదులుంచి,
    వక్రతౌచిత్య ధ్వని రీతి పంక్తిగూర్చి,
    ధన్య కావ్యమ్ము చెప్పుట నన్న్య కవుల
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు !

    రిప్లయితొలగించండి
  16. 1-వ పా. "నవరస ... గు + ణాదు (?) యథి?
    2-వ. పా. "వక్రతౌచిత్యధ్వని (?)" గణము?
    3-వ. పా. "నన్న్య" (?)

    రిప్లయితొలగించండి
  17. భారతీదేవి కరుణాప్రభావమందు
    నున్నతోన్నతవిద్యాప్రసన్నులైన
    పండితోత్తమ బుధజన భద్రజనుల
    కౌగిలింతలే కవులకు ఘనతలొసగు.

    భద్రము = శుభంకరము

    రిప్లయితొలగించండి
  18. శ్రీపార్వతీశ్వర శర్మగారూ,

    వక్రతౌచిత్యద్వని లో త్య గురువౌతుందండి. గణము కుదరదు.
    మొదటి పాదములో అఖండయతి వేశారనుకుంటాను.

    తప్పైతే క్షమించగలరు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    ఈనాటి సమస్యకు వచ్చిన పూరణములు మంచి శోభతో అలరారుచున్నవి.

    1. శ్రీమతి లక్ష్మీ దేవి గారి 2 పూరణలలోను వాత్సల్య భావము తొణికిస లాడుచున్నది. చాల బాగుగానున్నవి.

    2. ఎచ్.వి.సత్యనారాయణ గారు: 2 విధములలో పూరించేరు -- (1) పిల్ల గాలులు; (2) కీర్తి కాంత: చాల బాగున్నవి.

    3. శ్రీ సుబ్బారావు గారు మంచి విరుపుతో పూరించేరు. బాగున్నది.

    4. శ్రీ సహదేవ గారు శిష్యులయెడ గురువులకు ఉండే వాత్సల్యమును వర్ణించేరు. బాగున్నది.

    5. శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యమును ఇలా మార్చి వ్రాస్తున్నాను:

    కావ్యకన్యను కూతురుగా దలంచి
    మమతతో పొంగె పోతనామాత్య కవియె
    అటుల ననురాగభావమే యతిశయింప
    కౌగిలింతలే కవులకు ఘనత నోస్గు

    మీ భావము బాగున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    కావ్యములలోని భావపు కమ్మదనపు
    పదసుమమ్ముల గంధము పైన బడగ
    పొత్తముల మ్రొక్కి యెద దాక హత్తుకొనెడు
    కౌగిలింతలే కవులకు ఘనత నొసఁగు!

    ఒకమంచి కావ్యమును చదివి భావమును తెలిసికొన్నపుడు కలిగే ఆనందముతో ఆ గ్రంథమును కళ్ళకద్దుకొని హృదయమునకు హత్తుకొన్నపుడే కవి నిజమైన ఘనతపొందినట్లు భావిస్తాడు.

    రిప్లయితొలగించండి
  21. నమస్కారములు
    సవరణ జేసి నందులకు గురువులకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  22. కంది శంకర వర్యుల కవిత బ్లాగు
    శంకరాభరణమ్మిది శంక దీర్చి
    పద్య విద్యను నేర్పును పరగ దీని
    'కౌగిలింత' లేకవులకు ఘనత నొసఁగు.

    రిప్లయితొలగించండి
  23. నవరసమ్ముల నింపి గుణాదులుంచి,
    వక్రతౌచితీ ధ్వని రీతి పంక్తిగూర్చి,
    ధన్య కావ్యమ్ము చెప్పుట నన్న్య కవుల
    కౌగిలింతలే కవులకు ఘనత నొసగు !

    రిప్లయితొలగించండి