13, ఏప్రిల్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 676 (పతినింద గల్గించు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పతినింద గల్గించు పరమసుఖమ్ము.

(ఇది ద్విపద. మిత్రులు చేయవలసింది కేవలం పూర్వపాదాన్ని వ్రాయడమే. ఉత్సాహం ఉన్నవారు ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చు. మంజరీ ద్విపద వ్రాయకుంటే సంతోషం)

23 కామెంట్‌లు:

  1. ప్రథమ ప్రయత్నము.

    మతి లేని వాడొకొ మమ్మేలుచుండు;
    వెతలన్ని దీర్పవివేకము లేదు;
    సతతమ్ము పీడించు శని బోలిన నర
    పతినింద గల్గించు పరమసుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  2. క్షమించాలి . అసలే అంతంత మాత్రం . పైగా తొలి ప్రయత్నం
    -------------------------------------------------------------------
    సతిపతి సంతోష సరసమ్ము లాడ
    అతిగారవము నొంది యమితమై ప్రీతి
    మితిమీరి కోపమ్ము మింటనంటగను
    పతినింద గల్గించు పరమసుఖమ్ము

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గురువులకు,
    పెద్దలకు ప్రణామములు.

    భక్తు లై పరమేశు భావించువారు
    సక్తులు కారాదు సార్వభౌమాది
    నీచులు కల్పించు నిత్యభోగంబు
    లందు; వారిచ్చు బింబాధరాశ్వ
    కాందోళికాదులు నాత్మవ్యధకు ని
    మిత్తంబు; లందుచే మితిలేని మోహ
    చిత్తంబు నొందుట సేఁగి యెల్లఱకు;
    రాజులు మత్తులు; రాజుల సేవ
    రాజమార్గంబు నరక గతిఁ జేర;
    శ్రీకాళహస్తీశు సేవించు కంటె
    బ్రాకటం బగు ధర్మపథము లేదంచు
    స్తుతమతి ధూర్జటి ధూర్తులౌ భూమి
    పతి నిందఁ గల్గించు పరమసుఖమ్ము.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  4. అతిపారుషత్వంబులవియెప్పుడైన
    వెతలు పుట్టించును, విజ్ఞతనడచు,
    అతివరో! వినుమమ్మ యాత్మలోనైన
    సతులకేవేళను సలపంగరాదు
    పతినింద, గల్గించు పరమసుఖమ్ము
    పతిపాదసేవయే పత్నికెల్లపుడు
    సుతులను గతులను నుతులింకనొసగు
    సతతమైశ్వర్యంబు చక్కగానిచ్చు
    మితిమీర బోకంచు మిగులవత్సలత
    సుతకంత బోధించె సుదతియొక్కర్తె.

    రిప్లయితొలగించండి
  5. తరువోజ
    పతినింద కల్గించు పరమ సుఖమ్ము పత్ని కంచు దలంపు వ్యర్థమేయౌను
    పతిసేవలోననే పరమ సుఖమ్ము పడయుచునుందురు వసుధలో సతులు
    పతులు నిల్లాలిని పరమాదరమున భావించుటే శుభప్రదమను రీతి
    జతయౌచు శివుడును శర్వాణి యలరి క్షితి దంపతులను రక్షింతు రెల్లపుడు

    రిప్లయితొలగించండి
  6. మిత్రులార!
    నా పద్యము 4వ పాదములో పొరపాటు దొరలినది. 4వ పాదమును ఈవిధముగా మార్చుచున్నాను:

    జతయౌచు శివుడును శర్వాణి యలరి సతతమ్ము కూర్తురు జతలకు సుఖము

    రిప్లయితొలగించండి
  7. పతి చెంతలేనిచో పడతులకునుడు
    పతి నిందఁ గల్గించు పరమసుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  8. అతనుచెంతగలచోనన్యులననదు
    సతతము వానినే సాధించు గాన

    పతి చెంతలేనిచో పడతికింకనుడు
    పతి నిందఁ గల్గించు పరమసుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  9. నడిరేతిరి అయిన గూటికి రాకున్న
    మగడు ముసుగెట్టి నిద్దురోయిన
    సతి పతి వియోగ జీవనమ్మున
    పతినింద గల్గించు పరమసుఖమ్ము!


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  10. ఉడుపతి కన్నా - ఉడుగణపతి - అమోదయోగ్యమని బావిస్తూ -
    సవరణ చేస్తున్నాను.. మన్నించండి

    అతనుచెంతగలచోనన్యులననదు
    సతతము వానినే సాధించు గాన
    పతి చెంతలేనిచో పాపముడుగణ
    పతి నిందఁ గల్గించు పరమసుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  11. గుండా సహదేవుడు గారి పూరణ....

    రాతిని నాతిగా రాముడు జేయ
    పతిత పావన రామ ప్రార్ఠన సుఖము
    కారణ భూతుడౌ కాముకుడు సుర
    పతినింద గల్గించు పరమ సుకమ్ము

    రిప్లయితొలగించండి
  12. వెలదికి పతిసేవ వెలసె ధర్మముగ
    తొలినాటి నీతులు తలపంగ రాదు
    తలక్రిందులాయెను ధర్మమ్ము ,నీతి,
    కలికాలమిది కాదె కాలమ్ము మారె
    పతినింద కల్గించు పరమసుఖమ్ము.
    --------------

    రిప్లయితొలగించండి
  13. పత్ని సాధ్వి యైనను ప్రాణ హరణము
    పతి నింద గల్గించు , పరమ సుఖమ్ము
    భర్త పొగడి లాలించి పైటను లాగ
    యెంత వాడు నైనను నింతి ప్రియుడే .

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా!
    ఈనాటి పూరణలను పరిశీలించుదాము.
    1. శ్రీమతి లక్ష్మీ దేవి గారి ప్రథమ ప్రయత్నమే చాల బాగున్నది. శని గ్రహము వంటి నరపతి గురించి ప్రస్తావించేరు.
    2. శ్రీమతి రాజేశ్వరి గారు: అతి గారవము అనరాదు. దుష్ట సమాసము. అతి సుఖమ్మును అని సవరించ వచ్చు. సరసాలాపాలలో పతినింద కూడా మంచిదే అని వారి అభిప్రాయము. బాగున్నది.
    3. డా. ఏల్చూరి వారు: ధూర్జటి గారి శ్రీ కాళహస్తీశ్వర శతకములోని భావములను ఉట్టంకించేరు. బాగున్నది - భూమీపతి నింద అని వాడేరు. చిన్న బుగ్గ చుక్క కొట్ట వచ్చినట్టి కనిపించుచున్నది - 3వ పాదము ఒంటరిది అయిపోయినది. దాని జత కలిస్తే కదా ద్విపద అవుతుంది. భావము చాల బాగున్నది.
    4. మూర్తి గారు: (పెద్ద పేరున్న మూర్తి గారు) అత్తింటికి వెళ్ళే నవవధువుకు తల్లి బోధ రూపములో పూరించేరు. చాలా బాగున్నది.
    5. రామకృష్ణ గారు: పరోక్షముగా పతిని నిందించుట; విరహ సమయములో చంద్రుని నిందించుట అని పూర్తి చేసేరు. అయ్యో పరోక్షముగా దేనికీ? ప్రత్యక్షముగానే నిందలు వేయుటకు కొందరు వెనుకాడుట లేదు కదా. సరిలెండి వాళ్ళ ఊసు మనకు వద్దు. మీ ఆలోచనే బాగున్నది.
    6. డా. కమనీయము గారు: కాల మాహాత్మ్యాన్ని ఆలంబనము చేసుకొని పూర్తి చేసేరు. బాగున్నది.
    7. శ్రీ సుబ్బారావు గారు: వ్రాసిన పద్యము ఏ ఛందస్సో తెలియదు. వారి ఆంతర్యము ఏమిటో తెలియుట లేదు. ప్రయత్నము చేసేరు. అక్కడికే సంతోషము.

    పాల్గొనిన వారందరికీ శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గురువులకు ప్రణామములు.

    ఒక్క పాదం అక్షరాల కూర్పులో తొలగిపోయింది.

    భక్తు లై పరమేశు భావించువారు, సక్తులు కారాదు; సార్వభౌమాది
    నీచులు కల్పించు నిత్యభోగంబు, లౌచిత్యహీనంబు; లార్తికరంబు;
    లంది పొందిననాళ్ళ నన్నువ లశ్వ, కాందోళికాదులు నాత్మవ్యధకు ని
    మిత్తంబు; లందుచే మితిలేని మోహ, చిత్తంబు నొందుట సేఁగి యెల్లఱకు;
    రాజులు మత్తులు; రాజుల సేవ, రాజమార్గంబు నరక గతిఁ జేర;
    శ్రీకాళహస్తీశు సేవించు కంటెఁ, బ్రాకటం బగు ధర్మపథము లేదంచు
    స్తుతమతి ధూర్జటి ధూర్తులౌ భూమి, పతినిందఁ గల్గించు పరమసుఖమ్ము.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. వితతి బ్రమ బూన్చు విరహమ్ము నందు
    పతినింద గల్గిం చు పరమ సుఖమ్ము
    --------------------------------------------
    నమస్కారములు
    గురువు గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  17. ధన్యవాదములండి.
    నాలుగు స్థానాల్లో యతి నియమము గల తరువోజ నడక చక్కగా అనిపించింది.
    తల్లి కూతురుకు హితబోధ చేయించి సత్యనారాయణమూర్తి గారి పూరణ బాగున్నది.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సరస్వత్యై నమః :

    మిత్రులారా!
    ఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము.

    1. శ్రీ సహదేవ గారు మంజరీ ద్విపదను ఎత్తుకున్నారు. ప్రాస నియమము లేదు కదా అదొక పరమ సుఖము. సురపతి వ్యవహారమును వెలికిదీసేరు. బాగున్నది.

    2. డా. ఏల్చూరి వారు జారిపొయిన పాదమును మళ్ళీ పట్టుకొని మనముందుంచేరు. బాగున్నది,

    3. శ్రీమతి రాజేశ్వరి గారు మరొక ప్రయత్నమును చేసేరు. వారి మొదటి పాదమును ఇలా సవరించుదాము:
    "వితత భ్రమను బూంచు విరహమ్మునందు". బాగున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమ:

    సతితండ్రి దక్షుకున్ సతతము భూత
    పతినింద గల్గించు పరమసుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
    దక్షుకున్ అనే ప్రయోగము బాగులేదు. మీ మొదటి పాదమును ఇలా సవరించుదాము:

    సతి కన్నతండ్రికి సతతమ్ము భూత

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  22. విష్ణువును నింద జేయుట వెఱ్ఱి గాదె
    వలదు వైరము శ్రీహరి పైనను యసు-
    రపతి! నింద గల్గించు పరమసుఖమ్ము
    నీకు బో, తండ్రి! నీమాట నేను వినను.

    రిప్లయితొలగించండి
  23. మారెళ్ళ వామన కుమార్ఆదివారం, మే 27, 2012 8:43:00 PM

    పతిని సేవించుచూ పరమ సాధ్వీమణులు
    తరియింతురీరీతి నఖిలజగతి
    పతిసేవ కాదనుచు బరగు పడతికి నింక
    పతి నింద కల్గించు పరమ సుఖము.

    రిప్లయితొలగించండి