14, ఏప్రిల్ 2012, శనివారం

"భారతరత్న" అంబేడ్కర్


అస్పృశ్యతాభూత మావహించిన వేళ
గళమెత్తిపల్కినఘనుడుతాను,
నిష్ఠతో రాజ్యాంగ నిర్మాణమొనరించి
దారిజూపించినధన్యజీవి,
అవమాన భారాల నంతరంగమునందు
దాచియుంచినయట్టిధర్మమూర్తి,
అల్పవర్గంబులకండగానిల్చుచు
దైన్యతదొలగించుధైర్యయుతుడు
దీప్తులొలుకంగ భారతదేశమునకు
సేవయొనరించు నిస్స్వార్థ జీవి యతడు
రమ్యగుణశాలి, భారతరత్న మనగ
పేరు వడసిన నేత యంబేడ్కరుండు.

నిత్యదరిద్రవాయువులు నిర్భరజీవన మావహించినన్
సత్యతగోలుపోక సుఖశాంతుల నంతట పంచి పెట్టి తా
నత్యధిక ప్రయాసమున నందర కన్నిట సౌఖ్యదాయి యౌ
సత్యసుశాసనంబులను సాధన జేసి రచించె నక్కటా!


సరియగు రాజ్యాంగంబును
భరతావనికందజేయు భాగ్యవిధాతా!
ధరపై శాశ్వతముగ నీ
కరమర లేకుండగల్గు నధిక యశంబుల్.


అంబేడ్కర్ జయంతి సందర్భముగా.....

రచన
.వేం..నా.మూర్తి
పాబ్రా, హిసార్ జిల్లా, హర్యానా.

6 కామెంట్‌లు:

  1. జీవ పునాది- జీవనజ్యోతి
    జీవ పునాది- జీవనజ్యోతి
    బడుగు ప్రజల గుండెలలో ఆశాజ్యోతి
    ఎవరో కాదు! అతడే అంబేత్కర్ - ఎవరో కాదు! అతడే అంబేత్కర్
    ...................
    ...................

    రిప్లయితొలగించండి
  2. కరమాదరమున నంబేడ్
    కరు భారత రత్నవరుని ఘన చరితము శ్రీ
    కరముగ వర్ణించిన కవి
    వరు నభినందింతు మూర్తి ప్రజ్ఞాశాలిన్

    రిప్లయితొలగించండి
  3. భరత మాత సుతుని భారత రత్నమున్
    ముచ్చటైన పద్య ములను నిలిపి
    వారి కిచ్చి ఘన నివాళులు భక్తితో
    మించి నారు మూర్తి మేలు మేలు.

    రిప్లయితొలగించండి
  4. గురుతుల్యులు శ్రీ నేమాని పండితుల వారికి, శ్రీ మిస్సన్నగారికి ధన్యవాదములు. శ్రీయుతులు వేంకటేశ్వరరావుగారి స్పందనకు కృతజ్ఞతలు.
    ఆర్యా!
    ఘనులౌ కవివరులారా!
    వినమితవిద్యార్థి నేను, విజ్ఞులు మీరల్,
    ప్రణతిశతంబులు చేకొను
    డనయము వత్సలత నిచ్చు యభినందనకున్.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా మూర్తి గారూ!
    మీ పద్యము 4వ పాదములో యభినందనకున్ అని యడాగమము చేసేరు. అచ్చట యడాగగమునకు బదులుగా నుగాగమము చేయాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా!
    ధన్యవాదములు
    "వత్సలత నిచ్చు నభినందనకున్" గా మార్చవలసినదిగా మనవి.

    రిప్లయితొలగించండి