19, ఏప్రిల్ 2012, గురువారం

శాప ప్రసాదము

శాప ప్రసాదము

శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు గారు

తే.గీ.
వనములకు నేగి యొకనాడు పంక్తిరథుడు,
క్రూరమృగముల వేటాడి కొంత తడవు
పిదప కొండొక తావున విశ్రమించె
నంతలో నబ్జ బాంధవు డస్తమించె .. .. 1

ఉ.
వారిజ బాంధవుండు చని పశ్చిమ భూధర పంక్తి జేరగా
సారస సంఘముల్ కడు విషాదము నొందెను నింగిలోన సొం
పారెను పాటలాంశు రుచులంతట సంధ్యను వార్చె నాదృతిన్
జేరువనున్న యొక్క సరసిన్ గని యా నరపాలు డాపయిన్ .. 2

ఉ.
క్రమ్మెను చీకటుల్ మరలగా పురికిన్ నృపుడూని చాల వే
గమ్ముగ బోవుచుండు నెడ క్ష్మాపతి కర్ణయుగమ్ము సోకె చి
త్రమ్ముగ కొన్ని శబ్దములు దాపున నొక్క సరస్సునుండి యా
త్రమ్మున నాతడా రవములన్ విని సంశయపూర్ణ చిత్తుడై .. 3

మ.
తలచెన్ భూవిభుడంత దైవగతి నా ధ్వానమ్మునున్ భ్రాంతితో
జలముల్ సొచ్చిన యొక్క గంధగజమే సల్పెన్ వెసన్ చాల సం
కులమున్ జేయుచు నా సరస్సు ననుచున్ గోరంత కొండంతగా
తెలివిన్ గోల్పడి కూల్చ నెంచె నిభమున్ దీసెన్ శరంబయ్యెడన్ .. 4.

కం.
ధనువునకు తొడిగి బాణం
బును వడి మంత్రించి వేసె భూపతి యస్త్రం
బును శబ్దభేది యది కా
వున దాకెను సడి నొనర్చు పూరుషు నొకనిన్ .. .. 5.

కం.
శ్రావణ కుమారు డనబడు
నా వైశ్య కుమారు డటుల నస్త్రము దాకన్
వేవేగ కూలె భువినెం
తే విల విల లాడజొచ్చె తేజమ్ముడుగన్ .. .. 6

కం.
అమ్మా అయ్యా యని దై
న్యమ్మున నాతండొనర్చు నార్త రవము క
ర్ణమ్ములకు సోకి యాశ్చ
ర్యమ్మున దశరథుడు చేరి యాతని కడకున్ .. 7.

శా.
భ్రాంతిన్ జెందితి గంధసింధురపు శబ్దంబంచు నా చేతిలో
నంతంబొందె నితండు ఘోరమిది పాపాత్ముండ నేనంచు దా
స్వాంతంబందు దపించుచున్ నృపుడటన్ వ్రాలెన్ విచారంబుతో
నెంతే తప్పిదమున్ క్షమింపుమనగా నీ రీతి నాతండనెన్ .. 8

సీ.
ఓ మహారాజ! నేనేమి చేసితినంచు
క్రూరమ్ముగా నన్ను గూల్చితీవు
నా తల్లిదండ్రులున్నారు వృద్ధులు నంధు
లచ్చోట వారి దాహంబు దీర్ప
నెంచినే జలములో ముంచితీ పాత్రను
వారికొసంగు మివ్వారినంచు
నా స్థితిన్ దెల్పుమా నరనాథ యంచు నా
తడు ప్రాణములు వీడ వడిగ నృపతి
తే.గీ.
యా జలమ్ములు గొనిపోయి యచటి వృద్ధ
దంపతులకిడు నెడ వారు దైన్యమొంది
పుత్రు మృతి వార్త విని శాపమునిడి పంక్తి
రథుని కంతట విడిచిరి ప్రాణములను .. 9.

తే.గీ.
కొడుకు దరిలేని తరివారు కూలినటుల
కొడుకు లెవ్వరు దరిలేని యెడనె పంక్తి
రథుడు తనయులకై యేడ్చి ప్రాణములను
విడుచునని శాపమును వారలిడుట జేసి .. 10

సీ.
సంతతి లేక యా క్ష్మాపాలు డెంతయు
వేనవేలేండ్లుగా వేగుచుండె
నట్టి దుస్థితిలోన నా శాప ఫలితమ్ము
వ్యర్థమ్ము కాదను నాశ గలిగె
నందుచే నపుడేని నతనికి పుత్రులు
కలిగెదరను నమ్మకమ్ము ప్రబలె
నట్టి తలంపుతో నాత్మలో మిక్కిలి
యానంద వీచిక లలర సాగె
తే.గీ.
సాహసమ్ముతో భ్రాంతితో సలిపినట్టి
యాతని యకృత్యమే శాపమై వరమయి
వంశ వర్ధన హేతుసంభావ్య మయ్యె
నహహ విధిలీల లివ్విధి నద్భుతములు .. 11

7 కామెంట్‌లు:

  1. నమస్కారములు.
    మొత్తం శ్రవణ కుమారుని కధ సులభ శైలిలో పద్య రూపంలో చక్కగా వివరించిన పూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ!
    శుభాశీస్సులు. మీ ప్రశంసను చూచేను. చాల సంతోషము. మీ వంటి వారికి నాయందు గల మంచి అభిప్రాయము వలన నాకెంతయు ఆనందముగా నుంటున్నది. అవియే మాకు ప్రోత్సాహము నిచ్చుచున్నవి. శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  3. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
    నమస్కారములు
    మీ కవిత్వం చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. శాపప్రసాదము చాలా బాగుంది. మరోమారు నమస్కారములతో
    మూర్తి.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా!
    అభిమానము జూపుచు నా
    కభినందన తెలుపుచున్న యట్టి హితుల నే
    శుభమస్తని దీవించెద
    త్రిభువనపతి వారి కిడుత ధీవిభవంబున్

    రిప్లయితొలగించండి
  5. పండితుల వారి శాపప్రసాదము మంచి ధారతో సాగినది. ముఖ్యంగా ఉత్పలమాలలు బాగా ఆకట్టుకున్నాయి.

    రిప్లయితొలగించండి