3, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1101 (పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.

30 కామెంట్‌లు:

  1. జరుపగ యజ్ఞము తన ము
    గ్గురు భార్యల దశరథుండు గూడుచు నపుడున్
    మరి పాయస మిడ యజ్ఞపు
    పురుషుఁడు, గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.

    రిప్లయితొలగించండి
  2. హరునిఁ గరుణించ వేడెను
    బురుషుఁడు; గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్
    దరుణి; ప్రసవించినంతనె
    యరుసము నందెను కుటుంబ మా సమయమునన్!

    రిప్లయితొలగించండి
  3. పురుషుని వేషము దాల్చెను
    తరుణి యొకతె కొన్నినాళ్ళు, తత్సమయములో
    నరుదగు గతి బళిర! నటత్
    పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    యజ్ఞపురుషుడు అన్న విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సంతానంకోసం పురుషుడు శివుని వేడుకుంటే అతని భార్య గర్భాన్ని ధరించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘నటత్ పురుషుడు’ గర్భాన్ని దాల్చినట్టు చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    కొన్నేళ్ళ క్రితం మా వూళ్ళో సురభి వాళ్ళు ‘పోతులూరి వీరబ్రహ్మం’ నాటకాన్ని ప్రదర్శించారు. యువ వీరబ్రహ్మంగా నిండు చూలాలైన ఒక అమ్మాయి నటించింది. ఆ దృశ్యం గుర్తుకు వచ్చింది మీ పూరణ చూసినప్పుడు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. తరుణి యొ కనాట కంబున
    పురుషుని వేషంబు వేసి పోణిమి వోవన్
    మరునుని ప్రేరణ కతనన
    పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్య ఫలముగన్

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

    గురువర్యా। నిన్నటి రోజంతా ఖాళీగా నెట్ ముందు కూర్చుని యుంటిని
    =======*========
    చిత్రమైన స్వప్నసాకారమునకు శివుని ప్రార్థించిన భక్తునిపై

    గరళము మ్రింగిన వానిని
    శరణని,గత జన్మ స్వప్నసాకారముకై
    వరమును బొందిన కలియుగ
    పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి


  7. శ్రీ వరప్రసాద్ గారి పద్యమును ఇలా సవరించుచున్నాను:

    పరమేశ్వరునిన్ వేడుచు
    శరణము, పూర్వంపు కలల సాకృతికొరకై
    వరమును బొందిన కలియుగ
    పురుషుడు గర్భమ్ము దాల్చె పుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "పోణిమి వోవన్" కంటే "పోణిమి సెలగన్" అంటే బాగుంటుంది. మూడవ పాదాన్ని "మరు ప్రేరణ కతమున న - ప్పురుషుడు" అందాం.
    *
    నరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సనరణ మీ పద్యాన్ని నిర్దోషంగా, ప్రశస్తంగా చేసింది.

    రిప్లయితొలగించండి
  9. హరియందచందములఁగని
    హరుడెయదుపుదప్పె; మోహనాంగియె తానై
    హరిహరమూర్తిఁగన పరమ
    పురుషుడు గర్భమ్ముఁదాల్చెఁబుణ్యఫలముగన్ ||

    రిప్లయితొలగించండి
  10. గూడ రఘురామ్ గారూ,
    అయ్యప్ప ఆవిర్భావం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వరమో, కలికాలపు కల
    వరమో,తెలియంగ వశమె వార్తగ వచ్చెన్
    కరిహెల్జరుయనుజర్మను
    పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్య ఫలముగన్ !!!

    రిప్లయితొలగించండి
  12. మంచి సూచనలకు,సవరణలకు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ గూడ రఘురాం గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. అయ్యప్ప జన్మ కొరకు శివుడు స్త్రీరూపమును దాల్చెను అన్నారు. కాస్త వివరించగలరా? అయ్యప్ప జననము గురించి నాకు వివరములు తెలియవు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    'హెల్జరు + అను' అన్నపుడు సంధి జరగాలి కదా. అక్కడి 'హెల్జ రనెడి జర్మను' అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    మీరు చెప్పే వరకూ రఘురామ్ గారి పద్యంలోని అన్వయదోషాన్ని గుర్తించలేదు. ఆ పద్యానికి నా సవరణ....
    హరియందచందములతో
    హరునిన్ వలపించె మోహనాంగియె తానై
    హరిహరమూర్తిఁ గన పరమ
    పురుషుడు గర్భమ్ముఁదాల్చెఁబుణ్యఫలముగన్
    *
    రఘురామ్ గారూ,
    గమనించారా?

    రిప్లయితొలగించండి
  15. "కళాపూర్ణోదయము"లోని సుముఖాసత్తి(సుగాత్రి) పురుషునిగను, మణిస్తంభుఁడు(శాలీనుఁడు) స్త్రీగను మారఁగఁ, గళాపూర్ణుఁ డుదయించిన ఘటన....


    వరమిడెను శారదాంబయె;
    ధర సతి పతిగఁ, బతి సతిగఁ దామయ్యు వెసన్
    జరియించఁగ, నప్పుడు త
    త్పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్!

    రిప్లయితొలగించండి
  16. మరియొక ప్రయత్నము:

    పరితోషమొందె గృహమున
    బురుషుడు, గర్భమ్ము దాల్చె బుణ్యఫలముగన్
    పరమ పతివ్రతయగు సతి,
    కరమొప్పిన దాగృహమ్ము కళలేపారన్

    రిప్లయితొలగించండి
  17. అరయగ హరియట నామము!
    సరసీరుహనాభుఁడంట!చకితంబౌ యా
    విరిదమ్మిన పుట్టెనొకఁడు!
    పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్!!

    రిప్లయితొలగించండి
  18. గుండు వారి కళాపూర్ణోదయములోని ఘటన చాలా ఆసక్తికరమైనది. దాని ప్రస్తావన బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. పరమేశుని లీల లనగ
    వరమీయగ సంతు కొఱకు వారువ మునకున్ !
    పరి పరి విధముల యుగ
    పురుషుఁ డు గర్భమ్ము దాల్చెఁ బుణ్య ఫలముగన్ !

    వారువమునకు = అశ్వనీ దేవతలు
    యవనాశ్వురునకు = మాంధాత
    యవనము = వేగము గల గుఱ్ఱము

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్య వాదములు

    మరియొక పూరణ హాస్యముగా
    ======*=======
    పరమేశ్వరుని వేడ మరణ భయముదొలగి జను దెంచి
    పరమాన్నకలశము నొందె వరము గాను,సలిపి క్రతువు
    పురుషుడు,గర్భమ్ము దాల్చె బుణ్యఫలముగను సతియు
    సురలు మెచ్చెడి శూరునిగనె సోమవార శుభ దినమున

    రిప్లయితొలగించండి
  21. భరియించి రోకలి నొకటి
    పురుషుడు గర్భమ్ము దాల్చె; బుణ్యఫలముగన్
    మురళీకృష్ణుని సఖులుగ
    చరియించిరి గొల్లవారు సమ్మోదమునన్

    రిప్లయితొలగించండి
  22. ధర యందున యాదవులం
    దరు చనఁ గారణ మగుచును, తా రోకలినే
    ధరియించెనొకడు, ధన్యుడు
    పురుషుడు గర్భమ్ము దాల్చె; బుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి
  23. ధర నుండిన యాదవులం
    దరు చనఁ గారణ మగుచును, తా రోకలినే
    ధరియించెనొకడు, ధన్యుడు
    పురుషుడు గర్భమ్ము దాల్చె; బుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి
  24. గుండు మధుసూదన్ గారూ,
    ‘కళాపూర్ణోదయం’ ప్రసక్తితో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చిన్న సవరణ... ‘చకితంబౌ నా/ విరిదమ్మిని పుట్టెనొకఁడు!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం.. ‘పరిపరి విధముల నా యుగ..’ అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    ఇందులో ‘హాస్యం’ ఎక్కడుంది?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సాంబుని వృత్తాంతంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ.
    మీరూ సాంబుని విషయంతో పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ నేమాని మాష్టారు గారికి నమస్కారములు. మీరు చెప్పేవరకు ఆ పద్యమునందు అన్వయ దోషముందని గుర్తించనే లేదు. పద్యములు వ్రాసేటప్పుడు అనుకోకుండా ఇటువంటి తప్పులు కూడా దొర్లుతాయని తెలిసినది. ఇట్టి వాటిని కూడా సరి చూసుకోవలెనన్న విషయము నేర్చుకున్నాను. ధన్యవాదములు.
    చిన్న మార్పుతో ఆ పద్యమును మరల అర్థవంతముగా మార్చిన శంకరయ్య మాష్టారుగారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
    " సోమవార శుభ దినమున" నండి

    రిప్లయితొలగించండి
  27. "చంద్రమా మనసో జాతః చక్షోః
    సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత"

    ...పురుష సూక్తం


    తరువులు పశువులు మనుజులు
    విరివిగ గ్రహములు ఋతువులు వెలసిరి తొలుత
    న్నరయగ నెపుడా యజ్ఞపు
    పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్

    రిప్లయితొలగించండి
  28. మురియుచు మైకుల నెల్లెడ
    నరవగ తొమ్మిది నెలలహ నానా నిందల్;...
    కరవగ వోటరు లెల్లరు
    పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్ 😊

    రిప్లయితొలగించండి
  29. రాజుభిక్షువయ్యెరమణినొదలి.

    ఈ పాదమునకు పూరణ కోరుతున్నాను సాహితీ మిత్రులను.🙏🙏

    రిప్లయితొలగించండి