20, జులై 2013, శనివారం

కేశవ మానస పూజ





కేశవ మానస పూజ

సీ. శ్రీకేశవా! దేవ! శ్రీరమారమణీశ!

    ....నిగమాంతవేద్య! ధ్యానింతు నిన్ను

    నారాయణా! జగన్నాయకా! నీకిదే

    ....ఆవాహనమ్ము దేవాధిదేవ!

    మాధవా! మామక మానసాంబుజవాస!

    ....సింహాసనమ్మిదే చిన్నిధాన!

    గోవింద! లోకైక గురుదేవ! ఖగవాహ!

    ....పాద్యమ్ము నీకిదే పద్మనయన!

    విష్ణుదేవా! దైత్య విధ్వంసకా! చక్రి!

    ....అర్ఘ్యమియ్యదె కరుణాలవాల!

    మధుసూదనా! భక్తమందార! వైకుంఠ!

    ....ఆచమనీయ మియ్యదె ముకుంద!

    దేవా! త్రివిక్రమా! దేవతాగణ వంద్య!

    ....స్నానమ్ము నీకిదే జ్ఞానతేజ!

    వామనా! సురహితా! వాసవ వందితా!

    ....యజ్ఞోపవీత మియ్యదె రమేశ!

    శ్రీధరా! మురహరా! శ్రితలోక రక్షకా!

    ....చందనమ్మిదె మహానందసాంద్ర!

    శ్రీహృషీకేశ! రాశీభూత వాత్సల్య!

    ....ఆభరణమ్మిదే ఆదిదేవ!

    పద్మనాభా! ఫుల్ల పద్మదళేక్షణా!

    ....పుష్పార్చనమ్మిదే మోక్షదాత!

    దామోదరా! దైత్య దానవ నాశకా!

    ....ధూప మియ్యదె పరితోషపూర్ణ!

    సంకర్షణా! మౌనిజన హృదయారామ!

    ....దీపమ్ము నీకిదే త్రిభువనేశ!

    వాసుదేవా! విశ్వపాలన తత్పరా!

    ....నైవేద్య మిదె నీకు నాగశయన!

    ప్రద్యుమ్న! విశ్వరూపా! ధర్మతత్పరా!

    ....తాంబూలమిదె సదా ధ్యాననిరత!

    అనిరుద్ధ! వివిధ దివ్యాయుధధృతకరా!

    ....మంత్రపుష్పమ్మిదే మాహృదీశ!

    పురుషోత్తమా! జగద్గురువరా! సాదర

    ....వందనమ్ములు మహానందధామ!

    త్రిజగదీశా! అధోక్షజ! నీరదశ్యామ!

    ....పొనరింతు మానసపూజ నీకు

    నారసింహా! హిరణ్యకశిపసంహార!

    ....ప్రహ్లాద వరద! శోభాకరాంగ!

    అచ్యుతా! దేవబృందార్చిత పదపద్మ!

    ....నీ సేవలనొనర్తు నెమ్మనమున

    శ్రీజనార్దన! కృపాసింధు! నీ చరితమ్ము

    ....గానమ్ము నొనరింతు దీనపాల!

    దేవా! ఉపేంద్ర! రాజీవపత్రేక్షణా!

    ....వినుతింతు నీ మహావిభవములను

    హరి హరీ! మురహరీ! ఆదరమ్మేపార

    ....నుపచారములొనర్తు యోగివంద్య!

    శ్రీకృష్ణ! మమ్ము పాలింపుమా నింపుమా

    ....జ్ఞానతేజమ్ము నా మానసమున

ఆ.వె.

    అంతరంగ నిలయ! శాంతి సౌఖ్యప్రదా!

    నిన్ను గొలుచువారిని కృప గనుచు

    బాపి దుఃఖములను పరమపదమ్మిడు

    నాదిదేవ! నీకు నంజలింతు.


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

4 కామెంట్‌లు:

  1. కేశవ నామమ్ములతో
    ధీశక్తిని పద్యములను తీరిచినారే
    కేశవ మానస పూజగ
    నాశమ్మగు పాపమెల్ల నది మది జదువన్.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    గురువు గారికి ధన్యవాదములు

    కేశవ మానస పూజ అద్భుతముగానున్నది
    శ్రీ నేమాని గురుదేవులకు,శ్రీ శంకరయ్య గురుదేవులకు కేశవ మానస పూజను అందించినందులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. నిన్న శ్రీ శంకరయ్య బొడ్డు గారు వార్కారీ యాత్ర గురించి వ్రాసినారు, వార్కరుల పై చిన్న వివరణ (వార్క = యాత్ర మరాఠ బాషలో ) అయ్యప్ప భక్తుల వలె మహారాష్ట్రలో పాండురంగ స్వామి భక్తులు 15 రోజుల పాటు శ్రీ భక్త తుకారాం సమాధి నుండి పండరీపురము వరకు కాలినడకన కీర్తనలు జేయుచూ తోలి ఏకాదశికి పాండురంగ స్వామిని దర్శించు కొందురట. ఈ సంవత్సరము సుమారు 10 లక్షల మంది భక్తులు యాత్ర జేసినారట.

    రిప్లయితొలగించండి
  4. మా కేశవ మానస పూజను గురించి స్పందించి ప్రశంసల దెలిపిన మిత్రులు శ్రీ మిస్సన్న గారికి, శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీ కందుల వరప్రసాద్ గారికి, మన బ్లాగులో సొంపుగా ప్రకటించిన శ్రీ కంది శంకరయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు - శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి