7, జులై 2013, ఆదివారం

పద్య రచన – 395 (ఛందోబద్ధ కవిత్వము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“ఛందోబద్ధ కవిత్వము”

11 కామెంట్‌లు:

 1. భావకవితకు నుండును బహుళ స్వేచ్ఛ
  పద్య కవితకు నొదుగుట వలయు చూడ
  నొదిగియుండుటలోనున్న నోర్పు నేర్పు
  లయగతులును దానికి హొయలు పెంచు.

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లక్షణాలకు ఒదగడం వల్ల కవిత్వానికి హొయలు చేకూరుతుందన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
  'బహుళ స్వేచ్ఛ' అన్నప్పుడు ళ గురువై గణభంగం..
  'భావకవితకు నుండును స్వైరగతులు' అందామా?

  రిప్లయితొలగించండి
 3. మాస్టరుగారూ ! చక్కనిసవరణ .. ధన్యవాదములు..
  సవరణతో..

  భావకవితకు నుండును స్వైరగతులు
  పద్య కవితకు నొదుగుట వలయు, చూడ
  నొదిగియుండుటలోనున్న నోర్పు నేర్పు
  లయగతులును దానికి హొయలు పెంచు.

  రిప్లయితొలగించండి
 4. మీ దు మిక్కిలి ఛందస్సు మీర కుండ
  రచన గావింప బడుటన రమ్యముగను
  పద్య కవితలు వినుటకు హృ ద్య మయ్యి
  ఆయు రారోగ్య పుష్టిని నంద జేయు .

  రిప్లయితొలగించండి
 5. సుందరమగు కవనమ్ముకు
  ఛందమె అందంబనుటకు సందియమేలా
  సుందరివేసెడి చిందుల
  కందెల సందడియెలేక నందంబగునే

  రిప్లయితొలగించండి
 6. దీక్షతోడ శిల్పి దేవతా మూర్తిని
  చెక్క, నరుడు జోత చేయుచుండు,
  చక్కనైన రీతి సాగు ఛందో బద్ధ
  పద్యమదియు పొందు ప్రాభవమును.

  రిప్లయితొలగించండి
 7. సుందరికి సుగుణమట్లును
  పందిరి పై మల్లె తీగ ప్రాభవపు గతిన్
  కుందనమున కాంతి వలెను
  ఛందస్సు కవిత్వమునకు చవులను గూర్చున్.

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారి పద్యము.....
  సీ.
  ఆంధ్రసాహిత్య విద్యానంద సీమలో
  నుద్యానవన మగు పద్యవిద్య
  యందులో మల్లెలు మందారములు జాజు
  లాదిగా వివిధమ్ములైన పువులు
  సొంపుగా నింపుగా శోభిల్లు ప్రాంతమ్ము
  ఛందస్సమేత భాస్వంతసరణి
  గణయతిప్రాస లక్షణము లాసీమకు
  నందచందముల బెంపొందజేయ
  తే.గీ.
  నట్టి రసరమ్య సీమయం దనవరతము
  వేడ్కతో విహరించెడు విజ్ఞులార!
  భారతీమాతృ సత్కృపాపాత్రులార!
  యంజలిని గూర్తు మీకు సమాదరమున.

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నా సవరణను సహృదయంతో ఆమోదించినందుకు ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  ఛందస్సు మీరని పద్యం హృద్యంగా ఉంటుందన్నారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘బడుట + అన’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘బడినచో’ అందామా?
  *
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  బహుకాల దర్శనం. సంతోషం!
  మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  ‘కవనమ్ముకు’ అనకూడదు కదా. దాన్ని ‘కవనమునకు’ అందాం.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఛందోబద్ధ పద్యాన్ని శిల్పంతో పోల్చిన మీ పద్యం అందంగా ఉంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  పద్యానికి ఛందస్సు ఏ విధంగా చవులను కూర్చుతుందో చిన్న పద్యంలోనూ చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  సాహిత్యసీమలో పద్యవిద్య ఉద్యానవనమన్న మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. యతి మైత్రి లేని కవనము
  మతి పోవును చదివి నంత మాటలు కఱువై !
  చతురత గచంద మలదిన
  బ్రతికించును భావు కతను భాసిల్ల నిలన్ !
  -----------------------------------------------
  ఇల్లాలు లేని యింటను
  కల్లోల భరిత మైన కానన మౌగా !
  చల్లా రిన వంట వలెను
  చెల్లదు చందస్సు లేక చేదగు కవితల్ ! !

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం. "కల్లోలాంకితము నైన..." అందాం.

  రిప్లయితొలగించండి