12, జులై 2013, శుక్రవారం

పద్య రచన – 400 (ముసురు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....

“ముసురు”

11 కామెంట్‌లు:


 1. భూగోళాన ముసురు ఎర్ర చీనా కి నల్ల మరక
  అభివృద్ధి తరుగు ఐతే గొడుగు పట్టిన
  సామాన్యుడే దేశాన్ని కాపాడ గలిగే
  మేధావి - 'మోడీ'ఫీకేషన్ జరూర్ !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సంసార జీమూతసంఘాలు ముసురుచో
  కాలము కాలమై కనుల జేరు
  క్షణికమై సుఖము కలదంచుననిపించు
  ఉండుండికష్టములురుముచుండు
  విడువక వచ్చును వెడలి పోవు నటులె
  చినుకు లీ బంధాలు జీవధార
  తెగతడిసిన కట్టె తెలివిడి మండినన్
  పొగలు మాత్రమె గ్రక్కు పిచ్చి పనులు

  ఈ సకలచరాచరజగమెవ్వని కర
  కల్పిత మతండు సత్యము కానరాడు
  ఈ సకలచరాచరజగమ్మిటుల మాయ
  గ కనుమూయగ కేవల కర్మ సాక్షి !

  రిప్లయితొలగించండి
 3. ముసురు పట్టెను గగనాన మోద మలర
  కారు చీకట్లు పుడమిని గ్రమ్ము కొనెను
  చినుకు పడు నను నాశతో చీకు ముసలి
  గొడుగు క్రిందన కూర్చుండె చూడు సామి !

  రిప్లయితొలగించండి
 4. కసురుకొంటూ కాలమే కాటువేసె
  పసరుమందైన పూయరే ఎవ్వరైన
  ఎసరు పెట్టగ ఎవ్వరూ కానరారె
  ముసురు పట్టింది ముదుసలి జీవితాన

  రిప్లయితొలగించండి
 5. ముసురుఁ బట్టిన కారున మోదమలర
  రైతు మొదలిడు సేద్య సంరంభమికను,
  వారి మేలు కోరుటకయి ప్రార్థనమున
  దేవుని కటాక్షమును వేడి తృప్తి పడుదు

  రిప్లయితొలగించండి
 6. సస్యంబైనటువంటి పంటలఁ భువిన్ సాక్షాత్కరింపంగ నా
  లస్యంబించుకలేక శీఘ్రగతిచే రంజిల్లగాఁ జేయుచున్
  లాస్యంబై ఘనవర్షధారలు నిధానంబై ప్రజాకోటికిన్
  దాస్యంబున్ తొలగింప జేయు,శతథా కైమోడ్పులర్పించెదన్.

  రిప్లయితొలగించండి
 7. ముసురు గప్పెను చీకట్లు కసిగ భువిని
  విసుగు జెందిన యిల్లాలు ముసుగు దన్నె
  కసురు చున్నవి గాలులు విసుగు లేక
  పసిడి పంటలు తనవోలె మసక బారు
  కాలు కదపగ నీరీతి కదల కుండ

  రిప్లయితొలగించండి
 8. ముసురుకున్నట్టి మబ్బుల ముందుజూచి
  కసరబోకుము పోదులే ఉసురు నీకు
  పచ్చకోకలు తనకేమొ వచ్చుననుచు
  మురిసి పోవును మనతల్లి భూమి గాదె.

  రిప్లయితొలగించండి
 9. జిలేబీ గారూ,
  అభినందనలు.
  మీ భావానికి నా పద్యరూపం......
  ఇలను జూడ ముసురె, యెఱ్ఱ చైనాకేమొ
  నల్ల మరక, ప్రగతి నాస్తి, భరత
  భూమి బ్రోతుమన్న ‘మోడీ’ఫికేషనే
  దిక్కటంచు బుధులు దెల్పినారు.
  *
  ఆదిత్య గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  `క్షణికమై సుఖము’ అన్నచోట గణదోషం.. ‘క్షణికమైన సుఖము’ అంటే సరి.
  'పొగలు మాత్రమె గ్రక్కు పిచ్చి పనులు' అన్నప్పుడు యతి తప్పింది. ‘పొగలు గ్రక్కెడు పిచ్చి పుట్టు పనులు' అందామా?*
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  స్వాగతం! మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తే ఛందోబద్ధంగా పద్యాలను వ్రాయగలరు. మీ భావానికి నా పద్యరూపం.....
  కసరుకొనుచును కాలమే కాటువేసె
  పసరుమందైన పూయ రెవ్వారలైన
  నెసరు పెట్టగ కానరా రెవ్వ రిచట
  పట్టెను ముసురు ముదుసలి బ్రతుకునందు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పద్యం. మీ ధారాశుద్ధికి కైమోడ్పు లర్పించెదన్.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు. (నిర్దోషంగా వ్రాసినందుకు ధన్యవాదాలు)
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అందమైన శబ్దచిత్రాన్ని కళ్ళముందుంచారు మీ పద్యంతో. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. అవునండి. చూసుకోలేదు.
  తప్పులు తెలిపినందుకు ధన్యవాదాలు.
  "క్షణికమైన సుఖము "
  "తెగతడిసిన కట్టె తెలివిడి మండునో?
  పొగలు మాత్రము గ్రక్కు ప్రొద్దు పోక"
  అని మారుస్తున్నా
  స్వస్తి,
  ఆదిత్య

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులకు నమస్సుమాంజలులు.
  ఫొటో,వ్యాఖ్య, చూసి ఉత్సాహపడి,చందోబద్దంగా వుందో లేదో చూసుకోకుండా పద్యం పోస్ట్ చేసాను,తెలుగు భాషపై మక్కువ ,పద్యరచనపై ఆశక్తితో ,ఈ మద్యనే తమవంటివారి బ్లాగులు చూసి చందోబద్దంగ పద్యం వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను,నా భావాన్ని చందోబద్దంగా మలచి,నేర్పినందుకు,నన్ను ప్రోత్సహించినందుకు,సర్వదా కృతజ్ఞతలు..

  రిప్లయితొలగించండి