22, జులై 2013, సోమవారం

శివ తాండవముశివ తాండవము

 శివ తాండవం పరమ శివ తాండవం
భూతనాయక మహాద్భుత తాండవం

పరమ శివ తాండవం గిరితనయ సంయుతం
సరస నటనాద్భుతం సకల భువనోత్సవం

హరహరా పురహరా భవహరా భయహరా
రిపుహరా స్మరహరా మఖహరా సుఖకర

ప్రణవమయ శోభితం ప్రమథగణ ఖేలనం
రుచిర గుణ వైభవం పరమశివ తాండవం

త్రిగుణ విభవాన్వితం త్రికరణ విరాజితం
త్రిణయన కళాద్భుతం త్రిదశవర సంస్తుతం

సతి లాస్య వైభవం మణివిభూషణ రవం
శ్రితజనోత్సవకరం ప్రతిపదం శ్రుతిహితం 

నలువయును భారతియు శ్రుతి లయలు కూర్పగా
అమరపతి చేయగా కలవేణుగానమ్ము

హరి మృదంగము మ్రోయ తద్ధిమిత తద్ధిమిత 
పరవశంబున ప్రకృతి పులకించి యలరింప

గిరిసుతా ధృతకరం శుభనటత్ పద యుగం
ఢమఢమడ్డమరుకం ధగ ధగ ద్ధిమకరం 

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు


7 కామెంట్‌లు:

 1. అద్భుతమైన గీతాన్ని అందించారు. నా అదృష్టం వలన నిన్ననే పండిత నేమానివారిని ప్రత్యక్షంగా కలవడం, శివానందలహరి మీద ఆయన అందించిన అమృతవాక్కులను వినడం, వారి ఆశీస్సులు పొందడం జరిగింది. వారికీ, శంకరయ్యగారికీ ఈ గురు పూర్ణిమ సందర్భంగా నా వినయపూర్వక నమస్కారాలు.

  రిప్లయితొలగించండి
 2. ప్రణవ మయశోభితం శ్రీ నేమాని గురుదేవుల పరమ శివుని "శివతాండవం"
  శ్రీ నేమాని గురుదేవులకు,శ్రీ శంకరయ్య గురుదేవులకు ఈ గురు పూర్ణిమ సందర్భంగా నా వినమ్ర వందనములు .

  రిప్లయితొలగించండి
 3. శివ తాండవ రచనమునకు
  శివుడే మఱి సంతసించి సేమము గలుగన్
  అవిరళ వరముల నిచ్చుత !

  భవకరుడగు రామజోగి భ్రాతకు నెపుడున్ .

  రిప్లయితొలగించండి
 4. మా కృతి శివతాండవమును మన బ్లాగులో ప్రకటించిన శ్రీ కంది శంకరయ్య గారికి, వెంటనే చక్కగా స్పందించిన శ్రీ ఆదిత్య గారికి, శ్రీ వరప్రసాదు గారికి మరియు శ్రీ సుబ్బారావు గారికి హార్దిక శుభాశీస్సులు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. శివ తాండవమును అందించిన పూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారికి , శ్రీ శంకరయ్య గురు దేవులకు ప్రణా మములు

  రిప్లయితొలగించండి
 6. అమ్మా! రాజేశ్వరి గారూ! మీ ప్రశంసలకు మా సంతోషము. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

  రిప్లయితొలగించండి