6, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1104 (సౌహార్దముఁ జూపువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్.

17 కామెంట్‌లు:

 1. అయ్యో , నేను పెట్టిన పూరణమేమయినది?
  మళ్ళీ ప్రచురిస్తున్నాను.

  ఆహారవిహారములం
  దే హాయినిఁ జూచువాడదెట్టుల ముక్తుం
  డౌ? హేయమ్మగు తనువున
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్.

  రిప్లయితొలగించండి
 2. స్నేహితుని రీతి మెలగుచు
  నూహలలో దేల్చి సొమ్ము లొక్కొక్కటిగా
  స్వాహా చేయుచు గపటపు
  సౌహార్దము జూపువాడె శత్రువనదగున్

  రిప్లయితొలగించండి
 3. స్వాహా కారపు యజ్ఞము
  లేహాయిని గూర్చు భువికి, లేదని ప్రకృతిన్
  ఊహలు లౌకికములకే
  సౌహార్దము జూపువాడె శత్రువనదగున్

  రిప్లయితొలగించండి
 4. ఆహా! మన మిత్రునితో
  స్నేహంబును జూపువాఁడె స్నేహితుడు గదా!
  సాహో! మన శత్రువుతో
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్!!

  రిప్లయితొలగించండి
 5. స్నేహమిదే యనుకొనుచును
  దాహానికి నీళ్ళుగాక థమ్సప్ నిస్తూ
  ఆహా ఓహో మాటల
  సౌహార్థము చూపువాడె శత్రువనదగున్

  రిప్లయితొలగించండి
 6. ఆహా! ఓహో !యనుచును
  సాహో! యని శకుని మామ సామ్రాట్టును తా
  నాహుతి చేసె కదనమున
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్.

  రిప్లయితొలగించండి
 7. ఆహా యేమని యంటిరి ?
  సౌహార్దము జూపు వాడె శత్రు వనదగున్
  బాహాటంబుగ బలుకుదు
  సౌహార్దము జూపు వాడె సుహృ త్తుం డగున్


  రిప్లయితొలగించండి
 8. ఊహా సుందరివీవని
  స్నేహమ్మును జేయుమనుచు చెడుయూహలతో
  మోహావేశమున తగని
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁదగున్!!!

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ నా మెయిల్‍కు వచ్చింది. బ్లాగులో ఎందుకు రాలేదో నాకూ అర్థం కాలేదు.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  ‘శత్రువు యొక్క మిత్రుడు శత్రువే కదా’ బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఇస్తూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘థమ్స పొసగుచున్’ అంటే సరి!
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  చివరి పాదంలో యతి తప్పింది. చివరి పాదాన్ని ఇలా అందాం... ‘సౌహార్దము జూపువాడు శత్రు వెటు లగున్’
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. ఆహా ! మిత్రు డనదగున్
  సౌహార్దము జూపువాడె ; శత్రు వనదగున్
  సాహాయ్యము జేసిన తన
  స్నేహితుడిని జంప జూచు చెడు కారకుడే !

  రిప్లయితొలగించండి
 11. ఆహా ! ప్రక్కన బల్లెము
  స్నేహితునకు తానె హాని జేయగ జూచున్
  ఓహో! యనుచున్ ఛద్మపు
  సౌహార్దము జూపు వాడె శత్రువనదగున్

  రిప్లయితొలగించండి
 12. ఊహా లోకము నందున
  నీహా రము కొఱకు వేచి నెయ్యము చేయన్ !
  బాహాటము నందు కపట
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రువనఁ దగున్ !

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  =======*========
  పతిత పావనుడన భూరి వరములొసగి
  పాపిపయిన సౌహార్థము జూపువాడె,
  శత్రువన దగున్ శాస్త్రముల్ జదివి లోక
  నాశమునకై దిరుగుచుండు నాగరికుని।
  =======*========
  ద్రోహమును మదిని నిల్పుచు
  సౌహార్థము జూపువాడె శత్రువనదగున్
  ఊహలను వీడి యిడుముల
  సాహసమును జూపు వారె శాసన కర్తల్|

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్య,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం మెచ్చుకోదగింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. రాహులు సలహాదారుగ
  బాహాటమ్ముగ కవుగిలి భళిభళి యనుచున్
  బీహారున లాలూతో
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్

  రిప్లయితొలగించండి
 16. బాహాటమ్ముగ కూర్చొని
  దోహదముగ చెట్టు నీడ తొందర పడుచున్
  ఆహాయని యప్పు లిడుట
  సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్

  రిప్లయితొలగించండి