13, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1111 (నరకమున సుఖమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నరకమున సుఖమ్ము దొరకు నయ్య!

28 కామెంట్‌లు:

 1. ధరలన్ని పెరిగె నేఁ, డీ
  ధరలో సుఖజీవనమ్ము దక్కక, పేదల్
  నిరసించుచు నిటులందురు
  "నరకమున సుఖమ్ము దొరకు నయ్య!" యటంచున్.

  రిప్లయితొలగించండి
 2. వ్యాధి ముదిరియు దుఃఖించు వాఁడొకండుఁ
  జావుఁ గోరుచు దైవమున్ బ్రోవుమంచు,
  వేడుచుండెను పరిపరి విధములుగను
  "నరకమున సుఖమ్ము దొరకు నయ్య!" యనుచు.

  రిప్లయితొలగించండి
 3. దేవదానవ సంగ్రామమునఁ జావఁ గోరు నొక దానవుని స్వగతము...

  యుద్ధ రంగమందు యోధుఁడుఁ జచ్చిన,
  స్వర్గమునకు నేగి వఱలు నండ్రు;
  స్వర్గమందుఁ జేర వాసవుఁ డిడు బాధ!
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య!!

  రిప్లయితొలగించండి

 4. నేటి మన నగరంముల సౌకర్యములు
  పట్టణముల పరిస్థితులు చూడ చూడ
  భళిరా, పై లోకమున నున్న
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. యముని వలచిన ధూమోర్ణ తండ్రితోఁ బలికిన మాటలు...

  ద్విపద:
  "యముని వలచి తేను సుమశరు మహిమ;
  మముఁ గూర్చఁగఁ బరిణయము సేయు మయ్య!
  తరతరమ్ములుగ సుందరతరమ్మైన
  నరకమున సుఖమ్ము దొరకునయ్య మఱి!!"

  రిప్లయితొలగించండి
 6. వలచిన చినదాని పరిణయ మాడంగ
  మనసుఁ దెలిసి నడచు మగువ గాగ
  భువిని జీవితమ్ముఁ జవిచూడ దివిమించి
  న రకమున సుఖమ్ము దొరకు నయ్య!

  రిప్లయితొలగించండి
 7. నరకమున సుఖమ్ము దొరకు నయ్య ,యయిన
  ఇచ్చ గింతు రార్య యిలను జనులు
  నరకమునకు బోవ నగుబాటు నొందక
  సుఖము నందు గలదు సుఖము ,నిజము

  రిప్లయితొలగించండి
 8. వెరచి శత్రువులకు వెన్నుజూపుట కంటె
  వెరచి పిరికి వలెను వెతల మునుగు
  కంటె పోరు నందు కాయము వీడిన
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య

  రిప్లయితొలగించండి
 9. నీతి పరుల బ్రతుకు నిక్క మీ నాడులో
  చితికి పోవుచుండె, జెప్ప రాని
  లంచగొండి ధూర్తు లంచెలై పీడించు
  "నరకమున సుఖమ్ము దొరకునయ్య!"

  రిప్లయితొలగించండి
 10. శీనా గారి పద్య నడక చక్కగా వున్నది. కాని పోరు నందు కాయము వీడ నరకమా?!

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారూ,
  ఈరోజు మీ బహుముఖ్య నైపుణ్యం స్పష్టమయింది. ఇచ్చిన ఆటవెలది పాదాన్ని కందంలోనూ, తేటగీతిలోను, ద్విపదలోనూ ఇమిడ్చి పూరించడమే గాక ఆటవెలది కూడా వ్రాసారు. విషయం చూస్తే దేనికదే వైవిద్యంగా ఉన్నాయి. చాలా బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  అభినందనలు.. మీ భావానికి నా పద్యరూపం....
  నగరములను పట్టణములందు నేడు సౌ
  కర్యములను జూడగా భళి యని
  లోకు లనగ నూర్ధ్వలోకమ్ములందున్న
  నరకమున సుఖము దొరకునయ్య!
  *
  సహదేవుడు గారూ,
  ‘దివిని మించిన రకము’ మంచి విరుపు. చక్కని పూరణ. అభినందనలు.
  *
  శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘అంచెలై’ అనకుండా ‘అంచెలుగ’ అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 12. సహదేవుడు గారూ,
  ఆ విషయంలో ‘శీనా’ గారే తమ సమర్థన తెలుపుకొనవలసి ఉన్నది. మంచి ‘పాయింట్’ పట్టుకున్నారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. పాపులగు నరులకు ప్రాప్తించు దు:ఖము
  నరకమున ; సుఖమ్ము దొరకు నయ్య !
  మంచి పనులు జేయు మనుజుల కెపుడును
  స్వర్గ మందు దాము చనిన పిదప !

  రిప్లయితొలగించండి
 14. శంకరయ్య గారికి , నమస్కారములు మరియు సహదేవుడు గారు తెలిపిన అభ్యంతరము గురించి కొంత ఆలోచించిన మీదట
  నాకు అనిపించిన భావనను మీ సముఖం లో విన్నవించుకుంటున్నాను.
  యుద్దములో విజయము కానీ వీర స్వర్గము కానీ లభించునని మనమేరిగినదే . అయితే ఒకవేళ యితర కర్మ ఫలముల చేత నరకమున పడిన గాని, చేవ చచ్చి పోరాడక కూర్చుంటే కలిగే అవమాన బాధ కంటే నరక ప్రాప్తే సుఖమని నా భావన.

  రిప్లయితొలగించండి
 15. dharma shaastramulanu daarimallinchuchu
  neeti niyamamulaku neellu vadali
  maanavatva viluva marachina vaaniki
  narkamuna sukhammu dorakunayya

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  ======*=======
  శ్రీనివాసునివలె సిరుల తోడ సకల
  కలిమి నొంద జనులు ఖలుల జెంత
  జేరి పాపములను జేయని వారికి
  నరకమున సుఖమ్ము దొరకునయ్య!

  రిప్లయితొలగించండి
 17. నరకభాధలన్ని నేరుగా ఇక్కడే
  రోజుకొక్క తీరు రాజుచుండె
  ఇహము లోన సౌఖ్యమింతైన లేదయ
  నరకమున సుఖమ్ము దొరకునయ్య

  రిప్లయితొలగించండి
 18. నరక లోక యాత్ర నచికేతుడపుడు చే
  యంగ నరక విభుడు యముడు వరము
  లొసగి సత్కరించె లోక వందితునకు
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య!!

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  ఈ మధ్య సినిమాలలో జూపెడి యముని అల్లుడిపై
  =======*=======
  యుక్తి తోడ నొక్క యువకుడు యమపురి
  జేరి పితర దొరను చిత్తు జేసి
  యముని కల్లు డైన,నతనికి దప్పక
  నరకమున సుఖమ్ము దొరకునయ్య!
  ( పితర దొరను = యముడు )

  రిప్లయితొలగించండి
 20. శ్రీ శైలజ గారు మీ పద్యములో " న "కు "నే" కు, యతి వేసారు, న కు నా , నై, నౌ లు యతులుగా జెల్లును

  రిప్లయితొలగించండి
 21. భువిని ప్రళయ మెపుడు భూ కంపములు మెండు
  బాంబు ప్రేలు చుండి బాధ బెట్టు
  గరిత కోర్కె దీర గయ్యాళియై మొత్తు
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య !

  రిప్లయితొలగించండి
 22. ధర్మరాజ! వీడెఁ దనువును విదురుండు
  యముని యంశ తాను విమల చరిత!
  చింత వలదు నీకు సుంతైన, వానికి
  నరకమున సుఖమ్ము దొరకు నయ్య!

  రిప్లయితొలగించండి

 23. బొడ్డు శంకరయ్య గారి పూరణ.....

  ధర్మ శాస్త్రములను దారిమళ్ళించుచు
  నీతి నియమములకు నీళ్ళు వదలి
  మానవత్వ విలువ మరచిన వానికి
  నరకమున సుఖమ్ము దొరకునయ్య.

  రిప్లయితొలగించండి
 24. శీనా గారి సమర్థన, పద్యమున అన్వయము గురువుగారు వివరించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 25. నాగరాజు రవీందర్ గారూ,
  సమస్యను సమర్థంగా విరిచి మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  శ్రీనివాస్ గారూ,
  మీ వివరణ సమర్థనీయంగానే అనిపిస్తున్నది కానీ కర్మఫలాన్ని అనుభవించవలసిన వాడికి (అతడు వీరస్వర్గము పొందనున్నాడన్న సానుభూతితో) నరక బాధలు తప్పవు కదా! సుఖమెక్కడిది?
  నచికేతుని వృత్తాంతంతో మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మళ్ళించు, నీళ్ళు’ అనే వ్యావహారిక పదాలను వాడారు. ‘దారి తప్పించుచు, నీరు’ అంటే సరి.
  ‘మానవత్వ విలువ’ అని సమాసం చేయరాదు కదా! అక్కడ ‘మానవత్వపు వెల’ అందామా?
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  దారిలో పడ్డారు. సంతోషం. మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో వరప్రసాద్ గారు చెప్పినట్టు యతి తప్పింది. దానిని ‘నరకభాధలన్ని నెరవుగా నిక్కడే’ అని ప్రాసయతి వేద్దాం. (నెరవు = అధికము, సంపూర్ణము)
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు. ఈసారి సవరణలకు అవకాశం ఇవ్వలేదు. బ్యాడ్ లక్!
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. గురువర్యులకు ప్రణామాలు,..
  పూరణబాగుందని మీరు అనడం, నాకు చాలా సంతోషాన్ని కల్గించింది,మీరందిస్తున్న ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు....తప్సులు సరిదిద్దుకుని ,గుర్తుంచుకుంటాను..

  రిప్లయితొలగించండి
 27. శ్రీ వరప్రసాద్ గారికి,
  పూరణలో నా తప్పును చెప్పినందుకు కృతజ్ఞతలు,పద్యరచనలో ఇప్పుడిప్పడే నడకలు నేర్చుకుంటున్నాను...

  రిప్లయితొలగించండి