24, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1122 (వ్రతములతో వర్ధిలును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

23 కామెంట్‌లు:

 1. వ్రతములు సకామ కర్మలు
  వ్రతములతో వర్ధిలును జరామరణంబుల్
  హితపద్ధతి తగు సాధన
  సతతము నొనరింప నొదవు సద్గతులు సుధీ!

  రిప్లయితొలగించండి
 2. గుండు మధుసూదన్ గారి పూరణ....
  (నేమాని వారికంటె ముందే పోస్ట్ చేసారు. ఎందుకో బ్లాగులో రాలేదు)

  సతతము హింసను జేయుచుఁ
  బతన మార్గ గామి యగుచుఁ బరధన హరుఁడై
  మతి నీతి నియమ మేదిన
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  ======*======
  సుతుని గతులు,పుత్రిక పతి
  వ్రతములతో వర్ధిలును,జరామరణమ్ముల్,
  హితులు హితము మరచి బలుకు
  గతము గతః యను సతతము కలియుగ మందున్
  ( వ్రతములు = అధికారములు )

  నిన్న అనంతపురములో నుంటిని,అచ్చట వర్షములు లేక రైతులు కష్టములు పడుచున్నారు,
  రాష్ట్రం మొత్తంగా వరదలున్నా ఇక్కడ వర్షపు జాడ లేదు.

  పురము లందు వేరు అనంత పురము,పొంగి
  పొర్లు వేరు శెనగ పంట పొలము,కరువు
  తాండవము జేయు ముత్యాల మండపమ్ము,
  తుమ్మ జేట్లతో నిత్యము తూగు చుండు.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  (1) మీ పద్యములో 2 టైపు పొరపాట్లు దొరలినవి:
  -- 1. వేరుసెనగ అనుటే సాధువు
  -- 2. తుమ్మ చెట్లతో అని ఉండవలెను

  (2) శ్రీ గుండు మధుసూదన రావు గారి పద్యములో 2వ పాదము మొదటలో గణభంగము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. క్రతువులు పెక్కులు చేయుచు
  సతతము జపములను చేయు సద్గుణు డైనన్
  సతి సుత హితమున చేసెడి
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

  రిప్లయితొలగించండి
 6. వితరణ భావము వనితకు
  వ్రతములతో వర్ధిలును, జరా మరణమ్ముల్
  ప్రతియొక్కరికివి దప్పవు
  సతతము శివ పూ జ సేయ స్వర్గము గలుగున్ .

  రిప్లయితొలగించండి
 7. సతతము జీవుడు పూజలు
  వ్రతములతో వర్ధిలును; జరామరణమ్ముల్
  గతజన్మల పాతకముల
  వెతలతడిని కలతఁబెట్టవిక నమ్మినచో |

  రిప్లయితొలగించండి
 8. జతనము తో గల్గును పర
  హితమొనరించెడి మతి; పర హిత దూరములౌ
  వ్రతములు, పునర్జన్మ లొసగు
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములో సతతము శివపూజ సేయ స్వర్గము గలుగున్ - అనే భావము సరియైనది కాదు. పుణ్య కార్యములు చేస్తే స్వర్గము కలుగును. పూజలు కర్మలలోకి వచ్చును - అందుచేత పూజల వలన చిత్తశుద్ధి కలిగి భక్తి పెంపొందును. పూజలు సకామములైతే మళ్ళీ జన్మము కలుగును కాని మోక్షము లభించదు. మోక్షమే ఎవరికైనా అభిలషణీయము. స్వర్గము వలన గలిగే ఫలితము శాశ్వతమైనది కాదు - మోక్షమే శాశ్వతానందము నిచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. అయ్యా శ్రీ శ్రీనివాస్ గారూ!
  మీ పద్యములో 3వ పాదములో (పునర్జన్మ) అనేచోట గణభంగము కలదు. సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. జతనము తో గల్గును పర
  హితమొనరించెడి మతి; పర హిత దూరములౌ
  వ్రతములు, కర్మ ఫలమొసగు
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

  రిప్లయితొలగించండి

 12. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....

  పూజ్యులు నేమాని వారికి ధన్యవాదాలు. సవరించిన నా పూరణ...

  సతతము హింసను జేయుచుఁ
  బతన నిగమ గామి యగుచుఁ బరధన హరుఁడై
  మతి నీతి నియమ మేదిన
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

  రిప్లయితొలగించండి
 13. మితి మీరిన కాంక్ష విడచి
  పతనము గాకుండ మదిని పరుల హితమ్మున్ !
  సతతము భక్తిని నిలిపెడు
  వ్రతము లతో వర్ధిలును జరా మరణమ్ముల్ !

  రిప్లయితొలగించండి
 14. గురువులు క్షమించాలి
  నిన్నటి సమస్యను నేను మార్చ లేదు అంత తెలివి నాకెక్కడిది తమ్ముడూ ! ?
  అది టైప్ పొరబాటు నేను చూసుకో లేదు .రాసేసి బయటికి వెళ్ళాను ఇప్పడి వరకు చూడటము కుదరలేదు అదన్న మాట అసల్ సంగతి

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
  ======*======
  చిన్న నాడు జదివిన పాఠమొకటి గుర్తుకు వచ్చి

  కేకిని గని కాకియు కే
  కీకల తోడ దిరుగాడ యేకాకయ్యేన్
  కాకుల గుంపున,కాకికి
  కేకియు రూపము వలదుగ కీర్తిని పొందన్

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని వారూ,
  ‘వ్రతములు సకామ కర్మలు’ అంటూ మీరు చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ (సవరించిన) పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
  కాకుంటే అన్వయమే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది.
  ‘గతము గతమె’ అంటే బాగుంటుంది.
  ‘అవంతపురం’ మీద వ్రాసిన పద్యం బాగుంది.
  ‘వేరు + అనంత’ అన్నప్పుడు సంధి జరుగుతుంది కదా. ‘వేరె యనంత’ అనండి.
  *
  శ్రీనివాస్ గారూ,
  మీ మొదటి పూరణ, (సవరించిన) రెండవ పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  చివరి పాదాన్ని ‘సతతము శివపూజ సేయ సత్పద మబ్బున్’ అందాము
  *
  గూడ రఘురామ్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  పతి యతిచార మొనర్చిన
  సతియును నా వ్రత మొనర్చి, సత్యముగఁ “బతి
  వ్రత” యయ్యె; నితరులకొ? తద్
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 18. హితమే మామతమనుచును
  మతిమంతులు మంచికోరి మానక శ్రద్ధన్
  పతితుల కోసము జేసెడు
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్

  రిప్లయితొలగించండి
 19. ఏల్చూరి మురళీధర రావు గారూ,
  చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. అతులిత సౌభాగ్యమ్ములు
  వ్రతములతో వర్ధిలును. జరామరణముల్
  పతినికజేరవు మంగళ
  వ్రతమును పూనంగ సతులు శ్రావణమందున్

  రిప్లయితొలగించండి
 21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. సతతము లంచము వంచన
  మితిమీరిన దొడ్డి దారి మేతలు చేతల్
  చతురతతో జేసెడి యా
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్

  రిప్లయితొలగించండి
 23. అతిగా మడి మైలంచును
  సతమతమును జేసి యొసగి చంకను బిడ్డన్
  పతులను రాపిడి పెట్టెడి
  వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్

  రిప్లయితొలగించండి