18, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1116 (మానవులారా! భజనలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మానవులారా! భజనలు మానుట శుభమౌ.

38 కామెంట్‌లు:

 1. ధ్యానముగ భజన జేసిన
  కానడుగా దైవ మైన కలియుగ మందున్ !
  మౌనగు బాబాలను గని
  మానవు లారా భజనలు మానుట శుభమౌ !

  రిప్లయితొలగించండి
 2. గుండు మధుసూదన్ గారి పూరణ....

  మానుఁ డనర్హులఁ బొగడుటఁ ;
  దానను స్వీయాభిమాన దర్పము నిలుచున్!
  మానాభిమానములు గల
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!!

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  ఈనాటి ప్రథమ తాంబూలం మీకే! మంచి పూరణ చేసారు. అభినందనలు.
  ‘మౌని + అగు’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మౌనులు’ అంటే సరిపోతుంది.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మానవులారా! భజనలు
  మానుట శుభమౌ నటంచు మాన్యుడు పలికెన్
  జ్ఞానము వెల్లివిరియ దగు
  ధ్యానమ్మే కద పరమపదమ్మును జేర్చున్

  రిప్లయితొలగించండి
 5. నిజహృదయావాసుని నా
  మజపమ్మే మేలుగూర్చు మానవులారా!
  భజనలు మానుట శుభమౌ
  విజితేంద్రియులార! వడి లభించును సుగతుల్

  రిప్లయితొలగించండి
 6. మా నాయకుడే గొప్పని
  మా 'నవ ' పార్టీ సరియని మైమరపులతో
  మానవ ? వారిని పొగడుట
  మానవులారా! భజనలు మానుట శుభమౌ.

  రిప్లయితొలగించండి
 7. దానవుడు పీఠ మెక్కుచు
  మానమునే విడిచి మింగ మన సొమ్ములునున్
  హీనుడిగ నెఱిగి వానిని,
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!!

  రిప్లయితొలగించండి
 8. ఈనాటి కలియుగమ్మున
  నానా కష్టాలఁ బాపి జ్ఞానమొసంగే
  యా నారాయణుఁ గొలువక
  మానవులారా!, భజనలు మాను టశుభమౌ.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  =======*=======
  మాన హీనుని జెంత జేరి మాన్యుడవని బల్కి నేడు
  గానము జేసిన బెరుగు ఖలులకు కండ కావరము
  వానరముల తోడ జేరి వనవాసము జేయు చున్న
  మానవులారా! భజనలు మానుట శుభమౌను మీకు!!

  కానుక లిచ్చెడి ఖలునిన్
  భానుడవనుచును గ్రహముల వలెను దిరుగుచున్
  దానవుల జెంత జేరిన
  మానవులారా! భజనలు మానుట శుభమౌ।

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  =======*=======
  కొన్ని గణముల సవరణలతో

  3. జ్ఞానులమను కొని మీర
  జ్ఞానపు మౌనులను గాంచి,జ్ఞానము నొందన్
  కానుక లిడనను వ్యర్థము,
  మానవులారా!భజనలు మానుట శుభమౌ!

  రిప్లయితొలగించండి
 11. శ్రీ నేమాని గురుదేవుల బాటలో

  4. నిజము దెలియ రాముని(యీశ్వర) నా
  మ జపమ్మే మేలుగూర్చు మానవులారా!
  భజనలు మానుట శుభమౌ!
  గజ దొంగల నాయకునకు కనకము(కలిమియు)కొరకై

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. ముఖ్యంగా కందం చివరి పాదాన్ని స్థానభ్రశం చేసి వ్రాసిన విధానం ప్రశంసనీయంగా, ఔత్సాహికులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘మ్రింగ మన సొమ్ములనే...’ అంటే బాగుంటుందేమో!
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘ఒసంగే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘జ్ఞానప్రదుడౌ’ అందామా?
  *
  వరప్రసాద్ గారూ,
  మీ నాలుగు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. దానవుల బోలిన దొరలు
  కానరు ధర్మము జగమున, కర్కశ చేష్టల్
  మానరు పొగడ్తల వలన,
  మానవు లారా! భజనలు మానుట శుభమౌ !

  రిప్లయితొలగించండి
 14. శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మౌనము మేలగు భజనలు,
  గానము, కీర్తనల కంటె, గనుడీ మదిలో
  నే నాదోద్భవ మూలము
  మానవు లారా! భజనలు మానుట శుభమౌ !

  రిప్లయితొలగించండి
 16. శ్రీనివాస్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. రాజకీయ నాయకులపై
  5.
  నిజము దెలియక ఖలుని నా
  మ జపమ్మే జేయు చున్న మానవులారా!
  భజనలు మానుట శుభమౌ!
  కుజనుల రాజ్యము వలదుర కువలయ మందున్ ।

  రిప్లయితొలగించండి
 18. తన కూతురు లారా తో ఓ తల్లి:

  కానవు క్రికెట్టు కానిది,
  పూనవు కాంచ నరచేతఁబొత్తము నెపుడున్
  రైనా కోహ్లీ పూజలు
  మానవు, లారా!భజనలు మానుట శుభమౌ!

  రిప్లయితొలగించండి
 19. గానము జేయుడు భవు కథ
  మానవులారా !, భజనలు మానుట శుభమౌ
  మానవ మృగముల కెప్పుడు
  ఆనతి మఱి యిచ్చె మనకు నార్యులు వినుడీ .

  రిప్లయితొలగించండి
 20. ఏ నాయకు డైన నిలను
  దావవ కృత్యములు జేసి దయలేకుండన్
  మానవతుల జెరచినచో,
  మానవులారా! భజనలు మానుటశుభమౌ!

  రిప్లయితొలగించండి
 21. పూనకము వచ్చినట్టుల
  మా నాయకుడెంత మంచి మనిషో యనుచున్
  నానా విధముల పొగడెడు
  మానవులారా! భజనలు మానుటశుభమౌ!

  రిప్లయితొలగించండి
 22. ద్యానింపగ శ్రీహరినే
  జ్ఞానమొసగ ముక్తి జన్మ సాఫల్యతయున్
  ఈ నాయకమన్యులునిక
  మానవులారా భజనలు మానుట శుభమౌ

  రిప్లయితొలగించండి
 23. ఓ! నవ యువతా! దేశము
  దానవ దుర్నీతి పరుల దత్తంబౌ నీ
  మానా భిమాన హీనుల
  మానవులారా! భజనలు మానుట శుభమౌ.

  రిప్లయితొలగించండి
 24. పూనిక లేని యెడ, తలచి
  ధ్యానమున హరిని నిలుపగ దక్షత మదిలో
  కానని వారల తోడను
  మానవులారా! భజనలు మానుట శుభమౌ.

  రిప్లయితొలగించండి
 25. సినిమా తారలను అతిగా అభిమానించే నానితో అతని మిత్రుడు :

  సోనాక్షి సిన్ హ సిమ్రాన్
  సోనాలీ బింద్రె మరియు జుహి చావ్లాలన్
  నానీ ! నువు ధ్యానించుట
  మానవు ! లారా * భజనలు మానుట శుభమౌ !

  * లారా దత్తా

  రిప్లయితొలగించండి
 26. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  మానవు కుజనుఁ బొగడ; వర
  మా, నవుబా టవును గాదె మన యందఱకున్?
  మా నవహృ న్మందిర ఘన
  మానవులా, రా! భజనలు మానుట శుభమౌ!!

  రిప్లయితొలగించండి
 27. వరప్రసాద్ గారూ,
  మీ ఐదవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  రామకృష్ణ గారూ,
  మీ ‘లారా’ పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘మనిషో’ అనకుండా ‘మనిసియొ’ అందాం. ‘మనిషి + ఓ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అంతేకాదు ‘మనిషి’ అనే ప్రయోగం తప్పు. ‘మనిసి’ అనే తద్భవాన్ని వాడవచ్చు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది. రెండు మూడు పూరణలు ‘రమణ’ గారి మెయిల్ ద్వారా పంపారు. సంతోషం.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘నాయకమన్యుల నిక’ ఇక్కడ ‘ల’ లు గా పొరపాటున టైపయిందని భావిస్తున్నాను. తనను తాను పండితుడ నని చెప్పుకొను వానిని ‘పండితంమన్యుడు’ అంటాము. అలాంటి ప్రయోగమే కనుక ‘నాయకంమన్యులు’ అనవలసి ఉంటుందనుకుంటున్నాను. నిశ్చయంగా నాకూ తెలియదు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ద్విప్రాసతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. క్షీణించు భారతమునన్
  బూనిక గలవారు లేక బ్రోదియు మిథ్యౌ!
  హీనుల గద్దెక్కించుచు
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!

  రిప్లయితొలగించండి
 29. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘గద్దె + ఎక్కించు’ అన్నప్పుడు సంధి లేదు. ‘హీనుల గద్దెలపై నిడి’ అందాం.

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి ధన్యవాదములు.
  తమరి సూచిత సవరణతో పద్యం:
  క్షీణించు భారతమునన్
  పూనిక గలవారు లేక బ్రోదియు కరువౌ!
  హీనుల గద్దెల నిల్పుచు
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!

  రిప్లయితొలగించండి
 31. మానవుల భజన జేయుట
  మానవు నీకేమి బుద్ధి, మన హరి హరులన్
  ధ్యానించుము, మరి యర్హులు
  మానవులా ? రా ! భజనలు మానుట శుభమౌ.

  రిప్లయితొలగించండి
 32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వహ్వా! ఏమి విరుపు? ఏమి చక్కని పూరణ. మీకు ప్రత్యేక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. దేనికి రాగము తాళము?
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!
  గానపు సీడీ వినుడో!
  త్రేనుచు పులిహోర వడలు తినగనె భక్తిన్!

  రిప్లయితొలగించండి


 34. జానా బెత్తెడు గురువుల
  నానాటికి తెలియు వంచనల జూడగనౌ
  యేనాటికైన మేలౌ ,
  మానవులారా! భజనలు మానుట శుభమౌ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. వానలు కురియుట కొరకై
  మానవులారా! భజనలు మానుట శుభమౌ!
  దీనులు ముంబయి వాసుల
  ప్రాణము బప్పడి వ్రతమున వరదలు త్రుంపెన్!

  రిప్లయితొలగించండి