22, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1120 (శరణు కోరెఁ గపోతము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శరణు కోరెఁ గపోతము చంపెను శిబి.
ఈ సమస్యను పంపిన తాటికొండ ఓంకార్ గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    నేటికీ మేటి దాత శిబి చక్రవర్తే :

    01)
    __________________________

    శరణు కోరె గపోతము; - చంపెను శిబి
    శ్యేనపు పసి ,తనువు నుండి - కీనమిచ్చి !
    సంతసించి సురలు మెచ్చి - స్వస్తి బలికి
    శిబికి మరల ,తనువు నిచ్చె - శీఘ్రముగను !
    సురభి నిల్చె యతని కీర్తి - శోభనముగ
    నేటి వరకు ! శిబియె గాదె - మేటి దాత !
    __________________________
    శ్యేనము = డేగ
    కీనము = మాంసము

    రిప్లయితొలగించండి
  2. 'శివుడు బిడియాల ' పేరది 'శిబి ' యనంద్రు
    నడచి పోవుచునుండగా నడవి లోన
    దెబ్బ తిని కాళ్ళపైనను దబ్బున బడి
    శరణు కోరెఁ గపోతము- చంపెను శిబి.

    రిప్లయితొలగించండి
  3. శిబి యనందురు ' బిడియాల శివుని ' జనము
    బోయడాతడు నడవిని బోవుచుండ
    దెబ్బ తిని కాళ్ళపైనను దబ్బున బడి
    శరణు కోరెఁ గపోతము- చంపెను శిబి.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది మీ బోయోపాఖ్యానం !

    నేటికీ మేటి దాత శిబి చక్రవర్తే :

    01 అ)
    __________________________

    శరణు కోరె గపోతము; - చంపెను శిబి
    శ్యేనపు పసి ,తనువు నుండి - కీనమిచ్చి !
    సంతసించి సురలు మెచ్చి - స్వస్తి బలికి
    శిబికి మరల ,తనువు నిచ్చె - శీఘ్రముగను !
    సురభి నిల్చె యతని కీర్తి - శోభనముగ
    "సాటి లేడు నేటి వరకు - మేటి దాత"
    "శిబికి సాటి శిబియె యంచు - స్థిర మాయె" !
    __________________________
    శ్యేనము = డేగ
    కీనము = మాంసము

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    =======*==========
    శరణు కోరెఁ గపోతము,చంపెను శిబి
    డేగ యాకలి,దన తొడ వేగ గోసి
    శిబికి వరముల నిచ్చెను శీఘ్రము గను
    దాత యన నీవని బలికి ధరణి నందు.

    కేంద్రము ఆంద్ర ప్రదేశ్ పై చిన్న జూపు జూచుట పై

    డేగ వంటి కరువులెల్ల పాగ వేచె
    వైరికి వరము లిచ్చెడి ప్రభుని గాంచి
    శరణు కోరెఁ గపోతము,చంపెను శిబి
    పంజరమున ప్రతి దినము పస్తు లుంచి.

    (కరువు= విద్యుత్ మొ., శిబి = కేంద్రము, కపోతము= ఆంద్ర ప్రదేశ్)

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ శి.బి. పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శరణు కోరె గ పోతము చంపెను బలి
    కాదు ,బలితన తొడనునే గాటు వెట్టి
    డేగ కాహార మొసగియు డీ లు వడిన
    పావురంబును గాపాడె ప్రభువు గాన

    రిప్లయితొలగించండి
  8. శరణు గోరె గపోతము చంపెను శిబి
    యనుట దప్పంచు నా పాదమును నొక కవి
    మార్చె నీరీతి సభ్యుల మన్నన గనె
    శరణు గోరె గపోతము సదయు శిబిని

    రిప్లయితొలగించండి

  9. శరణు గోరె గపోతము; చంపెను శిబి
    తనదు తనవు పై మోహము, త్వరితము గను
    తొడను కోసి డేగ కునిచ్చె దొర తనమున
    గాచె శరణార్ధి నపుడు తా గాంచె కీర్తి

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తొడనే’ అనవలసింది ‘తొడనునే’ అన్నారు. దానికి బదులు ‘బలియె తన తొడను’ అనండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏమి చేసె సుగ్రీవుడు రాముని గని ?
    పురుగు కేల మూడెను చావు పొలము నందు ?
    పావురమును గాపాడిన ప్రభువు యెవరు ?
    శరణు గోరె ; కపోతము చంపెను ; శిబి.

    రిప్లయితొలగించండి
  12. తనదు తొడ నుండి మాంసము తనియు వరకు
    డేగ కోరిక మేరకు కోసి కోసి
    శరణు కోరెఁ కపోతము చంపెను శిబి ..[ ని ]
    సురలు మెచ్చగ కురిసెను విరుల వాన

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. శిబిఁ బరీక్షింప, హరి "డేగ", చిచ్చు "కూకి"
    యయ్యె; గ్రద్ద తఱుమఁగను నఱచుచు శిబి
    శరణు కోరెఁ గపోతము; చంపెను శిబి
    దేహ మోహమ్ము; తులతూచి దేహమిడెను!
    ఘనత నెఱిఁగిన దేవతల్ కరుణఁ జూపి,
    మోక్ష మిచ్చిరి; శిబియంత మోదమందె!!

    (హరి=ఇంద్రుఁడు; చిచ్చు=అగ్ని; కూకి=పావురము)

    రిప్లయితొలగించండి
  15. నాగరాజు రవీందర్ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి ప్రయత్నమే. అన్వయమే కుదరనట్టు అనిపిస్తున్నది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శిబి యను నతడు వేటకై చేర నడవి
    డేగ పావురముఁ దరుమ వేగిరమున
    చావు భయముచే వైరిని చంపమనుచు
    శరణు కోరెఁ కపోతము చంపెను శిబి

    రిప్లయితొలగించండి