27, జులై 2013, శనివారం

పద్య రచన – 415 (చేదోడు వాదోడు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“చేదోడు వాదోడు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు

15 కామెంట్‌లు:

 1. యువకుడను పేరు గలిగిన వృద్ధుడొకడు
  విధురు డగుటచే నొక కొంత వెదకి వెదకి
  తుదకు చేదోడు వాదోడు దొరకె ననుచు
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 2. నమస్కారములు
  శ్రీ పండితులవారి ప్రతిభ అద్భుతం రెందిటికీ ఒకే పద్యం అవధాన సరస్వతులు కదా ! చాలా బాగుంది

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  అక్కయ్య గారన్నట్టు మీరు సవ్యసాచులు. సముచితమైన పద్యం. అభినందనలు.
  మొదటి పాదంలో యతిని సవరించండి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  మొదటి పాదానికి నా సవరణ....
  ‘వృద్ధుఁ డొకఁడు యువకుఁడను పే రతనిది’

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. చేయి దోడును మఱియును వాయి దోడు
  నగుచు యన్ని పనులను దా నగుచు జేసె
  మాకు కృష్ణమ్మ యపుడున మ్మకము గాను
  అటులు జేయువా రెవరును నగుప డరుగ.

  రిప్లయితొలగించండి
 7. సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘అగుచు యన్ని - అగుచు నన్ని’ అనీ, ‘నమ్మకముగాను అటులు _ నమ్మకము గలుగ నటులు’ అనీ సవరించండి.

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  యతి గురించి మీరు మార్పుతో సూచించిన పాదము బాగుగనే యున్నది. ఈ సూచన ముందుగా నేను గమనించలేదు. అందుకే సమస్యా పూరణములో వేరొక విధముగా పాదమును మార్చేను. ఈ పేజీలో నా పద్యమును మీ సూచన ప్రకారమే మార్చుదాము. సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీకు మా యందు గల ఆదర భావమునకు చాల సంతోషముగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  పద్యానికి ఆయువుపట్టు అయిన లయ నా సవరణలో కంటే మీ సవరణలోనే ఉన్నది.

  రిప్లయితొలగించండి
 11. పతిని పూజించు టన్నను పగటి కలయె
  నెలత చేదోడు వాదోడు నిలువ కున్న
  నట్ట నడి సంద్ర మందున నౌక లేక
  విడువ కుండిన చాలును వేడ్క యనగ

  రిప్లయితొలగించండి
 12. హృదయ సాన్నిహిత్య మెంత యున్నను గాని
  హితము గోరు వార లెంద రుంద్రు?
  చిన్న నాటి చెలిమి చేదోడు వాదోడు
  కలిమి లేము లందు కాన వచ్చు.

  రిప్లయితొలగించండి
 13. సంఘమందున జీవింప జనులు యోకరి
  కొకరు చేదోడు వాదోడు యుండవలయు
  మతము కులముల పేరను మనసునందు
  ద్వేషమును పెంచ వలదని తెలిపె సాయి

  రిప్లయితొలగించండి
 14. చాదస్తపు టలవాట్లను
  చేదోడు వాదోడ టన్న చెల్లదు నేడీ
  వాదన లెందుకు మరి మరి
  సాదరమున కలసి మెలసి సౌఖ్యం బొందన్ !

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం.. ‘చేదోడు వాదోడు’ అన్నది కందపద్యంలో ఎక్కడా ఇమడదని నా ఉద్దేశ్యం.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సాయి ప్రబోధంగా మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘జనులు + ఒకరి’, ‘వాదోడు + ఉండవలయు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. నా సవరణ....
  సంఘమందున జీవింప జను లొకరి కొ
  కరును చేదోడు వాదోడుగా మెలగచు

  రిప్లయితొలగించండి