17, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1115 (పుక్కిటం బట్టి యుమిసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

43 కామెంట్‌లు:

 1. జలధిలో దాగియున్న రాక్షసుని బట్ట
  నెంచి మౌని యగస్త్యుండు మించు వేడ్క
  భువన రక్షణ శీలి యపూర్వ రీతి
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అగస్త్యుడు :
  మహావిష్ణువు దేవతలతో సముద్ర జలముల ఇంకింపచేసిన,
  దానిలో ఉన్న కాలకేయాదుల వధ వీలవుతుందని చెప్పాడు.
  సముద్ర జలముల యింకింపచేసే శక్తి అగస్త్య మహామునికి సాధ్యమనీ ఆయన్ను వేడుకొనమని చెప్పాడు.
  అప్పుడు దేవతలందరు శ్రీ మహావిష్ణువు సూచన అనుసరించి అగస్త్య మహామునిని సమీపించి, నమస్కరించి,
  ఆ మునీశ్వరుని కాలకేయాదుల నాశనానికై సముద్ర జలముల పానము చేయవలసినదిగా ప్రార్థించారు.
  వారికోరిక మేరకు అగస్త్య మహాముని లోకహితంకోసం సముద్ర జలమునంతటినిత్రాగివేసాడు.
  అపుడు కాలకేయాదులను ఇంద్రాది దేవతలందరు తమ దివ్యాయుధములతో యుద్ధముచేసి సంహరించారు.

  01)
  __________________________

  పూర్వ కాలము జలధిని - పొంచియున్న
  పుణ్య జనులను బట్టగా; - పూనికగొని
  పుడమి జలధిని యుదకముల్ - మొత్తమంత
  పుక్కిటం బట్టి; యుమిసె స - ముద్ర జలము !
  పుణ్య పురుషు డగస్త్యుడౌ - మునియె ! వినరె !
  __________________________
  పుణ్య జనుడు = రాక్షసుడు

  రిప్లయితొలగించండి
 3. జహ్నుముని గంగఁ ద్రావిన చందమునిట
  వింటిమి, భరత దేశము వింతల గని.
  యిచట నొక యగస్త్యుండను ఋషియు మునుపు
  పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

  రిప్లయితొలగించండి
 4. ఉప్పునీరని తెలిసియు గొప్ప కొరకు
  వంద పందెమ్ము త్రాగెద నిందు చూడు
  డనుచు నొక్కడు పూని ప్రతినను జేసి
  పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

  రిప్లయితొలగించండి

 5. నదులు నింపిన నీరు వానగ కురిసెడు
  నీరు కడలినీరు రుచుల వేరు యగునె
  శుష్క తర్కవాది వికట శూన్యవాది
  పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. వేరు + అగునె అనుచోట ఉకార సంధి యయి వేరగునె అనే రూపము వచ్చును. వేరు యగునె అని యడాగమము రాదు. అందుచేత మీ పద్యములో వేరగునొకొ? అని సవరించుదాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. కాలకేయులఁ జంప సంగ్రామమందు
  జలధి నిస్సారముగఁజేయ వలయునన్న
  ముని యగస్త్యుఁడు జనహితమునుఁ దలంచి
  పుక్కిటన్ బట్టి యుమిసె సముద్ర జలము.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు

  సమస్య వృత్తాంతము దెలిపిన శ్రీ నేమాని గురుదేవులకు,శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములు

  మృత సముద్రము నందు మనుజులు మునగరని తెలియక మునిగిన వానిపై
  =======*=======
  మృత సముద్రమే నొక మంచి మృత్యు మార్గ
  మని దలచి వడి వడి గను మునిగె నొక్క
  యువకుడు, జలధి పై తేలి యోగి వలెను
  పుక్కిటన్ బట్టి యుమిసె సముద్ర జలము.

  రిప్లయితొలగించండి
 9. అవని జనులను గాపాడ యా యగస్త్యు
  డా క్షణం బున రాక్షస యానవాలు
  తెలియు కొఱకునై సంద్రాన , వెలికి తీయ
  పుక్కిటం బట్టి యుమిసె సముద్ర జలంబు

  రిప్లయితొలగించండి
 10. వేరు యగునె..
  మళ్ళీ అదే తప్పు చేశానే !!
  వేరు కాదు అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 11. అబ్ధిఁబోలు పాఠ్యాంశములర్ధమవక
  వ్రాసెను పరీక్షనొకడు ధారణముజేసి
  తానరయువిద్య నాస్తియె; తఱచిచూడ
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము|

  రిప్లయితొలగించండి
 12. దేవతల కోర్కె మన్నించి దుష్టులైన
  కాలకేయాదుల నడచి కష్టములను
  దీర్చ నాగస్త్యముని శక్తి, ధీ బలమున
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము

  రిప్లయితొలగించండి
 13. వింధ్య గర్వమణచె నొక విబుధు డతడు
  మిగుల కరుణతో ద్రావిడ మాండలికము
  నకు సొబగులద్దె కుంభజు నకది హేల
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము

  రిప్లయితొలగించండి
 14. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  ఈ రోజు మీ జన్మదినమని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. ఈశ్వరానుగ్రహం మూలాన మీరు అనునిత్యం అనామయాయురారోగ్యాలతో విలసిల్లుతూ, ఇతోధికసాహితీసేవ కావిస్తూ మీ విద్యావంశానికి అమందానందాన్ని కలుగజేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

  ద్రుహిణాంభోజముఖీపదాబ్జయుగవిద్యోతార్తవౌఘంబుఁ బ్ర
  త్యహముం గూర్చుచు “శంకరాభరణ” విద్యాహృద్యపద్యాకృతిన్
  మహముం దీర్చు మహామహా! శుభము లింపారంగ శుంభద్గతిన్
  ముహురావృత్తిని వొందు నీ దినము సమ్మోదమ్ము దీపింపఁగన్ !

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 15. శంకరయ్య గురువర్యులకు ,
  నమస్కారములు మరియు జన్మదిన శుభాకాంక్షలు .
  శ్రీనివాస్ మద్దాలి (శీనా )

  రిప్లయితొలగించండి
 16. పల్లె వాడొక డజ్ఞాని పట్టణమును
  గాంచ జనె దాను దిరుగుచు కడలి కడకు
  ప్రముదమున జేరి యుప్పు నీరని తెలియక
  పుక్కి టంబట్టి యుమిసె సముద్ర జలము

  రిప్లయితొలగించండి
 17. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు జన్మదిన శుభా కాంక్షలతో.....
  అభినందన అక్షర కానుక

  గురువా! సాహిత్యోత్తమ!
  మరువము మీ సేవ మేము మను కాలంబున్
  కరివరదుని సత్ కృపచే
  నిరతము సుఖ శాంతి తోడ నిలపై మనుమా!

  భవదీయ
  గండూరి లక్ష్మీనారాయణ

  రిప్లయితొలగించండి
 18. కవి మిత్రులకు నమస్కృతులు.
  అగస్త్యుని సముద్రపానాన్ని గురించిన కథలు రెండు ఉన్నాయి.
  సముద్రంలో దాగిన కాలకేయులను బైట పడవేయడానికి దేవతల, మునుల కోరికపై అగస్త్యుడు సముద్రాన్ని పానం చేసాడు. దేవతలు కాలకేయులను సంహరించారు. ఇంతవరకు రెండు కథలూ సమానమే.
  ఒక కథ ప్రకారం అగస్త్యుని సముద్రపానం తరువాత గంగావతరణం జరిగింది. కాలకేయుల మరణానంతరం సముద్రాన్ని మళ్ళీ జలపూరితం చేయమని దేవతలు కోరగా అగస్త్యుడు ఆ జలమంతా జీర్ణమైనందన తన కది సాధ్యం కాదన్నాడు. ఆ తరువాత భగీరథుడు తెచ్చిన గంగాజలంతో సముద్రం నిండుకున్నది.
  ఇక రెండవ కథ ప్రకారం మొదట గంగావతరణం, తరువాత సముద్ర పానం... యాగాశ్వాన్ని వెదుకుతూ సగరుని కొడుకులు భూమిపై నాలుగింట మూడు వంతులు త్రవ్వారు. భగీరథుడు తెచ్చిన గంగ వారు త్రవ్విన ప్రదేశంలో నిండుకున్నది. సగరుని కారణంగా ఏర్పడింది కనుక అది ‘సాగరం’ అయింది. అగస్త్యుడు దానిని పానం చేసి కాలకేయుల మరణానంతరం దేవతల కోరికపై మళ్ళీ బయటకు వదిలాడు. ఆ విధంగా అతని కడుపులో కొంతకాలం ఉండి బయటపడటం వల్ల సముద్రజలం ఉప్పగా మారిపోయింది.
  ఈ రెంటింట ఏది సరియైనదో...?

  రిప్లయితొలగించండి
 19. నాగరాజు రవీందర్ గారి పూరణ.....

  "చక్కగ వినుము మనుమడ ! యొక్క తపసి
  పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలమ"
  టంచు జెప్పగ తాతయ్య , యర్భకుండు
  "పుక్కిటి పురాణము" లనుచు వెక్కిరించె

  రిప్లయితొలగించండి

 20. గురువులకు జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 21. గుండు మధుసూదన్ గారి పూరణ.......
  కంది శంకరయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలతో...

  బాలుఁ డొక్కఁడు సాగర పారమునను
  గాంక్షమెయిఁ దిరుగాడుచు, ఘనతరమగు
  దాహ బాధను బొంది, తాఁ దాళ లేక,
  పుక్కిటం బట్టి, యుమిసె సముద్ర జలము!

  రిప్లయితొలగించండి
 22. పండిత నేమాని వారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  పూరణ, పూరణకు ముందు చెప్పిన నేపథ్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వైవిధ్యమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  చమత్కారభరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సముద్రమే యొకమంచి. అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘జనులను గాపాడ నా యగస్త్యు..’ అనండి.
  ‘రాక్షస యానవాలు’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘ఆ క్షణంబున నసురుల యానవాలు’ అనండి.
  *
  గూడ రఘురామ్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఆగస్త్యుడు’ అంటే అగస్యుని కుమారుడు కదా. అక్కడ ‘దీర్చగ నగస్త్యముని శక్తి, ధీ బలమున’ అందాం.
  మీ రెండవ పూరణ కూడా చాలా బాగుంది.
  *
  శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  ధన్యోస్మి! నా యీ పుట్టిన పుట్టినరోజునాడు నేనెంత పుణ్యం చేసుకున్నానో? మనోరంజకమైన పద్యాన్ని ప్రసాదించారు. ధన్యవాదాలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
  ఏల్చూరి వారికి,
  శ్రీనివాస్ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  మిస్సన్న గారికి,
  గుండు మధుసూదన్ గారికి
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్షలు:

  అరువది మూడు వత్సరములైనవి జన్మ దినోత్సవంబు శ్రీ
  కరముగ వచ్చె నేడు వర కంది కులేందుడు శంకరయ్యకున్
  కరము ముదమ్ము తోడ శుభ కామనలిత్తు చిరాయురున్నతుల్
  వరమగు గాక యంచు కవివర్యు గుణాఢ్యుని బ్రస్తుతించుచున్

  రిప్లయితొలగించండి
 24. అబ్ది నీరంత యావిరై ఆకసమున
  వరుణ దేవుని నోటిలో వాలిపోవ
  వాన కురిపింప పుడమిపై వరణుడంత
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము

  అడవి సొగసుల జూడ పర్యాటకుండు
  దారితప్పి తిరుగుచుండ దాహమయ్యె
  చెంత నున్నట్టి కడలిలో కొంత నీరు
  పుక్కిటంబట్టి యుమిసె సముద్రజలము

  రిప్లయితొలగించండి
 25. గురువులు శ్రీ శంకరయ్య గారికి హృదయ పూర్వక జన్మదిన శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 26. పండిత నేమాని వారికి,
  పాదాభివందనాలు. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 27. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు జన్మదిన శుభాకాంక్షలతో
  కంది శంకరయ్య కవికుల శ్రేష్ఠులు
  మాకు గురువు గారు మాన్యవరులు
  జన్మదినము నేడు సంతోషకరమయా
  వందవత్సరములు వరలుమయ్య......

  రిప్లయితొలగించండి
 28. మునులు తాపసులను గన్న పుణ్య చరిత
  పుక్కిటం బట్టి యుమిసె సముద్ర జలము
  ధర్మ నిరతిని పాలించు కర్మ భూమి
  కవులు పండించు పంటల కల్ప తరువు

  రిప్లయితొలగించండి
 29. గురువు గారికి ప్రణామములు. మీకు నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి ప్రణామములతో జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 31. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  =======*=======
  ఆ భగవంతుని అనుగ్రహం వలన మీకు,మీ వంశమునకు సుఖ శాంతులు కలుగాలని ఆకాంక్షిస్తూ
  గురుదేవులకు హృదయ పూర్వక జన్మదిన శుభా కాంక్షలు
  పద్యహారము గురుదేవులకు కానుకగా

  తబసి వలె నిత్య యవ్వన
  నభశ్చరుడు,శిష్య తతికి నగము,వసుధపై
  శుభ దినమే,శుభ దినమే
  అభయము నిచ్చెడి గురువుల కనవరతమ్మున్ ।

  తబసి వలె నిత్య యవ్వన
  నభశ్చరుని జన్మ దినపు నడపు,వసుధపై
  శుభ దినమే,శుభ దినమే
  అభయము నిచ్చెడి గురువుల కనవరతమ్మున్ ।
  (జన్మ దినపు నడపు= జన్మదినాచరణ)

  రిప్లయితొలగించండి
 32. శ్రీ కందుల వరప్రసాద్ గారి పద్యమును ఒకించుక మార్చి వ్రాయుచున్నాను:

  శుభమతియు నిత్య యౌవన
  నభశ్చరుడు శిష్యతతికి నగము వసుధపై
  ప్రభ లలరెడు శుభదినమే
  యభయము నిచ్చెడి గురువుల కనవరతమ్మున్

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 33. శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములు.

  రిప్లయితొలగించండి
 34. బిడ్డతో గూడి సంద్రపు టొడ్డు జేర
  దాహ మంచును పసివాడు త్రాగ నెంచి
  యుప్పగా నున్న కతమున నుప్ఫు మంచు
  పుక్కిటం బట్టి యుమిసె సముద్ర జలము

  రిప్లయితొలగించండి
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 37. అంబుధిని యార్చనందుకు అగ్నికిడెను
  శాపమింద్రుండు పుడమి పై జననమొంద
  కుమ్భజుండంత అరచేత కూర్మిమీఱ
  పుక్కిటంబట్టె యుమిసె సముద్రజలము

  పూరణ చేసినవారు శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు

  రిప్లయితొలగించండి
 38. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రమణ గారూ,
  శ్రీ కెంబాడి తిమ్మాజీ రావు గారి పూరణ బాగుంది. వారికి అభినందనలు.
  ‘ఆర్చనందుకు అగ్ని కిడెను’ అన్నదానిని ‘ఆర్చనందుల కగ్ని కిడెను’ అందాం. ‘అందుకు + అగ్ని’ అన్నప్పుడు సంధి జరిగి ‘అందు కగ్ని’ అవుతుంది కదా.
  *
  శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు.....
  బొడ్డు శంకరయ్య గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  వరప్రసాద్ గారికి
  ....................... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 39. శ్రీశంకర గురువర్యులకు జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 40. గురువు గారికి అభివాదనములతో జన్మదిన శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 41. గురువు గారికి ప్రణామములతో జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 42. శంకరార్యా !
  ధన్యవాదములు !
  మరియు
  జన్మదిన శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 43. శుభాకాంక్షకు అందజేసిన మిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  రామకృష్ణ గారికి,
  వసంత్ కిశోర్ గారికి
  ............ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి