19, జులై 2013, శుక్రవారం

పద్య రచన – 407 (తొలి ఏకాదశి)

కవిమిత్రులారా,
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
ఈరోజు పద్యరచనకు అంశము....
“తొలి ఏకాదశి”

17 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    తొలిఏకాదశి :
    ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
    పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
    ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి
    పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు.
    స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.
    తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి,
    మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి
    తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే
    జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం.
    ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.
    దానిని ఉత్థాన ఏకాదశి అంటారు.
    ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు.
    ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు

    01)
    __________________________

    విష్ణు మూర్తదె శయనించు - వేళ యిదియె
    శయన యేకాదశి యనుచు -శక్తిమేర
    వ్రతము సలిపిన గలుగును - ఫలము మెండు !
    మరియును తొలి యేకాదశి - నరులకిదియె !
    పూర్వ సంవత్స రారంభ - పర్వ దినము !
    __________________________

    రిప్లయితొలగించండి
  2. శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములు, తొలి ఏకాదశి( శయన ఏకాదశి) పర్వ దినము యొక్క విశిష్టతను తెలియ జేసినారు .
    సత్కవులకు బాగు వీక్షకులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. వరప్రసాద్ గారికి మరియు
    మిత్రులందరికీ శయన ఏకాదశీ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. తొలి ఏకాదశి దినమున
    తులనాత్మక దండములను తొలిగా శంభో !

    ఇలనే నాదర సహితము
    మెల మెల్లగ బెట్టు చుంటి మీదయ కొఱకున్ .

    రిప్లయితొలగించండి
  5. తొలి యేకాదశి నేడు పుణ్య దినమెంతో నిష్ఠతో భక్తితో
    పలు పుణ్యక్రియలన్ బొనర్చునెడ సంప్రాప్తించు సద్యోగముల్
    విలసన్మానసులార! దీక్ష గొనుచున్ వేదాంత తత్త్వజ్ఞులై
    నలరారందగు పారమార్థిక వివేకానంద ధామమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. కేశవ మానస పూజ:

    శ్రీకేశవా! దేవ! శ్రీరమారమణీశ!
    ....నిగమాంతవేద్య! ధ్యానింతు నిన్ను
    నారాయణా! జగన్నాయకా! నీకిదే
    ....ఆవాహనమ్ము దేవాధిదేవ!
    మాధవా! మామక మానసాంబుజవాస!
    ....సింహాసనమ్మిదే చిన్నిధాన!
    గోవింద! లోకైక గురుదేవ! ఖగవాహ!
    ....పాద్యమ్ము నీకిదే పద్మనయన!
    విష్ణుదేవా! దైత్య విధ్వంసకా! చక్రి!
    ....అర్ఘ్యమియ్యదె కరుణాలవాల!
    మధుసూదానా! భక్తమందార! వైకుంఠ!
    ....ఆచమనీయ మియ్యదె ముకుంద!
    దేవా! త్రివిక్రమా! దేవతాగణ వంద్య!
    ....స్నానమ్ము నీకిదే జ్ఞానతేజ!
    వామనా! సురహితా! వాసవ వందితా!
    ....యజ్ఞోపవీత మియ్యదె రమేశ!
    శ్రీధరా! మురహరా! శ్రితలోక రక్షకా!
    ....చందనమ్మిదె మహానందసాంద్ర!
    శ్రీహృషీకేశ! రాశీభూత వాత్సల్య!
    ....ఆభరణమ్మిదే ఆదిదేవ!
    పద్మనాభా! ఫుల్ల పద్మదళేక్షణా!
    ....పుష్పార్చనమ్మిదే మోక్షదాత!
    దామోదరా! దైత్య దానవ నాశకా!
    ....ధూప మియ్యదె పరితోషపూర్ణ!
    సంకర్షణా! మౌనిజన హృదయారామ!
    ....దీపమ్ము నీకిదే త్రిభువనేశ!
    వాసుదేవా! విశ్వపాలన తత్పరా!
    ....నైవేద్య మిదె నీకు నాగశయన!
    ప్రద్యుమ్న! విశ్వరూపా! ధర్మతత్పరా!
    ....తాంబూలమిదె సదా ధ్యాననిరత!
    అనిరుద్ధ! వివిధ దివ్యాయుధధృతకరా!
    ....మంత్రపుష్పమ్మిదే మాహృదీశ!
    పురుషోత్తమా! జగద్గురువరా! సాదర
    ....వందనమ్ములు మహానందధామ!
    త్రిజగదీశా! అధోక్షజ! నీరదశ్యామ!
    ....పొనరింతు మానసపూజ నీకు
    నారసింహా! హిరణ్యకశిపసంహార!
    ....ప్రహ్లాద వరద! శోభాకరాంగ!
    అచ్యుతా! దేవబృందార్చిత పదపద్మ!
    ....నీ సేవలనొనర్తు నెమ్మనమున
    శ్రీజనార్దన! కృపాసింధు! నీ చరితమ్ము
    ....గానమ్ము నొనరింతు దీనపాల!
    దేవా! ఉపేంద్ర! రాజీవపత్రేక్షణా!
    ....వినుతింతు నీ మహావిభవములను
    హరి హరీ! మురహరీ! ఆదరమ్మేపార
    ....నుపచారములొనర్తు యోగివంద్య!
    శ్రీకృష్ణ! మమ్ము పాలింపుమా నింపుమా
    ....జ్ఞానతేజమ్ము నా మానసమున
    అంతరంగ నిలయ! శాంతి సౌఖ్యప్రదా!
    నిన్ను గొలుచువారిని కృప గనుచు
    బాపి దుఃఖములను పరమపదమ్మిడు
    నాదిదేవ! నీకు నంజలింతు

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా!
    చిన్న టైపు పొరపాటు:
    ఆరవ పాదములో మధుసూదనా! అని చదువుకొనవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. యోగనిద్రను శయనిం చు యోగిదివస
    మసుర ద్వారమ్ము కడనిల్చి వసుధ గాచు
    వ్రతములు పండుగల శుభారంభ మగుచు
    శ్రీకారము తొలిఏకాదశీ దినమ్ము

    రిప్లయితొలగించండి
  9. నేమాని పండితార్యా! నమోన్నమః

    శ్రీహరి పాల సంద్రమున శేషునిపై శయనించు, లోకముల్
    మోహమునందు మున్గును, ముముక్షువు లిత్తరి వీడి కోరికల్
    దేహము వొందు నిద్రయును, తిండియు కట్టడి జేసి, యాహరిన్
    మోహపు టంధకారము సమూలముగా నశియింప వేడరే!

    తొలి యేకాదశిని న్నిరశ్న వ్రతుడై తోయంబులున్ ద్రాగకే
    బలి భిక్షంబులు బెట్టి ద్వాదశి తిథిన్ భక్షించుచో భోజ్యముల్
    నలు మాసమ్ముల దీక్షనుండు యతిలో నారాయణుం జూచుచో
    కలుగున్ సజ్జన కోటి కెల్ల శుభముల్ కాపాడుటన్ వేలుపుల్.

    భానుడు దక్షిణాయనము వైపు గమించుచు కర్కటాన కా-
    లూనిన పిమ్మటన్ వరుసలో నరుదెంచెడు పర్వ శోభలన్
    మానవ కోటి పొంది బహు మంచిగ జీవన యాత్ర సాగగా
    పూనిక నిచ్చు నీ దినము పొంగెడు భక్తిని శక్తి నిచ్చుచున్.

    రిప్లయితొలగించండి
  10. మెండుగ పూజలు జేతురు
    పంఢరిపురమున విఠలుని భజనలతోడన్,
    నిండగ వార్కరు లందరు
    పండుగ ఏకాదశి మన పంఢరిలోనన్

    వార్కరులు = పంఢరిపురికి కాలినడకన కీర్తనలతో చేరుకునే భక్తులు

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి. 3వ పద్యములో బహుమంచిగ అని వాడేరు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. పాల కడలిని శయనించ పాప హరుడు
    శయన నేకాద శియనుచు జేయు వ్రతము
    నుపవ శించిన కలుగదు నుదర వ్యాధి
    అన్న మందున దాగిరి దనుజు లనగ !

    రిప్లయితొలగించండి
  13. ‘తొలి ఏకాదశి’ పర్వదిన ప్రాశస్త్యాన్ని వసంత కిశోర్ గారు చక్కగా వివరించారు.
    పండిత నేమాని విష్ణు మానస పూజను ఆస్తిక జనోపయోగంగా ప్రసాదించారు.
    నేటి అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్ర్రులు.....
    వసంత కిశోర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    మిస్సన్న గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ‘విష్ణుమూర్తి + అదె’ అన్నప్పుడు సంధి లేదు. అలాగే ‘శయన + ఏకాదశి’ వృద్ధిసంధి అవుతుంది. నా సవరణ.....
    విష్ణుదేవుడు శయనించు వేళ యిదియె
    యందరు శయనైకాదశి యని పిలుతురు.
    *
    తిమ్మాజీ రావు గారూ,
    మూడవ పాదంలో గణదోషం. ‘వ్రతములును’ అంటే సరి!
    నాల్గవ పాదంలోనూ గణదోషం. ‘శ్రీకృతియె’ అంటే సరిపోతున్నది.
    *
    మిస్సన్న గారూ,
    ‘మంచిగ’ అన్నదాన్ని ‘మానిత’ అంటే సరిపోతుందా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘శయనైకాదశి’ అని సంధి చేయాలి కదా! ఆ పాదాన్ని ‘చేయగ శయనైకాదశీ వ్రతమ్ము’ అందాం.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    నేను వ్రాసిన సీసమాలికలో (కేశవ మానసపూజ) కేశవాది 24 నామములు కలవు. చివరి ఆటవెలది యొక్క 4 పాదములను సీసపాదములగా కూడా చదువుకొనవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. నేమాని పండితార్యా! మీ సూచనకు ధన్యవాదములు.

    గురువుగారూ! మీ సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి