9, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1107 (శరమున్ గని జింకపిల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

21 కామెంట్‌లు:

  1. శరవేగమ్మున మీదికి
    మరి వచ్చిన పులిని గొట్ట మానవు డొకడున్
    దరి జేరి పులికి నాటిన
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  2. నరులను గని పరువెత్తుచుఁ
    దరువుల డొంకలను దాఁటి దప్పికఁ గొనియున్
    దరినున్న కొలను లోపల
    శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్.
    (శరము=నీరు)

    రిప్లయితొలగించండి
  3. తిరుగుచు దప్పిక తోడను
    హరిణ మొకటి వెదకుచుండె హ్రదమున కొరకై
    దరిదాపున నగుపించిన
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  4. తరుమగ వ్యాఘ్రము భీతిన్
    హరిణమొకటి యురుకుచుండె నటుయిటు వేగన్
    మరుగును వెదకుచు నుండగ
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.


    శరము = ఱెల్లుగడ్డి

    రిప్లయితొలగించండి
  5. చిరుత ప్రాయపు బాలురు
    ధరింప దసరాలలోన ధనువున్ శరమున్
    విరులొప్పెడు నా చక్కని
    శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  6. కరుణామయుడా రాముని
    కరమున వెలువడుచు ముక్తి కరమగుచు నదో
    దరి జేరెను నన్ననుచును
    శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  7. గిరగిర వడివడి బరుగున
    అరుసముతో జిందు లేసి నటునిటు దిరుగన్
    ఇరవుగ దప్పిక కలుగన్
    శరమున్ గని జింక పిల్ల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  8. పరువమునందతి సహజము
    మరుతాపము ప్రాణికోటి మనుగడ కెల్లన్
    హరిణము విసిరిన తొలిసుమ
    శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్ !!!

    రిప్లయితొలగించండి
  9. చిరుతను గని పరుగెత్తెడి
    హరిణంబును జూచి వేట కరుదెంచిన వే
    టరి యా పులిపై వేసిన
    శరమున్ గని జింక పిల్ల సంతసమొందెన్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    నా తప్పునకు క్షంతవ్యుడను క్షమించగలరు, నా తలపులలో , వాక్కులో శివుడు అందరి కంటెను ఆదర్శప్రాయుడు,
    నిన్నటి పూరణలో యతి కొరకు వాడిన పదము తప్ప మరియొకటి కాదు.
    నా తలపులలో మహేశ్వరునకు అత్యుత్తమమైన స్థానము యున్నది. ఇక పై వ్రాతలలో ఆ స్థానము నిచ్చెదను.

    రిప్లయితొలగించండి
  11. అరుదెంచి వ్యాధు డొక్కడు
    హరిణముపై విల్లునెత్తి యమ్మును వేయన్
    గురితప్పి చెట్టు దాకిన
    శరమున్ గని జింక పిల్ల సంతసమొందెన్.

    రిప్లయితొలగించండి
  12. నరముల లోపల జొచ్చిన
    శరమును వేగముగ తీయ శస్త్ర చికిత్స తో
    శర వేగమున విడివడిన
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    ======*=======
    దరిదాపున నగుపించిక
    గరిక, దిరుగు చుండె నడవి కనుమల నందున్
    దరికిన్ జేరిన జక్కని
    శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్

    (శరము చివరనున్నది గరిక యనుకొని )

    రిప్లయితొలగించండి
  14. పరవశ మునవన మందున
    హరిణాక్షి కోయంగ విరులు హానిగ దలచెన్
    నరనారి యనుచు భీతిగ
    శరమున్ గని జింక పిల్ల సంతస మొందెన్ !

    రిప్లయితొలగించండి
  15. సురవైరులపై పరమే-
    శ్వరు డెక్కిడ ధనువు బూని సంధింపంగా
    మరియొక కరమున నొదుగుచు
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  16. పరవస్తు చిన్నయ సూరి చెప్పిన పంచతంత్రములో మిత్రలాభము కధ !

    వరువాత వలను దీయుచు
    మరపున బడు వ్యాధుని గని మౌకలి గూయన్
    బరువెత్తి ,నక్కఁ దాకిన
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    వరువాత = ప్రాతఃకాలము ; మౌకలి = కాకి

    రిప్లయితొలగించండి
  17. ధరణిన్ పచ్చిక మేసెడు
    హరిణంబును జూచి బోయ డమ్మునువేయన్
    గురి తప్పిన యా బోయని
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ధరణీధరుడా రాముని
    గురినే శంకించి నట్టి కోతుల మదిలో
    నరమరికలు తీర్చిన యా
    శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్

    రిప్లయితొలగించండి