చేతనమ్ము గూర్చు జ్యోతివీవు
భయము దీర్తువీవు భద్రముల్
గూర్తువు
తలతునమ్మ! నిన్ను
గొలుతునమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
బడుగునైతి నమ్మ! బాధలెన్నొ
పడుచునుంటి నమ్మ! భవచక్రమున
తల్లి!
తలతునమ్మ! నిన్ను
గొలుతునమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
నడువజేయు మమ్మ! నన్ను మంచి
యోగమార్గమందు నొప్పుగా నో
దేవి!
తలతునమ్మ! నిన్ను
గొలుతునమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
ఆర్తి తోడ నిటుల నరుగుచుంటి
దుర్గమమ్ములైన త్రోవలలో
నేను
తలతునమ్మ! నిన్ను
గొలుతునమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
అభయమిమ్ము భవభయమ్ము బాపి
అలసి సొలసియుంటి నమ్మ! నెమ్మనమున
తలతునమ్మ! నిన్ను
గొలుతునమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
ప్రణవ మంత్ర వాచ్య! పరమ పూజ్య!
నీ పదమ్మె నాకు నిక్కమౌ రక్షగా
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
పిలిచి నంతలోనె పలికి వ్యథల
దీర్చి రక్ష గూర్చు దేవత వని మది
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!
ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
నీదు సేవలందు మోదమొందు
భాగ్యమిమ్ము నాకు పరమ దయామయీ!
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!