2, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 63 (ఇనశశిబింబయుగ్మము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 7
సమస్య - "ఇనశశిబింబయుగ్మ ముద
యించె దినాంతమునందుఁ దద్దిశన్"
చం.
ఇనసమతేజ! మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్నసం
జననము మేరు ప్రస్తరము చక్కఁగఁ దీర్చితిఁ బక్షమయ్యె నే
ర్పున సురకోటులన్ దిశలఁ బొల్పగ వ్రాయుచు రాఁగ నేఁటి కా
యిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

10 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    విశ్వరూప సందర్శన సమయంలో సూర్యుడు ,చంద్రుడు, అగ్ని, సమస్త లోకాలూ అందలి జీవులూ అర్జునుడు సందర్శించిన సమయం :

    01)
    _____________________________________________

    ఘనమగు యుద్ధమందు,తన - గర్వము ఖర్వము గాగ , పార్థుడే
    వినయము కృష్ణుతో బలికె - వేదన నొందుచు "సన్యసించెదన్"
    అనవిని , విశ్వరూపమును - హంసుడు జూపెను, గీత బోధతో !
    ఇన శశి బింబ యుగ్మ ముద - యించె దినాంతమునందుఁ దద్దిశన్
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  2. వనముల పాలుయైతిమని వ్యాకులమేలనె వామలోచనా!
    కనుగవ సూర్యచంద్రులయి కాంతులుజిమ్మెడి మాధవుండదే
    మనలనుఁ గావవచ్చెనిటు మన్ననఁ జేయుచు చూడు ద్రౌపదీ!
    యిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.

    రిప్లయితొలగించండి
  3. వసంత కిశోర్ గారూ,
    ఉదాత్తమైన పూరణ. బాగుంది. అభినందనలు.
    "వినయము కృష్ణుతో బలికె" అన్నదాన్ని "వినయముతోడ కృష్ణు ననె"అంటే ఎలా ఉంటుంది?

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "పాలు + అయితిమి" అన్నప్పుడు యడాగమం రాదు. "వనముల పాలు గాగ మది వ్యాకుల మేలనె" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  4. వినుమిక నాదు శ్రీమతియె వేడుక మీరగ,పుట్టినింటికే
    చనియెను కాన్పు నొందుటకు;చాలొక పిల్లడు చాలునంటి,నే
    కనియెద ఆడు పిల్లనని ఖచ్చితమంచును జెప్పె!చూడగన్
    యిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !ధన్యవాదములు !
    ఎలాగూ మూడో పాదంలో కృష్ణుడున్నాడు కాబట్టి
    "వినయము భక్తి తోడ , కడు"- అంటే బావుంటుందేమో !

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    ఇంతకూ కవలలు (ఒక ఆడ, ఒక మగ) జన్మించినట్టా?

    వసంత కిశోర్ గారూ,
    మీరు చెప్పిందీ బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ! ధన్యవాదములు.
    అవునండీ!కవలలుగా సూర్యతేజ,చంద్రముఖి పుట్టినట్లు.

    రిప్లయితొలగించండి
  8. ఘనముగ లాల వోసి కను కాటుకఁ దీరిచి పౌడరద్ది శ్యా
    ముని కడ దండమెట్టి యొక ముద్దును బెట్టగ పాప యంతటన్
    గునగున పర్విడన్ నొసట కుంకుమ నద్దిన మోము తోడ! హా,
    ఇన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్!

    (పాప ముఖం చంద్రబింబము, పాప నుదుటిన బొట్టు సూర్యబింబమని నా ఉద్దేశ్యం)

    రిప్లయితొలగించండి
  9. Lucknow Roadshow by siblings:

    ఘనుడగు డింపులిండటను కావలి కాయుచు చెల్లి కోసమై
    కనుగొన డింపులమ్మనట కంపము నొందుచు వోట్లకోసమై
    మనమున కాంగ్రెసాధములు మంత్రపు ముగ్ధులు నౌచు నెంచిరే:
    "ఇనశశిబింబయుగ్మ ముద యించె దినాంతమునందుఁ దద్దిశన్"

    రిప్లయితొలగించండి