20, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 81 (నిను నిను నిన్నునిన్ను)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 25
సమస్య - "నిను నిను నిన్నునిన్ను మఱి
నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్"
(అ) రామాయణార్థంలో ....
చం.
అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
పనస! సుషేణ! నీల! నల! భానుకులుం డగు రాఘవేంద్రుఁ డ
ద్దనుజపురంబు వే గెలువ దైత్యులఁ జంపఁగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
(ఆ) భారతార్థంలో ...
చం.
అనఘ సురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
మ్మనుమనె రాజసూయము యమాత్మజు డిప్పుడు చేయఁబూని తా
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
() భాగవతార్థంలో ...
చం.
అనఘ సురేశ! వాయుసఖ! ఆర్యమనందన! రాక్షసేంద్ర! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మనుమని చెప్పె మాధవుఁడు మారుని పెండ్లికి మిమ్ము నందఱిన్
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

21 కామెంట్‌లు:

  1. ఘనమగుమీనమై ధరనుఁగాచు వరాహము, కూర్మమై మహా
    వినుతిని పొందినావు ధరఁసింహమవైతి, వుపేంద్రు డైతి ధా
    త్రినిఁ దిగు రామ కృష్ణు, కలికిప్రభుడంచునుగొల్తునేఁ సదా
    నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    ముందుగా మీకు నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరొక్కరే ఈ సమస్యను పూరించారు. మంచి విషయాన్నే ఎత్తుకున్నారు. కాని 2,3 పాదాల్లో యతి తప్పింది. ఒకసారి సవరించే ప్రయత్నం చేయండి. కాకుంటే చివరాఖరుకు నేనున్నాను గదా!

    రిప్లయితొలగించండి
  3. ఘనముగ మీనమై ధరనుఁ గాచు వరాహము, కూర్మమై, ఘనా
    ఘన నరసింహ,వామనుడుగాన్ మఱి రాముడు, కృష్ణుడై సదా
    మనమున మాయెడన్ కరుణమాయకయుండెడి దేవ! గొల్తు నేఁ
    నిను,నిను,నిన్ను,నిన్ను మఱి నిన్నును,నిన్నును,నిన్ను,నిన్నునున్.

    రిప్లయితొలగించండి
  4. వినుమయ పెద్దనా ! సుకవి పింగళి సూరన ! రామకృష్ణ ! తి
    మ్మన కవి ! భట్టు మూర్తి ! మరి మల్లన ! ధూర్జటి ! రామభద్ర ! రా
    యని సభ వేళ యయ్యెను ; రయమ్మున బిల్వగ వచ్చి నిల్చితిన్
    నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ !!!

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ! చక్కగా విష్ణ్వవతారములను కీర్తిస్తూ వ్రాశారు.బాగుంది.
    ఎనిమిది అవతారాలను కీర్తిస్తే ఇంకా బాగుండేది. ఏడే వచ్చాయి.
    విష్ణునందన్ గారూ! అష్ట దిగ్గజాలను చక్కగా పిలిచారు.అభినందనలు.

    రామాజ్ఞ ననుసరించి సీతను అడవిలో ఒంటరిగా వదలి వెళ్లుచూ అష్ట దిక్పాలురతో తల్లిని జాగ్రత్తగా చూడుడని మ్రొక్కిన విధము...

    ఇనకుల చంద్రు డిట్లు తన యింతిని కానల పాలు జేసెగా !
    మనమున మ్రొక్కుచుంటి నిట మాతను జక్కగ రక్ష జేయగా !
    ఎనిమిది దిక్కులన్ జగతి నేలుచు నుండెడి నేతలార! నే
    నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్!!

    రిప్లయితొలగించండి
  6. ఘనముగ మీనమై ధరనుఁ గాచు వరాహము, కూర్మమై, ఘనా
    ఘన నరసింహ,వామనుడుగాన్ మఱి రాముడు, కృష్ణ, కల్కి గా
    మనమున మాయెడన్ కరుణమాయకయుండెడి దేవ! గొల్తు నేఁ
    నిను,నిను,నిన్ను,నిన్ను మఱి నిన్నును,నిన్నును,నిన్ను,నిన్నునున్.


    హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం , భావం చాలా బాగుంది. అష్టదిక్పాలకులను పిలువటం, ప్రార్థించటం బాగుంది.
    విష్ణునందనుల వారి పద్యం కూడా బాగుంది.
    పై పద్యం లో కల్కి ని తలచాను, రెండవ పద్యంలో మరిచాను. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  7. అద్భుతమైన పూరణ లిచ్చిన విష్ణు నందన్ గారూ, హనుమచ్చాస్త్రి గారూ, మందాకిని గారూ
    అభినందన మందార మాలలు.

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ! ధన్యవాదములు.
    వేగంగా కల్కిని తెచ్చి కృష్ణుని ప్రక్క నిలిపారు .ఇప్పుడు లెక్క సరిపోయింది.అభినందనలు..

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ,
    ఇప్పుడు మీ పూరణ సర్వలక్షణసమన్వితమై సుందరంగా ఉంది. అభినందనలు.
    ‘ఘనాఘన’ మంటే మేఘం. అది ఇక్కడ అన్వయించడం లేదు.
    "మేటి కూర్మమై/ ఘన నరసింహ ..." అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  10. డా. విష్ణు నందన్ గారూ,
    అష్టదిగ్గజాలను సభకు పిల్చిన మీ పూరణ మనోజ్ఞమూ, సర్వశ్రేష్ఠమూ. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కరుణరసప్రపూరిగమైన ఉత్తమ పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శంకరయ్యగారూ , మిస్సన్న గారూ , మందాకిని గారూ , శాస్త్రి గారూ , ధన్యవాదాలు .

    మందాకిని గారూ , మీ పద్యానికి శంకరయ్యగారు చేసిన సవరణలో మరో సవరణ . ' నరసింహ వామనుడు ' గా అన్నప్పుడు ద్వంద్వసమాసం ధ్వనించడం లేదు కనుక , ఒక విధానంలో - " మేటి కూర్మమై / ఘన నరసింహ వామనులుగాన్ " అనడం . లేదా పైన మొదటి పాదంలో ' ఘన ' శబ్దం ప్రయోగించేశాం పునరుక్తి ఎందుకనుకుంటే , " మేటి కూర్మమై / కనగ నృసింహమై , వటువుగాన్ ...." అంటూ సవరించేయడం.....ఏదైనా బాగానే ఉంటుంది.

    అలాగే మొదటి పాదంలో " ఘనతర మీనమై " అనండి. పద్యం మరింత పటిష్టంగా తయారవుతుంది .

    రిప్లయితొలగించండి
  12. డా. విష్ణు నందన్ గారూ,
    శతసహస్ర వందనాలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. నాదీ ఒక ప్రయత్నం:

    విను జననేత! రాష్ట్రపతి! విన్ము ప్రధాని! విపక్ష నాయకా!
    విను మధినాయకీ! సచివ! విన్మిది శాసన శిల్పి! వాక్పతీ!
    జనులు శపింపరే 'ధరల' జాలము నందున చిక్కి శల్యమై
    నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.

    ( వాక్పతి = స్పీకర్ )

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్నగారూ! ధరలు పెరిగితే ఎవరిని తిట్టాలా అనుకునే వాడిని.అష్టవిధ నాయకులను చూపించి అదరగొట్టేశారు.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ, గురువుగారూ, విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు.
    గురువుగారూ,
    మీ ఇద్దరి సవరణలతో .....

    ఘనతర మీనమై ధరనుఁ గాచు వరాహము, మేటి కూర్మమై,
    కనగ నృసింహమై, వటువుగాన్ మఱి రాముడు, కృష్ణ, కల్కి గా
    మనమున మాయెడన్ కరుణమాయకయుండెడి దేవ! గొల్తు నేఁ
    నిను,నిను,నిన్ను,నిన్ను మఱి నిన్నును,నిన్నును,నిన్ను,నిన్నునున్.

    మిస్సన్న గారూ, వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో చక్కటి పద్యం చెప్పారు.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదాలు హనుమచ్చాస్త్రి గారూ, మందాకిని గారూ.
    మూసలో కాగిన బంగారం లాగ మందాకిని గారి పద్యం వన్నె లీను తోంది.

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మీ పూరణ అచ్భుతంగా ఉంది. స్పీకర్ ను వాక్పతి చేయడం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కష్టపడి బావ నొప్పించి
    బావగారిచ్చే విందుకు తన తోటి వారిని పిలుస్తోందొక చిట్టి మరదలు :

    01)
    _______________________________________________

    నిను నిను నిన్నునిన్ను మఱి - నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ !
    చనువున బావ రమ్మనెను - చప్పున పోదము ! రండి ! రండహో !
    తినుటకు ! భానుతేజ,రవి - దేవకి , లాలస,చిన్న,రాఘవా
    సునయన, శోభ ! కోరినవి - సొంపుగ పొందగ , యక్క తోడుగన్ !
    ______________________________________________

    రిప్లయితొలగించండి