31, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 511 (అల్లుఁ డవినీతిపరుఁ డైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అల్లుఁ డవినీతిపరుఁ డైన నత్త మెచ్చు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులకు మనవి ...
నిన్న మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల ఈనాటి సమస్యను ఇవ్వడం ఆలస్యమయింది. నిన్నటి పూరణలు, వ్యాఖ్యలను ఈ మధ్యాహ్నం వరకు పరిశీలించి స్పందిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

30, అక్టోబర్ 2011, ఆదివారం

సుబ్రహ్మణ్య స్తోత్రము

సుబ్రహ్మణ్య స్తోత్రము
(నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలతో ...)

వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||

వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||

వందే వల్లీ సహితం
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||

వందే వీరవరేణ్యం
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||

వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||

వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||

వందే సుందర రూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||

వందే భవ్య చరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||

రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యసి రావు గారు.

సమస్యా పూరణం - 510 (భవుఁడు భవు నెదిర్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 509 (ద్రవమునెల్ల హరించి)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
ద్రవమునెల్ల హరించి కాచెను
త్ర్యంబకుండు జగమ్ములన్.
(ఛందస్సు - ఇది ‘తరళం’ అనే వృత్తం. దీని గణాలు న-భ-ర-స-జ-జ-గ. యతిస్థానం 12. ప్రాస నియమం ఉంది. దీని నడక ‘ననననానన - నాననానన - నాననానన - నాననా’)
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

29, అక్టోబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 508 (కుందేటికి మూడు కాళ్ళు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.

28, అక్టోబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 507 (జనులకు భగినీహస్త..)

కవిమిత్రులకు
భ్రాతృవిదియ పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
జనులకు భగినీ హస్తభోజనము విషము.
భ్రాతృవిదియ (భగినీహస్త భోజనం)
ఈరోజు భ్రాతృవిదియ. దీనిని కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని ‘యమద్వితీయ’ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాదుల పూజ చేస్తారు. భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరింది. తీరిక చిక్కని పనుల మూలంగా చాలాకాలం ఆమె కోర్కె తీర్చలేకపోయాడు. తుదకు యముడు ఒకనాడు యమున యింటికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆమె ఎంతో మర్యాద చేసింది. యముణ్ణి, అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని, వారి పరివారాన్ని పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించింది. ఆమె చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించమని కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు "ఏ సోదరి ఈనాడు సొదరుని తన ఇంటికి ఆహ్వానించి తన చేతివంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుంది" అని కూడా వరమిచ్చారు.
యమునికి మరియు యమునకు ఇటువంటి సోదర ప్రేమ నడచిన విదియ కాబట్టి దీనికి ‘యమద్వితీయ’ అనే పేరు వచ్చింది. ఈనాడు ప్రధానమైన ఆచారం సోదరి తన అన్నదమ్ములను ఇంటికి ఆహ్వానించి పూజించి, క్రొత్తబట్టలు పెట్టి గౌరవించడం. ఈ ఆచారం ఏర్పడిన తరువాత ఈ పర్వదినానికి ‘భాతృవిదియ’, ‘భగినీ హస్తభోజనము’ అనే పేర్లు వచ్చాయి. (వికీపీడియానుండి)

27, అక్టోబర్ 2011, గురువారం

నా పాటలు - (అయ్యప్ప పాట)

కొయిలాలొ కోయిలమ్మో!

(ఈ పాటలో పల్లవి నాది కాదు. జానపద బాణీల్లో పాటలు రికార్డింగ్ జరుగుతుండగా వెళ్ళాను. వాళ్లు వ్రాసుకున్న చరణాలు సరిగా లేకపోవడంతో వాళ్ళ భాషలోనే చరణాలు వ్రాసి ఇచ్చాను)

కొయిలాలొ కోయిలమ్మో
కొయిలాలొ కోయిలమ్మో
అయ్యప్ప యాడుండో జాడ జెప్పమ్మా
కొయిలాలొ కోయిలమ్మో ................................... || కొయిలాలొ ||

నువు బొయ్యే తోవల్ల పూలతోట లున్నాయి
తీరుతీరు పూలల్లో తొంగితొంగి చూడమ్మా
పువ్వుల్లో పువ్వయ్యీ .....
పువ్వుల్లో పువ్వయ్యీ ఉన్నడేమొ చూడమ్మా ........ || కొయిలాలొ ||

నువు బొయ్యే తోవల్ల పండ్లతోట లున్నాయి
తీరుకొక్క పండు తెచ్చి నైవేద్యం పెట్టమ్మా
విందారగింప వచ్చీ .....
విందారగింప వచ్చి దొరుకుతాడొ చూడమ్మా .......... || కొయిలాలొ ||

నువు బొయ్యే తోవల్ల కుటీరాలు ఉన్నాయి
కన్నె కత్తి గంట గద గురుస్వాము లున్నారు
ఆ స్వాముల గుంపుల్లో .....
ఆ స్వాముల గుంపుల్లో చేరినాడొ చూడమ్మా ........ || కొయిలాలొ ||

పరిష్కర్త - కంది శంకరయ్య
సంగీతం - కళాప్రవీణ్.
గానం - యోగానంద్, బృందం.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/11450ee6-cbe5-43d9-a8d0-d9d16783c31b/Koyilalo

సమస్యా పూరణం - 506 (ఏనుఁగు జన్మించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

26, అక్టోబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 505 (దీపావళి పోరు సలిపె)


కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
దీపావళి శుభాకాంక్షలు!
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దీపావళి పోరు సలిపె తిమిరముతోడన్.

శుభాకాంక్షలు!


కవిమిత్రులకు
బ్లాగు వీక్షకులకు
తెలుగువారి కందరికీ
దీపావళి శుభాకాంక్షలు!

ప్రమిద దేహమ్మునకు గుర్తు, ప్రజ్వరిల్లు
జ్యోతియే యాత్మ, యందులో సద్వివేక
భూతమౌ జ్ఞానతైలమ్ము పోసినపుడె
లోకకళ్యాణకాంతులు ప్రాకు దిశల!

క్రమము దప్పక వచ్చెడి కవివరులకు
నప్పుడప్పుడు కనిపించు నతిథులకునుఁ
గలుఁగ సుఖసంపదలు శుభాకాంక్ష లిప్పు
డందఁజేయుచున్నది ‘శంకరాభరణము’

25, అక్టోబర్ 2011, మంగళవారం

చమత్కార (చాటు) పద్యాలు - 131

కవిమిత్రు లందరికి నరకచతుర్దశి శుభాకాంక్షలు!
శ్రీకృష్ణ నవరత్నములు
(శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించిన ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
సీ.
నరకబాణాసుర మురజరాసంధాది
పాపులచేఁ జాల బాధలఁ బడి
భూదేవి విన్నపంబులు సేయ క్షీరాబ్ధి
శాయి దయాళుఁడై జగతిమీఁద
యాదవవంశంబునందుఁ దా వసుదేవు
సూనుఁడై జన్మించి సురలు మెచ్చ
ధరణిభారముఁ బాపి దనుజులఁ బరిమార్చి
ధర్మంబు నిలిపి యధర్మ మడఁచె
ఆ.వె.
అట్టి దేవదేవు నాదినారాయణుఁ
బుండరీకనయను భుజగశయనుఁ
గమలనాభుఁ గొలిచి కల్మషంబుల నెల్లఁ
దోలువాఁడ ముక్తి నేలువాఁడ. ................................................... (1)
సీ.
పురుడు వెళ్ళనినాఁడె పూతనఁ బరిమార్చె
శకటాసురునిఁ గొట్టెఁ జరణహతిని
బడద్రొబ్బె మద్దులు బకునిఁ గీటడఁగించె
దావాగ్ని ద్రావి వత్సకునిఁ గూల్చె
గోవర్ధనం బెత్తి గోవుల రక్షించెఁ
గాళీయనాగంబు గర్వ మడఁచె
ధేనుకాసురుఁ బట్టి తిత్తొల్చె మహిపుత్త్రుఁ
దునిమి రక్కసునిఁ దుత్తుమురు సేసె
గీ.
వెలయు వనమెల్లఁ బెఱికిపో వీచె లీల
వత్సవాతూలు నాతృణావర్తుఁ గెడపె
సురుచిరాంగుండు గోపాలసుందరుండు
దనుజదమనుండు గేవల దైవ మెట్లు? .........................................(2)
సీ.
గోపాలకులతోడ గోవులఁ గాచె నా
కాళింది తటమునఁ గమలభవుఁడు
వత్సముల్ గొనిపోవ వాని రూపము దాల్చి
వనజేశునకుఁ దల వంగఁ జేసె
బాల్యంబునాఁడు గోపాలకులును దాను
వెన్నలు పాలును వెజ్జి యాడె
చేడెలతో జలక్రీడ లాడఁగఁ జొచ్చి
యందఱ చీరలు నపహరించె
ఆ.
రహిఁ బదాఱువేల రాజకన్యకలను
నన్ని రూపులగుచు ననుభవించె
రాసకేళిఁ గూడె రామల నెల్లను
గృష్ణు మహిమ లెన్నఁ గేవలంబె. .............................................. (3)
సీ.
వెలయ నక్రూరుకు విశ్వరూపము సూపె
వలువకై చాఁకలివానిఁ బంపె
మఱి కుబ్జఁ జక్కనిమానిసిగాఁ జేసెఁ
బుష్పలావి కొసంగె భూరిమహిమ
కంసుని ధేనువుల్ ఖండించి వైచెను
గువలయాపీడంబు పొవ రడంచె
చాణూరమల్లుల సమయించె భుజగర్వ
రూఢిని గంసుని రూప మణఁచె
గీ.
కంసుతండ్రిని బట్టంబు గట్టి కాచె
దేవకీదేవి దైన్యంబు త్రెంచి వైచెఁ
గేలిమై శిశుపాలునిఁ గీటడంచె
భక్తవత్సలు శ్రీకృష్ణుఁ బ్రస్తుతింతు. ............................................ (4)
సీ.
అరయ నిర్వదియొక్క యక్షౌహిణులతోడ
నిర్వదియొక్కమా ఱేఁగుదెంచె
మధురపై విడిసిన మత్తు జరాసంధు
దునిమించె భీముచే దురమునందుఁ
గాలయవనుఁ డుగ్రగతి నెత్తిరా వాని
ముచికుందుచే మృతిఁ బొందఁజేసె
ఆ శమంతకరత్న మరుదారఁగాఁ దెచ్చె
జాంబవంతుని గెల్చె జాంబవతిని
ఆ.
వేడ్క బెండ్లియాడె వెడలించె నపనింద
జగతి కెల్ల మేలు సంఘటించె
తెగి సృగాల వాసుదేవునిఁ దెగటార్చె
గృష్ణుఁ డితఁడు సర్వజిష్ణుఁ డితఁడు. .......................................... (5)
సీ.
బదరికా వనములోఁ బరగు ఘంటాకర్ణుఁ
డిచ్చఁ గొల్చిన మోక్ష మిచ్చె నండ్రు
కైలాసగిరిమీఁదఁ గాలకంధరముఖ
విబుధ సంస్తుతులచే వెలయు నండ్రు
గురువు తన్ వేఁడిన గురురక్షణార్థమై
చచ్చినసుతునిఁ దెచ్చిచ్చె నండ్రు
దుర్యోధనాదులు ద్రుపదనందన వల్వ
లొలువంగ నక్షయ మొసఁగె నండ్రు
ఆ. వె.
కామగమన మగుచుఁ గడునొప్పు సౌంభకా
ఖ్యానపురము జలధిఁ గలపె నండ్రు
చరిత పుణ్యధనుఁడు భరితగోవర్ధన
కంధరుండు లోకసుందరుండు. ................................................ (6)
సీ.
సమరంబులో జరాసంధాదులను ద్రోలి
ప్రేమతో రుక్మిణిం బెండ్లియాడె
మురదానవునిఁ గూల్చి నరకునిఁ బరిమార్చి
దివ్యకుండలములు దెచ్చుకొనియె
విబుధకన్యలఁ బదార్వేలను విడిపించి
దయఁ జూచి మణిపర్వతంబు దెచ్చె
సురలోకమున కేఁగి సురపతి నోడించి
సురభూరుహము దెచ్చె సురలు మెచ్చఁ
ఆ. వె.
బౌండ్ర వాసుదేవు బంధుయుక్తంబుగాఁ
ద్రుంచి కాశిరాజు త్రుళ్లడంచె
వాసుదేవు మహిమ వర్ణింప శక్యమే
ఫాలనేత్రుకయిన బ్రహ్మ కయిన. ............................................. (7)
సీ.
పరగ బాణాసురుపై నేఁగి యాతని
శోణితపుర మెల్లఁ జూఱలాడె
ఆపురిఁ గాల్చి త్రేతాగ్నులు చల్లార్చి
పురపాశములు ద్రెంచి మురునిఁ గూల్చె
బాణాసురుని వేయుబాహులుఁ దెగనేసి
చండిక వేడినఁ జంపకునికి
శివుఁడు దాఁ గోపించి శీతజ్వరము వైవ
వైష్ణవజ్వరమును వైచె నతఁడు
గీ.
జృంభకాస్త్రంబుచే సోలఁ జేసె శివునిఁ
బ్రేమతో ననిరుద్ధునిఁ బెండ్లిచేసెఁ
గరుణ బాణునిఁ బట్టంబు గట్టె నితఁడు
మూఁడుముర్తుల కవ్వలిమూర్తి యితఁడు. .................................... (8)
సీ.
పాండుతనూజుల పక్షమై నొగలెక్కి
రెండు సేనలయందు నిండియున్న
బంధుజనంబుల బావల మఱఁదుల
నన్నదమ్ములఁ జూచి యనికిఁ దొడఁగి
యనుకంపఁ జేసిన యార్తుని బోధించి
పార్థుకు విశ్వరూపంబు సూపె
నచ్చటఁ బదునెన్మి దక్షౌహిణులతోడ
భీష్మాదియోధుల పీఁచ మడఁచె
ఆ. వె.
ధరను మఱియుఁ బుట్టి దనుజులఁ బరిమార్చె
భూమిభార మెల్లఁ బుచ్చివైచె
నాదిదేవుఁ డయిన యా కృష్ణుఁ బ్రార్థించు
నట్టివారు ముక్తు లయినవారు. ................................................... (9)

సమస్యా పూరణం - 504 (నరకునకు సత్యభామ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నరకునకు సత్యభామ సోదరి యగునఁట!

24, అక్టోబర్ 2011, సోమవారం

నా పాటలు - (‘ఓ మనసా! ప్రేమించకే!’ సినిమా పాట - 2)

ఓ మనసా! ప్రేమించవే! (రెండవ భాగం)

ఆమె -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను || ఓ మనసా ||
మనసున మనసై - మసలే మనిషిని || మనసున ||
మరచిపో అనకే ... ఆ ........................................................... || ఓ మనసా ||
అతడు -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను || ఓ మనసా ||
మారిన నా మదిలోన మరులెన్నో రేపిన || మారిన ||
చెలియ చెలిమిని మరువకే ... ఆ ...................................... || ఓ మనసా ||

అతడు -
ఏనాటికి విడిపోతాయో - ఈప్రేమకు సంకెలలు
ఆమె -
ఏదేవుడు వరమిస్తాడో - ఈదూరం తొలగాలని || ఏనాటికి ||
అతడు -
ఆకాశం భూమి సాక్షిగా - ఆవేదన చెందినాము
ఆమె -
ఆకాశం భూమి సాక్షిగా - ఆవేదన చెందినాము
ఇద్దరు -
ఆత్మీయత పంచుకొనగా - ఆరాటం పడుతున్నాము ........... || ఓ మనసా ||

రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉన్నతి, సారంగపాణి.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/fb7433a8-c9b8-4033-95ed-06b8e21cda87/O-manasa---Unnathi,-Sarangapani

సమస్యా పూరణం - 503 (సొమ్ము లున్నవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సొమ్ము లున్నవాఁడె సుగుణధనుఁడు.
ఈ సమస్యను సూచించిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

23, అక్టోబర్ 2011, ఆదివారం

నా పాటలు - (‘ఓ మనసా! ప్రేమించకే!’ సినిమా పాట)

ఓ మనసా! ప్రేమించవే!
నేను వ్రాసిన మూడు సినిమా పాటల్లో ఇది మొదటిది. ఏడెనిమిదేళ్ళ క్రితమే ఈ సినిమా పూర్తయింది. కోర్టు తగాదాల్లో చిక్కి విడుదల కాలేదు. ఇక కాదనుకుంటా! ఈ చిత్రంలో విశాఖపట్టణానికి చెందిన శివాజీ అనే డాక్టర్ హీరోగా నటించాడు. నా పాటలో కొంతభాగం షూటింగ్ వికారాబాద్ సమీపంలోని ఏదో ప్రాజెక్ట్ దగ్గర జరిగింది. ఆ సందర్భంగా రెండురోజులు ఆ యూనిట్ వాళ్ళతో ఉన్నాను.
రెండవపాట ‘హృదయాలు’ అనే చిత్రంకోసం వ్రాసాను. పాట రికార్డింగ్ కూడా అయింది. కాని భాగస్వామ్యపు గొడవలతో షూటింగ్ మొదలుకాకుండానే ఆగి పోయింది.
మూడవ పాట మా వరంగల్ వాళ్ళు తీసిన సినిమా. పేరు ‘నీ మనసు నాది’. నిరుద్యోగసమస్యపై పాట వ్రాయమన్నారు. వ్రాసి ఇచ్చాను. వాళ్ళు ఆ పాటను ఇష్టం వచ్చినట్లు మార్చేసారు. నా పేరు పెట్టవద్దని చెప్పాను.

ఓ మనసా! ప్రేమించవే! (మొదటి భాగం)

ఆమె -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను
|| ఓ మనసా ||
వలపు విఫలమై - విలపించుటకే
|| వలపు ||
కలలున్నవి అనకే! .... ఆ ......................................... || ఓ మనసా ||

అందరాని చందమామకై - అశించే కలువనై
చెలికాని వలపు కలిమికై - నిలిచాను బేలనై
|| అందరాని ||
తోడులేని నా బ్రతుకున - తూరుపు తెలవారునా || తోడు ||
పేదగుండె చీకటి తొలగి - వెలుగు సిరులు నిండునా ......... || ఓ మనసా ||

అతడు -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను
|| ఓ మనసా ||
మారిన నా మదిలోన - మరులెన్నో రేపిన || మారిన ||
చెలియ చెలిమిని మరువకే ... ఆ ............................... || ఓ మనసా ||

కాలం కాలనాగమై - కాటువేసి పోయినా
ఎడబాటే కాలకూటమై - ఎద మంటలు రేపినా
|| కాలం ||
ప్రియురాలి ప్రేమ పిలుపే - విరిజల్లై కురిసెనులే
|| ప్రియురాలి ||
మురిపాల నా సఖిని - చెర వీడి రమ్మనవే ...................
|| ఓ మనసా ||
(గమనిక - నేను ‘బేలనై’ అని వ్రాస్తే గాయని ‘బేలినై’ అని పాడింది)

రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉష, ప్రవీణ్.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/9f0d771e-c8dd-49a7-8947-dbc56933ff7c/O-manasa---Usha,-Praveen

సమస్యా పూరణం - 502 (నేనే నీవైతినేమొ?)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 501 (అంతర్ధానముఁ జెందె)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం
డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
ఈ సమస్యను పంపిన
ఊకదంపుడు గారికి
ధన్యవాదాలు.

22, అక్టోబర్ 2011, శనివారం

నా పాటలు - (గణేశ గీతం)

గణేశ! గుణేశ!
(హిందీ చిత్రం `ప్రిన్స్’ లోని ‘బదన్ పే సితారే’ వరుసలో)

గణేశ! గుణేశ! గజేంద్రముఖ!
పరేశ! సురేశ! పరబ్రహ్మరూప!
నమో విఘ్నరాజ! నమో ఏకదంత!
నమో విఘ్నరాజ! నమో ఏకదంత! ........
|| గణేశ ||

నమో యక్ష గంధర్వ సిద్ధార్చితా!
నమో నాగ యజ్ఞోపవీతాంచితా!
నమో దుఃఖ దారిద్ర్య పాపాంతకా!
నమో సూర్యకోటి ప్రభాభాసురా! .............
|| గణేశ ||

నమో పార్వతీపుత్ర! లంబోదరా!
నమో భక్తమందార! బుద్ధిప్రియా!
నమో వక్రతుండా! నమో శాశ్వతా!
నమో సిద్ధ సంసేవితాంఘ్రిద్వయా! .........
|| గణేశ ||

సదా నీదు రూపమ్ము భావింతుము
సదా నీదు నామమ్ము భజియింతుము
గుణాతీత! మాదిక్కు నీవేనయా!
శుభాకార! మాపైన దయ చూపవా! ......
|| గణేశ ||

రచన - కంది శంకరయ్య
రికార్డింగ్ - కరావొకే
గానం - బృందగానం.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/bd2bbd8a-381d-4fad-be9c-276e9cc1824a/Ganesha-Gunesha

సమస్యా పూరణం - 500 (ఐదువంద లనిన)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ..
ఐదువంద లనిన నల్పమె కద!

21, అక్టోబర్ 2011, శుక్రవారం

నా పాటలు - (తాండూరు భద్రేశ్వర సుప్రభాతం)

తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వర సుప్రభాతం

శ్రీమన్మహాదేవ! శ్రీభావిగీశ!
తాండూరు పురవాస! మహిత విఖ్యాత!
పరిపూత గురులింగరూప! కరుణాత్మ!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిత్యత్రికాల లింగార్చన పవిత్ర!
పరమ పావనగాత్ర! దుష్టగుణ జైత్ర!
సత్పుణ్య చారిత్ర! లోకనుత పాత్ర!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

వీరశైవోద్ధరణ కర్మానురక్త!
బసవధర్మ ప్రచారక! శూలిభక్త!
పావనశ్లోక పంచాగమ సుకర్త!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

ఈషణత్రయ నాశకా! గుణాతీత!
వైరిషడ్వర్గ విధ్వంసక! మహాత్మ!
సప్తవ్యసన భంగ! కరుణాంతరంగ!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

శ్రీ భావిగీ మహాక్షేత్రమ్ములోన
మఠమందు స్వామి రూపమ్ముతో వెలసి
భక్తజనులకు కొంగు బంగారమైన
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

తాండూరు వాస్తవ్యుడౌ శ్రీ బసన్న
భావిగి రథోత్సవము దర్శించి రాగా
బండి వెంటనె వచ్చి వెలసినావంట!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిత్యనూతనమైన నీ రథోత్సవమును
దర్శించి తరియింప భక్తజనకోటి
దిక్కుదిక్కులనుండి వచ్చుచున్నారు
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నీ పేరు స్మరియించి, నీ రూపు భావించి,
నీ గుడిని దర్శించి, నీ పూజ చేసి
నిన్నె నమ్మిన మమ్ము కాపాడ రావ?
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

వర భద్రయోగివై బసవస్వరూపివై
నూతిలో నీటినే నేతిగా మార్చావు;
నీ మహిమ లెంచగా నే నెంత స్వామి?
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

సంసారబంధ మాయాజాలమున జిక్కి
హింసా ప్రవృత్తితో స్వార్థచింతనతోడ
పాపకూపమ్ములో పడు మమ్ము కాపాడు
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిను నమ్మి, నిను జేరి, నీ పూజచేయ
భక్తు లెందరొ వచ్చి నిలిచారు దేవా!
లేవయ్య! రావయ్య! లేచి రావయ్యా!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ప్రవీణ్.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/9e8d1ba4-1691-43d7-9b40-d2800118c4bc/Bhavigi-Bhadeshwara-Suprabhaatam

నిషిద్ధాక్షరి - 1

నిషిద్ధాక్షరి - 1

‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా
రామునిపై
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

20, అక్టోబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట - 7)

సాయి మంత్రం

షిరిడీపురమే చిన్మయధామం
సాయి నామమే శుభమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| షిరిడీ ||
ఆర్తు లందరికి అభయము నిచ్చి
ఆదరించు సద్గురు మంత్రం .....................
|| షిరిడీ ||

భవరోగమ్ముల భరతం పట్టే
వైద్యశిఖామణి ఘనమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| భవ ||
గురువుల గురువై అజ్ఞానమ్మును
తరిమికొట్టు సద్గురుమంత్రం ....................
|| షిరిడీ ||

అరిషడ్వర్గము లంతముచేసి
ఆదుకొనే తారకమంత్రం
సాయినామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| అరి ||
పాపాలను విచ్ఛిన్నం చేసి
పాలించే పావనమంత్రం ..........................
|| షిరిడీ ||

సర్వదేవతా స్వరూపుడైన
సాయిని చూపే సన్మంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| సర్వ ||
చిత్తశాంతి చేకూర్చి జన్మమును
తరింపజేసే చిన్మంత్రం ...........................
|| షిరిడీ ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - సుభాష్, స్వాతి, బృందం.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/2dde5bd0-7840-4a24-8ccc-4c0281fd5a34/Sai---Shiridi-purame

సమస్యా పూరణం -499 (మాటఁ దప్పువాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.

19, అక్టోబర్ 2011, బుధవారం

నా పాటలు - (సాయి పాట - 6)

దీపస్తంభం

తీరం తెలియని సముద్రయానంలో
దారిని చూపే దీపస్తంభంలా
భవసాగరమును తరింపజేసెడివై
బాబా కథలే దారిని చూపునులే
బాబా కథలే గమ్యం చేర్చునులే

అమృతధారలను మించే మధురిమతో
అగ్నిత్రయమును మించు పవిత్రతతో
చెవుల సోకి హృదయానికి చేరునులే
జీవితముల శోభిల్లగ జేయునులే
బాబా కథలే కాంతిని నింపునులే ...........
|| తీరం ||

తనువు మీది అభిమానం తొలగించి
ద్వంద్వభావ గర్వాలను నిర్జించి
జ్ఞానకాంతులను మదిలో నింపునులే
సర్వపాప సంఘాలను చంపునులే
బాబా కథలే నీతులు నేర్పునులే ...........
|| తీరం ||

అధిక మోహమును స్వార్థము నడగించి
ఆత్మను సాక్షాత్కర మ్మొనరించి
గురుభక్తిని మన ఎదలో నింపునులే
పరమాత్ముని సన్నిధికే చేర్చునులే
బాబా కథలే మోక్షము నిచ్చునులే ........
|| తీరం ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/315a55d2-ace7-445d-9f7c-2a4f4c4aad16/Sai---Teeram-teliyani

సమస్యా పూరణం -498 (కుంచములోఁ బోతునక్క)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్.
(కుంచము = నాలుగు మానెళ్ళ కొలపాత్ర)
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

18, అక్టోబర్ 2011, మంగళవారం

సన్మాన నవరత్నాలు

ప్రముఖ నేత్రవైద్యులు
శ్రీ వద్దిరాజు శ్రీకాంత్ గారి
షష్టిపూర్తి మహోత్సవము
ది. 13-10-2011 నాడు జరిగిన సందర్భమున సమర్పించిన
సన్మాన నవరత్నాలు

శ్రీ ప్రసన్నాంజనేయు విశిష్టదయను
వీరభద్రుని సుకటాక్షవీక్షణమున
గురువరుండు దత్తాత్రేయు కరుణవలన
కలుఁగు సర్వశుభములు శ్రీకాంత నీకు!

తే. గీ.
వద్దిరాజు వంశాబ్ధి విభాకర! నర
సింహ రావు సరోజిని చెన్ను మీఱు
దంపతులు, వారి సుతుఁడవై తనరి, వైద్య
విద్యలో గడించితివి ప్రావీణ్య మీవు!
తే. గీ.
ఉత్తమేంద్రియమై నేత్ర మొప్పు ననుచు
తచ్చికిత్సలో నైపుణ్యతను గడించి
వైద్యమును వృత్తిగా పొంది వరలి, యుచిత
నేత్రవైద్య శిబిరముల నిర్వహింతె!
తే. గీ.
వాసి గాంచిన ఆలూరి వంశమందు
రాణ కెక్కె లక్ష్మీపతి రావు ఘనుఁడు
శారదా దేవి యాతని సతియు, వారి
తనయ శర్వాణి నీకయ్యె ధర్మపత్ని.
కం.
గర్వము నెఱుంగక నుమా
శర్వుల సేవించు, వైద్యశాస్త్రజ్ఞతలో
సర్వులు మెచ్చు ప్రతిభగల
శర్వాణి హిత సహదర్మచారిణి యయ్యెన్.
తే. గీ.
వయసు పైఁబడి ప్రేమను బాసి కుములు
వృద్ధులకు సేవచేయు సత్కృప నయితివి
కార్యదర్శి; వృద్ధాశ్రమ మార్యజనులు
మెచ్చగా నిర్వహించెడి మేటి వీవు!
తే. గీ.
అనయము లయన్సు క్లబ్బు కధ్యక్షుఁడ వయి
పేద విద్యార్థులకు సర్వవిధములైన
హితము గావించియు సమాజహితము గోరి
చిరము సంసేవకార్యముల్ చేసినావు.
కం.
‘అరు’ ణనెడి జ్యేష్ఠపుత్త్రుఁ డ
మెరికాలో నింజనీరు, మఱి యశ్విని యం
దరు మెచ్చు కోడ లయ్యెను;
‘కిరణు’ ద్వితీయుండు వెజ్జు కీర్తింపఁబడున్.
కం.
ఘనుఁడవు శ్రీకాంత్! కూరిమి
చనువు గలిగి మెలగునట్టి శర్వాణి! సదా
యనుకూలదంపతులుగా
జననుతులై పొందుఁడు సుఖసంతోషములన్.
రచన, సమర్పణ
బాల్యమిత్త్రుడు
కంది శంకరయ్య.

యడాగమం - 3

యడాగమం - 3

‘యడాగమం’ ఉదాహరణలు ఒకేచోట .....
(అ)
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
(ఆ)
అమ్మ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క యెక్కడ.
దూత + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి యెక్కడ
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
(ఇ)
మేన + అల్లుఁడు = మేనల్లుఁడు; మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
(ఈ)
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
(ఉ)
ఏమీ + అంటివి = ఏమీ యంటివి
(ఊ)
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
(ఋ)
వచ్చి + ఇచ్చెను = వచ్చి యిచ్చెను
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
(ౠ)
ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి
(ఎ)
ఏగి + ఏగి = ఏగి యేగి
(ఏ)
నా + అది = నాది, నా యది
నా + అవి = నావి, నా యవి

యడాగమం _ 2

యడాగమం _ 2
3) ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
ఏమి, మఱి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి అనేవి ఏమ్యాదులు (ఏమి + ఆదులు -‘ఏమి’ మొదలైనవి). ఈ పదాల చివర ఉన్న ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికం (జరుగవచ్చు లేదా జరుగకపోవచ్చు).
ఉదా ...
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
‘కిషష్ఠి’ అంటే షష్ఠీవిభక్తి ప్రత్యయం ‘కిన్’. ఇది ద్రుతప్రకృతికం. అంటే నకారం అంతమందు కలది. ‘హరికిన్ + ఇచ్చె’ అన్నప్పుడు సంధి జరుగకుంటే ‘హరికి నిచ్చె’ అవుతుంది. ద్రుతం (న్) లోపించినపుడు ‘హరికి + ఇచ్చె = హరి కిచ్చె’ అవుతుంది. ఇక్కడ యడాగమం రాదు.
ఇత్తునకు (హ్రస్వ ఇకారానికి) అనడంవల్ల దీర్ఘమైన ఇకారం (ఈ) కు ఇక్కడ సంధి జరుగక యడాగమమే వస్తుంది. ఉదా ... ‘ఏమీ + అంటివి = ఏమీ యంటివి’.
4) క్రియాపదములం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
క్రియాపదాలలో ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి జరుగవచ్చు లేదా జరుగక యడాగమం రావచ్చు. ఇది ప్రథమపురుష, ఉత్తమపురుష బహువచన క్రియారూపాలకే వర్తిస్తుంది.
ప్రథమపురుషకు ఉదా ...
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
ఉత్తమపురుషకు ఉదా ...
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
‘మధ్యమపురుష క్రియలం దిత్తునకు సంధి యగును’ అనే సూత్రం చేత ‘ఏలితివి + అప్పుడు = ఏలితివప్పుడు; ఏలితిరి + ఇప్పుడు = ఏలితిరిప్పుడు’ అని సంధి జరుగుతుందే కాని ‘ఏలితివి యప్పుడు, ఏలితిరి యిప్పుడు’ అని యడాగమం రాదు.
5) క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.
భూతకాలాన్ని తెలిపే అసమాపకక్రియ క్త్వార్థం. ఒకే వ్యక్తి వెంటవెంట చేసిన రెండు పనులను ఒకే వాక్యంలో చెప్పినప్పుడు మొదటి క్రియాపదం అసమాపకంగా ఉంటుంది. ‘చూచి వచ్చెను’ అన్నప్పుడు మొదటి క్రియాపదం ‘చూచి’ అనేది అసమాపకం. ఇటువంటి క్రియాపదాల చివర ఇత్తు (హ్రస్వ ఇకారం) ఉన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది.
‘వచ్చి + ఇచ్చెను’ అన్నప్పుడు ‘వచ్చి’ అనేది క్త్వార్థం. దీని చివర ఉన్న హ్రస్వ ఇకారానికి (ఇత్తుకు) ‘ఇ’ అనే అచ్చు పరమైనపుడు సంధి జరుగక యడాగమం వచ్చి ‘వచ్చి + య్ + ఇచ్చెను = వచ్చి యిచ్చెను’ అవుతుంది.
ఇదే విధంగా క్రిందివి ...
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
‘అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు’ అనే సూత్రం వల్ల ‘ఔర + ఔర = ఔరౌర; ఆహా + ఆహా = ఆహాహా’ మొదలైన సంధులు జరిగి ‘తఱుచుగా’ అనడం వల్ల సంధి వైకల్పికంగా వచ్చి ‘ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి’ అవుతుంది. కాని ‘ఏగి + ఏగి’ అన్నప్పుడు ‘ఏగి’ అనేది క్త్వార్థం కాబట్టి సంధి జరుగక ‘ఏగి యేగి’ అని యడాగమం వస్తుంది.
‘అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగా నగు’ అనే సూత్రం వల్ల అది, అవి శబ్దముల హ్రస్వ అకారమునకు సమాసంలో లోపం వస్తుంది. బహుళంగా అనడం వల్ల లోపించక పోవచ్చు. ‘నా + అది’ అన్నప్పుడు ‘అ’ లోపించి ‘నా + ది = నాది’ అనీ, ‘అ’ లోపించకుంటే ‘నా + అది = నా యది’ అనీ అవుతుంది. అలాగే ‘నా + అవి = నావి, నా యవి’ అనేది.
ప్రస్తుతానికి ఇంతే!
మిత్రులారా,
యడాగమానికి సంబంధించిన మీకు తెలిసిన విశేషాలను, సందేహాలను వ్యాఖ్యలుగా పెట్టండి.

నా పాటలు - (సాయి పాట - 5)

సాయీ! నీ మహిమ

సాయీ! నీ మహిమాతిశయమ్మును
సన్నుతి జేసి తరింపగా
వేయిముఖమ్ముల శేషుడు కూడ
చాలడంటె మరి నా తరమా?
|| సాయీ ||
షిరిడీవాసా! చిన్మయరూపా!
కరుణాసాగర! వరదాతా!

భక్తజనులు నీ పాదపద్మములు
స్మరించుచుందురు నిరంతరం
మాయామోహము నశింపజేసి
ఉద్ధరించెదవు దయామూర్తివై ...........
|| సాయీ ||

మానవజన్మము నెత్తి నరులకు
మోక్షమార్గమును చూపించితివి
సర్వకాల సర్వావస్థలలో
సంస్కరించెదవు క్షమామూర్తివై .........
|| సాయీ ||

నీటితోడ వెలిగించి దీపములు
జ్ఞానకాంతులను వెదజల్లితివి
నిన్ను నమ్మి నీ దరికి జేరగా
మన్నించెదవు యోగిరాజువై ............
|| సాయీ ||

ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి!
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! ........
శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉన్నతి, స్వాతి, సుభాష్, శంకరయ్య.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/cdcec89f-23a3-4468-880c-1593c212124e/Sai---Saayee-nee-mahima

సమస్యా పూరణం -497 (గాలిమేడలు స్వర్గము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గాలిమేడలు స్వర్గముకన్న మిన్న.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

17, అక్టోబర్ 2011, సోమవారం

యడాగమం -1

యడాగమం -1
‘మా + ఇల్లు’ అన్నప్పుడు సంధి జరుగడానికి అవకాశం లేదు. వ్యావహారికంలో "మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం’ అంటాము. కాని గ్రాంథికంలో "మా యిల్లిక్కడకు చాల దూరము’ అంటాము. గ్రాంథికంలో ముఖ్యంగా పద్యరచనలో వాక్యం మధ్య అచ్చును ప్రయోగించడం దోషం. ‘మా + ఇల్లు = మా యిల్లు’ ఇక్కడ ‘ఇ’ అనే అచ్చు స్థానంలో ‘యి (య్ + ఇ) వచ్చింది. ఇది యడాగమం.
యట్ + ఆగమం = యడాగమం. ‘యట్’ అనేది ఆగమంగా రావడం యడాగమం. ‘యట్’లోని టకారం లోపించి ‘య’ మిగులుతుంది. ‘య’లోని అకారం ఉచ్చారణాసౌలభ్యం కోసం చేరినదే. నిజానికి అక్కడ ఆగమంగా వచ్చేది ‘య్’ మాత్రమే.
‘ఆగమం’ అంటే వర్ణాధిక్యం. ఒక వర్ణం (అక్షరం) అధికంగా వచ్చి చేరడమే ఆగమం. మనకు ఆగమ సంధులు, ఆదేశ సంధులు ఉన్నాయి. ‘మిత్రవదాగమః (మిత్రవత్ + ఆగమః), శత్రువదాదేశః (శత్రువత్ + ఆదేశః)’ అంటారు. ఆగమం మిత్రుని వంటిది. అంతకు ముందున్న అక్షరాన్ని తొలగించకుండా మిత్రుని వలె ప్రక్కన చేరుతుంది. ఉదా... పెంకు + ఇల్లు = పెంకు + టు + ఇల్లు = పెంకుటిల్లు (టుగాగమ సంధి). ఆదేశం శత్రువు వంటిది. అందుకు ముందున్న అక్షరాన్ని కాని అక్షరాలను కాని తొలగించి శత్రువులా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఉదా... వాఁడు + చచ్చెను = వాఁడు సచ్చెను (గసడదావేడ సంధి).
ఇప్పుడు ఎక్కడెక్కడ యడాగమం వస్తుందో చూద్దాం ....
1) సంధి లేనిచోట స్వరంబునకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమం బగు.
వివరణ - సంధి జరుగని చోట అచ్చు తర్వాత ఉన్న అచ్చుకు యడాగమం అవుతుంది.
ఉదా.
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
2) అత్తునకు సంధి బహుళముగా నగు.
వివరణ - ‘అత్తు’ అంటే హ్రస్వమైన అకారం. దీనికి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగా జరుగుతుంది. బహుళమంటే అనేకవిధాలు. వ్యాకరణంలో బహుళార్థాలు నాలుగు (క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః, క్వచిద్విభాషా క్వచిదన్యదేవ| విధేర్విధానం బహుధా సమీక్ష్య, చతుర్విధం బాహుళకం వదంతి||)
అ) ప్రవృత్తి (నిత్యం) - విధించిన వ్యాకరణకార్యం నిత్యంగా (తప్పకుండా) జరగడం.
ఉదా... రామ + అయ్య = రామయ్య; సీత + అమ్మ = సీతమ్మ.
ఆ) అప్రవృత్తి (నిషేధం) - విధించిన వ్యాకరణకార్యం జరుగకపోవడం. స్త్రీవాచక తత్సమ సంబోధనాంత పదాల అత్తునకు సంధి లేదు.
స్త్రీవాచక శబ్దాలకు ఉదా ...
అమ్మ + ఇచ్చెను = అమ్మ + య్ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క + య్ + ఎక్కడ = అక్క యెక్కడ.
తత్సమ శబ్దాలకు ఉదా ...
దూత + ఇతఁడు = దూత + య్ + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి + య్ + ఎక్కడ = హరి యెక్కడ
సంబోధనాంత శబ్దాలకు ఉదా ...
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ + య్ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ + య్ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ + య్ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
ఇ) విభాష (వికల్పం) - విధించిన వ్యాకరణకార్యం జరుగవచ్చు, జరుగక పోవచ్చు.
ఉదా ...
మేన + అల్లుఁడు = (సంధి జరిగి) మేనల్లుఁడు;
(సంధి జరుగక యడాగమం వచ్చి) మేన + య్ + అల్లుఁడు = మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
ఈ) అన్యకార్యప్రవృత్తి (అన్యవిధం) - మరొక విధంగా జరుగడం.
ఉదా ... ఒక + ఒక = ఒకానొక.
(మిగతా తరువాతి పాఠంలో ...)
దయచేసి ఈ పాఠంపై మీ అభిప్రాయాలను తెల్పండి.

నా పాటలు - (సాయి పాట - 4)

మాయలకు లొంగకుండ

మాయలకు లొంగకుండ భక్తి మీరగా
సాయి భజన చేయరండు సుజనులారా || మాయలకు ||
వందనాలు చేయండి సేవించండి || వందనాలు ||
అందరికీ దిక్కు కదా సాయిబాబా ..................................... || మాయలకు ||

ప్రతినగరం ప్రతిగ్రామం వాడవాడలా
సాయినాథ మందిరాలు విలసిల్లాలి || ప్రతినగరం ||
ప్రతి ఒక్కరి హృదయంలో సద్గురు సాయి || ప్రతి ఒక్కరి||
నెలకొని చూపించాలి మోక్షమార్గము ............................... || మాయలకు ||

తల్లి తండ్రి హితుడు గురువు దైవమాతడే
సుఖసంపద లిచ్చి మనల బ్రోచునాతడే || తల్లి తండ్రి ||
సర్వదేవ వందనాలు పొందునాతడే || సర్వదేవ ||
సర్వమత జనమ్ముల శరణ్యుడాతడే ................................ || మాయలకు ||

అతని రూపు మనకన్నుల దివ్యజ్యోతి
కర్ణరసాయన మాతని జ్ఞానబోధనం || అతని ||
సుధామధుర మతని నామ మగును జిహ్వకు || సుధా ||
అతడే మన పతి గతి యని స్తుతులు చేయరా ................... || మాయలకు ||

ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! || ఓం సాయి ||
జయజయ సాయీ! జయజయ సాయీ!
శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/f7a39ed9-68db-405a-a311-295be431a0fb/Sai---Maayalaku

సమస్యా పూరణం -496 (దొరకని దొరలును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!
ఈ సమస్యను పంపిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

16, అక్టోబర్ 2011, ఆదివారం

నా పాటలు - (సాయి పాట - 3)

సాయికి మా వందనం

గోదావరీతీర షిరిడిపురములో
విలసిల్లు సాయికి మా వందనం - కరుణ
కురిపించు సాయికి మా వందనం
కాపాడు సాయికి మా వందనం - జనుల
పాలించు సాయికి మా వందనం .................... || గోదావరీ ||

అఖిలాండకోటి బ్రహ్మాండవిభుడుగా
భాసించు బాబాకు మా వందనం - కష్ట
ముల బాపు బాబాకు మా వందనం
వరము లిచ్చు బాబాకు మా వందనం - సుఖము
లను గూర్చు బాబాకు మా వందనం ............. || గోదావరీ ||

అజ్ఞానమును బాపి జ్ఞానము నొసగే
సౌజన్యమూర్తికి మా వందనం - మూడు
లోకాల కర్తకు మా వందనం
పాపాల హర్తకు మా వందనం - పంచ
భూతాల భర్తకు మా వందనం ..................... || గోదావరీ ||

భక్తులందరి హృదయ మందిరములలో
నెలకొన్న పాదునకు మా వందనం - వేద
వేదాంత విదునకు మా వందనం
జ్ఞానసంపదునకు మా వందనం - ప్రణవ
సన్మంత్రనాదునకు మా వందనం ............... || గోదావరీ ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/706a7362-4d12-438d-ade1-c84b0e66d6f9/Sai---Godavaritheera

సమస్యా పూరణం -495 (జ్ఞానము లేనట్టివాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్.
ఈ సమస్యను సూచించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం -494 (మా కేనుంగులు సాటియే)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
మా కేనుంగులు సాటియే యనుచు దో
మల్ పల్కుటల్ చిత్రమే?
ఈ సమస్యను పంపిన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారికి
ధన్యవాదాలు.

15, అక్టోబర్ 2011, శనివారం

అష్టావధానం

నిషిద్ధాక్షరి
వసంత్ కిశోర్ గారి కోరికపై
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
చెప్పిన పాఠం
అష్టావధానంలో 4వ ప్రక్రియ నిషిద్ధాక్షరి. ఇది అవధానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. పృఛ్ఛకుడు ఏదేని ఒక విషయము గూర్చి పద్యమును చెప్పమనును. సాధారణముగా కంద పద్యమునే వాడుతారు. ఇందులో (1) ప్రత్యక్షర నిషేధము; (2) వర్గ నిషేధము; (3) ఏకాక్షర నిషేధము అని ఉండును. ప్రత్యక్షర నిషేధములో అవధాని ఒక పద్యమును ప్రారంభించి మొదటి అక్షరమును చెప్పును. పృఛ్ఛకుడు 2వ అక్షరము ఫలానాది వాడరాదు అనును. అప్పుడు ఆవిధముగా 2వ అక్షరమును చెప్పును. పిదప 3వ అక్షరమును పృఛ్ఛకుడు నిషేధించును. అవధాని 3వ అక్షరమును చెప్పును. ఈ విధముగా పృఛ్ఛకుడు అన్ని అక్షరములను నిషేధిస్తూ ఉండగా అవధాని సరియైన అక్షరములను ఎంచుకొని పద్యమును అర్థవంతముగా పూర్తి చేయును. (2) వర్గ నిషేధములో పృఛ్ఛకుడు ఏదో ఒక వర్గమును వాడరాదు అని చెప్పును (ఉదా: క వర్గము కూడదు, లేక చ వర్గము కూడదు, ..) (3) ఏకాక్షర నిషేధములో ఏదో ఒక అక్షరము పద్యము మొత్తము మీద వాడరాదు అనును. నా అనుభవము: మందార పూవు పై పద్యము చెప్పవలెను - మ అను అక్షరమును వాడరాదు. నా పద్యమును చూడండి:
తొలి వేల్పు చెట్టు పూవది
బలె బలె ఎర్రనగు రంగు బాగగు తేనెన్
గలిగిన విరి, వేల్పుల సిగ
లలరించుచు పూజలందు నద్భుత రీతిన్.

సమస్యా పూరణం -493 (పరమపావనమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పరమపావనమ్ము పరుల సొమ్ము.
ఈ సమస్యను పంపిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

14, అక్టోబర్ 2011, శుక్రవారం

చిరంజీవులు

చిరంజీవి సప్తకం
మిత్రులకు మనవి:
ఈ శ్లోకం నిత్య స్మరణీయం. ఈ చిరంజీవులను నిత్యం స్మరించుకొంటే ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయని పెద్దల వచనం!
అశ్వత్థామ బలిర్వ్యాసో
హనుమాంశ్చ విభీషణ:|
కృప: పరశురామశ్చ
సప్తైతే చిరజీవిన:||

దీనికి పండిత నేమాని రామజోగి సన్యాసిరావు వారి అనువాదం ....
తే.గీ.
అల చిరాయు లశ్వత్థామ, బలియు, వ్యాసు
డును, హనుమయు, విభీషణుడును, కృపుడును,
పరశురాముండు నను బేళ్ళ బరగు వారు
వారిని దలంచినంత సత్ఫలము లొదవు

నా అనువాదం ...
కం.
ఒలయఁగ నశ్వత్థామయు
బలి వ్యాసుఁడు పవనసుతుఁడు పరశుధరుండున్
వెలయ విభీషణుఁడు కృపుఁడు
నిల చిరజీవులు; స్మరింప నెసఁగు శుభంబుల్.

ఈ శ్లోకాన్ని ప్రస్తావించిన చంద్రశేఖర్ గారికి,
చక్కని అనువాదం చేసిన పండిత నేమాని వారికి,
ధన్యవాదాలు.

నా పాటలు - (సాయి పాట - 2)

పుణ్యమూర్తి సాయీ!

పుణ్యమూర్తి సాయీ! మా - పూజ లందుకోవయ్యా || పుణ్య ||
అగణిత మహిమాన్వితా! - ఆదుకొనగ రావయ్యా || అగణిత ||
తలచినంత బ్రోచు దయా - జలనిధి కిదె ‘ధ్యానము’
పిలిచినంత పలుకు వేద - విదునకు ‘ఆవాహనం’
భక్తలోక హృదయపీఠ - వాసున కిదె ‘ఆసనం’
సజ్జన ప్రశస్త సేవ్య - చరణున కిదె ‘పాద్యము’ .................... || పుణ్య ||

ఆపన్నజనోద్ధారక - హస్తున కిదె ‘అర్ఘ్యము’
సాయి కిదే ‘అర్ఘ్యము’
వరములు కురిసే ప్రసన్న - వదనున కిదె ‘ఆచమనం’
సాయి కిదే ‘ఆచమనం’
దినకరశత తేజోమయ - దేహున కిదె ‘స్నానము’
శివకేశవ రూపధారి - చిన్మయునకు ‘వస్త్రయుగం’
సదమల సత్కీర్తియుతున - కిదియే ‘ఉపవీతము’
బంధనాలు ద్రెంచు లోక - బాంధవునకు ‘గంధము’
క్షతివిరహిత సౌజన్యసు - గతున కివియె ‘అక్షతలు’ || క్షతి ||
సుమకోమల మానస పరి - శుద్ధున కిదె ‘పుష్పము’ ......... || పుణ్య ||

షిరిడీపుర నిలయుడగు వి - శిష్టున కిదె ‘ధూపము’
సాయి కిదే ‘ధూపము’
జ్ఞానశూన్య మనోతిమిర - సంహారికి ‘దీపము’
సాయి కిదే ‘దీపము’
భక్తుల ఆకలిని దీర్చు - స్వామికి ‘నైవేద్యము’
చర్విత వేదోపనిషద్ - జ్ఞానికి ‘తాంబూలము’
కమనీయాకారున కిదె - ‘కపురపు నీరాజనం’
హిమకర దినకర నేత్రున - కిదియె ‘మంత్రపుష్పము’
చరాచరప్రపంచ కుక్షి - ధరున కిదె ‘ప్రదక్షిణం’ || చరా ||
ఇష్టకామ్యదాత కిదే - ‘సాష్టాంగవందనం’ ................................ || పుణ్య ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉన్నతి, సుభాష్, బృందం.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/2fe17954-ad6f-4ac9-bb74-

a7bf8f2aef11/Sai---Punyamoorthi