4, అక్టోబర్ 2011, మంగళవారం

శ్రీ లలితా మానస పూజ

శ్రీ లలితా మానస పూజ
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

శ్రీమన్మహారాజ్ఞి! సింహాసనేశ్వరీ! ఆనందరూపా! చిదగ్నిజాత!
శ్రీలలితాంబికా! శ్రీపరమేశ్వరీ! అఖిలాండకోటి బ్రహ్మాండనేత్రి!
శ్రీరాజరాజేశ్వరీ! త్రిపురేశ్వరీ! బాలార్కకోటి ప్రభాకరాంగి!
కామేశ్వరీ! మహాకామేశ్వరప్రియా! కళ్యాణగుణమయీ! జ్ఞానదాయి!
సచ్చిదానంద భాస్వత్ తత్త్వవైభవా! సద్భక్త హృదయాంబుజాత నిలయ!
భక్తిభావాఢ్య సౌవర్ణ పుష్పాళితో మాల కూర్చితి జగన్మాత! నీకు
ఓంకారవాచ్య! సద్యోగ ప్రదాయినీ! ఐంకారవాచ్య!జ్ఞానాంబురాశి!
హ్రీంకారవాచ్య! లోకేశ సంసేవితా! శ్రీంకారవాచ్య! సంసిద్ధిదాయి!
శ్రీమణిద్వీప చింతామణీ ప్రాసాద వాసినీ! సకల సౌభాగ్యనిలయ!
శ్రీచక్రరాజవాసిని! సర్వమంగళా! ధ్యానింతు నీదు తత్వ ప్రశస్తి

రావమ్మ మాయమ్మ! లలితాంబ! నీ పాద జలజ ధూళికణమ్ము సర్వరక్ష
రావమ్మ జగదంబ! రాజీవదళనేత్ర! నీ కృపావీక్షణ నిత్యరక్ష
రావమ్మ శారద! రాకేందు బింబాస్య! నీ చిరునగవు శాంతిప్రదమ్ము
ఆదిత్యకోటి మహాకాంతియుతగాత్రి! సచ్చిదానంద భాస్వత్స్వరూప!
అమృతధారాప్రవాహము నీదు సత్కృపా వైభవంబది లోకభద్రకరము
పొలుపారు మచ్చిత్త పుండరీకమునిదే ఆసనమ్ముగ నిత్తు నమ్మ! నీకు
అమరగంగా పావనాంబుసారంబులే అర్ఘ్యపాద్యాదులో యమ్మ! నీకు
సరస శబ్దార్థ భాస్వత్కవితాప్రసూనాభిషేకమొనర్తు నమ్మ! నీకు
సౌవర్ణ నవరత్న సముపేత హారమ్ము నాభరణము చేతు నమ్మ! నీకు
భక్తి భావాంచిత పరిమళ పుష్ప సమర్చన గావింతునమ్మ! నీకు

పరమేశ్వరీ! మహాపద్మాటవీసంస్థ! నైవేద్యముల గూర్చి వేవిధములు
బహురసాన్వితముగా ప్రజ్ఞానపాత్రలో నర్పించుచుంటినో యమ్మ! నీకు
కర్పూరవీటిక నర్పింతునిదె నీకు ప్రియమార గొనుచు సేవింపుమమ్మ!
విధి ముకుందాదులు వేదమంత్రాలతో ఆనందమును గూర్తురమ్మ! నీకు
సిరియును వాణియు చెలికత్తెలై సదా సమ్మోదమును గూర్తురమ్మ! నీకు
గజముఖ షణ్ముఖుల్ కడువినోదమ్మును నెమ్మది గూర్చెదరమ్మ! నీకు
వాగ్దేవతల్ నామపారాయణముచేసి ఆహ్లాదమును గూర్తు రమ్మ! నీకు
ధ్యాననిమగ్నులౌ మౌనివరేణ్యులు నెమ్మనమ్మున గాంతురమ్మ! నిన్ను
నిఖిల లోకేశులు నీ ఆజ్ఞలనుగొంచు నాశ్రయించుచునుందురమ్మ! నిన్ను
భక్త బృందంబులు బహుప్రకారములుగా నర్చించుచుందురో యమ్మ! నిన్ను

విశ్వ సర్గ స్థితి విలయకారిణి నీదు లీలాప్రశస్తి వర్ణింతు నమ్మ!
వేద శాస్త్ర పురాణ విద్యలనేకముల్ ప్రియమార నిపుడు వల్లింతునమ్మ!
శబ్దార్థవైచిత్ర్య సముపేత సాహిత్య కృతులగోష్ఠుల నిర్వహింతునమ్మ!
వివిధ సత్కళలతో విలసిల్లు నృత్యాది విన్యాసములను గావింతునమ్మ!
ఛత్రమ్ము పట్టెద చామరమ్ములుపూని వినయాన సేవ గావింతునమ్మ!
సాష్టాంగరీతుల చాలమ్రొక్కెద నీకు వేడ్కతో స్తుతుల గావింతునమ్మ!
హారతులిచ్చెద ననురాగ మలరార సమకూర్తు మంత్రపుష్పమ్ములమ్మ!
సకలోపచారముల్ స్వాంతమ్మునన్ భక్తి వెలుగొంద నీకు గావింతునమ్మ!
మా పూజలందుమా మమ్ము కాపాడుమా మా తల్లి! సర్వసంపత్ప్రదాయి!
భవబంధములు బాపి ప్రజ్ఞానమును గూర్చి శ్రీమాత! మమ్ము పాలింపుమమ్మ!

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు.

5 కామెంట్‌లు:

  1. చిత్తమనే పుండరీకమును ఆసనముగా అమ్మవారికి సమర్పించిన తమరు ధన్యులు. అభివందనములు.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    అందరి తోటి మానస పూజచేయించ గలిగిన పుణ్యాత్ములు . ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  3. భక్తిభావప్రపూరితమైన దేవీమానసపూజను అందించిన నేమాని వారికి పాదాభివందనాలు.

    రిప్లయితొలగించండి
  4. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య .....

    శ్రీ లలిత అమ్మవారి స్తుతి మా అందఱి చేత చేయించారు. మీ సాంగత్యముతో మేమంతా ధన్యుల మయాము. మీకు అభివాదములు.

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    విద్వత్కవులు, సహృదయులు అయిన పండిత నేమాని వారి సాంగత్యం లభించడం మన అదృష్టం.

    రిప్లయితొలగించండి