13, అక్టోబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -491 (ద్రోణసుతుఁడు పాండవులకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ద్రోణసుతుఁడు పాండవులకు ప్రాణసఖుఁడు.

61 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _________________________________

    ప్రాణముల తీయు తలపున - పసి శిశువుకు
    భ్రూణ పయి ప్రయోగించెను - పుష్కరంబు
    ద్రోణ సుతుడు ! పాండవులకు - ప్రాణ సఖుడు
    భ్రూణమును గాచె చక్రంబు - పూని యపుడు !
    _________________________________
    భ్రూణ = గర్భవతి
    భ్రూణము = శిశువు

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....


    గురుని పుత్రుండు, బ్రాహ్మణ కులభవుండు,
    కౌరవుల పంచ జేరెను గాని యాజి
    నతుల శౌర్యధనుడు ద్రోణ సుతుడు పాండ
    వులకు ప్రాణ సఖుడును సుముఖుడు మున్ను

    రిప్లయితొలగించండి
  3. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    ఇది అన్యాయమండీ. గర్భస్థుడైన పరీక్షిత్తును కృష్ణుడు కాపాడిన వృత్తాంతంతో నేను పూరణ చేయాలనుకున్నాను. నా అయిడియా మీరు కొట్టేసారు :-)
    మంచి పూరణ. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  4. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, అక్టోబర్ 13, 2011 8:10:00 AM

    పండితశ్రీ నేమాని వారి పూరణ సూచించినట్లుగా మొదట్లో అశ్వత్థామ పాండవ పక్షపాతియే. శ్రీ కృష్ణ రాయబార సమయంలో దుర్యోధనుని ఎదిరించినది ఆయనే గదా! యుద్ధ సమయం వచ్చేసరికి సీను మారింది, అంతే. కరక్టేనా మహాశయా!

    రిప్లయితొలగించండి
  5. తండ్రి త్రిదశాలయము జేర తల్లడిల్లి
    వేయగ నపాండవేయమావేశమంది
    ద్రోణసుతుఁడు, పాండవులకు ప్రాణసఖుఁడు
    విష్ణు చక్రాన రక్షించె కృష్ణమూర్తి

    రిప్లయితొలగించండి
  6. కౌరవులపక్షమునజేరి పోరుసలిపె
    ద్రోణసుతుడు,పాండవులకు ప్రాణసఖుడు
    కృష్ణపరమాత్మ సారథ్య క్రీడ సలుప
    ధర్మమేజయమందెను ధరణియందు.

    రిప్లయితొలగించండి
  7. అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శంకరార్యా ! అన్యాయ మనగానే ఉలిక్కి పడ్డాను !
    ధన్యవాదములు !

    02)
    _________________________________

    పాండు రాజ కుమారులు - పలుకు నేర్వ
    ద్రోణు నొద్దను యున్నట్టి - తోయమందు
    ఒక్కరై యుండి రందరు ! - నిక్కువముగ
    ద్రోణ సుతుడు పాండవులకు - ప్రాణ సఖుడు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  8. తండ్రి స్వర్గస్థుడయినట్టి దారుణ కథ
    విన్నవెంటనె, నీతిని విడిచెనేమొ
    ద్రోణసుతుఁడు; పాండవులకు, ప్రాణసఖుఁడు
    కృష్ణునకును, కృష్ణకు నట్టి కీడుఁ జేసె.

    రిప్లయితొలగించండి
  9. 03)
    _________________________________

    ద్రోణు నంతము వినినంత - ద్రోహ బుద్ధి
    ద్రౌపది సుతుల పరిమార్చి - దారుణముగ
    ద్రోహమును జేసి నటువంటి - దురితు డెట్లు
    ద్రోణ సుతుడు, పాండవులకు - ప్రాణ సఖుడు ???
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. సాదా సీదా పూరణం:
    కౌరవుల యుప్పు దినుటచే దారిలేక
    వారి పక్షాన బోరగా వలసె గాక
    నుభయలకు మేలు దలచెచు నుత్తముండు
    ద్రోణసుతుఁడు పాండవులకు ప్రాణసఖుఁడు.

    కొంచెం విరుపుతో యిలా:
    కడుపులో నున్న శిశువుల గాల్చు తుళువ
    అన్నమారోగ్యమును లేక యలమటించు
    మనియె నిశ్చేష్టుడై తలవంచి వినగ
    ద్రోణసుతుఁడు పాండవులకు ప్రాణసఖుఁడు.
    -తాడిగడప శ్యామలరావు.

    రిప్లయితొలగించండి
  11. అప్రస్తుత ప్రసంగానికి మన్నించాలి:
    నా గేయ రచన బ్లాగులో పాల్గనడానికి అందరికీ ఆహ్వానం.
    http://geyarachana.blogspot.com/

    రిప్లయితొలగించండి
  12. ధార్త రాష్ట్రులు,కర్ణుడు, ధూర్త శకుని
    పాత్ర ధారులు వచ్చిరి బాగు బాగు
    ద్రోణసుతుడు,పాండవులకు ప్రాణసఖుడు
    శౌరి పాత్రల వేసెడి వారలెచట ?

    రిప్లయితొలగించండి
  13. 04)
    _________________________________

    ధర్మ పథమున సాగెడు - త్రాటిగట్టు
    ద్రోణు విడలేక రారాజు - తోడ గలిసె !
    ధర్మ మార్గము గాకున్న - దారిలేక
    దుష్టులను గూడ వలసిన - దుర్యవస్థ !(కాని)
    ద్రోణ సుతుడు, పాండవులకు - ప్రాణ సఖుడు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  14. 05)
    _________________________________

    ద్రుపద పుత్రికి శోకమ్ము - దుర్భరమవ
    దురితముల నెన్నొ జేసెను - దోష మనక !
    ద్రోహములనెల్ల పక్కకు - త్రోసి జూడ
    ద్రోణ సుతుడు పాండవులకు - ప్రాణ సఖుడు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

    ప్రాణ సఖుడు ద్రోణసుతుడు పాండవులకునయ్యు దా
    ద్రోణు మరణ వార్త వినుచు దుఃఖితుడయి డుల్లి వి
    న్నాణమకట పాండవకుల నాశనమును బూనగా
    త్రాణగుణుడు శౌరి హితుల రక్ష యగుచు నొప్పెగా

    రిప్లయితొలగించండి
  16. నేమాని వారి స్ఫూర్తితో :

    06)
    || ఉత్సాహ ||
    _________________________________________

    పాండవులకు ద్రోణసుతుడు - ప్రాణసఖుడు గాడయా !
    దుండగీడు బండ మనిషి - ద్రోహ బుద్ధి గలుగుటన్
    గుండు జేసి చిన్న బుచ్చి - కోట బయట విడచిరే !
    దండు గింక వాని జన్మ! - తక్కరీడు యనబడున్ !
    _________________________________________
    తక్కరీడు = మోసగాడు

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారి వ్యాఖ్య ....
    కొన్ని సూచనలు:
    కొందరి రచనలను చూచి ఈ క్రింది సూచనలను చేస్తున్నాను:
    (1) శక్తివంతుడు(తప్పు) : శక్తిమంతుడు (ఒప్పు). ఇకార ఉకారముల మీద "మంతుడు" అనే వాడాలి. ఉదా: ధీమంతుడు, శ్రీమంతుడు, బుద్ధిమంతుడు, హనుమంతుడు, ఆయుష్మంతుదు, రోచిష్మంతుడు
    (2) దేశముకు(తప్పు), దేశమునకు (ఒప్పు). ఉకార ఋకారముల తరువాత "నకు" అని చేర్చాలి. ఉదా: రాజునకు, పితృనకు, పుత్రునకు,
    ఔత్సాహికులైన రచయితలు ఈ సూచనలను గ్రహించగలరు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా ! చిన్న సందేహం !
    పైన చేసినట్టుగా సమస్యలో పదాలను అటూ యిటూమార్చడం !
    తేటగీతిని ఆటవెలదో మరోటో చెయ్యడం లాంటి సదుపాయం
    సౌకర్యం నిజమైన అష్టావధానంలో కూడా ఉంటుందా ?

    అష్టావధానంలో సమస్యా పూరణం , వర్ణన , దత్తపది
    గాక మిగతా అంశా లేమేమి ఉంటాయి ? కొంచెం వివరిస్తారా !

    రిప్లయితొలగించండి
  19. నేమానివారి సలహాను పాటిస్తూ వారికి ధన్యవాదములతో :

    01అ)
    _________________________________

    ప్రాణముల తీయు తలపున - బాలకునకు
    భ్రూణ పయి ప్రయోగించెను - పుష్కరంబు
    ద్రోణ సుతుడు ! పాండవులకు - ప్రాణ సఖుడు
    భ్రూణమును గాచె చక్రంబు - పూని యపుడు !
    _________________________________
    భ్రూణ = గర్భవతి
    భ్రూణము = శిశువు

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

    అయ్యా! వసంత్ కిశోరు గారూ! శుభాశీస్సులు.
    మీరు వ్రాసిన పద్యము "తరలి" వృత్తము. ఉత్సాహ కాదు.
    ఉత్సాహ కంటె తరలిలో గణ క్రమము జటిలముగా ఉంటుంది.
    సుగంధి, ఉత్సాహ, తరలి వృత్తములు ఒకే కోవలోకి వచ్చినా
    గణముల వరుస వేరు:
    (1) సుగంధి: 7 హ గణములు + 1 గురువు
    (2) ఉత్సాహ: 7 సూర్య గణములు + 1 గురువు
    (3) తరలి: భ స న జ న ర
    యతి స్థానము జాగ్రత్తగా చూచుకోవలెను.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

    శ్రీ వసంత కిశోరు గారికి. అయ్యా! శుభాశీస్సులు.
    అష్టావధానములో సమస్యకు పదాలు మార్చకూడదు. ఆఖరి పాదములో క్రియా పదమునకు చివరలో చిన్న మార్పు చేసి అర్ధవంతముగా చేయవచ్చును. ఈనాటి సమస్యలో తరలి వృత్తమునకు అనుగుణముగా యతిని దృష్టిలో పెట్టుకొని పదములను మార్చేను - అంతే.
    ఇచ్చిన సమస్యలో పదములను మార్చకుండా అవకాశమున్న ఏ ఇతర పద్యములోనైన పూరించ వచ్చును.
    అష్టావధానములో అంశములు: (1) సమస్య, (2) దత్తపది, (3) వర్ణన, (4) నిషిద్ధాక్షరి, (5) అప్రస్తుత ప్రసంగము (ఇవి 5 అందరికి సామాన్యము).
    మిగిలిన 3 అవధాని ఎంచుకున్నవి ఉంటాయి. సాధారణముగా: పురాణము, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, ఘంటా గణనము, పుష్ప గణనము, చదరంగము, పేకాట, ఆకాశ పురాణము, ఆశువు, వార గణనము, అన్య భాషా ప్రక్రియ, మొదలైనవి.

    రిప్లయితొలగించండి
  22. **********************************************************************
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    రాయబార ఘట్టానికంటె ముందు ఉత్తరగోగ్రహణంలోను అశ్వత్థామ కౌరవపక్షంలో ఉండి అర్జునునితో తలపడ్డాడు.
    **********************************************************************
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    ‘తండ్రి త్రిదశాలయము జేర’ చక్కని ప్రయోగం. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘సారథ్యక్రీడ’ అన్నప్పుడు ‘థ్య’ గురువై గణదోషం. ‘సారథ్యకేళి’ అందాం.
    **********************************************************************
    వసంత కిశోర్ కుమార్ గారూ,
    మీ మిగిలిన ఐదు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘ఒద్ద + ఉన్నట్టి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ద్రోణు గురుకులమున నున్న’ అందాం.
    నాల్గవ పూరణలో ‘త్రాటిగట్టు’ ప్రయోగం ప్రశంసార్హం. ‘దుర్యవస్థ’ దురవస్థా? అక్కడ ‘దుర్దశ గనె’ అందాం.
    ఆరవ పూరణ ఛందం గురించిన నేమాని వారి సూచన గమనించారు కదా!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  23. **********************************************************************
    మందాకిని గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అశ్వత్థామ కృష్ణునకు చేసిన కీడేమిటి? అతనికి మేనల్లుండ్రైన ఉపపాండవులను చంపడమా?
    **********************************************************************
    తాడిగడప శ్యామలరావు గారూ,
    మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘దలచెడు’ కు ‘దలచెచు’ అని టైపాటు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఎంత చక్కని ప్రశ్న? చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ తరలి వృత్తంతో పూరణ మధురంగా ఉంది. అభినందనలు.
    క్రమంతప్పకుండా మీరు ఇచ్చే సూచనలు, చెప్పే ఛందో వ్యాకరణ విశేషాలు ఔత్సాహికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  24. నేమాని వారికి నమస్సులు !
    అయ్యా ! ఓపికతో నా సందేహములు తీర్చినందులకు ధన్యవాద శతములు !
    నాకు మొదటి మూడూ తప్ప మిగిలిన అంశముల గూర్చి లేశమాత్రమూ తెలియదు !
    నేను మున్నెన్నడూ అవధానములను చూచి యున్న వాడిని గాను !
    కావున ఈ అఙ్ఞతను మన్నించి
    మీ వీలు వెంబడి ఒక్కొక్క అంశం గురించి వివరముగా వివరించ ప్రార్థన !

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! మీ చక్కని సవరణలకు ధన్యవాదములు !
    నేమాని వారి సూచన గమనించాను --కాని
    నా వద్ద నున్న గ్రంథములో
    [సులక్షణ సారము (ఛందశ్శాస్త్రము) ,
    లింగంగుంట తిమ్మకవి విరచితము,
    పునఃపరిశీలన విద్వాన్ శ్రీ రావూరి దొరసామి శర్మ;
    బులుసు వేంకట రమణయ్య గారిచే పరిష్కృతము;
    బాలసరస్వతీ బుక్ డిపో
    మద్రాసు]
    ఈ క్రింది విధముగా నున్నది ! పరికించుడు !

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులు హనుమచ్చాస్త్రి గారి హాస్యస్ఫూరక పూరణ ఇక్కడ జత చేస్తూ,
    ధార్త రాష్ట్రులు,కర్ణుడు, ధూర్త శకుని
    పాత్ర ధారులు వచ్చిరి బాగు బాగు
    ద్రోణసుతుడు,పాండవులకు ప్రాణసఖుడు
    శౌరి పాత్రల వేసెడి వారలెచట ?
    ---- -----
    మరికొంత హాస్యం జోడిస్తూ నా పూరణ:
    హనుమ! నీవు చిరంజీవి యగుటఁజేసి
    దూరదృష్టినటు గనుమా "ద్రోణసుతుఁడు";;
    "పాండవులకు ప్రా ణసఖుడు" పండుకొనిరి
    మందుగొట్టి, నాటకమే గతిన్ దొరఁకొను?

    రిప్లయితొలగించండి
  27. ద్రోణ సుతుడు పాండవులకు ప్రాణసఖుడు
    కాడు,కాని హితవుబల్కె కౌరవులకు
    పోరునష్టంబు ,లాభంబుపొందు గాన
    సంధికొప్పుటే కురువంశ సౌఖ్యమనెను!!!

    రిప్లయితొలగించండి
  28. సాహ చర్య పద్మ మిత్ర - సప్తకంబు గురువు ను
    త్సాహ వృత్తమునకె చెల్లు - జలజ దళ విలోచనా !

    వి: పాదమున కేడు సూర్య గణములు నాపై నొక గురువును గలది
    "యుత్సాహ" మనబడును !

    కేవల "న" గణములతో నున్న ( 7-న+ గ) ---" తరళము "
    కేవల "హ" గణములతో నున్న (7-హ+గ)---" సుగంధి "
    యనబడును !
    కావున యిందు "న" మరియు "హ"అను రెండు సూర్య గణములూ
    గలసి 7 గణములుండవలెను !
    ఉత్సాహ వృత్తము కాదు ! ఇది జాతుల లోనిది !
    భీమన ఛందములోనూ అనంతుని ఛందములోనూ ఉత్సాహ వృత్తము లేదు !
    అప్పకవి మాత్రముమది యేలకో యుత్సాహ వృత్తమని పేర్కొనెను !

    రిప్లయితొలగించండి
  29. కృష్ణ రాయబార సందర్భంలో దుర్యోధనుడు ద్రోణునితో నన్నట్లూహ:

    వాసుదేవుడు జగతికి వంద నీయు
    డగునె? మాయల మారి యెట్లగును హితుడు?
    పామ రుండగు నొక గొల్ల వాని కతడు,
    ద్రోణ! సుతుఁడు, పాండవులకు ప్రాణసఖుఁడు.

    రిప్లయితొలగించండి
  30. ఈ మూడూ గాక "భ-స-న-జ-న-ర"
    గణములుండిన అది "తరలి" వృత్తము !

    ఇందు
    సుగంధి కి --------9
    తరళము నకు------13
    తరలి కి----------11
    ఉత్సాహ కు--------5వ గణము మొదటి యక్షరమునకు
    యతి చెల్లింప వలయును !

    అన్నిటికీ ప్రాస నియమము గలదు !

    రిప్లయితొలగించండి
  31. నమస్కారములు...!
    తెలుగు వెలుగు అనే గేయాన్ని ఈ లింక్ లో చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయగలరని ఆశిస్తున్నాను.

    http://rpsarma.blogspot.com/2011/10/blog-post_13.html

    ధన్యవాదములు...!

    రిప్లయితొలగించండి
  32. మిస్సన్న మహాశయా !
    సమస్యలను చీల్చి చెండాడ్డంలో మీకు మీరే సాటి !
    ఈ విషయంలో మాత్రం శ్రీకృష్ణుడు కూడా మీ ముందు తీసికట్టే !
    చాలా గొప్పగా పూరించారు ! భళా ! మేలు భళా !

    వేమన చెప్పింది
    మాలాంటి " తళుకు బెళుకు రాలు తట్టెడేల"
    మీలాగ " మంచి నీల మొక్కటి చాలు " అని గదా !

    మీ " రంగవల్లి యుద్ధరంగమాయె "
    పూరణలో
    మీరానాడు రణరంగంలో పెట్టిన రంగవల్లిని నేననునిత్యం స్మరిస్తూనే ఉంటా !

    మీకు నా అభినందన మందార శతములు !
    గుర్తుంచుకోండి !

    మీ జిల్లా కొస్తా ! మీ ఊరొస్తా ! మీ వీధికొస్తా ! మీ నట్టింట్లో కొస్తా !
    అప్పుడిస్తా !

    రిప్లయితొలగించండి
  33. గురువు గారూ,

    నా తప్పుకు చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.

    శ్రీ నేమాని గురువర్యా,

    చక్కని వ్యాకరణ రీతులను జెప్పి మమ్ములను పురోగతి వైపుకు నడిపిస్తున్న మీకు కృతజ్ఞతాభివందనములు.

    మిస్సన్న గారూ,

    మంచి విరుపుతో పూరించారండి. ఆలస్యమైనా కూడా అమృతాన్ని తెచ్చినట్లుగా వుంది. అభివాదములు.

    రిప్లయితొలగించండి
  34. గురువుగారు,ధన్యవాదాలు.
    అంతేనండి. అలాగనుకునే పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
  35. కిశోర మహోదయా వందనశతములు.
    మనోహర పద్య పరంపరా పాండిత్యంలో ఎంతైనా మీ ముందు మేం తీసికట్టే.
    తెలుగు ఛందస్సులో మీరు చేస్తున్న కృషి, చూపిన్స్తున్న ప్రతిభ స్తుత్యములు.
    సదా మాఇంటికి మీకు మా స్వాగతం.
    ధన్యవాదాలు.
    సంపత్కుమార శాస్త్రి గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. తెలుగు వెలుగు గీతం - ప్రతిస్పందన

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ!
    సూచనకు ధన్యవాదములు.!
    ప్రస్తుతం బరహా లిపిలో టైప్ చేశాను.! మరో ఫాంట్ లో ప్రయత్నిస్తాను.
    -----------------------------------------
    శంకరయ్య గారూ! అభిప్రాయ అభివ్యక్తికి ధన్యవాదాలు!
    ప్రస్తుతం బరహా లిపిలో టైప్ చేశాను. ఏదైనా ఇబ్బంది ఉందా? తెలియజేయగలరు!

    రిప్లయితొలగించండి
  37. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    చక్కని ఛందోపాఠం చెప్పారు. ధన్యవాదాలు.
    ఉత్సాహ లక్షణాన్ని గురించి నాకూ సందేహం వచ్చి అనంతుని ఛందోదర్పణంలో వెదికితే దొరకలేదు.
    **********************************************************************
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    చివరికి అశ్వత్థామ, కృష్ణుల చేత చంద్రభాసురం కొట్టించారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    ‘కాడు’ అన్న ఒక్కమాటతో ఎంత వైవిధ్యాన్ని సాధించారు! చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    వసంత కిశోర్ గారు ప్రశసించినట్లు సమస్యను ‘చీల్చి చెండాడడంలో’ మీకు మీరే సాటి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  38. మిత్రుల పూరణలు వ్యాఖ్యలు ఛంధో పాఠాలు ఉత్సాహ భరితంగా ఉన్నాయి. సాయంకాలము తీరికగా చదవాలి. మరో మార్గములో,

    నిహతు డగుటయు రణ మందు నిజము గాదు
    ద్రోణసుతుడు ; పాండవుల ప్రాణ సఖుడు
    పూని గుటిలత ధర్మజు బొంకఁ జేసె
    ద్రోణుఁ గూల్చగ ననిలోన, దురిత మయ్యె !

    రిప్లయితొలగించండి
  39. ధన్యవాదాలు, మాస్టారూ. మనసులో ఆ దేవతామూర్తులకు క్షమాపణలు చెప్పే పోస్టు చేశాను.
    అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ:|
    కృప: పరశురామశ్చ సప్తైతే చిరంజీవినా:||

    రిప్లయితొలగించండి
  40. వసంత మహోదయా ! మిస్సన్న గారి యింటికి వెళ్ళండి. మీకు చక్కని ఆతిధ్యము లభిస్తుంది !

    రిప్లయితొలగించండి
  41. వసంత మహోదయా!
    "మీ జిల్లా కొస్తా ! మీ ఊరొస్తా ! మీ వీధికొస్తా ! మీ నట్టింట్లో కొస్తా !
    అప్పుడిస్తా !..."
    అదేదో మాయింటికి రాకూడదూ? డా. మూర్తి మిత్రులను కూడా పిలుస్తాను :-)

    రిప్లయితొలగించండి
  42. మిస్సన్న మహాశయా ! మీ ఆహ్వానానికి ధన్యవాదములు !
    తప్పకుండా వస్తాను ! మూర్తిగారు మరీ ఊరిస్తున్నారు !

    రిప్లయితొలగించండి
  43. శంకరార్యా !
    ఎలాగూ ఛందస్సు మీద శీర్షిక ఉంది గనుక
    వీటిని సంస్కరించి అందులో పడేస్తే బావుంటుంది !
    వెనకా ముందులు తరువాత సరిచేసుకోవచ్చు!
    ప్రస్తుతానికి పాఠాలన్నీ ఒక చోట ఉంటాయి !
    కొత్తవారికి మార్గ దర్శనానికీ
    పాతవారికి పరిశీలనకూ ఉపయోగ పడతాయి !
    ఇలాగే వదిలేస్తే ఈ సమస్యల మధ్యలో సమాధై పోతాయి !

    అలాగే "వ్యాకరణం" అనే కొత్త శీర్షిక ప్రారంభించి
    నేమాని వారి పాఠాలనందులో పెడితే
    ఎందరికో ఉపయుక్తముగా నుండును !

    వారిచ్చిన ఉదాహరణ --రాజుకు---రాజునకు
    అలాగే శిశువుకు---శిశువునకు
    అనేదానిలో పెద్దగా తేడా తెలియుట లేదు కాని
    చంద్రుకు-- చంద్రునకు
    ఇంద్రుకు---ఇంద్రునకు
    శివుకు ---శివునకు
    బాలకుకు ---బాలకునకు
    అని నప్పుడు తప్పు సుస్పష్టం !

    రిప్లయితొలగించండి
  44. మూర్తీజీ ! మీరు ఊరిస్తున్న కొద్దీ వెళ్ళాలనిపిస్తోంది మిస్సన్న గారింటికి !
    అలాగే తప్పకుండా వెళ్తాను !
    ఏమిటీ ? పాఠాలు చదవడానికి మరో మార్గమా ?
    ప్రక్కన చంద్రశేఖరులూ , చేతిలో చంద్రభాసురం కూడా ఉండాలా ?

    రిప్లయితొలగించండి
  45. అంతేకాదు వసంత మహోదయా!
    మూర్తి గారింటికి గుఱ్ఱపు స్వారీ చేసుకొంటూ వెళ్ళాలి. అది వారి నియమాలలో ఒకటి. చంద్రభాసురం మేము సప్లై చేస్తాం. కాబట్టి,గుఱ్ఱపు స్వారీ అక్కడ నేర్చుకొని మరీ రండి :-) గుడ్ లక్.

    రిప్లయితొలగించండి
  46. చంద్రశేఖరా ! మీ ఆహ్వానానికి వేన వేల ధన్యవాదములు !
    మీ వంటి మిత్రులు లభించడం పూర్వ జన్మ సుకృతం !
    మీరేమో మాయలమరాఠీ ప్రాణం లాగ ఎక్కడో సప్త సముద్రాల కావల ఉన్నారాయె !
    బాలవర్ధికి దొరికినట్టు ఏ గండ భేరుండమూ దొరకదాయె !
    దొరికినా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెగురుదామనుకొందిట !
    అలా ఉంది నా పరిస్థితి !
    సెర్వికల్ స్పాండిలోసిస్---పదేళ్ళ నుండి ! అలాగే నెట్టుకొచ్చా !
    రెండేళ్ళనుండి లంబార్ స్పాండిలోసిస్ మరియూ సయాటిసా అందులోనూ పిరిఫొరిస్ !
    పట్టుమని పదడుగులు నడవలేని పరిస్థితి !
    నేను మా వీధి దాటి 6 నెలలవుతోంది !
    రిటైరయ్యాక దేశమంతా తిరగాలి ! వీలుంటే ప్రపంచామంతా తిరగాలి
    అనుకుంటూనే జీవితం గడిపేశాం !
    అప్పుడు డబ్బులేదు తీరిక లేదు --మనసున్నా !
    అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్టు
    ఇప్పుడు అన్నీ ఉన్నాయి ---ఆరోగ్యంతప్ప !
    మరీ విసిగిస్తున్నట్టున్నాను ---ఉంటా !

    రిప్లయితొలగించండి
  47. నిహతు డగుటయు రణ మందు నిజము గాదు
    ద్రోణసుతుడు ; పాండవులకు ప్రాణ సఖుడు
    పూని గుటిలత ధర్మజు బొంకఁ జేసె
    ద్రోణుఁ గూల్చగ ననిలోన, దురిత మయ్యె !

    రిప్లయితొలగించండి
  48. తొందఱలో సమస్యా పాదము లో జరిగిన టైపాటు సవరించాను. కిశోర్ జీ చక్కని వైద్యము చేయించుకొని బాధా నివృత్తులు కండి. చంద్రశేఖరుల వారికి మా ఊరిలో యీ సారి ఏనుగులను కూడా చూపిస్తాను ( ఇక్కడ ఒక సర్కసు కంపెనీ ఉంది). మిత్రులు దూరంగా ఉన్నారు. లేకపోతే నలుగురూ కలవడానికి మా ఊరు మంచిదే .

    ద్రోణ పర్వములో దృష్టద్యుమ్నుడు ద్రోణుని( శవము ) శిరస్సుని ఖండించిన సందర్భములో కొన్ని పద్యాలు చదివి తిక్కన వారి పద్యాలు వినని రాజరాజ నరేంద్రుని దురదృష్టానికి బాధ పడ్డాను. నన్నయ గొప్పవాడే గాని తిక్కన అద్భుతమైన తెలుగు కవి!

    రిప్లయితొలగించండి
  49. **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మరో మార్గంలో అంటూ ‘నిహతుఁ డగుటయు’ పూరణ పంపారు. అంతకు ముందు వేరే మార్గంలో వ్రాసిన పూరణ ఉందా? నేను వ్యాఖ్యలను పైనుండి క్రిందికి నాలుగైదు సార్లు చూసాను. నా మెయిల్ ‘ఇన్ బాక్స్’ పరిశీలించాను. కాని దీనికంటె ముందు మీది ఏ పూరణా కనిపించలేదు. ఎక్కడైనా మిస్ అయ్యానా?
    ‘నిహతుఁ డగుటయు’ పూరణ చక్కని విరుపుతో ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    మీరిచ్చిన చిరంజీవుల శ్లోకాన్ని తెలుగులో అనువదించడానికి విఫలప్రయత్నం చేసాను. అయినా వదలను. మరోసారి ప్రయత్నిస్తా. ధన్యవాదాలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    ఈ ఆలోచన నిన్ననే వచ్చింది. దానికి కార్యరూపం ఇవ్వబోతే కరెంటు కోత! రాత్రి నిద్ర ముంచుకొచ్చింది. మీ సలహాను పాటిస్తాను. ధన్యవాదాలు.
    మీకు అన్నివిధాల స్వస్థత చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  50. శంకరార్యా ! ధన్యవాదములు.
    చంద్ర శేఖర్ గారు ! ధన్యవాదములు.చంద్ర భాసుర సహిత రసవత్తర చర్చ గ 'మ్మత్తు' గా సాగినది.కిషోర్ జీ త్వరలో మీ ఆరోగ్యానికి వసంత కాలం రావాలని మాకోరిక.

    రిప్లయితొలగించండి
  51. గురువు గారూ నమస్కారములు, ధన్యవాదములు. అడుతుం బుడుతుం బ్రతుకులు. నేను పంపినది ఒకటే పూరణ. మిత్రులు వేఱు వేఱు పంథాలలో పూరించారు. మిస్సన్న గారు అద్భుతమైన విఱుపులతో వారి బాటలో చక్కని పూరణ చేసారు. అశ్వథ్థామ హతః (కుంజరః ) అని ధర్మరాజు పలికిన అబధ్ధము ఎవరూ ప్రస్తావించక పోవడము వలన నాకు ఆ అవకాశము కలిగింది. అందుచే మరో మార్గము అన్నాను. మీకు శ్రమ యిచ్చాను,మన్నించండి.

    రిప్లయితొలగించండి
  52. పండిత నేమాని వారి వ్యాఖ్య .....

    అయ్యా! శుభాశీస్సులు.
    చిరంజీవు లేడుగురినీ పేర్కొంటూ చెప్పిన ఈ పద్యమును చూడండి:

    అల చిరాయు లశ్వత్థామ, బలియు, వ్యాసు
    డును, హనుమయు, విభీషణుడును, కృపుడును,
    పరశురాముండు నను బేళ్ళ బరగు వారు
    వారిని దలంచినంత సత్ఫలము లొదవు

    ఏదో ఆసక్తితో వ్రాసేను గాని సంస్కృత మూల శ్లోకములాగ సులభగతి లేదు ఈ పద్యానికి.
    శ్రీ చంద్రశెఖర్ గారు మరియు వసంత కిశోరు గారు తిలకిస్తా రనుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  53. చంద్రశేఖర్ గారీ వ్యాఖ్య .....

    పండితశ్రీ నేమాని మహాశయా!
    చక్కటి పద్యాన్ని ఆశువుగా అందించినందులకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  54. మిత్రులకు మనవి: ఈ శ్లోకం నిత్య స్మరణీయము. ఈ చిరంజీవులని నిత్యం స్మరించుకొంటే ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయని పెద్దల వచనము
    అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ:|
    కృప: పరశురామశ్చ సప్తైతే చిరజీవిన:||
    పండిత నేమాని వారి కి ధన్యవాదాలతో, నాల్గవ పాదం సవరణ గమనించండి - సప్తైతే చిరజీవిన:||

    రిప్లయితొలగించండి
  55. పండిత నేమాని వారూ,
    చిరంజీవుల శ్లోకానికి చక్కని అనువాదం చేసి నాకు శ్రమను తప్పించారు. ధన్యవాదాలు. నేను చేస్తే శ్లోకంలోని వరుస కచ్చితంగా తప్పేది.

    రిప్లయితొలగించండి
  56. నా ఆరోగ్యము నాకాంక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు !

    నేమాని వారు చక్కని అనువాదం అందించారు !

    శంకరార్యా !
    అలా తప్పించుకుంటే ఎలా ?
    ఆ వరుసేమీ దేశ మాన కాలముల ననుసరించినది కాదుగా !
    శ్లోక సౌలభ్యం కోసం చెప్పిన వరుసే గాని !

    వరుస మారితే ఏమౌతుంది ? ఏడుగురూ ఉంటే చాలు గాని !
    కావున మీ అనువాదం కూడా అందిస్తే ఆనందిస్తాం !

    ఇంతకీ ఈ కృపుడెవరు ? చిరంజీవి ఎట్లా అయ్యాడు ?
    కృపి సోదరుడూ,ద్రోణుని బావమరది ---అంతకు మించి తెలియదు !

    రిప్లయితొలగించండి
  57. కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసినాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. ఏడుగురు చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.
    గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు. కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడై తపస్సు చేసికొనసాగాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలపడసాగారు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన తపస్సును భంగం చేయడానికి నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచి సత్యధృతి మనస్సు చలించింది. అది గ్రహించి తన కామోద్రేకాన్ని నిగ్రహించుకొన్నాడు. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడింది. అది రెండు భాగాలై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలానికి శంతన మహారాజు వేటాడుతూ అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారాలు చేయించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణం చేయించాడు. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదాలను నానా విధ శాస్త్రాలను నేర్పాడు. అతడే విలువిద్యలో పరమాచార్యుడై భీష్ముని కోరికపై కౌరవ పాండవులకు గురువు అయ్యాడు.
    కృపిని ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. ఆమె కుమారుడే అశ్వత్థామ.
    ప్రభుభక్తి కలిగి ధృతరాష్ట్రునితో ఉండి ఎప్పటికప్పుడు దుర్యోధనుని దౌష్ట్యాన్ని ఖండిస్తూనే ఉండేవాడు. యుద్ధానంతరం ధృతరాష్టునితో తపోవనానికి వెళ్ళాడు.
    రాబోయే సూర్యసావర్ణిక మన్వంతరంలో సప్తఋషులలో ఇతడొకడు.

    రిప్లయితొలగించండి
  58. గురువుగారూ ఎంతటి చక్కని మహత్తరమైన కథను వివరించారండీ.
    నాకు కూడా కృపి చిరంజీవి అని తెలియదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  59. శంకరార్యా ! ధన్యవాదములు !
    చక్కని కథను వివరించారు !
    కాని సందేహాలు యింకా పెరిగాయి !

    కృపుడు చిరంజీవి ఎట్లా ఐనాడు ?
    అయితే కృపి కూడా చిరంజీవేనా ?
    పాండవ కౌరవుల గురువెవరు? అని ప్రశ్నిస్తే 99.999% ద్రోణుడనే అంటారుగదా !
    కృపుడికి రాని పేరు ద్రోణుడికి ఎట్లా వచ్చింది ?
    భారతయుద్ధం తరువాత కౌరవుల వైపు బ్రతికి యున్న ముఖ్యు లెవరు ?

    ఏదో కుండలో పుట్టాడని వినడమే కాని ద్రోణుడి జన్మ వృత్తాంతం కూడా తెలియదు !
    మీకు శ్రమ కలిగిస్తున్నందులకు మన్నించండి !
    అయ్యా ! విషయం తెలిసిన మిత్రులెవరైనా వివరించవచ్చు !

    రిప్లయితొలగించండి
  60. అయ్యా ! నా అఙ్ఞానం అనంతం !

    మరి చిరంజీవులైన కృపాస్వత్థామలు కురుక్షేత్ర
    యుద్ధంలో పాల్గొన్నారుగదా !
    అర్జునుని పాశుపతం కూడా వీరిని ఏమీ చెయ్యలేదు గదా !
    మరి పాండవులను వీళ్ళెందుకు సంహరించలేదు !

    ఓహో ! ఏమి భారతీయ విఙ్ఞానం !!!
    భారత రామాయణాల రచనా కాలం ఎప్పుడు ?
    ఆనాటికే విఙ్ఞానంలో పరాకాష్ట్ఠ !
    ఒకడు కుండలో పుడతాడు !
    ఇంకొకడు తొడలో (ఔర్వుడు) నుండి పుడతాడు !
    మరొకడు కవచ కుండలాలతో పుడతాడు !
    ఇంకొకడు యఙ్ఞంలోంచి పుడతాడు
    ఒకడు వీర్యంలోంచి పుడతాడు !

    అయ్యా ! ఈ ప్రశ్నల పరంపర ఆగేలా లేదు !
    వేదిక మారిస్తే బాగుంటుందేమో !

    రిప్లయితొలగించండి