20, అక్టోబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -499 (మాటఁ దప్పువాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.

43 కామెంట్‌లు:

  1. కలియుగమ్ము నందు కల్లలనాడుచు
    మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.
    గడచినట్టి యుగపు ఘనతలఁ బాటించు
    సత్యసంధత గల జనులు గలరె?

    రిప్లయితొలగించండి
  2. మంచి మార్గమున జరించుచు పెద్దల
    మాటలెల్ల మణుల మూటలనుచు
    ధర్మనిరతు డగుచు ధర్మవిరుద్ధమౌ
    మాటదప్పు వాడె మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    పట్ట ననుచు పట్టె పద్మనాభుడు తాను
    భీష్ము గూల్తు ననుచు భీకరముగ
    పరమ భక్తుడైన భక్తుని జయముకై
    మాటదప్పు వాడె మాన్యుడగును

    కృష్ణుని చేత ఆయుధం పట్టిస్తాను అన్న భీష్ముని మాట నిలబెట్టుటకై

    రిప్లయితొలగించండి
  4. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    రిలయన్స్ వారు ప్రభుత్వమునకు సుంకము కట్టవలసినది గట్టకుండా తమ మదుపుదారులకు లాభములు జూపె
    --------------
    చమురు వెదకెనొకడు సాగర జలములో
    నల్పమధిక జేసి యప్పు జూపె
    మదుపు దారులకును మార్గనిర్ధెశ్యము,
    మాటదప్పు వాడె మాన్యుడగును|

    రిప్లయితొలగించండి
  5. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

    కోల దాల్చనంచు గోపాలుడునుతప్పె
    తప్పె గురునికూల్చ ధర్మజుండు
    మాట దప్పి సుంత మంచి సాధించుచో
    మాట దప్పువాడె మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  6. ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్ళకు పనిచేసింది. ఆ నమస్కార బాణం వేసిన అజ్ఞాతను నేనే

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, అక్టోబర్ 20, 2011 1:45:00 PM

    1. నిన్న పదుగు రెదుట నిలబడి మాటాడి
    నేడు లేదటంచు నెమకు వాడు
    రాజకీయ మందు రాటు దేలగ జూడ
    మాట దప్పువాడె మాన్యు డగును(?)

    2. ఒండు రెండు సార్ల కొరులను నమ్మించి
    మనెడు గాక ! చెడును మహిని- ఘనుడు
    మాట యందు నిలుచు మనుజుండు - వరుసగా
    మాట దప్పు వాడె , మాన్యు డగును

    --- సుజన సృజన

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నేటి స్థితి :
    ఎలాంటి వాడైనా మంత్రై తే మాన్యతకు లోటేముంది !

    01)
    _________________________________

    మాట దప్పువాడె - మంత్రిముఖ్యు డగును(ముఖ్య మంత్రి)
    మాట దప్పు వాడె - మంత్రి యగును !
    మాట నిలుపు వాడు - మంత్రి కాజాలడు
    మాటఁ దప్పువాఁడె - మాన్యుఁ డగును !
    _________________________________

    రిప్లయితొలగించండి
  9. హరిశ్చంద్రుడూ ,శ్రీరాముడూ మాట నిలుపు కొన్నారు !
    మళ్ళీ మానవులకు సాధ్యమా ?!

    02)
    _________________________________

    మాట నిలుపు టన్న - మాలావు కష్టము !
    మాట నిలుపు వారి - మహిని గనము !
    మాట నిలుపు టన్న - మరణంబు గోరుటే !
    మాటఁ దప్పువాఁడె - మాన్యుఁ డగును !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. నీతి పాలకుండు నిత్యప్రసన్నుండు
    కాటికాపరయ్యె మాటకొఱకు!
    మంత్రులైరి మాయ మాటలతో నేడు
    మాట దప్పు వాడె మాన్యు డగును!!!

    రిప్లయితొలగించండి
  11. వరుని బామ్మ కోరె వరకట్నమును, మరి
    వరుఁడు పలికె తనకు వలదనుచును
    బుద్దిశాలి వరుఁడు పుస్తెఁ గట్టెను,బామ్మ
    మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును!!

    రిప్లయితొలగించండి
  12. ఆర్యా !,
    నా వంతు పూరణ!
    కలియుగారంభమున యుగ లక్షణాల వివరణ ....

    ధర్మ మార్గచరులు ధనహీనులగుదురు
    విప్రులొదులురింక వేద విధులు
    కొట్టి బ్రతుకు వాడె గొప్ప వాడై మనున్
    మాట దప్పు వాడె మాన్యు డగును

    రిప్లయితొలగించండి
  13. నీతి నియమ మన్న నీటిమూట లెగద
    నేతి బీర లందు నేయి గనము.
    మాయ జగతి లొన మంచికి తావేది
    మాటఁదప్పు వాఁడె మాన్యుఁడగును !
    ------------------------
    మాయ మాట జెప్పి మాయమై పోవుచు
    పెళ్ళి మీద పెళ్ళి జెసు కొనుచు
    కట్ట లన్ని దాచి గుట్టుగా బ్రతుకుచు
    మాటఁదప్పు వాఁడె మాన్యుఁడగును !

    రిప్లయితొలగించండి
  14. నా పూరణ ......

    పుణ్యకర్ముఁడైన బోధగురువు చెప్పు
    మాటఁ దప్పువాఁడు చేటుఁ గనును;
    పాపకర్ముఁడైన బాధగురువు చెప్పు
    మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  15. ఎరిగి వేయునొక్కొ? యెరుగక వేయునో?
    "ఓటు " ప్రతిఫలానకోటువడక!
    నేతలందు నీతి నియమమ్మువిడి నేడు
    " మాటదప్పు వాడెమాన్యుడగును!!

    రిప్లయితొలగించండి
  16. చక్కని పూరణలు చేసిన మాస్టరు గారికి, కవి మిత్రులకు అభినందనలు. ఉదయం ' పవర్ కట్ వలన' సమయానికి పూరించ లేక పోయాను.

    చందమామ దెత్తు,సరియె విమాన మిత్తు
    చిన్ని నాన్న యనుచు చేరి పలికి
    అన్నమింత తినగ నమితమౌ ప్రేమతో
    మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  17. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, అక్టోబర్ 20, 2011 10:15:00 PM

    పసిడి పలుకు లద్ది పచ్చల హారమ్ము
    తెలుగు తల్లి మెడకు దీర్చి నట్లు
    నేదు నూరి వారి' నీతి 'పద్యము జూడ
    కంఠ హార మొప్పె కనుల ముందు

    రిప్లయితొలగించండి
  18. హనుమచ్చాస్త్రి గారి పద్యంలో తొలి పాదం ?????

    రిప్లయితొలగించండి
  19. ఆర్యా ! చిన్న పిల్లవాడు అన్నం తినడానికి చందమామ తెస్తాను, వద్దు విమానం కావాలంటే.... సరే విమానం తెస్తాను, అని అన్నం తినిపిస్తాము.
    కానీ ఆ మాట నిలబెట్టుకోలేము కదా ..అని నాభావం.

    రిప్లయితొలగించండి
  20. **********************************************************************
    మందాకిని గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    చక్కని నీతిని బోధించిన మీ పూరణ ఉత్తమం. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి ఇతివృత్తాన్ని స్వీకరించారు పూరణకు. చాలా బాగుంది. అభినందనలు.
    ‘జయముకై’ అనరాదు, ‘జయమునకై’ అని ఉండాలి. అలా ఉంటే గణదోషం. అందుకని అక్కడ ‘గెలిపించ’ అంటే సరి!
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు. బడా కంపెనీలు ఎప్పుడైనా మాట తప్పేవే కదా!
    ‘నిర్ధెశ్యము’ అన్నారు. టైపాటు ... అది ‘నిర్దేశ్యము’ కదా!
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    సమస్య పాదాన్ని చక్కగా సమర్థిస్తూ మంచి పూరణ చేసారు. అభినందనలు.
    అజ్ఞాతంగా మీరు పంపిన నమస్కారాన్ని అందుకున్నాం. సాధించారు. సంతోషం. నాకు కాపీ, పేస్ట్ శ్రమను తగ్గించారు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    రాజకీయాల్లో మాట తప్పి మాన్యతనందే వారి గురించిన మీ మొదటి పూరణ చాలా బాగుంది.
    క్రమాలంకార పద్ధతిలో వ్రాసిన రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్యను ప్రశంసించిన మీ పద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ ‘మాలావు’ బాగున్నాయి. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఆ వరుడు ‘బామ్మ మాట బంగారు మూట’ అనుకోలేదు. బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    కళ్యాణ్ గారూ,
    కలియుగారంభ లక్షణాలు అంటూ చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    ‘నీతి నియమ మన్న’ ను ‘నీతి నియమము లన’ అనీ, ‘జెసుకొనుచు’ను ‘జేసికొనుచు’ అందాం.
    **********************************************************************
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ముద్దుముద్దు మాటలతో అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    **********************************************************************
    అజ్ఞాత గారూ,
    ‘గోలి’ వారి పూరణ మొదటి పాదంలో మీరు కనిపించిన దోషం ఏమిటి? **********************************************************************

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ పండిత నేమాని వారి పూరణ, శ్రీ శంకరయ్య గారి పూరణలు సుభాషితములుగా శోభిల్లుచున్నవి. నమస్సులు.
    హనుమచ్ఛాస్త్రిగారు, మన్నించాలి. మీ 1 వ పాదంలో గణదోషాన్ని అజ్ఞాతగారు సూచించారనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారు ధన్యవాదములు. మీసవరణ

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు ధన్యవాదములు. మీ సవరణ చక్కగా ఉన్నది. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  24. చందమామదెత్తు సరియెవిమానమిత్తు

    ఇందులో గణాలు సరిగా ఉన్నాయంటారా??

    రిప్లయితొలగించండి
  25. మందాకిని గారు సమస్యని రెండవ పాదంలో ఉంచి పూరించారు. ఇది తప్పని ఘట్టిగా వాదించనుగాని సంప్రదాయం కాదు. సమస్యని నాలుగవ పాదంగా ఉంచి పూరించడం సముచితం.

    పండిత నేమాని వారి పద్యం సుళువుగా ఉంది. బాగుంది

    శ్రీపతిశాస్త్రి గారు పట్ట ననుచు పట్టె పద్మనాభుడు అన్నారుగాని, యేమి పట్టాడో చెప్పలేదు. నిజానికి యిలా పద్యం పూర్తి కాలేదు!

    వరప్రసాదు గారు 'నల్పమధిక జేసి ' . అధిక జేసి సరయిన ప్రయోగం కాదని మనవి. 'అధికమున్ + చేసి' ని అధికము జేసి గా మార్చగలం కాని ఇంకా మువరణమును కూడా విసర్జించలేమండీ.

    కంది శంకరయ్య గారు 'సుంతమంచి సాధించుచో మాట దప్పువాడె మాన్యుడగును' అన్నారు. అన్యాయం సుమండీ. ఏ కొద్ది మంచికో మాట తప్పవచ్చునంటే యింక యెవరూ మాట మీద నిలబడ వలసిన పని లేదు. పోనీ, 'గొప్ప మంచి సాధించుచో' అందామా?

    లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణలలో మొదటిదే నాకు నచ్చింది. రెండవది కృతకంగా ఉంది - యేదో క్రమాలంకారయుక్తమైనా సరే. ధారాశూధ్ధికి కూడా మొదటిదే నాకు నచ్చింది.

    వసంత కిశోర్ గారి మొదటి పూరణమే బాగుంది నాకు. రెండవదానిలో అన్వయం కుదరటం లేదు.

    మంద పీతాంబర్ గారు పూరణం చూద్దాం. ఇందులో కూడా అన్వయదోషం అనిపిస్తోంది. సమస్య తధ్ధర్మకాలీనం. పాదాలు భూత వర్తమానాలలో ఉన్నాయి.

    జిగురు సత్యనారాయణ గారి పద్యం సమయోచిత చమత్కారం, వ్యవహారశైలీ కలిగి బాగుంది.

    కళ్యాణ్ గారి పూరణలో 'విప్రులొదులురింక వేద విధులు' అనే పాదం ఉంది. వదలుదురు అనే మాట పట్టుకుని వారు ప్రధమాక్షరం 'వ' ను 'ఒ' చేసారు ముందు మాటతో సంధి చేసారు. సరే విప్రులొదలుదురు అయింది. దీనలో చివరి అక్షరాలు రెండూ యెలా మింగేశారండీ చమత్కారంగా. అలా ఇదంతా కుదరదు కదా.

    నేదునూరి రాజేశ్వరి నేదునూరి గారి పద్యంలో 'జగతి లొన' అన్నారు. 'లో' అనే వ్రాయాలనుకుని ఉంటారు. అమ్మా, పద్యం మధ్యలో పూర్ణవిరామం గుర్తు (.) ఉంచరాదని మనవి. కారణాలు ఒకటి రెండు రోజుల క్రిందటే మనవి జేసాను. రాజేశ్వరి గారి రెండవ పద్యంలో కూడా 'జెసు కొనుచు' అన్నారు 'జే' అనే వ్రాయాలనుకుని ఉంటారు తప్పకుండా.

    కంది శంకరయ్య గారి పుణ్యకర్ముఁడైన..... పద్యం బహు ప్రశస్తమైన పూరణం.

    రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు అష్టావధానులు. వారిని విమర్శించటం సాహసమే. కాని 'ప్రతిఫలానకోటువడక' అన్న ప్రయోగం చిత్రంగా ఉంది. పద్యం కూడా నాకైతే సరిగా అన్వయం కావటం లేదని మనవి.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారు మొదటిపాదంలో 'చందమామ దెత్తు,సరియె విమాన మిత్తు ' అన్నారు. అజ్ఞాతగారు తప్పన్నారు. అవును కదా మరి. మూడు సూర్య గణాలు, మొదటి ఇంద్ర గణం సరిగా వచ్చాయి కాని చివరి ఇంద్ర గణం తప్పుకదా?

    రిప్లయితొలగించండి
  26. నమస్కారములు.
    నిన్న పూరణలో " గన్నవరపు వారికి " ,ఈ రోజు " రాజారావు గారికి " , నిరంతర కృషి ," కంది వారికి [నన్నింతగా ప్రోత్సహిస్తున్న] [ తమ్ముళ్ళందరికీ ] " హృదయ పూర్వక ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  27. శ్యామలీయం గారూ మీరు చెప్పిన సందేహం నాకూ కలిగింది.సమయాభావం వల్ల సవరించుటకు కుదరలేదు. క్రింది విధంగా సవరణ చేస్తున్నాను.

    పట్ట ననుచు చక్రి పట్టెను చక్రంబు
    భీష్ము గూల్తుననుచు భీకరముగ
    పరమ భకుడైన భక్తుని గెలిపింప
    మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  28. నమస్కారములు. శ్యామలీయం గారు .
    అవును రెండు చోట్ల టైప్ పొరబాటు . " జగతి లోన " జేసు కొనుచు " అని వ్రాయబోయి తొందరలో చూడలేదు .తెలియ జెప్పినందులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  29. శుక్ర నీతి జెప్పె సూటిగాను మెలఁగు
    దారి గాన నట్టి తరుణ మంద
    బద్ధ మాడదగు నిబద్ధతకొప్పుచు
    మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  30. మూడో పాదం చివర మార్చి వేరే విరుపుతో:
    శుక్ర నీతి జెప్పె సూటిగాను మెలఁగు
    దారి గాన నట్టి తరుణ మంద
    బద్ధ మాడదగు నిబద్ధతకొప్పక
    మాటఁ దప్పువాఁడె మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  31. **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు. నిజమే! నేను గమనించలేదు ‘గోలి’వారి పూరణలో గణదోషాన్ని.
    ‘చందమామదెత్తు సరి విమానము నిత్తు’ అంటే సరిపోతుం దనుకుంటాను.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలో తెలియడం లేదు. మీ గుణదోషవిచారంగా శాస్త్రీయంగా ఉంది. పనుల ఒత్తిడి, మనశ్శాంతి లేకపోవడం తదితర కారణాల వల్ల నేను గమనించని దోషాలను మీరు ఎంతో ఓపికతో గమనించి మిత్రులను హెచ్చరించడం ముదావహం! మీ సమీక్షలను మనసారా స్వాగతిస్తున్నాను. నేనే కాదు కవిమిత్రులు కూడా సంతోషిస్తున్నారు. తాము ఎక్కడెక్కడ ఏయే తప్పులు చేస్తున్నారో తెలుసుకొని దిద్దుకొని, మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. (మనలో మాట! కొన్ని దోషాలను నేను చూసీ చూడనట్టు వదిలేస్తాను. కొందరి పూరణలను శల్యపరీక్ష చేసి దోషాలను ఎత్తిచూపి, సవరణలను సూచించాలంటే ఒక్కొక్క పేరా అవుతుంది. ఇవన్నీ చూచి ‘ఎందుకీ బాధ! ఇదేదో మనకు కొరుకుడు పడని వ్యవహారం. పోనిద్దూ...’ అని తప్పుకుంటారేమో అని నా అనుమానం. అసలే పద్యవిద్య చులుకన చేయబడుతున్న ఈ కాలంలో ఆసక్తితో ముందుకు వస్తున్న ఔత్సాహికులను ప్రోత్సహించాలని నా ఆలోచన.) ఇలా అన్నానని మీరు గుణదోష విచారణ మానకండి. నాకు కొంత శ్రమ తగ్గిస్తున్నారు. అందుకు నేను, మన కవిమిత్రులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ సమీక్షలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
    కంది శంకరయ్య గారు 'సుంతమంచి సాధించుచో మాట దప్పువాడె మాన్యుడగును' అన్నారు. ఇది నా పూరణ కాదండీ. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారిది. వారు నా మెయిల్ కు పంపితే అక్కడ కాపీ చేసి, బ్లాగులో పేస్ట్ చేసాను.
    వరప్రసాద్ గారి పూరణలో ‘అల్ప మధిక జేసి’ అనడం దోషమే. ‘అల్ప మెచ్చు జేసి’ అంటే సరిపోతుంది.
    కళ్యాణ్ గారి పూరణలో ‘విప్రులు విడుతు రిక’ అంటే సరి!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  32. శంకరార్యా ధన్యవాదములు.
    నేను గమనించని దోషమును తెలిపిన కవిమిత్రులకు ధన్యవాదములు.
    సవరణ తో ...


    చందమామ దెత్తు,సరియె విమానమ్ము
    చిన్ని నాన్న యనుచు చేరి పలికి
    అన్నమింత తినగ నమితమౌ ప్రేమతో
    మాటఁ దప్పువాఁడు మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  33. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. 'ప్రతిఫలానకోటువడక' అన్న ప్రయోగం సాధువే శంకరయ్య గారూ. ఒక పని చేసేటప్పుడు ఫలితం - దాని పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పనైన చెయ్యాలి అని భావం. ఓట, ఓటు అంతే భీతి అన్న సామాన్యార్థంలోనే ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగం మీలాంటి 36 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రౌఢులకు కూడా అసాధువుగా కనిపించడం, ఇంకా అన్వయంలో క్లిష్టత బహుశః మీకు ఈ కారనంగానె కనిపించి ఉండొచు. మరేదైన వెలితి కనిపిస్తే పొడి, పొడి గా కాకుండా దయచెసి శ్రమ అనుకోకుండా సవివరంగ అంటే వివరించండి, విశ్లేషించండి, దృష్టాంతీకరించండి, సోదాహరించండి, ఉటంకించండి, విమర్శించండి, విపులీకరించండి, క్రోడీకరించండి, ప్రత్యక్షీకరించండి, నిరూపించండి, నిర్ణయించండి. మీ సావధాన సమధానం కోసం వేచి ఉండే.. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

    రిప్లయితొలగించండి
  35. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీరు పొరబడ్డారు. మీరు ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను నా వ్యాఖ్యగా భావించారు. మరొకసారి గమనించ ప్రార్థన!

    రిప్లయితొలగించండి
  36. శంకరయ్య గారూ.. క్షంతవ్యుడ్ని,.. ఆ విమర్శనా పోస్ట్ మీదని భ్రమించి, ఆ పోస్ట్ మిమ్మల్ని ఉద్దేశించి పొరపాటున పంపడం జరిగింది. ఆ పోస్ట్ "శ్యామలీయం" గారికి వర్తిస్తుందని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇలాంటి తప్పిదం మరల దొరలకుండా జాగ్రత్త తీసుకుంటాను. దయ చేసి గమనించగలరు. వీలుంటే నా భావన్ని "శ్యామలీయం" గారికి బదిలీ చేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  37. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    ఫరవాలేదండీ.. ‘ప్రమాదో ధీమతామపి’ అన్నరు కదా! మీ వ్యాఖ్యకు ‘శ్యామలీయం’ గారు స్పందిస్తారనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  38. 'ప్రతిఫలానకోటువడక' అన్న ప్రయోగం సాధువే "శ్యామలీయం" గారూ. ఒక పని చేసేటప్పుడు ఫలితం - దాని పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పనైన చెయ్యాలి అని భావం. ఓట, ఓటు అంటే భీతి అన్న సామాన్యార్థంలోనే ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగం మీలాంటి వారికి అసాధువుగా కనిపించడం, ఇంకా అన్వయంలో క్లిష్టత బహుశః మీకు ఈ కారణంగానే కనిపించి ఉండొచ్చు. మరేదైన వెలితి కనిపిస్తే పొడి, పొడి గా కాకుండా దయచేసి శ్రమ అనుకోకుండా సవివరంగా అంటే - వివరించండి, విశ్లేషించండి, దృష్టాంతీకరించండి, సోదాహరించండి, ఉటంకించండి, విమర్శించండి, విపులీకరించండి, క్రోడీకరించండి, ప్రత్యక్షీకరించండి, నిరూపించండి, నిర్ణయించండి.......... మీ సావధాన సమధానం కోసం వేచి ఉండే.. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

    రిప్లయితొలగించండి
  39. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులంఅరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  40. రాంభట్లవారు మన్నించాలి. 'ప్రతిఫలానకోటువడక' అన్నది సాధువుగాదని అనటం లేదు. 'ప్రతిఫలానికి' అని వాడుకగా అంటాం. అందుచేతనేమో 'ప్రతిఫలానకు' అన్నది కొంత చమత్కారంగా అనిపించింది. చిత్రంగా ఉన్నది అనటం తప్పుబట్టే ఉద్దేశంతో కాదని మనవి.

    అన్వయ పరంగా చూస్తే, "ఎరిగి వేయునొక్కొ, యెరుగక వేయునో, ఓటు ప్రతిఫలానకోటువడక" అన్నంత వరకు చాలా సాఫీగా అనిపించింది. తరువాయి పాదం 'నేతలందు నీతి నియమమ్ము విడి నేడు' అన్నది. ఇక్కడ రెండు విడి వాక్యాలు కనిపిస్తున్నాయి నాకు. వాటిమధ్య సమన్వయం కోసం చూస్తే, మొదటి వాక్యం ఓటు వేసే వ్యక్తి నుద్దేశించి కవి కించిదాశ్చర్యంగా అనటం. రెండవ వాక్యం కవి చేస్తున్న ప్రకటన. రెండు లోకపరశీలనా పూర్వకమైన వాక్యాలు. సరే, ఈ రెండు వాక్యాలకి సమన్వయం చేస్తే ' నేటి నేతలకి నీతి నియమాలు వేర్వేరు విషయాలు. ఓటు వేసే వాడు వీళ్ళకి తెలిసి వేస్తున్నాడా తెలియక వేస్తున్నడా తన ఓటు?' అని వచ్చింది. ఇదంతా యిలా చేసాక కూడా, మాటదప్పు వాడె (అటువంటి నేత యే) మాన్యుడగును అనే మకుట ప్రకటనతో యెలా అనుసంధానం అవుతున్నది? అని శంక వస్తోంది. ' రాంభట్లవారు అడిగారు కాబట్టి నాకు వారి పద్యానికి అన్వయం చేసుకోవటంలో కలిగిన యిబ్బంది యేకరువు పెట్టవలసి వచ్చింది. అన్వయం చేసుకోలేక పోవటానికి నా ప్రతిభాలోపమే కారణం కావచ్చును.

    రాంభట్లవారికి, వారితో పాటుగా యితర కవిమిత్రులకు, శంకరయ్యగారికి నేను ముఖ్యమైన సంగతి ఒకటి మనవి చేయవలసి ఉంది. నేను పండితకవిని గాను. అసలు పండితుడనూ గాను కవినీ గాను. మరీ ముఖ్యంగా వయ్యాకరణిని యసలే గాను.

    రిప్లయితొలగించండి
  41. "శ్యామలీయం" గారూ.... శుభోదయం
    మీ సందేహాలకు నా సమాధానం.
    1) విశేషం - 1
    చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంతస్తదలంకృతిః |
    త్వమేవ కీర్తిమాన్రాజన్! విధురేవహి కాంతిమాన్ ||
    సంక్షిప్త వ్యాఖ్య: వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే అది దృష్టాంతాలంకారం అవుతుంది. ఇక్కడ ఉపమానోపమేయ భావముంటుంది.
    "ఎరిగి వేయునొక్కొ, యెరుగక వేయునో, ఓటు ప్రతిఫలానకోటువడక" అన్నంత వరకు ఉన్న పూర్వార్థంలో సమాజ స్థితిగతి చెప్పి - తర్వత దాని ప్రతిఫలం అనే విషయం చెప్పడం జరిగింది.

    ఇక ...
    ప్రతి ఫలనా"కు" అన్న పదం
    మనకు వ్యాకరణంలో షష్ఠీ విభక్తి లో చెప్పిన విధానం ప్రకారం అదంత శబ్దాల తర్వాత "కు" ప్రత్యయం, ఇదంత పదాల తర్వాత "కి" అనే వస్తాయని ఉండడం గమనార్హం. అందువల్ల ప్రతి ఫలాన "కు" అని ఉపయోగించడం జరిగింది.

    2) విశేషం - 2
    ఉక్తిరర్థాంతరన్యాస స్స్యాత్సామాన్య విశేషయోః |
    హనుమా నబ్ధి మతర ద్దుష్కరం కిం మహాత్మనాం? ||

    సామాన్య, విశేష విషయాలను ప్రస్తావించి ... ఆ విశేషం చేత సామాన్యాన్ని సమర్థించి చెబితే అది "అర్థాంతరన్యాసాలంకారం" అన్నారు పెద్దలు.

    "ఇక్కడ రెండు విడి వాక్యాలు కనిపిస్తున్నాయి నాకు. వాటిమధ్య సమన్వయం కోసం చూస్తే, మొదటి వాక్యం ఓటు వేసే వ్యక్తి నుద్దేశించి కవి కించిదాశ్చర్యంగా అనటం. రెండవ వాక్యం కవి చేస్తున్న ప్రకటన." అని అన్నారు మీరు. ఇక్కడ "ఎరిగి వేయునొక్కొ, యెరుగక వేయునో, ఓటు ప్రతిఫలానకోటువడక" అన్నది విశేషం, అలాగే .. నేతలందు నీతి నియమమ్మువిడి నేడు మాటదప్పు వాడెమాన్యుడగును!! అన్నది సామన్య విషయం. కనుక విశేషంతో సామన్య విషయం సమర్థించి చెప్పడం జరిగింది.

    ఇలాంటివి... మన తెలుగు సాహిత్యంలో చాల కనిపిస్తూ ఉంటాయ్. అందులోనూ శతక వాఙ్మయం ముఖ్యమైంది. భాస్కర శతక పద్యాలు, వేమన , సుమతి, శతక పద్యాలు ఇవన్నీ ఇలాంటి అలంకారాలకు ఆకరమైనవే...

    3) విశేషం - 3
    "ఓటు ప్రతిఫలానకోటువడక" - ఇక్కడ స్వర, ప్రాస యతులు రెండూ పాటింపబడ్డాయి.

    4) విశేషం - 4
    "ఓటు ప్రతిఫలానకోటువడక" అన్న ఇదేపాదంలో ఓటు - ఓటువడక అన్న చోట - యమకాలంకారం ఉంది.
    ఇలా శబ్దార్థాలంకారాలు ఎన్నైనా వెలికితీయవచ్చు.. దృష్టే ప్రధానం.

    ఇక సమన్వయం అన్న విషయానికొస్తే... ఆలంకారిక దృక్పథం, అవగాహన ఇలాంటి సాహిత్యాధ్యనానికి అవసరం అనుకుంటాను. మీ సునిశిత పరిశీలనకు ధన్యావాదములు..

    రిప్లయితొలగించండి