30, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 509 (ద్రవమునెల్ల హరించి)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
ద్రవమునెల్ల హరించి కాచెను
త్ర్యంబకుండు జగమ్ములన్.
(ఛందస్సు - ఇది ‘తరళం’ అనే వృత్తం. దీని గణాలు న-భ-ర-స-జ-జ-గ. యతిస్థానం 12. ప్రాస నియమం ఉంది. దీని నడక ‘ననననానన - నాననానన - నాననానన - నాననా’)
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. శంకరార్యా ! వీని మధ్య తేడాను గమనించుడు !

  తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
  తరలము(ధ్రువకోకిల)----న-భ-ర-స-జ-జ-గ----యతి-12
  తరళము------------7నగణములు+గురువు----యతి-13

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  హాలాహలం బారినుండి రక్షింపుమని దేవతలు శివుణ్ణి :

  01)
  _______________________________________

  దివిజు లందర రూపుమాపగ - దీర్ఘమై ప్రభవించెగా !
  దివిని గ్రమ్మెను హాహలంబిదె - దిక్కు నీవెగ మాకికన్ !
  భవుని ప్రార్థన జేసి నంతట - భక్ష్యమున్ దిను నట్లుప
  ద్రవము నెల్ల హరించి కాచెను - త్ర్యంబకుండు జగమ్ములన్!
  _______________________________________

  రిప్లయితొలగించండి
 3. శివుని నామమె ముక్తి ధామము , చిత్తమందున పార్వతీ
  ధవుని నిల్పిన జీవితమ్ములు ధన్య మౌనట మిత్రమా
  భవుని రూపము దివ్య దీపము భక్తితో గొలువన్నుప
  ద్రవము నెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్!
  _______________________________________

  రిప్లయితొలగించండి
 4. అవిరళంబుగ పాలసంద్రమునైకమత్యముతోడ దా
  నవులు దేవత ధీగణంబులు నాభిజన్ముడు చిల్కగా
  నివుడు చెందుచు హాహలమ్ము జనించెభీతిని గొల్పి, యా
  ద్రవమునెల్ల హరించి కాచెను, త్ర్యంబకుండు జగంబులన్.

  రిప్లయితొలగించండి
 5. దివిజదానవులంత దుగ్ధనిధిన్ చెలంగి మథింపగన్
  భువనభీకర లీల వాసుకి ఫూత్కరింపగ కొల్లలై
  యవిరళంబుగ వెల్వడన్ ఘనుడై హలాహలధారలౌ
  ద్రవమునెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారు, ధన్యవాదములు.
  "కందము నమరిన పేరుల నందము దేనికి గలదిట?" = ఇక్కడ సమస్యగా నిచ్చిన కందములో అమరిన పేరుల (ప్రాణుల అనాల్సింది.) లో అందము దేనికి కలదు=కుందేటికి అని నా భావన.
  ఇక చివరిపూరణ తప్పించుకొనే పద్ధతి నాకే ఇష్టం లేదు. కానీ నా తిప్పలు చెప్పుకుందామని చెప్పాను.

  శివము మంగళమెల్లవేళల సృష్టియందునఁ గూర్చగా
  ధవళ రూపుడు నీలకంఠుఁడు దాను సిద్ధము నెప్పుడున్
  కువలయమ్మును బ్రోచువానిగ కూర్మితో విషమైన యా
  ద్రవము నెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్.

  రిప్లయితొలగించండి
 7. ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్య ........

  ఈ వారాంతపు సమస్య "ద్రవమునెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్." గమనించ వలసిన ముఖ్య విషయం. ఈ సమస్య భూతకాలంలో ఉన్నది 'కాచెను' అని. శంకరయ్యగారు తరళం అంటే వసంత కిశోర్ గారు కాదు తరలం అన్నారు . తరలి, తరల, తరళ వృత్తాల ఛందస్సులు తెలియబరచినందుకు వారికి ధన్యవాదాలు.

  వసంత కిశోర్ గారి పూరణ బాగుంది. Past tense ను సరిగా పాటించారు. అందమైన పూరణ.

  పీతాంబర్ గారి పూరణ tense విషయంలో పొరబడినది. వారి పద్యంలో చివరి పాదంలో 'కాచును' అంటే సరిగా ఉంటుంది. కాని సమస్య మార్చరాదు కదా.

  సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణలో tense సమస్య కాలేదు. కాని 'దేవత ధీగణంబులు ' అనటం సరియైన ప్రయోగం కాదు. దేవతా శబ్దం స్త్రీలింగం. ఎప్పుడూ దేవతా అనే వస్తుంది సంసృతంలో. కాబట్టి దేవతా ధీగణములే అవుతాయి. లేదా దేవగణములో, దేవధీగణములో అవుతాయి కావలసినట్లుగా. అలాగే నాభిజన్ముడు, హాహలమ్ము అనే మాటలు సరిగావని నా భావన.

  మిస్సన్నగారి పూరణ మంచి ధారా శుధ్ధిగా నున్నది. పవలు రేయియు.....శివుడు దానిని దాచి గళమున వరకు చాలా సాఫీగా ఉంది. పవలు రేయియు కన్నా పవలు రేలును అంటే బాగుంటుంది. 'జీరె జిల్కెడి వారలన్ ' అన్నది సరిగా అన్వయం కావటంలేదనిపిస్తుంది తొలుత . tense సమస్య కాలేదు కొత్తగా ద్రవము=పరుగు అని చెప్పారు. ఈ అర్ధం శబ్దరత్నాకరంలో కనిపించింది. 'దానిని దాచి గళమున, జీరె జిల్కెడి వారలన్ ద్రవమునెల్ల హరించి' అన్నపుడు బాగానే అన్వయం అవుతున్నది.

  రవి గారి పద్యం సుబోధకంగానే ఉంది గాని, సరిగా అన్వయం కావటంలేదని మనవి.

  మందాకిని గారి పూరణలో 'సిద్ధము నెప్పుడున్' అన్నారు గాని ద్రుతం లేదు కాబట్టి యడాగమమే కావాలి సిద్ధమెప్పుడున్ అని. పైగా శివుని కువలయమ్మును బ్రోచువానిగ చెప్పారు కాని ఆయన సర్వభూవనాలను బ్రోచువాడు గదా! కువలయము అంటే భూలోకం ఒక్కటే మరి. ఇంకా ధవళ రూపుడు అనటంకూడా సరియైన ప్రయోగం కాదు - ధవళదేహుడు అనటం సముచితంగా ఉంటుంది. 'సృష్టియందునఁ గూర్చగా' అనే భాగం కూడా 'సృష్టియందొనఁ గూర్చగా' అని మార్చటం ఉచితంగా ఉంటుంది. ఒనగూర్చు అన్న పదంలో అరసున్న లేదనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 8. సరిగ్గా చెప్పారు. నా పద్యం అన్వయం సరిగ్గా కుదరలేదండి, ముఖ్యంగా మూడవపాదంలో. కాసేపు ప్రయత్నించి,లాభం లేక వదిలేశాను. మీ సూచనలు బావున్నాయి.

  రిప్లయితొలగించండి
 9. శివము మంగళమెల్లవేళల సృష్టియందొనగూర్చగా
  ధవళ దేహుడు నీలకంఠుఁడు దాను సిద్ధము సర్వదా
  ధవుడు తానయి బ్రోచువాడయి ధాటిగా విషమైన యా
  ద్రవము నెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్.

  అయ్యా శ్యామలరావు గారు , ధన్యవాదాలు. మీ సూచనలతో నా పూరణ.
  కానీ యందొన సరియైన ప్రయోగమా అని చిన్న సందేహము.

  రిప్లయితొలగించండి
 10. మందాకిని గారు, సృష్టియందొనగూర్చగా అంటే సృష్టి యందు ఒనగూర్చగా అని విసంధి. ఒనగూర్చు అనే మాటకు 'సిద్ధించునట్లు చేయు' అని బ్రౌణ్యం. మరియు యీ అర్ధంలో యీ మాట ప్రసిధ్ధ ప్రయోగమైయున్నది. మంగళమెల్లవేళల సృష్టియందొనగూర్చగా అన్నది యిప్పుడు చాలా సుబోధకంగాను సాధువుగానే యున్నది కదా.

  కవిమిత్రులకు సదుపాయంగా ఉంటుదని చెబుతున్నాను. మీకు తెలిసి యుండవచ్చునేమో. http://www.andhrabharati.com/dictionary/index.php అని మంచి నిఘంటు సదుపాయం ఉంది. ఉపయోగించుకోవలసినది.

  రిప్లయితొలగించండి
 11. http://www.telugunighantuvu.com/

  తెలుగు నిఘంటువులో కొన్ని పదాలు ఇంకాచేర్చవలసి ఉంది.

  రిప్లయితొలగించండి
 12. శ్యామలరావు గారు
  ఒనగూర్చు పదం చాలా సార్లు వాడేదే నండి.అర్థం గురించి కాదు నేనన్నది. సంధి గురించి.
  ఆంధ్రభారతి, తెలుగు నిఘంటువు ఉన్నా నేను కఠిన పదాలు, తత్సమాలు వాడేది తక్కువ . తేట తెలుగు పదాల్లో నాకు తెలియనివి ఉంటే ఈ రెండింటిలో తప్పక చూస్తాను.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. మందాకినిగారూ, సంధి సమస్య యేమీ లేదు
  యందు + ఇనగూర్చు => యందొనగూర్చు. రెండు తెలుగు పదాల మధ్య సంధి. ఉత్తున కచ్చు పరంబగు నప్పుడు సంధి నిత్యము గదా.

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా ! ధన్యవాదములు !
  శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !
  విషము = హహలము, హాహలము,హాహాలము (ఆచార్య జి ఎన్ రెడ్డి)

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న మహాశయా ! ఇదేమి ఛందస్సు ?
  1-నభ నభ భజస 2-నభ భన రనస 3-నభ భన రసవ
  4-న-భ-ర-స-జ-జ-గ

  అయ్యా ! ఏదో హడావిడిలో పూరించినట్టున్నారు !

  రిప్లయితొలగించండి
 16. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  నేను చెప్పిన తరళ లక్షణం అనంతుని ఛందోదర్పణం లోనిది. మీ రిచ్చిన తరళ లక్షణం, తరల (ధ్రువకోకిల) లక్షణాలు ఏ లక్షణ గ్రంధంలోనివో పేర్కొనలేదు.
  ఆంధ్రామృతం బ్లాగులో ప్రకటితమైన క్రింది పద్యం చూడండి.
  తరళము:-.
  తెలుగు పండిత వృత్తి చేకొని దీక్షతో నట చెప్పుచున్.
  సులభ రీతిని పద్యముల్ విన సొంపు వ్రాయుట నేర్పితే!
  కలలు గన్న కవీశ్వరాకృతిగా ముదంబున నిల్చి మీ.
  కలల రూపగు పిల్లలన్ గనికార మొప్పగ చూచితే!
  ఒక అవధానంలో మేడసాని మోహన్ గారు "తరళము, మత్తకోకిల సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన సోదర వృత్తా"లని చెప్పిన పిమ్మట, దాని నడకను గూర్చి వర్ణిస్తూ చంద్ర శేఖరాష్టకాన్ని ఉదహరించి, అటుపై ఎంతో చక్కగా మత్తకోకిల పద్యం పూరించారు అవధాని గారు.
  సఖ్యతన్‌విడి సత్యభామ ప్రసన్న భావ విదూరయై
  ప్రాఖ్యమూర్తిని కృష్ణ దేవుని పాయ జూచిన వైనమున్‌
  ముఖ్యమంచు దలంప వచ్చునె భూరి పావనుడైన చిత్‌
  సౌఖ్య తత్పరు పంకజాక్షుని సన్నుతించుట ఒప్పగున్‌
  పై మత్తకోకిలలోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే ‘తరళం’ అవుతుందన్నారు.
  చిన్నప్పుడు పైరెండు వృత్తాల లక్షణాలను సులభంగా గుర్తుంచుకొనేందుకు క్రింది పద్ధతిని పాటించేవాళ్ళం.
  ‘మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా’
  ‘తరళ తారళ తారళాతర తారళాతర తారళా’
  మీరు చెప్పిన తరలి, తరళము అరు మాత్రల ఆవృత్తి గల్గి చివర ఐదు మాత్రలున్నాయి. (6+6+6+5)
  తరలము (ధ్రువకోకిల) మత్తకోకిల లాగా ఏడుమాత్రల ఆవృత్తి కలిగి చివర ఐదు మాత్రలున్నాయి (7+7+7+5)

  రిప్లయితొలగించండి
 17. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  ఉపద్రవము హరించిన త్ర్యంబకునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారా?
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  లయకు ప్రాధాన్యమిచ్చి విషమవృత్తం(?)లో సమస్యను పూరించారు. అభినందనలు.
  ‘శ్యామలీయం’, వసంత కిశోర్ గారల వ్యాఖ్యలను గమనించండి.
  **********************************************************************
  రవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  **********************************************************************
  ‘శ్యామలీయం’ గారూ,
  ఎంతో ఓపికతో బ్లాగును మళ్ళీ మళ్ళీ చూస్తూ, సూచనలను ఇస్తూ కవిమిత్రులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 18. గురువుగారూ ధన్యవాదాలు. విషమ వృత్తాన్ని ఉపసంహరించాను.
  శ్యామలీయంగారూ ధన్యవాదాలు.
  వసంత మహోదయా బ్యాంకుకు వెళ్ళే తొందరలో
  నడకనే చూచుకొన్నాను గాని గణాలను గమనించలేదు.
  ధన్యవాదాలు.

  సవరించిన నా పూరణ:

  పవలు రేలును దేవ దైత్యులు పట్టువీడక చిల్కగా
  ప్రవిమలమ్మగు క్షీర సంద్రము పైకి తేలెవిషమ్మహో
  శివుడు దాచెను కంఠ మందున, చీరె జిల్కెడి వారలన్
  ద్రవమునెల్ల హరించి, కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్.

  ద్రవము=పరుగు.

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా !
  నేను పరిశీలన కొఱకు మనవి చేసిన సమాచారము
  ఈ క్రింది గ్రంథము నుండి !


  [సులక్షణ సారము (ఛందశ్శాస్త్రము) ,
  లింగంగుంట తిమ్మకవి విరచితము,
  పునఃపరిశీలన విద్వాన్ శ్రీ రావూరి దొరసామి శర్మ;
  బులుసు వేంకట రమణయ్య గారిచే పరిష్కృతము;
  బాలసరస్వతీ బుక్ డిపో
  మద్రాసు]

  తప్పొప్పులు చెప్పగలిగే శక్తీ ,సమర్థతా నాకు పూజ్యం !

  ఇందు ఏది సరియైనదో విఙ్ఞులు నిర్ణయింతురు గాక !

  రిప్లయితొలగించండి
 20. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, నవంబర్ 01, 2011 8:45:00 AM

  గురువుగారూ,

  ధన్యవాదములు.

  శ్యామలీయం గారూ,

  ప్రతి పదాన్ని, ప్రతి పాదాన్ని లోతుగా అధ్యయనము చేస్తూ తప్పొప్పులను తెలియజేస్తున్న మీకు శతకోటి వందనములు. మీ వ్యాఖ్యలు నాలోని ఉత్సాహాన్ని, పట్టుదలను మరింతగా పెంచుతున్నయి. ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి