7, అక్టోబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -485 (సిరిమగనిం గాంచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్
ఈ సమస్యను సూచించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. సిరిమగని పుత్రు జంపిన
  హరుమదిలో నతడు పుట్ట హరి మోహినియై
  గిరిజా పతి ఎదుట నిలువ
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  రిప్లయితొలగించండి
 2. నా పూరణ ....

  స్మరుని దహించిన కతమున
  హరి తనపై కోపగించు ననుకొని గౌరీ
  పరిణయమున కేతెంచిన
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ .....

  నరసింహమూర్తియై హరి
  చరింప నతి భీకరముగ జగముల్ వడకెన్
  కరము భయంకరుడగు నా
  సిరి మగనింగాంచి చంద్రశేఖరు డడలెన్

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  బరవసము నొందె నంతట
  సిరి మగనిం గాంచి ! చంద్ర - శేఖరుడడలెన్
  సురవైరి తనను కాల్చగ
  కరమును తల పైన బెట్ట - గదలిన వేళన్ !
  _________________________________
  బరవసము = ధైర్యము
  సురవైరి = భస్మాసురుడు

  రిప్లయితొలగించండి
 5. చిన్న సవరణ తో...


  మరుడను చిచ్చున కాల్చిన
  హరుమదిలో మరల పుట్ట, హరి మోహినియై
  మరణము వానికి లేదను
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  రిప్లయితొలగించండి
 6. చంద్రశేఖర్:
  మాష్టారు స్వీయ ముద్రాంకితమైన సమస్యా పూరణ బాణాన్ని నా మీదకే వదిలారు. కాబట్టి నా పూరణ చివరి పాదంలో మానవమాత్రుడనైన "చంద్రశేఖరు" డను నేనే అని మనవి చేసుకొంటూ:
  జర దరిజేరు వయసున య
  మెరికా జిలుగు దొరసాని మిస గనినంతన్
  జ్వరమున్ రగిలించెడి యా
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్!
  జర = ముదిమి; ముసలితనము
  డా.మూర్తి మిత్రులు చెప్పినట్లు కొందరు "తెల్ల" పిల్లలని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది "ట" :-) నాకు మాత్రం భయం వేస్తుంది సుమా!

  రిప్లయితొలగించండి
 7. సిరికింజెప్పక పరుగిడి
  కరిరాజునిగాచినట్టి కరుణామయుడే
  తరుణీ రూపము దాల్చగ
  సిరిమగనింగాంచి చంద్రశేఖరుఁ డడలెన్!!!

  రిప్లయితొలగించండి
 8. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ.

  ప్రయాణం హడావుడిలో ఉండి రాసినది, పొరపాట్లేమైనా ఉన్నాయేమో. ఒక వారం రోజులకోసం ఇండియా వస్తునాను కనుక శంకరాభరణానికి శెలవు. వచ్చే వారం మళ్ళీ కలుస్తాను

  ఉరగారికూడి యురగా
  భరణుని హరి చూడబోవ పశుపతికడకున్
  ఉరగమ్ములుఱుకునోయని
  సిరిమగనింగాంచి చంద్రశేఖరుడడలెన్

  రిప్లయితొలగించండి
 9. వరములఁ గోరుచు తపమునొ
  నరుచున్, భామల గెలుచును, నరుడయి తనతో
  డ రణముఁ జేసెడి యీ మగ
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  1.వరములఁ గోరుచు తపమునొనరుచున్,
  2.భామల గెలుచును,
  3.నరుడయి తనతో డ రణముఁ జేసెడి యీ మగసిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  రిప్లయితొలగించండి
 10. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....

  ఆ పద్యమును ఇలా మార్చి రాస్తే బాగుంటుందనిపించింది.

  ఉరగారి గూడి యురగా
  భరణుని హరి చూడబోవ, పక్షిని గని యా
  యురగమ్ము లుఱుకునో యని
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరు డడలెన్

  రిప్లయితొలగించండి
 11. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  గరళముఁ ద్రావిన హరునకు
  వరపుత్రిక దాన మొసగ వనజాక్షుండున్
  గరమున గలశము నిలుపగ
  సిరిమగనిన్ గాంచి చంద్రశేఖరుఁ డడలెన్ !

  గంగను కలశములో దెచ్చి శ్రీహరి హరుని చేతిలో పెట్టాడు. మళ్ళీ విషము త్రాగాలేమో నని శివుడు భయపడ్డాడు.

  రిప్లయితొలగించండి
 12. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  కరిచర్మ ధారి శివమున
  మరుభూమిన్ నాట్య మాడి మసలెడు వేళన్
  కరిహితు డేతెంచె నచట
  సిరిమగనిన్ గాంచి చంద్రశేఖరుఁ డడలెన్ !

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

  అయ్యా! చంద్రశేఖర్ గారూ: శుభాశీస్సులు.
  ఈ సమస్య మీ అనుభవమా -

  సరె ఇది మీ అనుభవమా?
  హర హర! వివరింపుమయ్య ఆ వివరములన్
  సరసము కద! ఏ రీతిగ
  సిరిమగనిన్ గాంచి చంద్రశేఖరుడడలెన్

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారి పూరణ ....

  సిరిపతి మా గురువర్యులు
  సరదాగా జోకులేయు సమయములో తొం
  దరగా గురుడరుదేరగ
  సిరిమగినింగాంచి చంద్రశేఖరుడడలెన్

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, అక్టోబర్ 07, 2011 3:16:00 PM

  భక్తులను వెన్నంటి కాచే పరమేశ్వరుడు, తన భక్తుడైన రావణాసురుని సంహారమునకై వచ్చిన శ్రీహరిని చూచి తన భక్తునికావలేనని అనుకున్న సంధర్భము ( ఊహ మాత్రమే, తప్పైతే మన్నించగలరు ).

  హరభక్తుడైన రావణు
  పరిమార్చు నెపంబుతోడ పామరుడై య
  త్తరి జగతిని వెలసిన
  సిరిమగనిని గాంచి చంద్రశేఖరుడడలెన్.

  రిప్లయితొలగించండి
 16. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, అక్టోబర్ 07, 2011 3:17:00 PM

  భక్తులను వెన్నంటి కాచే పరమేశ్వరుడు, తన భక్తుడైన రావణాసురుని సంహారమునకై వచ్చిన శ్రీహరిని చూచి తన భక్తునికావలేనని అనుకున్న సంధర్భము ( ఊహ మాత్రమే, తప్పైతే మన్నించగలరు ).

  హరభక్తుడైన రావణు
  పరిమార్చు నెపంబుతోడ పామరుడై య
  త్తరి జగతిని వెలసిన యా
  సిరిమగనిని గాంచి చంద్రశేఖరుడడలెన్

  రిప్లయితొలగించండి
 17. కరగని ఖాకీ వాడట
  అరిఁగెను ఢిల్లీకి నేడె ఆహ్వానమునన్
  జరుగునది యేమొ! చెంచెత
  సిరిమగనిన్ గాంచి చంద్రశేఖరుఁ డడలెన్!!

  చెంచెత సిరి మగఁడు = నరసింహన్

  రిప్లయితొలగించండి
 18. శ్రీకంది శంకరయ్యగరూ! నమస్తే!
  మీ "శంకరాభరణం" బ్లాగు చూశాను. నేను కూడా
  సమస్యలు, దత్తపదులు పంపిస్తున్నాను. దయచేసి స్వీకరించండి!
  సమస్యలు:
  "లింగని పెండ్లియాడెనట లీలగ పుత్రులు వేడ్కనందగన్"
  "జీవుడు జీవి జంపుటది జీవిక కోసమె వృత్తి ధర్మమే!"
  దత్తపదులు:
  ఆలము, కాలము, గాలము, మేలము- వాతావరణ కాలుష్యముపై.
  కారేజీ, గారేజీ, బారేజీ, మారేజీ - శ్రీకృష్ణ రాయబారఘట్టముపై
  పై సమస్యలు, దత్తపదులు నేను అవధానములలో
  పృచ్చకునిగా అవధానులను అడిగినవి. వాటికి నా యొద్ద
  నా పూరణములున్నవి. నమస్తే!
  భవదీయ,
  డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ)

  రిప్లయితొలగించండి
 19. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  ఆర్యు లారా ! మిత్రులు చంద్ర శేఖర్ పిన్నవారు,సరసులు. కాని సిగ్గు యెక్కువ. అసలు కధ యిది. మా పల్లెటూరు చూడటానికి వాళ్ళ అబ్బాయితో ఒకసారి వచ్చి మా పొరుగింటికి వెళ్ళారు దారి తప్పి ( పూర్వము దుష్యంతుడి వలె ). అక్కడ గుఱ్ఱాలతో ఆడుకొంటున్న పసిదానికి ముగ్ధు లయ్యారు.ఆమెతో సంభాషిస్తుంటే ఆమె భర్త వచ్చాడుట. ఆయన కొంచెము జడుసుకొన్నారు.

  నరసింహ మూర్తిఁ జూడగ
  పొరుగూరికి వచ్చి యొక్క పొలతిని గాంచెన్
  తురగ విభవ సిత, వెనుకను
  సిరిమగనిన్ గాంచి చంద్రశేఖరు డడలెన్ !!

  రిప్లయితొలగించండి
 20. డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ) గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీరు పంపిన సమస్యలు, దత్తపదులు బాగున్నాయి. సాధారణంగా సమస్యలుగా వృత్తపాదాలను వారాంతపు సమస్యలుగా ప్రతి ఆదివారం ఇస్తూ ఉంటాను. ఈ ఆదివారం మీ సమస్యలలో ఒకటి ఇస్తాను.
  ఈ బ్లాగును మీరు రోజూ వీక్షించాలని, సమస్యలకు పూరణలు పంపాలని, కవిమిత్రుల పూరణలపై స్పందించి గుణదోష విచారణ చేయాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. చంద్రశేఖర్:
  పండితశ్రీ నేమాని వారికి, మిత్రులు డా.మూర్తి గారికి నా నమస్సులు. పెద్దలు యేమని చెప్పను, మా కంటే సీనియర్లు:
  పెద్దలు తమ వద్ద పిల్ల కబురులవి
  చెప్పలేము మనసు విప్ప లేము
  హద్దు మీరలేము, హనుమంతుని యెదుట
  కుప్పిగంతు లవ్వి గొప్ప కావు!

  రిప్లయితొలగించండి
 22. శ్రీగుభ్యోనమ:

  గురిజూచి విడచె బోయడు
  పరమాత్మకు దాకె శరము పాదమునందున్
  పరిపరి విధముల వగచుచు
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్

  {తన ప్రియ సఖునకు ఏమి జరిగినదో అని ప్రేమతో కూడిన భయము}

  రిప్లయితొలగించండి
 23. అడలు అంటే వ్యాకులపడు అనే అర్ధం లో - పూరించటానికి ప్రయత్నిస్తున్నాండీ

  పరుషపుఋషి కనుగానక
  విరసత పాదంబునాన విష్ణూరము నొం
  టరియైవగచుచునుండిన
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్.

  రిప్లయితొలగించండి
 24. **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
  **********************************************************************
  (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
  జర మీద పడ్డాక ‘జర’ భద్రంగానే ఉండాలి. చమత్కారభరితంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  ఎక్కడో దూరంగా ఉండి అవిరామంగా పూరణలు పంపుతున్నారు. మరి మన దేశానికి అందులోను మా మధ్యకు వస్తూ ‘వారం’ సెలవు ప్రకటించడం ఏమిటండీ? అన్యాయం!
  సవరించిన మీ పూరణ సర్వాంగసుందరంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  కిరాతార్జునీయం కథను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ఆ భయంతోనే కావచ్చు శివుడు విష్ణువు పాదోదకాన్ని తలదాల్చాడు.
  మీ రెండవ పూరణలో కరి(గజాసురు)ని చంపిన శివుడు కరిరక్షకుని చూచి భయపడడం సహజమే. బాగుంది.
  ఇక మూడవ పూరణలో మిత్రుడు చంద్రశేఖర్ భయపడ్డ సంఘటనను చక్కగా వివరించారు.
  మూడింటికి మూడూ బాగున్నాయి. అభినందన త్రయం!
  **********************************************************************
  పండిత నేమాని గారూ,
  మీ వ్యాఖ్యారూపమైన పూరణ బాగుంది. వారు భయపడ్డ వివరాలను స్వయంగా వారూ, వారి మిత్రులు నరసింహ మూర్తి గారూ తెలిపారు కదా!
  ఇక రెండవ పూరణలో గురువును చూచి భయపడ్డది పై చంద్రశేఖరా? లేక మీ సహాధ్యాయి చంద్రశేఖరా?
  చక్కని పూరణలు. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ఊహే కదా! తప్పేం లేదు. ‘నిరంకుశాః కవయః’
  కాని రాముడు ‘పామరుడు’ కాడు కదా!
  **********************************************************************
  జిగురు సత్యనారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  శ్రీనివాసుని కథాప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 25. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 26. సిరిమగడా నరసింహుడు
  సిరిచెంతన గూరుచుండి చిన్నగ నవ్వన్
  మరియేమి జేయునోనని
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్


  నరసింహుడు = పీ వీ నరసింహా రావు (యస్ చంద్రశేఖర రావుని గద్దె దింపిన కాంగ్రెస్ ప్రధాన మంత్రి...స్వర్గస్థుడు 2004)

  చంద్రశేఖరుడు = యస్ చంద్రశేఖర రావు (స్వర్గస్థుడు 2007)

  రిప్లయితొలగించండి
 27. పరుగిడి దేశమ్మంతయు
  కరచుచు నరచుచును గాంచి కవితయె యోడన్
  తిరిగెడు తన తల పట్టుచు
  సిరిమగనిం గాంచి చంద్రశేఖరుఁ డడలెన్

  సిరిమగడు = నరేంద్ర "దామోదర్" మోడి

  రిప్లయితొలగించండి