9, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -486 (జీవుడు జీవిఁ జంపుపని)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
జీవుడు జీవిఁ జంపుపని
జీవిక కోసమె వృత్తి ధర్మమే
ఈ సమస్యను పంపిన
డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ) గారికి
ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    కొందరు పెంచితే
    కొందరు(సర్కస్) హింసిస్తే
    కొందరు (బండితోలేవాళ్ళూ) కొడితే
    కొందరు మాంసమమ్మితే
    అన్నీ వృత్తి వ్యాపారాలే గదా !

    01)
    _________________________________________

    జీవుల బెంచు వారయిన - జీవుల హింసను బెట్టు వారలున్
    జీవుల గొట్టు వారయిన - జీవుల మాంసము నమ్మువారలున్
    జీవుడు జీవిఁ జంపుపని - జీవిక కోసమె వృత్తి ధర్మమే
    జీవన యాత్ర సాగగను - జీవము దేహము నిల్పు కోసమే !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    _________________________________________

    పావన మూర్తియౌ శివుడు - ప్రాణుల జీవము నిర్ణయించుటన్
    కేవల మాత్రుడే మనిషి - కీడొ నరించగ ,సృష్టి యందునన్
    జీవములన్ని వాని దయ - చే , నిల నుండుటొ, లేక స్రుక్కుటో !
    జీవుడు జీవిఁ జంపుపని - జీవిక కోసమె వృత్తి ధర్మమే !
    _________________________________________
    స్రుక్కు = క్షీణించు

    రిప్లయితొలగించండి
  3. సృష్టి , స్థితి , లయ కారకుని యాఙ్ఞానుసరణమే గదా జీవయాత్ర :

    3)
    _________________________________________

    జీవుల సృష్టి జేయుటయు - జీవన యానము సాగజేయుటో
    చావును నిర్ణయించు టది - చండుడు జేసెడి చాక చక్యమే
    భావన లోన వాని మది - బాయక ,జేసెడు పాప పుణ్యముల్
    జీవుడు జీవిఁ జంపుపని ! - జీవిక కోసమె వృత్తి ధర్మమే !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  4. రావిక నెట్టి బంధములు- రమ్మని మృత్యువు పిల్చువేళలన్
    నీవును నేనుఁ జేయగల నిర్మల పుణ్యము, పాపకర్మముల్
    చావున వెంటరాగలవు. జాలియు లేకన దెట్లు పల్కెదో?
    జీవుడు జీవిఁ జంపుపని జీవిక కోసమె? వృత్తి ధర్మమే?

    రిప్లయితొలగించండి
  5. జీవుడు జీవిఁ జంపుపని, జీవిక కోసమె వృత్తి ధర్మమే,
    దేవుడు జీవు లన్నిటిని దింపెను భూమికి నొక్క పద్ధతిన్
    జీవులు వృద్ది బొంద మరి జీవులు ధాత్రిని నిండ కుండగన్
    జీవుల భుక్తి దక్క మరి చీమను జంపిన గాని పాపమే.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని రామజోగి సన్యసిరావు గారి పూరణ ....

    జీవిత మొక్క నాటకము జీవులనేకులు పాత్రధారులున్
    జీవి శరీర పోషణకు జీవపదార్థము లోగిరమ్ములౌ
    కావున నన్య జంతువుల క్రన్నన జంపును జంతులందుచే
    జీవిని జీవి జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమే

    రిప్లయితొలగించండి
  7. నా పూరణ ....

    దేవుఁడు తేలిచెన్ పొలసుదిండులఁ గొన్నిటి సృష్టిధర్మమై
    జీవిని జీవి చంపు పని జీవిక కోసమె; వృత్తిధర్మమే
    యేవిధిఁ జెల్లు మానవున కిట్టుల జంతువధాత్తకార్య మౌ
    రా విడనాడగా వలయు నా పలలాశన మెల్లవారలున్.

    రిప్లయితొలగించండి
  8. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. వృత్తరచనా ప్రావీణ్యం మీకు కరతలామలకం అయింది. ఇక వెనక్కు చూడకండి. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చీమను చంపినా పాపమే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది, అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  9. లావుగలాడులోకమున లాతుల లోగొని తుంగ ద్రొక్కుటల్
    చేవ గలట్టి జీవి లఘు జీవుల బట్టీ వధి౦చుటల్ గన౦
    గా విధి చెయ్దముల్ చెలియగా దరమౌనె జనాళికిన్ మృగా
    జీవుడు జీవి చంపుటది జీవిక కోసమె,వృత్తి ధర్మమే.
    యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రి),రాజమహేంద్రవరం.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

    ' జీవుఁడు జీవిఁ జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమే !'
    కావును సత్యమై యరయఁ గాశ్యపి నందున జంతుజాలమున్
    భావన సేయగా ప్రకృతి భారము నిల్చెను వృక్షజాతులన్
    బ్రోవరె క్షీరదమ్ములను భూతములన్ గని మాతృధర్మమున్ !

    ఇది చాలా సున్నితమైన సమస్య. ప్రపంచ మంతా శాకాహారు లయితే బాగుండునని తలచే వాడిని. నేను శాకాహారిని అని తెలిసి 'మీరు బెండకాయలను కోసి వేయించేటప్పుడు వాటిలో ప్రాణము లేదా ?' అని ఒక చీనా వైద్యుడు నన్ను ప్రశ్నించాడు. సరే ! వంటికి ఆకుపచ్చ రంగు పులుముకొని ఒక గోతిలో కాళ్ళు నిలిపి ఎండలో నా తిండి నేను సమకూర్చుకోవాలా ? అని ప్రశ్నించాను. కాని నిర్దాక్షిణ్యంగా మా శ్రీమతి బెండకాయలు వేయించేటప్పుడు బాధగానే ఉంటుంది. వాటికి నొప్పి లేదనే భావన !. మరి మత్తు యిచ్చి శరీరములో వ్రణములను కోసిపడేస్తూ యీ కబురులేమిటి ?

    ' ఓం శ్రీ రాం !'

    రిప్లయితొలగించండి
  12. **********************************************************************
    డా .యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారూ,
    ‘మృగాజీవుడు’ చక్కని ప్రయోగం. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సమస్య సున్నితమైనదైనా సుతిమెత్తని భావనతో చక్కగా పూరించారు. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  13. నమస్కారం !

    నా వంతు పూరణ ,

    లావున లాఘవంబుగ విలాసముకై వనమందువేటలున్
    పావనగోసమూహముని భారతదేశమునందె జంపుటన్
    జీవులనంతరించునటు సేయుచు నందరు జెప్పునొక్కటే
    జీవుడు జీవి(జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమే

    రిప్లయితొలగించండి
  14. కళ్యాణ్ గారూ,
    వృత్తరచనా నైపుణ్యం మీకు చక్కగా పట్టుబడింది. ఇక మీ కలాన్ని ఉరికించండి. అభినందనలు.
    అయితే కొన్ని చిన్నచిన్న లోపాలు. వాటిని సవరించుకొనడానికి ఏ వ్యాకరణ పాఠాలూ అవసరం లేదు. ‘విలాసముకై’ అనకుండా ‘విలాసమునకై’ అనాలి. అంటే అక్కడ గణదోషం. బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం ...

    లావున లాఘవంబుగ విలాసము(నన్) వనమందువేటలున్
    పావనగోసమూహము(ను) భారతదేశమునందె జంపుట(ల్)
    జీవులనంతరించునటు సేయుచు నందరు జె(ప్ప జూతురే)
    జీవుడు జీవిఁ జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమే

    రిప్లయితొలగించండి
  15. కోవెల లోన కూడుచును కొట్టుచు కొబ్బరి కాయలెన్నియో
    చావడి లోన బాసలిడి చంపుట మానుము గోవునంచటన్
    బావురు మంచు గోలలిడు బంగరు రాహులు నెత్తి బాదుచున్
    జీవుడు జీవిఁ జంపుపని
    జీవిక కోసమె వృత్తి ధర్మమే

    రిప్లయితొలగించండి