ఓ మనసా! ప్రేమించవే!
నేను వ్రాసిన మూడు సినిమా పాటల్లో ఇది మొదటిది. ఏడెనిమిదేళ్ళ క్రితమే ఈ సినిమా పూర్తయింది. కోర్టు తగాదాల్లో చిక్కి విడుదల కాలేదు. ఇక కాదనుకుంటా! ఈ చిత్రంలో విశాఖపట్టణానికి చెందిన శివాజీ అనే డాక్టర్ హీరోగా నటించాడు. నా పాటలో కొంతభాగం షూటింగ్ వికారాబాద్ సమీపంలోని ఏదో ప్రాజెక్ట్ దగ్గర జరిగింది. ఆ సందర్భంగా రెండురోజులు ఆ యూనిట్ వాళ్ళతో ఉన్నాను.రెండవపాట ‘హృదయాలు’ అనే చిత్రంకోసం వ్రాసాను. పాట రికార్డింగ్ కూడా అయింది. కాని భాగస్వామ్యపు గొడవలతో షూటింగ్ మొదలుకాకుండానే ఆగి పోయింది.
మూడవ పాట మా వరంగల్ వాళ్ళు తీసిన సినిమా. పేరు ‘నీ మనసు నాది’. నిరుద్యోగసమస్యపై పాట వ్రాయమన్నారు. వ్రాసి ఇచ్చాను. వాళ్ళు ఆ పాటను ఇష్టం వచ్చినట్లు మార్చేసారు. నా పేరు పెట్టవద్దని చెప్పాను.
ఓ మనసా! ప్రేమించవే! (మొదటి భాగం)
ఆమె -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను || ఓ మనసా ||
వలపు విఫలమై - విలపించుటకే || వలపు ||
కలలున్నవి అనకే! .... ఆ ......................................... || ఓ మనసా ||
అందరాని చందమామకై - అశించే కలువనై
చెలికాని వలపు కలిమికై - నిలిచాను బేలనై || అందరాని ||
తోడులేని నా బ్రతుకున - తూరుపు తెలవారునా || తోడు ||
పేదగుండె చీకటి తొలగి - వెలుగు సిరులు నిండునా ......... || ఓ మనసా ||
అతడు -
ఓ మనసా! ప్రేమించవే ప్రేమను || ఓ మనసా ||
మారిన నా మదిలోన - మరులెన్నో రేపిన || మారిన ||
చెలియ చెలిమిని మరువకే ... ఆ ............................... || ఓ మనసా ||
కాలం కాలనాగమై - కాటువేసి పోయినా
ఎడబాటే కాలకూటమై - ఎద మంటలు రేపినా || కాలం ||
ప్రియురాలి ప్రేమ పిలుపే - విరిజల్లై కురిసెనులే || ప్రియురాలి ||
మురిపాల నా సఖిని - చెర వీడి రమ్మనవే ................... || ఓ మనసా ||
(గమనిక - నేను ‘బేలనై’ అని వ్రాస్తే గాయని ‘బేలినై’ అని పాడింది)
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉష, ప్రవీణ్.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/9f0d771e-c8dd-49a7-8947-dbc56933ff7c/O-manasa---Usha,-Praveen
maastaaruu, meeru cinemaa paatalu wraasaaraa!!!!!yee paata baagundi..mari migilina rendu???
రిప్లయితొలగించండిennela
మాస్టారూ, మీ బ్లాగ్ తొ సహా చాలా బ్లాగులు నన్ను వెలివేసాయి. అజ్ఞాతగా కామెంటాల్సి వస్తోందండీ..బాధ పడుతూ-ఎన్నెల
రిప్లయితొలగించండి‘ఎన్నెల’ గారూ,
రిప్లయితొలగించండిబహుకాల దర్శనం. ధన్యవాదాలు.
‘మీ బ్లాగుతో సహా’ అన్నారు. మీరెప్పుడూ నా బ్లాగులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెట్టలేదే! పూరణలు చదివి పూరించిన కవులను ప్రశంసించారు. మీకు పద్యకవితమీద ఆసక్తి తగ్గి ఇటువైపు చూడడం లేదనుకుంటున్నాను. నా బ్లాగు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. భాషాసాహిత్యాలకు సంబంధించిన ఏ విషయమైన స్వేచ్ఛగా ప్రస్తావించవచ్చు. చర్చల్లో పాల్గొనవచ్చు. రాజకీయాల ప్రస్తావన, వ్యక్తిగత దూషణలు చేసే వారిని సున్నితంగా హెచ్చరిస్తాను. అంతే!
మీ రెప్పుడూ మర్యాద నతిక్రమించిన వ్యాఖ్య పెట్టలేదు. మీకు స్వాగతం పలుకుతున్నాను.
శంకరార్యా ! మీరు వ్రాసిన సినిమా పాటలు సినిమాలలో కాకపోయినా వ్రాసిన కాసిని మా పాటలుగా ఇప్పుడు వినగలుగు చున్నాము. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వచ్చి విఘ్నములు కలుగకుండా విడుదలై తెలుగు వారందరూ వినగలిగే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నేను సినిమా పాటలు వ్రాయడానికి తగినవాణ్ణి కాను. ఎప్పుడూ ప్రయత్నించలేదు.
‘ఓ మనసా! ప్రేమించకే!’ చిత్రంలోని పాటలన్నీ వేరే కవులు వ్రాసారు. అవి రికార్డింగ్ అయిపోయాయి. ఆ చిత్రం సంగీత దర్శకుడు సంజయ్ కింగి నా సాయి పాటలకు సంగీతాన్ని అందించారు. చివరి నిమిషంలో ఆ సినిమాలో ఒక టైటిల్ సాంగ్ పెడితే బాగుంటుందని అనుకొని ఆ విషయమై చర్చించుకుంటున్నారు. సమయం లేదు. తెల్లవారే సరికి పాట సిద్ధం కావాలి. అదే సమయంలో నా అయ్యప్ప పాటల రికార్డింగ్ విషయం మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాను. నన్ను చూసి ఆ పాట నన్ను వ్రాయమన్నారు. నేను ఇప్పటి వరకు భక్తి పాటలే వ్రాసాను. వ్రాయగలనో లేదో అంటే ప్రయత్నించమని సన్నివేశాలను, ట్యూన్ ను ఇచ్చారు. ఆ రాత్రి స్టూడియోలోనే ఉండి ఆ పాట పూర్తి చేసి ఇచ్చాను. సినిమా విడుదలై జనంలోకి ఆ పాట వెళ్ళినప్పుడు స్పందన ఎలా ఉండేదో? ఆ పాట వ్రాసినందుకు నాకు 1500 రూ. ఇచ్చారు. దాని ప్రొడ్యూసర్ ఇంట్లో ఆ సినిమా సిడి చూపించినప్పుడు టైటిల్స్ లో ‘పాటలు’ అన్నదగ్గర రెండవస్థానంలో నా పేరు చూసుకొని సంతోషించాను. ఆ సరదా అలా తీరింది.
ఇక రెండవ పాట. ‘హృదయాలు’ అనే చిత్రానికి వ్రాసింది. మా అబ్బాయి స్నేహితునికి తెలిసినవాళ్ళు మొదలు పెట్టారు ఆ సినిమాని. ఆ అబ్బాయి వచ్చి సన్నివేశం చెప్పి విషాదగీతం వ్రాయమన్నాడు. వ్రాసి ఇచ్చాను. రికార్డింగ్ అయిందట నేను వినలేదు. ముహూర్తపు షాట్ చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర ‘యస్. వి. కృష్ణారెడ్డి’ క్లాప్ కొట్టగా జరిగింది. ఆ అబ్బాయి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అదే మొదటిసారి ఆ దేవాలయాన్ని చూడడం. ఆ సినిమా ఆ ముహూర్తపు షాట్ తోనే ఆగిపోయింది. దానికి నాకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. ఆ పాట సాహిత్యం నా దగ్గర ఉందో లేదో వెదకాలి!
మూడవ పాట. మా వరంగల్ వాళ్ళు తీసిన ‘నీ మనసు నాది’. ఎవరో చెపితే దాని ప్రొడ్యూసర్ కమ్ హీరో మా స్కూల్ కు వచ్చి నిరుద్యోగంపై ఒక పాట వ్రాసి ఇమ్మన్నాడు. వ్రాసి ఇచ్చాను. నెల తర్వాత "పాటను ఫైనలైజ్ చేసాం. రికార్డింగ్ కు పంపుతున్నాం. ఒకసారి వచ్చి చూడండి" అని ఫోన్ చేసారు. తీరా వెళ్లి చూస్తే అది నా పాటే కాదు. అంతగా మార్చారు. నిజానికి నేను వ్రాసిందే బాగుంది. మనసు వికలమై " ఇది నా పాట కాదు. నా పేరు వేయకండి" అని చెప్పి వచ్చాను. ఆ సినిమా విడుదల అయింది. కాని దానిని నేను చూడలేదు, ఆ పాటను వినలేదు. దాని సాహిత్యం కూడా నా దగ్గర లేదు.
అయ్యా,
ఇదీ సినీకవిగా నా ప్రస్థానం!
అన్నట్టు మరో విషయం ... సంగీత దర్శకుడు ‘చక్రి’ మా ఆవిడ అక్క కుమారుడే! కాని కవిగా అతణ్ణి ఎప్పుడూ కలవలేదు.
తమ్ముడూ ! చాలా బాగున్నాయి .ఇంత మంచి పాటలు విడుదల కానందుకు బాధ గా ఉంది. ఇక ముం దైనా మరిన్ని పాటలు సినిమా పరంగా వెలుగు లోకి రావాలని కోరుతూ ఆశీర్వదించి .అక్క
రిప్లయితొలగించండిమీ సినిమా అనుభవాలు చాలా కరెక్టు. వారు పారితోషికాల మాట అటుంచి మొత్తం వారికి నచ్చినట్టుగా మార్చి వేస్తారు. మన రచనలు మన పిల్లల్లాంటివి. ఒక్క అక్షరం మారినా బాధ గా ఉంటుంది. [ సీరియల్ వాళ్ళు కుడా అంతే ]
రిప్లయితొలగించండిగురువుగారూ మీ సినిమా పాట ఆర్ద్రతతో కూడిన విషాద ప్రేమగీతంగా భాసిల్లుతోంది.
రిప్లయితొలగించండి