29, అక్టోబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 508 (కుందేటికి మూడు కాళ్ళు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.

52 కామెంట్‌లు:

 1. అయ్యా! మిత్రులకు కొన్ని సూచనలు.
  కవయః నిరంకుశః - కవులు ఎవరికి తోచినట్లు వారు పద్యాలు వ్రాసుకొన వచ్చును. ఎవరూ ఎవరినీ ఆపలేరు. వాక్కులు అతి పవిత్రములైనవి అని గ్రహించండి. అగ్నిర్వై వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని ఉపనిషద్వాక్యము. వాక్కు అగ్ని వంటిది - పవిత్రతలోను మరియు ప్రభావములోను కూడా. అందుచేత పదములను వాడునపుడు తగిన భద్రత ముఖ్యము. అజ అనే శబ్దము బ్రహ్మకు మరియు మేకకు కూడా వాడుతారు. కాని ముందుగా బ్రహ్మ అనే అర్ధాన్నే చెప్పుకొనాలి. రామ అనే శబ్దము శ్రీరామునకు మరియు స్త్రీకి కూడ వాడుతాము. ఇలాగే అనేక పర్యాయ పదములు ఉన్నపుడు ఏ పదము ఉత్కృష్టమైన భావమును ఇస్తుందో దానినే వాడుట శ్రేయస్కరము. సప్తపర్ణి నష్టపర్ణి గావింపుడు అనే వాక్కు వలన ఒక రాజవంశము వారికి ఎంతో నష్టము వాటిల్లినట్లు చిన్నప్పుడు విన్నాను. ఆష్టపర్ణికి బదులు నష్టపర్ణి అనే అర్థము వలన అలా జరిగినది అని చరిత్ర. స్వస్తి. ఇట్లు - పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 2. ఒక పెంపుడు కుక్కను, కుందేలును ఆకతాయి పిల్లలు రాళ్ళువేసి కొట్టగా కాలు విరిగినదని చెప్పుకున్న సందర్భం...

  ముందే విరిగెను కుక్కకు
  కుందేటికి నిన్న విరిగె కుడివైపునదే
  సందున పిల్లలు కొట్టగ
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

  రిప్లయితొలగించండి
 3. వందనమో కందివరా!
  ఎందరు కను మీ వలె? ఒకటిత్తరి తీయన్
  కందుము నాల్గును మూడుగ.
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

  రిప్లయితొలగించండి
 4. 01)
  _________________________________

  మందెక్కువైన నొక్కడు
  పందెంబును వైచె నచట - పదుగురి తోడన్
  విందును కుడుచుచు నుండగ;
  "కుందేటికి మూడు కాళ్ళు - కుక్కకు వలెనే" !
  _________________________________
  మందు = మత్తు పదార్థము

  రిప్లయితొలగించండి
 5. అందముగా గంతుచు కను
  విందు గొలుపు జంతువిదిగొ పేరున గనుచో
  పొందికగా అక్షరములు
  కుందేటికి మూడు, కాళ్ళు కుక్కకు వలనే

  రిప్లయితొలగించండి
 6. వాడెప్పుడూ కుందేలును చూచిన వాడు గాదు పాపం !
  ఊళ్ళో తిరిగే కాలు విరిగిన కుక్కే వాడికి తెలుసు !
  కుందేలుకు కాళ్ళెన్ని ?
  అన్న ప్రశ్నకు వాడి , వాడి సమాధానం :

  02)
  _________________________________

  మందమతి యైన శిష్యుడు
  వందన మిడి జెప్పె నిట్లు - పదుగురు నవ్వన్
  "సందేహమేల మీకిక
  కుందేటికి మూడు కాళ్ళు - కుక్కకు వలెనే" !
  _________________________________

  రిప్లయితొలగించండి
 7. చందూ బొమ్మలు వేసెను
  కుందేలును కుక్క యొకటి కునుకున మరచెన్
  పొందికగా లేచి కనగ
  కుందేటికి మూడు, కాళ్ళు కుక్కకు వలనే.

  రిప్లయితొలగించండి
 8. అయ్యా ! యీ రాజకీయ అవినీతికి అంతు లేదు; సరిగదా
  కుల మత జాతి వర్ణ లింగ భేదాలు కూడా లేవు !
  ఉండవు గాక యుండవు !
  కుందేలైనా, కుక్కైనా ఒఖ్ఖటే !

  03)
  _________________________________

  అందరి దొకటే చందము
  విందుగ నందుట,ప్రభుత్వ - విత్తము నంతన్
  పందుల కన్నా హీనము
  కుందేటికి మూడు కాళ్ళు - కుక్కకు వలెనే !
  _________________________________

  రిప్లయితొలగించండి
 9. అయ్యా ! మందర మాటల మైకంలో
  కైక కూడా మందరగా మారిందని భావిస్తూ :

  04)
  _________________________________

  సుందర రూపుని రాముని
  కుందక , నడవులకు బంపె - కుతకుత బడుచున్
  మందర మాటల మైకము !
  కుందేటికి మూడు కాళ్ళు - కుక్కకు వలెనే !
  _________________________________

  రిప్లయితొలగించండి
 10. శ్రీగురుభ్యోనమ:

  కొందరు మూర్ఖులు జేరిరి
  అందరితో వాదులాడి యరచుచు తామున్
  పొందిక కుదరక పలికిరి
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే

  గురువుగారికి నమస్సులు. ఆంధ్రామృతంలో నాపద్యమునకు సవరణ సూచించినందులకు కృతజ్ఞతలు.
  నారాయణునిలో పరమేశ్వరుని చూపించిన విధానము నాకు బాగ నచ్చినది.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. ముందుగనిచ్చితికుక్కకు
  నందముగా మూడు కాళ్ళకాభరణంబుల్,
  పొందుగ గైకొనుమిక నీ
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

  రిప్లయితొలగించండి
 12. కందము నమరిన పేరుల
  నందము దేనికి గలదిట? యవ్వా నీకె
  న్నందువు కాళ్ళు? మొఱుగకుము.
  కుందేటికి, మూడు కాళ్ళు, కుక్కకు వలెనే .

  ఈ పూరణ నచ్చలేదు. ఏమీ తోచలేదు. మరొక పూరణ చేయుటకు ప్రయత్నించాలి.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారికి నమస్కరిస్తూ
  మూడు కాళ్ళ జంతువులు ఇంటనున్న మంచిదని తలచి మూర్కునికథ
  -------
  కందులవారికి గలిగెను
  సందేహము,మూడు కాళ్ళ శునకము తోడన్
  కుందేటికి కాలు విరవగ
  కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|
  ౨) నా కవితలు మూడుకాళ్ళ జంతువులవలెనున్నవి.
  కందుల వారికి దెలియక
  కందపు నియమములు, పొందిక విరుపు లేకన్ |
  సుందర కందము గాంచేన్
  కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|

  రిప్లయితొలగించండి
 14. అందిన బొమ్మల విరుచుచు
  సందడి సలుపు కసుగందు చరణాంబుజముల్
  పొందిన మాఇంటను బొమ
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే

  రిప్లయితొలగించండి
 15. రవి గారు,
  భలే చెప్పారుగా పాప గురించి.
  పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 16. ముందున్న కల్పమందున
  కందువలేనట్టి కోతి కంజుడుకాగా
  చిందులు వేయుచు నొసగును
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకువలెనే

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 17. "రక్తమాంస పురీష మూత్రముల పాత్ర
  మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు
  అబ్జులగువారు మోహాందులగుచు తలతురు
  అంతియే కాక సౌందర్యమనగ గలదే?"
  ఈపద్యం చింతామణి స్టేజిడ్రామాలోది.లతాలక్ష్మి గారు అద్భుతంగా పాడారు.రచయిత ఎవరో చెప్పగలరా?

  రిప్లయితొలగించండి
 18. అందరికీ నమస్కారం !
  నా పూరణ

  నాదే శాసన మిక నే
  నే దైవాంశ భవుడనని నిగ్గుచు తుగ్లక్
  వాదించెను నిండుసభన
  'కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే'

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 29, 2011 2:37:00 PM

  మందాకినిగారూ మన్నించాలి. మీ 2 వ పూరణలో 1 వ పాదం 3వ జగణము
  ఐనది. మరియు మొసళ్ళ పండుగ కాదు, అది ముసలముల పండుగ అని నేననుకొంటాను. ముసలము అంటే రోకలి. యాదవులు ఒకరినొకరు రోకళ్ళతో కొట్టుకొని యాదవ వంశం నసించినది. అందువలన ముసళ్ళ పండుగ అంటే కలహాలు అనుకొంటాను.

  రిప్లయితొలగించండి
 20. ఒహో , పెద్దలారా ,కవిమిత్రులారా ! నా పూరణ తప్పు మన్నించాలి . నా పద్యంలో మొదటి పదాలన్నీ నియమం ప్రకారం లేవు. ఇంకో పూరణ ప్రయత్నిస్తాను . :-)

  రిప్లయితొలగించండి
 21. డెందంబుననిక దోచిన
  చందమ్ముగ తా పలికెడి శఠుడా తుగ్లక్
  సందేహింపక పలికెను
  'కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే'

  రిప్లయితొలగించండి
 22. గురువర్యులారా , కవివర్యులారా , ఆర్యులారా !
  నాదొక చిన్న సందేహము, తీర్చ మనవి,
  కుందేలుకి - కుందేటికి , అలాగే ఏరుకి - ఏటికి , ఇలాగే ఇంకా ఎమన్నా పదాలు ఉంటే గనక , అక్కడ 'ట ' రావడంలో వ్యాకరణ విశేషం కొంత విశదీకరించ ప్రార్ధన !

  రిప్లయితొలగించండి
 23. **********************************************************************
  పండిత నేమాని వారూ,
  అందరికీ ఉపయుక్తమయ్యే విషయాలను చెప్పారు. ధన్యవాదాలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  చింతా రామకృష్ణారావు గారూ,
  ఏం చేయను? శంకరుణ్ణి కదా! మూడు కళ్ళతో చూస్తే నా కలాగే కనిపించింది. :-)
  చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 24. సరదాగా ఓ ప్రయత్నం:

  కాలు విరుగంగ కొడితివి జాలి లేక
  మూగ జీవిఁ, కుందేటికి? మూడు! కాళ్ళు
  కుక్కకు వలెనే నీకాళ్ళు కూడ విరుగు!
  కర్మ సిద్ధాంత మిది! దీని మర్మ మెరుగు.

  కుందు=బాధ; ఏటికి=ఎందుకు; మూడు=నీకు మూడుతుంది.

  రిప్లయితొలగించండి
 25. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, అక్టోబర్ 29, 2011 6:20:00 PM

  హుందా గద! తాతయ్యకు
  కుందేటికి?మూడు కాళ్ళు- కుక్క కు వలె నే
  డందరు నేతలు కాట్లకు
  ముందుండుట జూడ జూడ ముచ్చట వేయున్!

  రిప్లయితొలగించండి
 26. అయ్యా! కళ్యాణ్ గారూ!
  ఇ, టి, తి లు ఔపవిభక్తికములు - అంటే విభక్తుల వంటివే. వీటి గురించి పాఠము మన శంకరయ్య గారు పూర్తిగా చెప్పుతారు. ఇవి ఇలాగ వాడుకలో ఉంటాయి:

  లోన + ఇ = లోని
  ఇల్లు + టి = ఇంటి
  నూయి + తి = నూతి
  అలాగే మిగతా పదములలో వాడుతూ ఉంటాము.
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 27. వరప్రసాద్ గారి పూరణ .....

  వందన యడవిన గాంచెను
  కుందేటికి మూడుకాళ్ళు కుక్కకు వలెనే
  మందులు వేయగ ముందే
  పొందె విఱిగినట్టి కాలు పూర్తి నిడివితో.

  రిప్లయితొలగించండి
 28. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, అక్టోబర్ 29, 2011 6:51:00 PM

  రవి గారి పూరణమ్మున
  'కవి రవి 'భాసించె మధుర కధనము తోడన్
  స్తవ నీయ మైన యూహకు
  కవితా పరిమళము లద్ది కమనీయముగా

  రిప్లయితొలగించండి
 29. శ్రీపతి శాస్త్రి గారు,
  తప్పులు ఎత్తిచూపినపుడు మన్నించండి అనే పదం వాడవలదని ప్రార్థన.
  మీకు అనేక ధన్యవాదములు. మీరు చెప్పిన విషయం నాకు తెలియదు. గుర్తుంచుకుంటాను.

  రిప్లయితొలగించండి
 30. మందమతిని నే నెట్టుల
  కందము నిపుడు బలికెదను కష్టము తెలిసెన్
  తొందర వెట్టెను నేడీ
  "కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే ."

  రిప్లయితొలగించండి
 31. రవి పూరణం లోని భావం అద్భుతం. నాకూ అలానే అనిపించింది.
  అంటే రవి గాంచనిచో కవి గాంచును లేదా కవి గాంచనిచో రవి గాంచును అని.
  దాన్ని రాజారావు గారు చాలా చక్కగా పద్యంలో పొదిగారు.

  రిప్లయితొలగించండి
 32. శ్రీ పతిగారు మందాకిని గార్కి చెప్పిన విశేషం నాకూ తెలియదు.
  నేను ముసురుల పండుగ కానీ ముదుసలుల పండుగ కానీ అని అనుకుంటూ ఉంటుంటాను. క్రొత్త విషయం తెలిసింది.

  రిప్లయితొలగించండి
 33. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, అక్టోబర్ 29, 2011 7:16:00 PM

  అయ్యా శంకరయ్య గారూ! నమస్సులు .మూడు కళ్ళంటిరి ,కాదు కాదు -

  సందేహ మేల ?శంకర !
  అందముగా నాల్గు కళ్ళు -హరునికి మూడే !
  ఎందున దప్పించు కొనము
  సుందర వదనార వింద ! సూక్ష్మము దెలిసెన్

  రిప్లయితొలగించండి
 34. దుర్యోధనుడు శ్రీకృష్ణునితో అన్న మాటలు:
  (జానామి ధర్మ౦ న చ మే ప్రవృత్తి:
  జానామ్యధర్మ౦ న చ మే నివృత్తి: ...)
  నా పూరణ:
  అందు నధర్మము తెలియును
  కుందగుబో, పుట్టుగుణము కొరతల నోర్తున్
  మందుడ కృష్ణా! చూడగ
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.

  రిప్లయితొలగించండి
 35. ఇంకొక పూరణ:
  అందొక సమస్యఁ గంటిని
  కుందేటికిఁ గొమ్ములాఱు కుక్కకువలె నే
  నందముగ, నేడిది యెటుల
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే??

  రిప్లయితొలగించండి
 36. శంకరార్యా ! ధన్యవాదములు.
  రహమతుల్లా గారూ ! తెలుగునాట ఒకప్పుడు ఉరూరా ప్రదర్శింపబడి ప్రజల నోళ్ళలో నానిన గొప్ప నాటకమయిన చింతామణి రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు గారు.

  రిప్లయితొలగించండి
 37. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 29, 2011 9:31:00 PM

  మందాకినిగారూ మీ సలహా పాటిస్తాను. కానీ మన్నించుట అంటే కేవలం క్షమించుట మాత్రమే కాదని ఆలకించుట,చిత్తగించుట,గౌరవించుట అనే అర్థాలు వున్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను.

  గురువుగారూ "ముందు వున్నది ముసళ్ళ పండుగ" అనే సామెతను సాధారణముగా ముందు ముందు కష్టాలు {సమస్యలు} తెలుస్తాయి అనేందుకు సూచనగా చెప్తారు. యాదవులు నవ్వులాటకు మునిని అవమానించి ముందుముందు ముసళ్ళ పండుగ చూసినారని నా భావన.

  రిప్లయితొలగించండి
 38. మందాకిని గారికి, రాజారావు గారికి, శంకరయ్యగారికి నమస్కారాలు. మిస్సన్న గారి సరదా పూరణ బావుంది. కవులందరి పూరణలూ వేటికవే సాటి.

  నేమాని వారు మొట్టమొదట చేసిన సూచనల వంటివి అన్నీ కలగలిపి ఒకచోట ప్రచురిస్తే అద్భుతంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 39. **********************************************************************
  ముందుంది ముసళ్ళ పండుగ
  ఇది ఒక తెలుగు సామెతకు రూపాంతరం చెంది మరొక సామెతగా పరిణమించింది. అసలు రూపంలో ఇది ఎంత మాత్రము మొసళ్ళ పండగ కాదు. (not crocodile..). ముసలముల పండుగ. ముసలం అంటే రోకలి అని అర్థం. రోకళ్ళ పండగ ముందు ఉంది అని అర్థం. (వీకీపీడియా నుండి)
  -----------------------------------------------------------------------------------
  ముసళ్ళ పండగ... (Crocodile_Festival)
  చిరంజీవి ఓ సినిమాలో ‘ఇన్‌ ఫ్రంట్‌ దేర్‌ ఈజ్‌ ఏ క్రొకడైల్‌ ఫెస్టివల్‌ ’ అనే పదాన్ని వాడతాడు. దానర్థం ‘ముందుంది మొసళ్ళ పండగ’ అనే సామెతకు అది ఇంగ్లీష్‌ అర్థం మరి! ఏదో మాటవరసకు అనుకున్నా పాకిస్తాన్‌లో మాత్రం నిజంగానే మొసళ్ళ పండగ జరుపుకుంటారు. కరాచీలో జరిగే ఈ ఉత్సవం ఎంతో భిన్నంగా ఉంటుంది. షీదిస్‌ అనే తెగకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. షీదిస్‌ తెగ ఆఫ్రికా నుండి వలస వచ్చినవారు. మంగొఫిర్‌లోని ఓ ష్రైన్‌లో జరుపుకుంటారు. ఈ పండు గకు దాదాపు 8 శతాబ్దాల చరిత్ర ఉందట! (‘సూర్య’ దినపత్రిక)
  ---------------------------------------------------------------------------------
  (నా వ్యాఖ్య ... ఎక్కడో కరాచీలో జరిగే ఉత్సవం తెలుగు సామెతకు ఆధారం అవుతుందా? ఏమిటో ..?!)
  ----------------------------------------------------------------------------------
  ముసుళ్ళ పండుగ
  నేను విన్నదాని ప్రకారం ఇది ‘ముసుళ్ళ పండుగ’. ముసురుల పండగ -> ముసుర్ల పండుగ -> ముసుళ్ళ పండుగ. ముసురు పట్టినప్పుడు అంతా చీకాకు, ఏ పనీ కాదు. ఇంట్లోంచి బయటకు వచ్చి ఏ పనీ చేసుకోలేము. అంతా చిత్తడి. పనులకు, ప్రయాణాలకు, సమస్త జీవజాలానికి ఇబ్బందికరమే. ముసురులు పట్టిన కాలం నిజంగానే కష్టకాలం. "ఇప్పుడేదో కాలం అనుకూలంగా ఉందని మురిసిపోతున్నావు కాని ముందున్నది ముసుళ్ళ పండుగ!" అని దీని వెనుక అంతరార్థం.
  -------------------------------------------------------------------------------
  పై మూడింటిలో ఏది సరియైనదో పండితులే నిర్ణయించాలి.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 40. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  మీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  అత్యద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ పొందికగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  మీ మొదటి పూరణ మీకు తృప్తినివ్వకున్నా ఫరవాలేదు. బాగానే ఉంది. కాకుంటే ‘కందము నమరిన పేరుల నందము దేనికి గలదిట?’ ప్రశ్నే అర్థం కాలేదు.
  ఇక రెండవ పూరణ సమస్యతో తంటాలు పడినట్లు చెప్తూ చక్కని పూరణ నిచ్చారు. ఇదీ తప్పించుకొని వెక్కిరించే పద్ధతే. కొందరు పండితులు ఏమంటారో కాని నాకైతే ఓ.కే. అభినందనలు.
  **********************************************************************
  వరప్రసాద్ గారూ,
  మీరు నేరుగా పంపిన రెండు, నా సెల్ ఫోన్ కు మెసేజ్ గా పంపిన మూడవ పూరణ చూసాను.
  మొదటి పూరణలో మూడవ పాదంలో గణదోషం ‘కుందేటి కాలు విరువగ’ అంటే సరి!
  రెండవ పూరణలోని చమత్కారాన్ని గ్రహించాను. బాగుంది.
  మూడవ పూరణలో కొంత గజిబిజితనం కనిపిస్తున్నా బాగుంది. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 41. **********************************************************************
  రవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  ప్రశంసనీయమైన పూరణ మీది. అభినందనలు.
  **********************************************************************
  కళ్యాణ్ గారూ,
  తుగ్లకు పలుకులుగా మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.
  మీరు ఔపవిభక్తికముల గురించి అడగడం నేమాని వారు ఆ పాఠం చెప్పవలసిందిగా నన్ను ఆదేశించడం ... ఇక తప్పుతుందా? చెప్తాను. ఇలా చెప్తానని ‘పెండిగ్’లో పడుతున్న పాఠాల సంఖ్య పెరిగిపోతున్నది. సమయానికి మాట నిలబెట్టుకోలేక పోతున్నాను. వీలైనంత తొందరలో చెప్తాను.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  సరదాగా అంటూ చక్కని పూరణను అదీ ‘తేటగీతి’ లో చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
  **********************************************************************
  లక్కాకుల రాజారావు గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  కాకుంటే ‘ఏటికి?’ అనే గ్రామ్యప్రయోగం!
  రవి గారిని ప్రశసించిన మీ పద్యం సరసంగా ఉంది.
  నాకు కళ్ళద్దాలున్నాయని చక్కగా చమత్కరించిన పద్యానికి ధన్యవాదాలు.
  **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  ‘కుందేటికి కొమ్ము లాఱు కుక్కకు వలెనే’ సమస్య చాలా ప్రసిద్ధం. అందరం గతంలో విన్నదే!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 42. శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 43. డి.నిరంజన్ కుమార్ఆదివారం, అక్టోబర్ 30, 2011 12:11:00 PM

  వందకు తొంబైతొమ్మిది
  అందానికి కోతియగును ఆలాగుననే
  మందెక్కువయిన బుట్టును
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే

  రిప్లయితొలగించండి
 44. గురువు గారు, ధన్యవాదములు.
  "కందము నమరిన పేరుల నందము దేనికి గలదిట?" = ఇక్కడ సమస్యగా నిచ్చిన కందములో అమరిన పేరుల (ప్రాణుల అనాల్సింది.) లో అందము దేనికి కలదు=కుందేటికి అని నా భావన.
  ఇక చివరిపూరణ తప్పించుకొనే పద్ధతి నాకే ఇష్టం లేదు. కానీ నా తిప్పలు చెప్పుకుందామని చెప్పాను.

  రిప్లయితొలగించండి
 45. గౌతమపత్నితో గలిసిన ఇంద్రాధముని పూజసేయరే పుణ్యులారా
  కన్నకూతురని జంకక చెయ్యజార్చిన బ్రహ్మ దేవుడు గాడె ప్రాజ్నులారా
  సప్త ఋషి సతులతో సంగమించిన మహేశ్వరుని అర్ధింపరే అనఘులారా
  జార సామ్రాట్టు మురారికి గుడికట్టి భజనలు చేయ్యరే భక్తులారా

  నీతియట ధర్మమట నాకు నేర్పెదరట
  కాటికిన్ కాళ్ళు జాచిన ఘనుడనయ్యు
  సోమరిన్ కట్టుకొని గొడ్దు పోయినాడ
  తప్పునాయదిగాని తరుణిదౌనె?తప్పునాయదిగానీ ఇతరునిదౌనె?
  చెప్పనేటికి పొండయా పెద్దలారా----తారాశశాంకం నాటకంలో పి.సూరిబాబు బృహస్పతి గా పాడిన పద్యమిది.రచయిత ఎవరో చెప్పగలరా?

  రిప్లయితొలగించండి
 46. రహమతుల్లా గారూ,
  తారాశశాంకం నాటకం రచించింది ‘కొప్పరపు సుబ్బారావు’.

  రిప్లయితొలగించండి
 47. బందరు బజారు నందొక
  కుందేలును కుక్కను గొని కుందుచు నుండన్
  సందడిలోకాళ్ళు విరిగె
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే

  రిప్లయితొలగించండి
 48. పందెము కాసితి గెలిచితి:
  జందెము జూపిన హనుమకు జానెడు తోకే!
  సుందరి ప్రియంక! నమ్ముము:
  కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే

  రిప్లయితొలగించండి