24, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 503 (సొమ్ము లున్నవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సొమ్ము లున్నవాఁడె సుగుణధనుఁడు.
ఈ సమస్యను సూచించిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. (1) అమ్మ దాస్య బంధ మంతమొందించెను
    చక్రి వాహమయ్యె, శక్రు గెలిచె,
    ఫణుల పాలి యముడు, పక్షీంద్రుడా రీతి
    సొమ్ములున్న వాడె సుగుణ ధనుడు

    (2) సొమ్ము తోడనే జగమ్ములో నిల్కడ
    సొమ్ము తోడనే జయమ్ములెల్ల
    సొమ్ము లధిగమించు సుమ్ము సమస్తమున్
    సొమ్ములున్న వాడె సుగుణ ధనుడు

    రిప్లయితొలగించండి
  2. దానమిడుట సొమ్ము తన కరమునకును
    నామజపము సొమ్ము నాలుకకును
    పుణ్యరాశి పెరుగ పూరింట నిటువంటి
    సొమ్ము లున్నవాఁడె సుగుణధనుఁడు.

    రిప్లయితొలగించండి
  3. సొమ్ము లున్న వాఁడె శోభించు లోకాన.
    సొమ్ము లున్న వాఁడె సుజనుడిలను.
    సొమ్ము లున్న వాఁడె సొగసుగాఁడనఁబడు.
    సొమ్ము లున్న వాఁడె సుగుణధనుఁడు.

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, అక్టోబర్ 24, 2011 1:35:00 PM

    విద్యలు గలవంచు విఱ్ఱ వీగెద వేల ?
    బుధ్ధి గల్గు వాడె బుధ వరుండు
    పండితుండ !మంచి పనుల దలంపుల
    సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు

    రిప్లయితొలగించండి
  5. విజ్ఞులెల్లమెచ్చు విద్యా వివేకమ్ము
    లోకహితముగోరు పోకడలును
    సత్యపాలనమ్ము సద్వర్తనమువంటి
    సొమ్ములున్నవాడె సుగుణధనుడు

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  6. సొమ్ము వినయమగును సొమ్ము వివేకమ్ము
    సొమ్ము భూత దయయు సొమ్ము భక్తి
    సొమ్ము దానగుణము సొమ్ము శాంతమె యిట్టి
    సొమ్ములున్నవాడె సుగుణధనుడు

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతిశాస్త్రిసోమవారం, అక్టోబర్ 24, 2011 2:50:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    విద్య,యశము,వాక్కు,వినయంబు,ధర్మముల్
    భూషణమ్ములనుచు పోల్చినంత
    కుటిల బుద్ధి లేక కోరి దాల్చిన యిట్టి
    సొమ్ములున్న వాడె సుగుణ ధనుడు

    రిప్లయితొలగించండి
  8. శ్రీశ్రీ గురువుగారికి, శ్రీ కామేశ్వర శర్మ గారికి, శ్రీ పండిత నేమాని గారికి నమస్కరిస్తూ, మీరిచ్చిన మనోబలముతో మరింత మంచి పద్యములను వ్రాసి మీ మన్నలను పొందెదను. సవరణలకుధన్యవాదములు తెలుపుతూ.
    మీ శిష్యుడు
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారి ప్రయోగించిన 'చక్రి వాహమయ్యె' సాధువేనా యన్నది పెద్దలు నిర్ణయించాలి. కాని మొత్తం పద్యం చదివాక పక్షీంద్రుడు సొమ్మలున్న వాడెల్లాగా అన్న ప్రశ్న వచ్చింది. వారి రెండవ పూరణం మరింత బాగుంది నాకు.

    మందాకిని గారి పద్యం బాగుంది. 'తన కరమునకును' లాక్షణికమే గాని నడక కొంచెం యిబ్బంది పెట్టింది. తన కరంబులకును' అంటే మరింత సొగసుగా ఉంటుందేమో అనిపించింది.

    చింతా రామకృష్ణారావు గారి పద్యం సాఫీగా సాగింది, బాగుంది. అన్ని పాదాలకు ముందే సొమ్ములు పెట్టారు.

    లక్కాకుల వేంకట రాజారావు గారి పద్యంలో, 'విద్యలు గలవంచు' కన్నా 'విద్య గల దటంచు' అంటే యెలా గుంటుందనిపించింది. అదలా ఉంచి, సమస్యను యెలా అన్వయం చేసారన్నది కొంత ప్రశ్నగానే మిగిలింది నాకు. ఎందుకంటే మంచి పనులో, మంచి తలపులో సొమ్ములని సిధ్ధాంతం చేయాలనుకున్నారు కాని, చేయలేదు గద.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణం రాజారావు గారు చేయదలచుకొన్న సిధ్ధాంతాన్ని సిష్కర్ష చేసింది. మంచి పద్యం. బాగుంది.
    గోలి హనుమచ్ఛాస్త్రి , శ్రీపతిశాస్త్రి గార్లు మంచి మంచి సొమ్ములేవో బాగా లిష్టు వేసి సెలవిచ్చి మంచి పూరణములు చేసారు. బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  10. మంద పీతాంబర్ గారి పూరణ .....

    సత్య భాషణమ్ము సద్గురు సేవన
    దైవచింతనమ్ము ధర్మనిరతి
    శుభకరమగు నిట్టి శోభాన్వితమ్మైన
    సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు!!!

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, అక్టోబర్ 24, 2011 6:10:00 PM

    భక్త జనుల గాచి పరమపదములిచ్చి,
    బాధలను హరించి, బోధ జేయు
    పరమ పావనుడగు పరమాత్ముపై భక్తి
    సొమ్ములున్నవాడె సుగుణధనుడు.

    ( భక్తి అనెడి సొమ్ములు )

    రిప్లయితొలగించండి
  12. **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    అలవోకగా పద్యం చెప్పగలిగే మీకు నమస్సులు. మనోహరమైన పూరణ చెప్పారు. ధన్యవాదాలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సుగుణధనములో ఏయే సొమ్ములు చేరుతాయో చక్కగా వివరిస్తూ మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  13. **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ఎంతో ఓపికతో అందరి పూరణలను పరిశీలించి గుణదోష విచారణ చేస్తున్న మీకు ధన్యవాదాలు.
    పండిత నేమాని వారి మొదటి పూరణలో గరుత్మంతునికి ‘మాతృభక్తి, భృత్యధర్మం, పరాక్రమం, శత్రుంజయత్వం’ సొమ్ములనుకొనవచ్చు కదా!
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘శోభాన్వితము లైన / సొమ్ములు ...’ అంటే అన్వయోచితంగా ఉంటుంది కదా!
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్యామలీయం గారి వ్యాఖ్యలను చూచితిని.
    చక్రి వాహ మయ్యె అనుటలో చక్రికి వాహనమయ్యెను అని స్ఫురించు చున్నది అని నా భావము. కానిచో మార్పు చేయాలంటే మరో ప్రయత్నము చేద్దాము - హరికి వాహమయ్యె హరిని గెలిచె అంటే సరిపోతుంది. సొమ్ము అంటే యశో ధనము అని చెప్పవచ్చు; అలాగే సొమ్ము అంటే ఆభరణము అని కూడా ప్రసిద్ధముకదా. భావ సమన్వయము చేసిన శ్రీ శంకరయ్య గారికి వ్యాఖ్య చేసిన శ్రీ శ్యామలీయము గారికి ప్రత్యేక అభినందనలు.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  15. ‘శ్యామలీయం’ గారూ
    పండిత నేమాని వారూ,
    ‘చక్రి వాహము’ అన్నప్పుడు షష్ఠీతత్పురుషగా స్వీకరింపరాదా? తప్పని సరి సంభావనాపూర్వపదమే అనుకోవాలా?
    ‘అర్థవత్ సమాసః’ అన్నారు కదా?

    రిప్లయితొలగించండి
  16. మ్లేచ్చు డనెడి వాడు మేధావి గాకున్న
    పదవు లున్న చాలు పట్టు బడక
    రాజ కీయ మందు రాయసము దెలిసిన
    సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు !

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! ధన్యవాదములు.
    ' శ్యామలీయం' గారూ ! చక్కని వ్యాఖ్యలకు ప్రత్యేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రుల పూరణలకు అభినందనలు.

    సొమ్ములఁ గొన వచ్చు నిమ్ముగఁ జదువులు
    సొమ్ము గూర్చు పదవి సొంపు మీఱ
    సొమ్ము రాజకీయ సోపానమై యొప్పు
    సొమ్ము లున్నవాఁడె సుగుణ ధనుఁడు !

    రిప్లయితొలగించండి
  19. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, అక్టోబర్ 24, 2011 8:17:00 PM

    శ్యామలీయం గార్కి నమస్సులు

    ఎందు వల్ల గుణమొ ? యెందున దోషమో ?
    ఆచి తూచి చెప్పు నవసరమున
    'శ్యామ లీయ 'మిచట చక్కని వ్యాఖ్యాత
    భేద మెరుగ నట్టి పెద్ద మనిషి

    రిప్లయితొలగించండి
  20. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, అక్టోబర్ 24, 2011 8:34:00 PM

    సొమ్ము లున్న వాడు 'షోకిల్ల 'యగు గాక !
    రాజ్య మేలు గాక !రాత్రి బవలు
    సొమ్ము లున్న వాడు సోకోర్చు కోలేడు
    సొమ్ము లున్న వాడె? సుగుణ ధనుడు?

    రిప్లయితొలగించండి
  21. ఈ సమస్యను చూస్తే చాలాకాలం క్రిందట యేదో పుస్తకంలో చదివిన యీ శ్లోకం గుర్తుకు వచ్చింది
    టకా ధర్మః టకా కర్మః టకాహి పరమం పదం
    టకా యస్య గృహే నాస్తి హటకా టకటకాయతే

    అందుచేత రేలంగివారు మిస్సమ్మ సినిమాలో అన్నట్లు 'అంతా తైలం లోనేఉంది'

    సరే, నా తోచిన పూరణ యిదిగో -

    నరకువాడు లోక నాయకుడై జెల్ల
    సదయు లోక మెంచు చవట యనుచు
    గుణము నెఱుగ లేని గ్రుడ్డిలోకమునకు
    సొమ్ములున్న వాడె సుగుణ ధనుడు

    రిప్లయితొలగించండి
  22. **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    చక్కని పూరణ పంపారు. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వాస్తవాన్ని చక్కగా ప్రతిబింనించారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ‘శ్యామలీయం’ గారిపై చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    ఇక మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  23. శ్యామలీయము గారి వ్యాఖ్యలు బ్లాగుకి శోభలు గూర్చుతున్నాయి.వారి పూరణ మనోహరముగా ఉంది.
    మొదటి పాదములో ' జెల్ల ' అక్కడ సరళాదేశము రాదు గదా ! గసడదవాదేశముతో సవరణ,

    నరకువాడు లోక నాయకుడై సెల్ల
    సదయు లోక మెంచు చవట యనుచు
    గుణము నెఱుగ లేని గ్రుడ్డిలోకమునందు
    సొమ్ములున్న వాడె సుగుణ ధనుడు !

    రిప్లయితొలగించండి
  24. మాయా శశిరేఖ తల్లితో:

    పెళ్ళి చేసుకొనెద ప్రేమతోనభిమన్యు
    బావనాపలేడు బ్రహ్మ కూడ,
    జనని,తెలియు మింక, సాటిరారెవరెన్ని
    సొమ్ములున్న, వాడె సుగుణ ధనుడు!

    రిప్లయితొలగించండి
  25. ఉన్నసొమ్ము లూడ్చె నొసగ నింద్రపదవి (బలికి)
    లేనిసొమ్ములిచ్చె తా నడగక (కుచేలునికి)
    వాని లీల లందు వాని మెప్పించెడి (వాడు=పరమాత్మ)
    “సొమ్ము” లున్నవాఁడె సుగుణధనుఁడు.

    రిప్లయితొలగించండి
  26. **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    మీరు ప్రస్తావించిన శ్లోకానికి నా అనువాదం ........

    టంకము ధర్మము, కర్మము
    టంకమ్మే, పరమపదము టంకమె కాదా?
    టంకరహితమగు నింటను
    లుంట యయిన మట్టికుండ లొటలొటలాడున్.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    కాని మాయా శశిరేఖ లక్ష్మణకుమారుణ్ణి పెళ్ళాడతానన్నది కదా! అభిమన్యుణ్ణే పెళ్ళాడతానన్నది అసలు శశిరేఖ కదా!
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  27. నేను ప్రస్తావించిన శ్లోకానికి శంకరయ్యగారి అనువాదం బాగుంది. నా అనువాదం కూడా చిత్తగించండి.
    టంకమె ధర్మము కర్మము
    టంకమె సూ పరమపదము టంకమునకు నా
    టంకము గల గేహంబున
    గొంకక టకటకల వంటగిన్నెలు మ్రోయున్

    రిప్లయితొలగించండి
  28. ‘శ్యామలీయం’ గారూ,
    ధన్యవాదాలు.
    మీ అనువాదం బాగుంది. ‘టంకమునకు నాటంకము గల గేహంబున’ అనడం బాగుంది. అయితే చివరి పాదంలో యతిదోషం. ‘వంటకుండలు / వంటగుండిక మ్రోయన్’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి