12, అక్టోబర్ 2011, బుధవారం

సన్మాన పంచ రత్నములు

శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి
షష్టి పూర్తి సందర్భముగా
సమర్పించిన
సన్మాన పంచ రత్నములు.

శ్రీ భారతీశ శీతాద్రిజేశ సా
మ్ముఖ్య మంది కట్టమూరి చంద్ర
శేఖరావధాని! చిరకాల మారోగ్య
శుభ సుఖములతోడ శోభఁ గనుము.


అష్టావధాన విద్యను
కష్ట మ్మిసుమంత లేక కడు సులభముగా
నిష్టాగోష్ఠిగఁ జేయు వి
శిష్టంబగు ప్రతిభ నీది; చేసెద నుతులన్.


అస్త్రముల దూసిరట ఘన
శాస్త్రజ్ఞులు పృచ్ఛకుల్ ప్రచండముగా నీ
శస్త్రముల వంటి పూరణ
లే స్త్రైణమ్మై సొగసులనే కురిపించెన్.


విరులు సమస్యాపూరణ
లరయ లతలు దత్తపదులు ననఁగ నిషిద్ధా
క్షరు లాకులు వర్ణనములు
మురిపించునులే యుపవనముగ నీ రచనల్.


సృష్ట్యారంభక కరుణా
దృష్ట్యంచల లబ్ధ విభవ దీవ్యద్యశ సం
తుష్ట్యాద్యఖిల శుభంబుల
షష్ట్యబ్ది మహోత్సవమున సఫలతఁ గనుమా!


రచన
కంది శంకరయ్య
(‘ఆంధ్రామృతం’ బ్లాగు శ్రీ చింతా రామాకృష్ణారావు గారి సౌజన్యంతో)

7 కామెంట్‌లు:

  1. కవివర్యునికి చక్కని ప్రసంసావళి !

    రిప్లయితొలగించండి
  2. సరస్వతీ పుత్రులు ఎన్ని రత్నాలతో నైనా కావ్య కన్యలను అలంకరించి అలరించ గల ధన్యులు

    రిప్లయితొలగించండి
  3. పద్యాలు బాగున్నవి.!!!

    http://rpsarma.blogspot.com/
    కొత్త బ్లాగు.
    తెలుగు సాహిత్య అభిమానుల కోసం.. సందర్శించండి. రసానందం పొందండి!!

    రిప్లయితొలగించండి
  4. ఒక సరస్వతీ పుత్రుడు మరొక శారదా స్వరూపునికి ప్రశంసలు. అద్భుతం.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారు,
    దుష్కరప్రాసతో ఎంత మంచి కంద(కుంద)ముల మాల అల్లినారు. చాలా బాగుంది.
    మీరు రాసిన పాటలు కూడా మంచి పదాలతో అలంకారయుతంగా ఉన్నాయి.
    మీనుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది.

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    మిస్సన్న గారికి,
    మందాకిని గారికి .....
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి