21, అక్టోబర్ 2011, శుక్రవారం

నా పాటలు - (తాండూరు భద్రేశ్వర సుప్రభాతం)

తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వర సుప్రభాతం

శ్రీమన్మహాదేవ! శ్రీభావిగీశ!
తాండూరు పురవాస! మహిత విఖ్యాత!
పరిపూత గురులింగరూప! కరుణాత్మ!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిత్యత్రికాల లింగార్చన పవిత్ర!
పరమ పావనగాత్ర! దుష్టగుణ జైత్ర!
సత్పుణ్య చారిత్ర! లోకనుత పాత్ర!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

వీరశైవోద్ధరణ కర్మానురక్త!
బసవధర్మ ప్రచారక! శూలిభక్త!
పావనశ్లోక పంచాగమ సుకర్త!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

ఈషణత్రయ నాశకా! గుణాతీత!
వైరిషడ్వర్గ విధ్వంసక! మహాత్మ!
సప్తవ్యసన భంగ! కరుణాంతరంగ!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

శ్రీ భావిగీ మహాక్షేత్రమ్ములోన
మఠమందు స్వామి రూపమ్ముతో వెలసి
భక్తజనులకు కొంగు బంగారమైన
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

తాండూరు వాస్తవ్యుడౌ శ్రీ బసన్న
భావిగి రథోత్సవము దర్శించి రాగా
బండి వెంటనె వచ్చి వెలసినావంట!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిత్యనూతనమైన నీ రథోత్సవమును
దర్శించి తరియింప భక్తజనకోటి
దిక్కుదిక్కులనుండి వచ్చుచున్నారు
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నీ పేరు స్మరియించి, నీ రూపు భావించి,
నీ గుడిని దర్శించి, నీ పూజ చేసి
నిన్నె నమ్మిన మమ్ము కాపాడ రావ?
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

వర భద్రయోగివై బసవస్వరూపివై
నూతిలో నీటినే నేతిగా మార్చావు;
నీ మహిమ లెంచగా నే నెంత స్వామి?
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

సంసారబంధ మాయాజాలమున జిక్కి
హింసా ప్రవృత్తితో స్వార్థచింతనతోడ
పాపకూపమ్ములో పడు మమ్ము కాపాడు
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

నిను నమ్మి, నిను జేరి, నీ పూజచేయ
భక్తు లెందరొ వచ్చి నిలిచారు దేవా!
లేవయ్య! రావయ్య! లేచి రావయ్యా!
భద్రేశ్వరా! నీకు ఇదె సుప్రభాతం.

రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ప్రవీణ్.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/9e8d1ba4-1691-43d7-9b40-d2800118c4bc/Bhavigi-Bhadeshwara-Suprabhaatam

1 కామెంట్‌:

  1. శంకరార్యా ! తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి పేరు క్రొత్తగా వినుచున్నాను. సుప్రభాతం బాగుంది సుప్రభాతము చదివితే కొంత వరకు స్వామి చరిత్ర అర్థ మైనది.

    రిప్లయితొలగించండి