4, అక్టోబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -482 (పాదపపు మూలముండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పాదపపు మూలముండు పై భాగమందు.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _________________________________

    వృక్ష మూలము మాత్రము - వెదకి జూడ
    నేల యందున పెరుగును - నిజము నిజము !
    వంశ వృక్షపు పటమునే - పరచి గనిన
    పాదపపు మూల ముండు పై - భాగ మందు
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. గగనమందున్న వారలె ఘనము గాను
    సృష్టి చేయగ భూతల జీవ రాశి,
    మూల పురుషులు పైనున్న మొదటి వారు-
    పాదపపు మూలముండు పైభాగమందు.

    రిప్లయితొలగించండి
  3. విత్తిన న్మొలకల రూపు వేగమంది,
    మొక్క, వృక్షంబునౌ; క్రింద పుష్టి మీర
    పాదపపు మూలముండు, పైభాగమందు
    పత్ర రాజిత పుష్ప సత్ఫలములుండు!!

    - "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

    రిప్లయితొలగించండి
  4. వేద వేద్యుడు చెప్పెగా వేద మంత్ర
    మాకులాయెను అశ్వత్థ మందు వెలసి
    కోవిదులు గన, క్రిందుండు కొమ్మలన్ని
    పాదపపు మూలముండు, పైభాగమందు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమ:

    పాఠ్యభాగపు సందర్భ వాక్యములకు
    పద్యపాదము లొసగిరి వ్యాఖ్య జేయ
    వ్రాసి రందరు పుటముకు క్రిందివైపు
    పాదపపు మూలముండు పైభాగమందు.

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, అక్టోబర్ 04, 2011 1:20:00 PM

    పుణ్య చరితులై చెలగుమత్పూర్వ పురుష
    రక్త సంబంధవిధ మనురక్తితోడ
    చూచుటకు గీయు పటమును చూడ, వంశ
    పాదపపుమూలముండు పైభాగమందు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    పూర్తి జేయసమస్యకు పూరణములు
    పద్యపాదము నొసగిరి ప్రశ్నవోలె
    వరుస క్రమమున నుండును వ్యాఖ్యలన్ని
    పాదపపు మూలముండు పైభాగమందు

    రిప్లయితొలగించండి
  8. కందుల వరప్రసాద్ గారి పూరణ ....
    నేటి దొంగలు, నీవు దొంగయన్న వారికి బదులిస్తున్న రీతిని జూడ వారి మునుపటి గుణములు బయటపడును. సుమతీ శతకపు పద్యము "వెనుకటి గుణమేల మాను" తీసుకుంటిని
    గురువుగారు మన్నించాలి "మూల ముండు" ను "మూలములను " గా మార్చితిని
    తప్పులను జూప రోషము దన్నుకొచ్చి,
    పురుషపుంగవ బలుకులే పరుష పదము
    కుందనపురీతి, నేరుగ గాంచు జనులు
    పాదపపు మూలములను పై భాగమందు|

    రిప్లయితొలగించండి
  9. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

    పుడమి పుట్టువై మొలకెత్తబోవు విత్తు
    పదిలముగ తానెయొదిగుండు ఫలమునందు
    జీడి మామిడి పండును జూడ తెలియు
    పాదపపు మూలముండు పై భాగమందు.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

    మానవుని దేహమే మహా క్ష్మాజమనగ
    మూర్ధమే దాని నాడుల మూలమగుచు
    నవయవములెల్ల క్రిందికి నమరు నట్టి
    పాదపపు మూలముండు పై భాగమందు

    రిప్లయితొలగించండి
  11. నేదునూరి రాజేశ్వరి గారి పూరణ ....

    తండ్రి ఘన కీర్తి తెలుపును తనయు డనగ
    గగన మందుండు జలదము కడలి నుండి
    విద్య నేర్చిన వానికి వినయ మబ్బు
    పాదపపు మూలముండు పై భాగ మందు

    రిప్లయితొలగించండి
  12. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    వంశవృక్షపు పటాన్ని తలక్రిందులుగా ‘పరిచారా’? మంచి పూరణ. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    పైనున్న పితృదేవతల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మంచి విరుపుతో ఉత్తమమైన పూరణ నందించారు. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి విషయాన్ని ఎన్నుకున్నారు. కాని అన్వయం కొద్దిగా తికమక పెడుతున్నది.
    మీ రెండవ పూరణ సర్వోత్తమం. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ వంశవృక్షపు పటాన్ని గోడకు పైభాగాన అమర్చారా? మీ పూరణ చూసి నేను వ్రాయలనుకున్న పూరణను విరమించుకున్నాను. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    కందుల వరప్రసాద్ గారూ,
    సమస్య పాదాన్ని మార్చడం సత్సంప్రదాయం కాదు. అయినా మీ పద్యం బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఒదిగి + ఉండు’ అన్నప్పుడు సంధి లేదు.
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    నిర్దోషంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  13. గుండెకాయకు మేల్ పచ్చి కూరలనుచు
    కందమూలములను మూట కట్ట సతియె
    భోజనవేళలోకనుగొన- బువ్వ బదులు-
    పాదపపు మూలముండు పై భాగ మందు.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

    గురువర్యులు మిత్రులు చక్కని పూరణలు చేసారు. మాకు శీర్షాసనము మిగిల్చారు.
    కాని ముళ్ళపూడి వారి హాస్యోక్తి గుర్తు వచ్చింది.

    గోళ మటుపక్క యిప్పుడు కాళ రాత్రి
    నిదుర నుందురు జను లెల్ల కుదురు గాను
    క్రిందు మీదయి వరల ప్రకృతియు నంత
    పాదపపు మూలముండు పైభాగ మందు

    రిప్లయితొలగించండి
  15. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....

    ఊకదంపుడు గారి పూరణ చాలా బాగుంది. మీకు కంద సాయించక పోతే క్రింద ( బచ్చలి ) ఆకులు ఉంటాయండీ , అవి కూడా గుండెకు మంచివే !

    రిప్లయితొలగించండి
  16. **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    చమత్కార భరితంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి