14, అక్టోబర్ 2011, శుక్రవారం

నా పాటలు - (సాయి పాట - 2)

పుణ్యమూర్తి సాయీ!

పుణ్యమూర్తి సాయీ! మా - పూజ లందుకోవయ్యా || పుణ్య ||
అగణిత మహిమాన్వితా! - ఆదుకొనగ రావయ్యా || అగణిత ||
తలచినంత బ్రోచు దయా - జలనిధి కిదె ‘ధ్యానము’
పిలిచినంత పలుకు వేద - విదునకు ‘ఆవాహనం’
భక్తలోక హృదయపీఠ - వాసున కిదె ‘ఆసనం’
సజ్జన ప్రశస్త సేవ్య - చరణున కిదె ‘పాద్యము’ .................... || పుణ్య ||

ఆపన్నజనోద్ధారక - హస్తున కిదె ‘అర్ఘ్యము’
సాయి కిదే ‘అర్ఘ్యము’
వరములు కురిసే ప్రసన్న - వదనున కిదె ‘ఆచమనం’
సాయి కిదే ‘ఆచమనం’
దినకరశత తేజోమయ - దేహున కిదె ‘స్నానము’
శివకేశవ రూపధారి - చిన్మయునకు ‘వస్త్రయుగం’
సదమల సత్కీర్తియుతున - కిదియే ‘ఉపవీతము’
బంధనాలు ద్రెంచు లోక - బాంధవునకు ‘గంధము’
క్షతివిరహిత సౌజన్యసు - గతున కివియె ‘అక్షతలు’ || క్షతి ||
సుమకోమల మానస పరి - శుద్ధున కిదె ‘పుష్పము’ ......... || పుణ్య ||

షిరిడీపుర నిలయుడగు వి - శిష్టున కిదె ‘ధూపము’
సాయి కిదే ‘ధూపము’
జ్ఞానశూన్య మనోతిమిర - సంహారికి ‘దీపము’
సాయి కిదే ‘దీపము’
భక్తుల ఆకలిని దీర్చు - స్వామికి ‘నైవేద్యము’
చర్విత వేదోపనిషద్ - జ్ఞానికి ‘తాంబూలము’
కమనీయాకారున కిదె - ‘కపురపు నీరాజనం’
హిమకర దినకర నేత్రున - కిదియె ‘మంత్రపుష్పము’
చరాచరప్రపంచ కుక్షి - ధరున కిదె ‘ప్రదక్షిణం’ || చరా ||
ఇష్టకామ్యదాత కిదే - ‘సాష్టాంగవందనం’ ................................ || పుణ్య ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉన్నతి, సుభాష్, బృందం.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/2fe17954-ad6f-4ac9-bb74-

a7bf8f2aef11/Sai---Punyamoorthi

15 కామెంట్‌లు:

  1. గురువు గారూ చాలా ఉల్లాసముగా జరిగింది పాట. మీ బోటి వారు సినిమా పాటలు వ్రాస్తే నా బోటి వారు సినిమాలకు చేరువయే వాళ్ళ మేమో !

    రిప్లయితొలగించండి
  2. **********************************************************************
    మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    నరసింహ మూర్తి గారూ,
    ఆ ముచ్చటా తీరింది. ‘ఓ మనసా! ప్రేమించకే!’ అనే చిత్రం కోసం నేను టైటిల్ సాంగ్ వ్రాసాను. దానిని ప్రసిద్ధ గాయని ఉషతో పాటు నలుగురు పాడారు. పెద్ద పాట. రెండు భాగాలుగా ఈ సాయి పాటలు అయిపోయాక ప్రకటిస్తాను.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు నమస్కారము. మీ పాట అద్భుతముగ ఉన్నది.

    రిప్లయితొలగించండి
  4. కాజ సురేశ్ గారూ,
    ధన్యవాదాలు. ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    (దయచేసి ‘సురేశ్’ అని వ్రాయండి. ‘సురేష్’ అనడం తప్పు)

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి వ్యాఖ్య ....

    అయ్యా! మీ పాటలు రతనాల మూటలు.

    మీ భక్తియు నాసక్తియు
    మీ భావము వాగ్విభవము మీ కవనమ్మున్
    శోభామయములు సాయి
    శ్రీభూతి యొసంగు మీకు చెన్నగు సిద్ధుల్

    రిప్లయితొలగించండి
  6. మాత్రా ఛందస్సులో భావ సంపదా , పద విన్యాసమూ అబ్బురపరిచేలా పరుగులెత్తుతూన్నాయి .... మీ సారస్వత సేవ లో మరో కోణాన్ని దర్శింపజేసినారు - ధన్యవాదాలు శంకరయ్య గారూ !!!

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    డా. విష్ణునందన్ గారూ,
    మీ ప్రశంసలు నాకు ‘మెరిట్ స్కాలర్ షిప్పులు’. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. వీనుల విందుగా ఉన్నాయి పాటలు . సాయి నామామృతాన్ని గానం చేయగలిగిన మీరు ధన్యులు . విన గలిగిన అదృష్టం మాకు దక్కింది

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! పాటలో దేవునికి చేసిన షోడశోపచారములు అద్భుతం.

    రిప్లయితొలగించండి
  10. షోడశ కళానిధికి షోడశోప చారములు .........
    అనే అన్నమయ్య కీర్తనను తలపిస్తూ మీ పాట రమ్యంగా ఉందండీ.

    రిప్లయితొలగించండి
  11. **********************************************************************
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు. నేను ఆ పాట వ్రాయడానికి ‘స్ఫూర్తి’ మీరు పేర్కొన్న అన్నమయ్య పదమే!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  12. మన తెలుగు - చంద్రశేఖర్శనివారం, అక్టోబర్ 15, 2011 4:53:00 AM

    మాస్టారూ, అదుర్స్ (యువకుల్లాగా కామెంట్స్ చేశానంతే). ధ్యానా౭వాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి అనిపించారు విన్నవాళ్ళ చేత:-)

    రిప్లయితొలగించండి