9, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -487 (ఆదరింపవలదు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఆదరింపవలదు పేదజనుల.

23 కామెంట్‌లు:

 1. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ .....

  అఖిల జనులలోన నాత్మనే గాంచుచు
  బరుల సేవ కొరకు బాటుపడుచు
  మంచి మనసు తోడ మసల వలయును ని
  రాదరింప వలదు పేదజనుల

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  నేమాని వారి నిరాదరణ బావుంది !

  01)
  _________________________________

  ధర్మ నిష్ఠ దప్పు - తనవారె యైనను
  ఆదరింప వలదు ! - పేద జనుల
  మీద కరుణ జూప - మిగుల,శుభములెన్నొ
  మీకు దైవ మిచ్చు - మెచ్చు కొనుచు !
  _________________________________

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

  అయ్యా! శుభాశీస్సులు. సాహితీ సేవలో మీ కృషి అభినందనీయము. మీకు సద్యోగములను చదువుల తల్లి ప్రసాదించగలదని మా నమ్మకము - ఆశీస్సులు.

  రిప్లయితొలగించండి
 4. పాత్ర తెరుగ కుండ పైపైన గని వారి
  నాదరింప వలదు; పేదజనుల
  బాధలన్ని దెలిసి బాధ్యతగా దల్చి
  వెతల దీర్చు వాడు విష్ణు సముడు.

  రిప్లయితొలగించండి
 5. ఆదరింపవలదు నాడంబరముజూసి,
  ఆదరింపవలదు ఆస్తిజూసి,
  ఆదరింపవలదు పేదజనులజూసి
  చీదరించుకొనెడు చేదుమతుల !!!

  రిప్లయితొలగించండి
 6. కుడువ, నుండ కూడు గూడుయు లేకను
  కట్టుకొనగనింత బట్ట లేక
  అలమటించు చుండె నక్కటా జనత, ని
  రాదరింప వలదు పేదజనుల!!

  రిప్లయితొలగించండి
 7. మోదమొప్ప పుట్టి పేదగా శ్రీహరి
  ఆదరించువారి నరయు చుండు.
  ఆదరించవలయు నరసి పేదలను.ని
  రాదరింపవలదు పేదజనుల.

  రిప్లయితొలగించండి
 8. నా పూరణ ....

  "పేద పేదగానె వేదన పడవలె
  నాదరింపవలదు పేదజనుల
  వారు మనకు సాటి వచ్చినఁ జేటగు"
  ననెడి ‘దొరల’ పీచ మణచవలెను.

  రిప్లయితొలగించండి
 9. **********************************************************************
  పండిత నేమాని గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చేసారు. అభినందనలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పాత్ర తెరుగకుండ’ ను ‘పాత్రతను తెలియక’ అంటే బాగుంటుందేమో?
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  చింతా రామకృష్ణారావు గారూ,
  చక్కని పూరణ మీది. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 10. శ్రీపతిశాస్త్రిఆదివారం, అక్టోబర్ 09, 2011 8:36:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  పేదవారి కొరకు పేర్కొన్న పథకాలు
  పెద్దలైనవారి వద్ద జేరె
  చేత కాని ప్రభుత చేష్టలుడుగుచు ని
  రాదరింప వలదు పేద జనుల

  రిప్లయితొలగించండి
 11. పేద పేద యన్న వేదన పడరాదు
  దొంగ సాకు చెప్పి దోచు కొనును
  కొటి విద్యలన్ని కూటికే యను వారి
  నాదరింప వలదు పేద జనుల

  క్షమిం చాలి . మా యింటికి విజయ దశమి సందర్భముగా గురువులు శ్రీ విశ్వంజీ గారు వచ్చి నందున నేను బ్లాగు చూడ లేక పోయాను
  విజయ దశమి శుభా కాక్షలు చెప్పిన సోదరు లందరికీ ధన్య వాదములు + కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 12. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  పూరణ లన్నీ బాగున్నాయి

  కలిమి లేము లవియు కావడి కుండలు
  పేద రాజు, రాజు పేద యగును
  మంచి మనసు వలన మాన్యత గలుగు, ని
  రాదరింప వలదు పేద జనుల !

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
  చక్కని పూరణ చేశారు.కవిమిత్రుల పూరణ లన్నీ బాగున్నవి.

  రిప్లయితొలగించండి
 14. మాస్టారూ, ఆ.వె. పాదాన్ని ప్రయత్న పూర్వకంగా తే.గీ. లోపూర్తి చేశాను.
  పేదరికము దుర్భరముది పెద్దనిద్ర
  చచ్చినందాక దు:ఖమొసంగు గొంగ
  ఆదరణమె యమృతము నిరాదరింప
  వలదు పేదజ నులఁ మృతకుల సములను!

  రిప్లయితొలగించండి
 15. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 16. **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  ప్రభుత్వానికి చురక అంటించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  నేదునూరి రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ‘రాజు - పేద’ చిత్రంలోని ‘కళ్ళుతెరచి కనరా’ పాటను గుర్తుకు తెచ్చారు. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 17. నమస్కారం !

  నా వంతు పూరణ ,

  కోరి మనల నెన్నుకొనెడి దీనుల
  నాదరింప వలదు పేదజనుల
  నను యమాత్య చయము నణుచుదివ్యశరము
  సజ్జనునికి ఓటు ,సకల హితము

  రిప్లయితొలగించండి
 18. కళ్యాణ్ గారూ,
  సంతోషం! ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘కొనెడి దీనుల’ అన్నది ‘కొనునట్టి దీనుల’ అంటే సరి! మూడవ పాదాన్ని ‘నను (న)మాత్యచయము న(ణ)చు దివ్యశరము’ అందాం. అలాగే ‘సజ్జనునకు’ అనడం సాధుప్రయోగం.

  రిప్లయితొలగించండి
 19. క్షమించాలి , పాత పూరణలో దోషాలు ఉన్నాయి .. అవి సవరించి మళ్ళి పంపుతున్నా

  కోరి మనల నెన్నుకొను వార( దీనుల
  నాదరింప వలదు పేదజనుల
  నను యమాత్య చయము నణుచుదివ్యశరము
  సజ్జనునికి ఓటు ,సకల హితము

  రిప్లయితొలగించండి
 20. ధన్యవాదలండీ ! మీరు ఇచ్చిన సూచనలు గుర్తు ఉంచుకుంటాను ! పద్యం మళ్ళీ నెమరువెసుకుంటూ ఎక్కడో లయ తప్పుతోందే అని చూసి , గణదోషం ఉందని అది సవరించి పంపించిన తర్వాత మీ వ్యాఖ్య చుశాను , అందువల్ల పద్యం మళ్ళీ post అయ్యింది ! క్షమించాలి

  రిప్లయితొలగించండి
 21. కళ్యాణ్ గారూ,
  సవరించిన పూరణలో ‘ఎన్నుకొను వార’ తరువాత అరసున్నా అవసరం లేదు. మీరు వాడుతున్నది లేఖిని, బరహా లేక మరేదైనా అయితే తెలిపితే సరియైన అరసున్న ఎలా టైపు చేయాలో చెప్తాను. అరసున్నా వాడకపోతే దోషం లేదు. కాని తప్పుగా వాడితేనే దోషం.

  రిప్లయితొలగించండి
 22. కళ్యాణ్ గారూ,
  ఇవి చాలా చిన్న తప్పులు. పట్టించుకోక పద్య రచనను కొనసాగించండి. మావంటి పెద్దలు పెద్ద పెద్ద తప్పులే చేస్తుంటారు. తప్పని ఒప్పుకోక సమర్థించుకొనే ప్రయత్నమూ చేస్తుంటారు.

  రిప్లయితొలగించండి