28, అక్టోబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 507 (జనులకు భగినీహస్త..)

కవిమిత్రులకు
భ్రాతృవిదియ పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
జనులకు భగినీ హస్తభోజనము విషము.
భ్రాతృవిదియ (భగినీహస్త భోజనం)
ఈరోజు భ్రాతృవిదియ. దీనిని కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని ‘యమద్వితీయ’ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాదుల పూజ చేస్తారు. భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరింది. తీరిక చిక్కని పనుల మూలంగా చాలాకాలం ఆమె కోర్కె తీర్చలేకపోయాడు. తుదకు యముడు ఒకనాడు యమున యింటికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆమె ఎంతో మర్యాద చేసింది. యముణ్ణి, అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని, వారి పరివారాన్ని పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించింది. ఆమె చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించమని కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు "ఏ సోదరి ఈనాడు సొదరుని తన ఇంటికి ఆహ్వానించి తన చేతివంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుంది" అని కూడా వరమిచ్చారు.
యమునికి మరియు యమునకు ఇటువంటి సోదర ప్రేమ నడచిన విదియ కాబట్టి దీనికి ‘యమద్వితీయ’ అనే పేరు వచ్చింది. ఈనాడు ప్రధానమైన ఆచారం సోదరి తన అన్నదమ్ములను ఇంటికి ఆహ్వానించి పూజించి, క్రొత్తబట్టలు పెట్టి గౌరవించడం. ఈ ఆచారం ఏర్పడిన తరువాత ఈ పర్వదినానికి ‘భాతృవిదియ’, ‘భగినీ హస్తభోజనము’ అనే పేర్లు వచ్చాయి. (వికీపీడియానుండి)

37 కామెంట్‌లు:

  1. మేన కోడలి కడుగును మేనరికము
    తండ్రి యాస్తిని గోరును తనదు భాగ
    మనుచు తప్పించు కొనజుచు అనుజులైన
    జనులకు భగినీ హస్తభోజనము, విషము

    రిప్లయితొలగించండి
  2. తోడ బుట్టువు బంధము తోపనపుడు
    చెల్లి సౌభాగ్య సంపదల్ చింతజేయు
    నట్టి యెడ నామె ప్రేమతో పెట్టినను, కు-
    జనులకు భగినీ హస్తభోజనము విషము.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    యమున కోరిక దీర్చిన - యముని వరము
    మహిని మంచిని బెంచును - మానవులకు !
    కలత దీర్చి శుభము లిచ్చు - గాని ,కాదు
    జనులకు భగినీ హస్తభో - జనము విషము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. ప్రేమ మీరగ చెల్లెలు పెట్టునట్టి
    భోజనము సుధామధురమై ముదము గూర్చు
    ద్వేష భావమ్ము మదిలోన పెరుగు నపుడు
    జనులకు భగినీ హస్త భోజనము విషము

    రిప్లయితొలగించండి
  5. 01అ)
    _________________________________

    భ్రాతృ విదియ నేడు - భ్రాతలందరు వారి
    సోదరింటికి జన - శుభము గలుగు !
    అన్న దమ్ముల బిల్చి - యాడ పడుచు లంద
    రాతిథ్యమును నిడ - యమృత మగును !
    నరక లోకము దప్పు - నపమృత్యు వది రాదు
    నరులకు యిహ పర - నయము నొనరు !
    అన్నదమ్ముల మేలు - నాదరించు భగిని
    వైధవ్యమును బొంద - వలను గాదు !


    యమున కోరిక దీర్చిన - యముని వరము
    మహిని మంచిని బెంచును - మానవులకు !
    కలత దీర్చి శుభము లిచ్చు - గాని; కాదు
    జనులకు భగినీ హస్తభో - జనము విషము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  6. ఆడపడుచింటి కూటికి నాశపడకు
    వత్సరమున కొకపరినా వరుస కొరకు
    గతుక వారింట మరియాద, కాని యెడల
    జనులకు భగినీ హస్తభోజనము విషము!

    రిప్లయితొలగించండి
  7. జనులకు భగినీ హస్తభోజనము, విషము
    హరణ సేయుచు నారోగ్యమంద జేయు.
    నట్టి సుదినంబు నేడె. మీరరసి కొనరె
    ఆడపడచుల చేతి భవ్యాన్నమంచు.

    రిప్లయితొలగించండి
  8. పొరపాటును సూచించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. స్వర్గమునగూడి యొకనాటి సంధ్యవేళ
    తలచిరీరీతి కంసుడు, తాను శకుని
    మేనయల్లుండ్లె మామల మాన హరులు
    జనులకు భగినీహస్త భోజనము విషము

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  10. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, అక్టోబర్ 28, 2011 11:50:00 AM

    తెలియ' కార్తీక శుధ్ధ విదియ 'తిధిని - న
    మృత సమానము, శుభ కరమగును -సకల
    జనులకు భగినీ హస్త భోజనము- విషము
    తలను దాల్చిన సర్ప సంతతుల కైన

    రిప్లయితొలగించండి
  11. ప్రేమనింపెడి మాటలు ప్రీతి జేయ
    ఖేదభేదము జేయుచు మోదమొసగు
    జనులకు భగినీ హస్తభోజనము, విషము
    నైన నరగించి దీర్ఘాయువందజేయు.

    రిప్లయితొలగించండి
  12. ప్రేమ తోడుత కడుపార బెట్టినట్టి
    యెట్టి యాహారమైనను యమృత మగును
    కూర్మిబెంచు సోదరియింట కుడువ,కాదు
    జనులకు భొగినీ హస్త భోజనమ్ము విషము !!!

    రిప్లయితొలగించండి
  13. అందరికీ నమస్కారం,
    ఇది నా పూరణ !

    క్షీరసాగరాత్మజ నీకుజెల్లి నామె
    యింటనుద్భవించినవిషమీవు త్రాగ
    నంత సురలు గుసగుసల నాడిరచట
    'జనులకు భగినీహస్త భోజనము విషము'

    రిప్లయితొలగించండి
  14. ఆడపడచులు వలదట యత్త దనకు
    వలద టమ్మరొ! మగనికి భార్య దానె
    చెప్పజూచెను బదులిక చెప్ప నను కు
    జనులకు భగినీ హస్తభోజనము విషము.

    రిప్లయితొలగించండి
  15. చిన్న సవరణ , పై పద్యం లో మూడవ పాదం ఇలా మార్చితే బాగుంతుందేమొ అనిపిస్తోంది ..
    'నంత సురలు గుసగుసల నాడెనీశ !'

    రిప్లయితొలగించండి
  16. క్షీరసాగరాత్మజ నీకుజెల్లి నామె
    యింటనుద్భవించినవిషమీవు త్రాగ
    నంత సురలు గుసగుసల నాడెనీశ !
    'జనులకు భగినీహస్త భోజనము విషము'
    మందాకిని గారు ,
    పై పద్యం అని అన్నది నేను రాసిన పద్యాన్ని గురించి , నేను పోస్ట్ చేసే లోపు మీ పద్యం కనపడింది .వేరేలా భావించొద్దని ప్రార్ధన ! :-)

    రిప్లయితొలగించండి
  17. కళ్యాణ్ గారు,
    భలేవారే , అంతమాత్రం అర్థం అవుతుందండీ.
    నేను చమత్కారం అన్నది మీ పూరణ గురించి. లక్ష్మీదేవితో పాటు పుట్టిన విషమును ఆవిడ పుట్టింటి భోజనమన్నారు కదా , దానిగురించి.:-)
    ఒక సూచన-
    మీ సవరణ లో సురలు బహువచనం కదా, నాడిరీశ అనాలేమో!

    రిప్లయితొలగించండి
  18. మందాకిని గారు ,
    మీ పద్యం , మీ బ్లాగ్ లాగే మీ సూచన కూడా బాగుందండి . :-))

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! రామకృష్ణా రావు గారూ!
    భవ్యాన్నము కన్నా మృష్టాన్నము అంటే బాగుంటుందేమో.
    నేమాని

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! పీతాంబర్ గారూ!
    మీ పద్యము 2వ పాదములో యతి లేదు.
    నేమాని సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    కతుకుట అనే ప్రయోగము మానవులకు వాడ కూడదు. కతికేవి జంతువులు మాత్రమే.
    ఉత్కృష్టమైన పద ప్రయోగమే మంచి ఫలితాలని ఇస్తుంది. ఆలోచించండి.
    నేమాని

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని గారికి నమస్కారములు .పొరపాటును తెలియ పరచిన మీకు ధన్య వాదములు.రెండవ పాదాన్ని ఇలా సవరిస్తున్నాను.

    "నటుకు లైనను ఫలమైన యమృత మగును"

    రిప్లయితొలగించండి
  23. పండిత శ్రీ నేమాని మహాశయా!
    ధన్యవాదాలు. "కతికితే అతకదు" అనే సామెత వుంది కదా. అందుకే పెళ్లి తాంబూలాల కంటే ముందు ఒకరింట్లో ఇంకొకరు భోజనం చేయరేమో. మరి మీ వ్యాఖ్యా చూశాక ఇంకొంచెం శోధిస్తే, క్రింది ప్రయోగం దొరికింది.
    "క. ప్రతిగృహము నెపుడుఁదిరుగుచు, నతిశయ జనభుక్తశేష మాతురమతినై, గతుకుచు." బ్రహ్మోత్తర ఖండం. ౨, ఆశ్వాసము.
    అంత పరిజ్ఞానం లేదు. ఈ ప్రయోగం తప్పయితే తెలియజేయండి, తప్పక సరిదిద్దుకొంటాను.
    -చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. **********************************************************************
    ముందుగా ఈరోజు ఇలాంటి సమస్య ఇచ్చినందుకు అక్కాచెల్లెళ్ళను (ముఖ్యంగా రాజేశ్వరక్కయ్యను, మందాకిని చెల్లాయిని) క్షమించమని వేడుకుంటున్నాను. రాక రాక నా కూతురు ఇంటికి రావడంతో ఈనాడు ‘భగినీ హస్తభోజనానికి’ దూరమయ్యాను.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాస్తవం ప్రతిబింబించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    నిజమే. అలాంటి కుజనులూ ఉన్నారు. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    భాతృవిదియ ప్రాశస్త్యాన్ని సీసపద్యంలో చెప్పిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    మనోహరమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పిన విషయాన్ని పండిత నేమాని వారు చెప్పారు. గమనించారా?
    అక్కడ ‘అ / మృత సమానము, శుభ కరమే సమస్త’ అంటే సరి!
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    కళ్యాణ్ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ చాలా బాగుంది. మీ ఊహాశక్తికి జోహారు. చక్కని పూరణ. అభినందనలు.
    ‘చెల్లి + ఆమె’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘చెల్లి యామె’ అనడంమే సరి!
    **********************************************************************
    మందాకిని గారూ,
    మంచి ఆడపడుచు వనిపించుకున్నారు చక్కని పూరణతో. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  25. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    ఒకే భావానికి అనేక పదములు (పర్యాయ పదములు) ఉంటాయి. మా ఇష్టమొచ్చినటుల వాడుతామంటే నేనేమీ అనలేను. నా సలహా నేను చెప్పేను. ఉత్కృష్టమైన పదములను వాడుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నా ఇల్లు అన్నా నా కొంప అన్నా ఒకే అర్థము. ఏ పదము వాడుట ఉత్తమము అంటారు?
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  26. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    అన్ని సామెతలు మంచి పదములతో కూర్చబడవు. అందుచేత సామెతను ప్రమాణముగా తీసుకోలేము. శబ్దరత్నాకరములో కతుక్కు అనే పదమునిచ్చి అర్థము: "కొరుకుటయందు ధ్వన్యనుకరణము - ఉదా: ఒక్క నక్క వల గతుక్కున గొరికితా నవల జనగ .. ..
    అంతేకాదు మీరు చొప్పిన ఉదాహరణ కూడా మీరు పూర్తి పద్యము వ్రాయలేదు. ఇల్లిల్లు తిరిగుతూ ఎంగిలి మెతుకులు తినేది కుక్కే కదా.అందులో కుక్క గురించి చెప్పేరేమో అనిపిసించుచున్నది.

    రిప్లయితొలగించండి
  27. అడిగి వడ్డించుచును మధ్య నదనుచూసి
    చెడినవారితోడేలని చెప్పుటద్దె
    "కర్మ"గానెంచెడునిగమశర్మ వంటి
    జనులకు భగినీ హస్తభోజనము విషము.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారు, ధన్యవాదములు.
    కళ్యాణ్ గారు, ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా, మీ కామెంటు నన్ను భావోద్వేగంలో ముంచేసింది. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు కూతుళ్ళూనూ, నా చెల్లెళ్ళే కూతుళ్ళో కూతుళ్ళే చెల్లెళ్ళో అని తికమక పడుతూ ఉంటాను.
    ఇది ఇక్కడ అప్రస్తుతమేమో తెలియదు కానీ, నా చెల్లెలిని మా మేనమామకిచ్చిన కారణాన ఒకనాడు ఈ భగినీ హస్తభోజనం యొక్క ప్రాశస్త్యం నా మాతామహులైన బ్రహ్మశ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి ద్వారా విని, నా చెల్లెలి చేతి భోజనం చేసినవాడిని. మీరు ఈ నాడిచ్చిన సమస్య నన్ను ఎన్నో ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఎన్నెన్నో జ్ఞాపకాలను వెలికి తీసింది సుమా.

    అమ్మా, రాజేశ్వరీ మందాకినులూ, మీ చేతి భోజనం నాకెప్పటికి ప్రాప్తో??

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  30. మన తెలుగు - చంద్రశేఖర్శుక్రవారం, అక్టోబర్ 28, 2011 11:20:00 PM

    మందాకిని గారు వంటా వార్పూ గురించి వారి బ్లాగు లో వ్రాస్తారు. కాబట్టి రుచికరమైన వంటలు వండగలరని ఆశిద్దాము. వ్రాయటం వేరు వండటంవేరు అని నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకని కొంచెం జాగ్రత్త పడదాము (నవ్వుతూ) మాకు కూడా కొంచెం పార్సిల్ లో పంపండి.

    రిప్లయితొలగించండి
  31. చంద్రశేఖర్ గారూ,
    పండిత నేమాని వారూ,
    (సూర్యరాయాంధ్ర నిఘంటువు నుండి ...)
    కతుకు (రూపాంతరములు - గతుకు, గదుకు)స.క్రి.
    1. తిను, భుజించు.
    క.
    కతికిజ నతక దటంచు
    న్మతిమంతులు పలుకు పలుకు మాఁబోటులకున్
    స్మృతికంటె హెచ్చు .... (పార్వతీపరిణయము- 5.87)
    2. కుక్క మొదలగునవి నాలుకతో కొంచెము కొంచెముగా త్రాగు.
    చ.
    .... ఏఱులు నిండి పాఱినం
    గతుకఁగఁ జూచుఁ గుక్క తనకట్టడ మీఱక యెందు భాస్కరా. (భాస్కరశతకం-5)

    కతుక్కు (రూపాంతరము - కటుక్కు) విశేష్యం.
    కొఱుకుటయం దగు ధ్వనికి అనుకరణము.
    ఆ.
    ఒక్క నక్క వల గతుక్కున గొఱికి తా, నవలఁ జనఁగ వెంటఁ దవిలె బలము. (శుకసప్తతి- 1.177)

    గతుకు (రూపాంతరము - కతుకు) స. క్రి.
    1.(కుక్క మొదలగునవి) కొంచెము కొంచెముగాఁ దిను, నాలుకతో కొంచెము కొంచెముగాఁ ద్రాగు.2.ఎంగిలి తినుట (శబ్దరత్నాకరము)
    క.
    ప్రతిగృహము నెపుడుఁ దిరుగుచు
    నతిశయమున భుక్తశేష మాతురమతినై
    గతుకుచు వీథుల నుండుచుఁ
    గతిపయసంవత్సరములు గడపితి నచటన్. (బ్రహ్మోత్తరఖండము-2.124)

    రిప్లయితొలగించండి
  32. చంద్రశేఖర్ గారు ,
    వంట బ్లాగులో అంత ఆసక్తి కరంగా వ్రాయలేను కాబట్టి చేయటం బాగా వస్తుందని అనుకోండి. (నవ్వుతూ)
    శర్మ గారు ,
    మీకు, మన కవిసోదరులందరికీ వండి పెట్టగలిగిన రోజు వస్తే అంతకన్నా సంతోషమా!

    రిప్లయితొలగించండి
  33. **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    నిగమశర్మ ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  34. కందుల వరప్రసాద్ గారి పూరణ .....

    సిగ్గు విడిచి చెల్లెలి యింట సిరుల గొనుచు
    నియమములను పాటింపక నిత్యము దిను
    జనులకు భగినీహస్త భోజనము విషము
    పాలు ద్రాగగ గరళమౌ పాము వోలె.

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి