22, అక్టోబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 500 (ఐదువంద లనిన)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ..
ఐదువంద లనిన నల్పమె కద!

56 కామెంట్‌లు:

 1. నా పూరణ .....

  మన తెలుంగులో సమస్య దత్తపదుల
  తో నుతిని గనె నవధానవిద్య;
  యెన్నఁ దరమె మించె నెన్నొ సహస్రంబు
  లైదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
  ప్రాస నియమములో తొలి అక్షరము గురువా లఘువా అని చూస్తే పొరపాటు చేయుటకు అవకాశము ఉంటుంది. అది దీర్ఘమో లేక హ్రస్వమో అని మాత్రమే చూడాలి. అలాగే అనుస్వారముతో ఉందా ప్రాస అక్షరము అని కూడా గమనించాలి. అలాగే ప్రాస అక్షరము ఒక్క హల్లు అయితే అదే హల్లును వాడాలి; ద్విత్వ సంయుక్త అక్షరములు అయితే తప్పక అవే హల్లులను వాడాలి.
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 3. మాస్టారూ, శుభాకాంక్షలు అర్ధ సహస్ర సమస్యల గీత వరకూ వచ్చినందులకు. నాకింకా గుర్తు, యే రోజు మనం "రోజుకొక సమస్య" అనే శీర్షిక బాగుంటుందని అనుకొన్నమో, ముహూర్తబలం అలానే సహస్రం చేద్దాం. మీ ఓర్పు నేర్పూ దీనికి మూలబలం. దాన్ని చదువులతల్లి అలానే తరిగిపోకుండా వుంచాలని ఆశిద్దాం.

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు. ప్రాసమైత్రిని అందరి అభిప్రాయాలను కూర్చి ఒక ప్రత్యేక వ్యాసంగా ప్రకటించాలనుకుంటున్నాను. నా పాఠంతో కలిపి.

  రిప్లయితొలగించండి
 5. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  ధన్యవాదాలు.
  మీ అందరి భాగస్వామ్యం, సహకారం ఇలాగే కొనసాగితే అదేమంత కష్టమైన పని కాదు.

  రిప్లయితొలగించండి
 6. నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా:
  వేయి నోటు మార్చి బిచ్చమిడుదమన్న
  బెంగళూరు లోన బిచ్చ గాడు
  వేగ చిల్ల రిచ్చి విసుగుననియె, సామి!
  “ఐదువంద లనిన నల్పమె కద”

  రిప్లయితొలగించండి
 7. అయ్యా శ్రీ కామేశ్వర శర్మ గారు, శ్రీ పండిత నేమాని గారు మీ సూచనలకు ధన్యవాదములు.
  కవిత్వమందు నేను ఆరునెలల పసివాడిని,ఇంజనీరింగ్ విధ్యార్థిని బెంగళూరునందుండి తెలుగును పూర్తిగామరచిని. ఇది నామొదటి నిశేదాక్షరి ప్రయోగము. శ్రీశ్రీ శంకరయ్యగారి కవితావనమందు మొలచిన ఓ మొక్కను. గురువుగారి దీవెనలతో మీ మధ్యనుంటిని. గురువు గారి సహకారము లేకున్నచో ఈ పామరుడుకు మీ వంటి మహానుబావుల సాంగత్యము జిక్కెడిది కాదు.
  ------------
  ఏంత ధనమున్నను ఏమి చేయలేని పరిస్థితులున్నవి. శవదహనమునకు వేల రూపాయలు, లంచమివ్వకున్న సంతకం బెట్టనధికారులు.
  -------------
  ఐదు వేల కోట్లు అయ్యవారికి జాల
  కుండె, లక్ష యున్న మండె కట్టె,
  వేలు లేకయున్న వ్రేళ్ళుబడకయున్న
  ఐదు వందలనిన నల్పమెకద|

  రిప్లయితొలగించండి
 8. అఖిల వేదచయము నధ్యయనము చేయ
  అయిదు వందలేండ్ల యాయువడిగె
  మును వరమ్ము నజుని ముని భరద్వాజుడు
  నయిదు వందలనిన నల్పము కద
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 9. మన గుంపుకు, మార్గదర్శకులయిన గురువుగారికి, పండితులవారికి , చదువరులందరికీ అభినందనలు.
  గురువు గారు,
  మనం కూడా ఒక థీమ్ ని తీసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
  అక్షరమాలిక (గుణింతరూపాలతో సహా) తీసుకుని సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తే బాగుంటుంది.మిత్రులేమంటారు?

  ఓర్పు నేర్పు గలిగి యొజ్జగ రాజిల్లు
  కంది శంకరుండు కలరు యిచట
  కోటి సంఖ్య చేర కోరుకొనెదమిక
  ఐదువందలనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  రోజు రోజు మిగుల - మోజు పెరుగుచుండు
  శంకరాభరణము - శక్తి గనిన
  వేన వేలు దాటు - వేనోళ్ళ కొనియాడ !
  ఐదువంద లనిన - నల్పమె కద!
  _________________________________

  రిప్లయితొలగించండి
 11. అయ్యా సీసములో చూడండి (ఏక శ్లోకీ రామాయణమునకు అనువాద పద్యము)

  రామచంద్రుడు వనసీమల కేగెను
  స్వర్ణమృగంబును సంహరించె
  అసురేశ్వరుడు సీత నపహరించెను జటా
  యువు వాని నెదిరించి యొరిగె ధరణి
  చేరి సుగ్రీవుని స్నేహమ్ము నొనరించె
  వాలి నొక్కమ్మున గూల నేసె
  వాతాత్మజు వలన సీత జాడను గనె
  సామీరి లంక భస్మంబొనర్చె
  వారధిని గట్టి కపులతో వార్ధి దాటె
  హర్షమెసగ విభీషణు నాదరించె
  దశముఖుని కుంభకర్ణు యుద్ధమున గూల్చె
  రామ చరిత మీరీతిగా రాణ కెక్కె

  రిప్లయితొలగించండి
 12. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 22, 2011 2:17:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  వ్రాయలేకపోతి వాటిలో సగమైన
  పూరణములు జేయ పూనుకొనగ
  పరవశించి వ్రాయు పండితోత్తములకు
  ఐదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 13. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 22, 2011 2:20:00 PM

  గురువర్యులు శ్రీ పండిత నేమాని వారి రామకథ(సీసం) అద్భుతముగా నున్నది.

  రిప్లయితొలగించండి
 14. చెప్ప పద్యమొకటి చెమటపట్టునునాకు,
  జంకు పుట్టి హృదిని, శంకరార్య!
  వ్యాకరణము తెలియు వారలౌయొజ్జల
  కైదువంద లనిన - నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 15. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 22, 2011 2:35:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  అధికమైనదేది నరయంగ సృష్టిలో
  అచ్యుతుండు గాక నధికులెవరు
  పదసుమంబు లేరి పద్యముల్ గూర్చినా
  ఐదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని గారికి నమస్కారములు,
  మీరు "ప్రాస నియమములో తొలి అక్షరము గురువా లఘువా అని చూస్తే పొరపాటు చేయుటకు అవకాశము ఉంటుంది. అది దీర్ఘమో లేక హ్రస్వమో అని మాత్రమే చూడాలి." అని అన్నారు
  ఉదాహరణకు క్రింది కంద పద్యపాదములకు ప్రాస చెల్లినట్టా? కానట్టా? తెలియ జేయ ప్రార్థన.
  =================================
  కర్మను పాటించ వలయు
  ధార్మిక జీవితము మేలు ధరణి జనులకున్
  ===============================

  రిప్లయితొలగించండి
 17. అయ్యలందబోరు ఐదేసి వరహాలు
  చెల్లబోవు పప్పు బెల్లములును
  నేటి తీరుచూడ నీయగా మామూళ్ళు
  ఐదువందలనిన నల్పమె కద

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 18. ఏడు వేలు పలికె నెకరమునకు నాడు
  బూము వచ్చి పెరిగె భూమి రేటు
  భాగ్య నగరమందు ప్లాటుండినను గజ
  మైదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 19. అయ్యా! జిగురు సత్యనారయణ గారూ!
  ఏ పాఠమైనా సంపూర్ణముగా చెప్పాలంటే అధ్యాపనములో అనుభవము ఉండాలి. నాకు అట్టి అనుభవము శూన్యము అని ముందే చెప్పేను. అందుచేత మన శ్రీ శంకరయ్య గారు సంపూర్ణమయిన పాఠమును నేర్పుతారు తొందరలో అని ఎదురు చూద్దాము. ప్రాస నియమము తెలియని వాళ్ళు ఒక పాదములో హ్రస్వముతో మొదలిడి మరొక పాదములో దీర్ఘము వేయుటలు జరుగుచున్నవి కదా. (ప్రాస అక్షరము ద్విత్వము, సంయుక్తము, బిందుపూర్వకము కానప్పటికిని).
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 20. అయ్యా! వరప్రసాదు గారూ! శుభాశీస్సులు.
  మీ ప్రయత్నము చాలా బాగుగా ఉన్నది. మీకీ విషయము తెలియునో లేదో? మనలో చాల మంది తెలుగులో ఉన్నత విద్య చదువని వాళ్ళమే. నేను చదివినది తెలుగులో పి.యు.సి. మాత్రమే. తదుపరి విద్యలో తెలుగు లేదు. ఉద్యోగమా కంపనీ సెక్రెటరీ. ఇతర శాఖలలో ఉద్యోగాలలో ఉన్నావారే ఎందరో పద్య విద్యలో కూడా రాణిస్తున్నారు. మీరు కూడా స్వల్ప వ్యవధిలో చాలా రాణించగలరని ఆశిస్తూ - మీకు శుభాశీస్సులు పలుకుతూ - పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 21. ఊకదంపుడు గారు,
  మొదటి రెండు పాదాల్లో జోక్ చెప్పారే! బాగుంది.:-)

  రిప్లయితొలగించండి
 22. మన తెలుగు - చంద్రశేఖర్శనివారం, అక్టోబర్ 22, 2011 4:43:00 PM

  పండితశ్రీనేమాని మహాశయా! కోరిక మన్నించి సీస పద్యం అందించింనదుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, అక్టోబర్ 22, 2011 4:50:00 PM

  నిజము ! శంకరయ్య ,నేమాని ,రాంభట్ల ,
  శ్యామలీయ మనగ చాలమంది
  ఘనులు, మిత్ర కవుల కర్పింతు బ్రణతుల
  నైదు వంద- లనిన నల్పమె గద !

  రిప్లయితొలగించండి
 24. శ్రీ వరప్రసాద్ గారూ,
  నేను తెలుగు చదివినది పదవ తరగతివరకే సుమా.
  "కృషితో నాస్తి దుర్భిక్షం"
  "సాధనమున పనులు సమకూరు ధరలోన"

  ప్రయత్నం కొనసాగిద్దాం. చక్కగా పద్యాలు వ్రాయడం నేర్చుకుందాం.

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 25. **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  హాస్యస్ఫోరకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘విసుగు ననియె’ అన్నదాన్ని ‘విసుగున ననె’ అంటే ఇంకా బాగుంటుందేమో?
  **********************************************************************
  వరప్రసాద్ గారూ,
  ముందు మీలోని న్యూనతా భావాన్ని తరిమివేయండి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే పద్యరచన బ్రహ్మవిద్య ఏమీ కాదు. పద్యాల నడక పట్టుబడిందంటే రచన చాలా సులభమౌతుంది. వీలైనన్ని పద్యరచనలు చదువుతూ ఉండండి. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఛందోవ్యాకరణ గ్రంథాలను చదవవలసిన పని లేదు. క్రమక్రమంగా దోషాలు, సవరణలు తెలుస్తాయి. శుభమస్తు!
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కోట్లు అయ్యవారికి’ అని అచ్చు మధ్యలో రాకూడదు. అక్కడ ‘కోటు లయ్యవారికి’ అంటే సరి!
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  వేదవిజ్ఞానాన్ని అద్యయనం చేయడానికి ఐదువందల సంవత్సవాలు తక్కువే! అంత విస్తృతమైనదీ, లోతైనదీ మన వేదవిజ్ఞానం. చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  బహుశా మీరు ‘జానుతెనుగు సొగసులు’ బ్లాగులో కారుమల్లి శివరామదాసు గారి ‘అక్షరమాలిక’ చూసి ఉంటారు. మంచి పద్యాలు. ఆ పద్యాలను మన బ్లాగులో ప్రచురించడానికి అనుమతి తీసుకున్నాను. ప్రస్తుతం టైపు చేస్తున్నాను. పూర్తి కాగానే బ్లాగులో ప్రకటిస్తాను.
  ఓర్పు, నేర్పులతో నన్ను ఒజ్జను చేసిన ఘనత మీ అందరిదీ. మీ సహకారంతో బ్లాగు పురోగమిస్తున్నది. అందుకు అందరికీ ధన్యవాదాలు. పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కలరు + ఇచట’ అన్నచోట యడాగమం రాదు. అక్కడ ‘కలుగ నిచట’ అందాం.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 26. చిరంజీవీ! సత్యనారాయణా! చక్కని సందేహాన్ని వ్యక్తం చేసావు.
  ఈ క్రింది విధంగా నేను భావిస్తున్నాను.
  ప్రాస పూర్వాక్షరము గురువా లఘువా అనే వీషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి,
  ప్రాస పూర్వాక్షరము గురువా?,గురువైతే నాల్గు పాదాలూ గురువే ప్రాస పూర్వాక్షరంగా రావాలి. లఘువా? లఘువైతే లఘువే నాలుగు పాదాలలోను ప్రాస పూర్వాక్షరంగా రావాలి.
  పూర్ణానుస్వార పూర్వక ప్రాసాక్షరమా? ఐతే నాలుగు పాదాలలోను పూర్ణానుస్వార పూర్వక ప్రాసాక్షరమే ప్రాసాక్షరంగా రావాలి.

  కర్మను పాటించ వలయు
  ధార్మిక జీవితము మేలు ధరణి జనులకున్.

  అన్నది చక్కని ఉదాహరణ.

  రిప్లయితొలగించండి
 27. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, అక్టోబర్ 22, 2011 7:11:00 PM

  అభిషేక కళశమ్ము లాది భిక్షువు పూజ
  కైదు వంద లనిన నల్పమె కద !
  పువ్వుల దండలు పూజింప విష్ణున
  కైదు వంద లనిన నల్పమె కద !
  తల్లికి దండ్రికి దగ నమస్కారమ్ము
  లైదు వంద లనిన నల్పమె కద !
  చదివించు గురునికి సన్మాన సత్క్రియ
  లైదు వంద లనిన నల్పమె కద !

  సాయి సద్గురునికి సాగిలి మ్రొక్కుట
  లైదు వంద లనిన నల్పమె కద
  రాణ శంకరాభరణమందు' నెపిసోడు '
  లైదు వంద లనిన నల్పమె కద !

  ---- సుజన సృజన

  రిప్లయితొలగించండి
 28. చంద్రశేఖర్:
  మందాకిని గారూ, ఒక థీమ్ తీసుకొని చేద్దామనే ఆలోచన నాకూ చాలా కాలంగా మనసులోమెదిలింది. అయితే ఈ బ్లాగుకి మధ్యలో వచ్చి చేరే వారికి, ఇలా కనిపించి అలా మాయమై మరలా వచ్చేవారికీ, అతిథులకీ, కొంత ఇబ్బంది కలుగవచ్చు. అప్పుడు క్రొత్తవారు చేసే కసరత్తుకి ధారావాహికగా ఫాలో అయ్యేవారికీ కొంత తేడా రావచ్చు.
  ఇప్పుడు వున్న format లో యే రోజు సమస్య ఆ రోజుదే, యే ఐటెం కి ఆ ఐటెం సెపరేట్. కాబట్టి వచ్చి చేరే వారు వెంటనే అందుకొంటున్నారు. గత సంవత్సర కాలంగా ఎందరో కవిమిత్రులని ఆకర్షించింది మన బ్లాగు. మరి ఫార్మాట్ మార్చటానికి కొంత మేధోమధనం అవసరమే! ఆపై జనవాక్యం శిరోధార్యము.

  రిప్లయితొలగించండి
 29. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  ఒక్కొక్క సమస్యకు డజన్లకొద్ది పూరణలు పంపే మీ వంటి శతాధికపద్యరచనా సమర్థులుండగా మీరు చెప్పున లక్ష్యసాధన సులభమే. ధన్యవాదాలు.
  చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  మీరు సవ్యసాచులు. మీ సీసపద్య రామాయణం అద్భుతంగా ఉంది. రామాయణ కావ్యకర్తలైన మీరు రామునిపై పద్యం చెప్పడంలో తన్మయులై ఆనందానుభూతిని పొందుతూ, దాన్ని మాకూ పంచుతూ మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు. ధన్యవాదాలు.
  ‘ప్రాసమైత్రి’ని గురించిన పాఠం సిద్ధం చేస్తున్నాను. వీలైనంత త్వరగా ప్రకటిస్తాను.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  సగమైనా వ్రాయలేకపోవడానికి కారణం ఈ బ్లాగు మీకు ఆలస్యంగా పరిచయం కావడమే కదా! ఆ విధంగా ఆలస్యంగా బ్లాగులో అడుగుపెట్టిన గోలి వారు, వసంత కిశోర్ గారూ పాత సమస్యలను కూడా లేటెస్ట్ గా పూరించి తమ నైపుణ్యాన్ని ప్ర్రదర్శించారు. మీరు బ్లాగులో వెనక్కి వెళ్లి నచ్చిన సమస్య లేమైనా ఉంటే ఇప్పుడూ పూరించి పంపవచ్చు.
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘ఏది + అరయంగ, కాక + అధికులు’ అన్నచోట్ల యడాగమం వస్తుంది. ‘ఏది యరయంగ, కాక యధికులు’ అని ఉండాలి.
  **********************************************************************
  ఊకచంపుడు గారూ,
  ఇది నిజంగా ‘ఊకదంపుడు మాటే’. కవిమిత్రులందరి చేత మెప్పులు పొందే సలక్షణమైన, చమత్కారభరితమైన పూరణలు వ్రాసే మీకు చమటలు, జంకూనా?
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ రిచ్చిన ఉదాహరణలో ప్రాస చెల్లుతుంది. పోతన గారి పద్యం చూడండి.
  ధాత్రీవర! సమధిక చా
  రిత్రుఁడు హలపాణి వలికె ధృతి నాత్మావై .... (భాగ. దశమస్కం. 929)
  ఇక మీ పూరణ ...
  భాగ్యనగరంలో గజం అయిదువందలా? అబ్బో .. చాలా అల్పం. చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘అందబోరు + అయిదేసి’ అని పాదం మధ్య అచ్చు వాడరాదు. ‘అందరైరి యయిదేసి’ అంటే సరి!
  **********************************************************************
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  చమత్కారభరితమైన మీ పూరణ బాగుంది.
  ఎప్పుడెప్పుడు ఐదువందలు అల్పమో వివరించిన మీ సీసపద్య పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మా బ్లాగు ‘విజిటింగ్ ప్రొఫెసర్’ చింతా రామకృష్ణారావు గారూ,
  ‘ప్రాస’ను గురించి పాఠం చెప్పి సందేహనివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. **********************************************************************

  రిప్లయితొలగించండి
 30. శంకరార్యా ! ధన్యవాదములు !

  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 31. వరప్రసాద్ గారూ, ఇంజనీరింగ్ విద్యార్ధిగా వుంటూ తెలుగు పట్ల ఆసక్తి చూపటం ముదావహం. వదిలిపెట్టకండి. "పట్టుపట్టరాదు, పట్టిన పట్టువిడువంగ రాదు" - Perseverance is the key to success అనే మాటలు గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి.

  రిప్లయితొలగించండి
 32. ఐదువందలనిన నద్భుతమేకదా
  యందు కొనుడు "మంద" వందనములు!
  ప్రజ్ఞ గలిగి నట్టి పండిత కవులకు
  ఐదు వంద లనిన నల్పమె కద!!!

  శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. ఐదువందలసమస్యాపూరణలనుసమర్థవంతంగానిర్వహించిఔత్సాహికులైనమావంటివారికితగుసలహాలుసూచనలిచ్చి ప్రోత్సహించిన మీకు శతసహస్రవందనాలు. నాకు మూడు వందల పైగా పూరణలు చేయ నవకాశ మిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 33. పండిత నేమాని వారికి, రామకృష్ణారావు మాస్టారు గారికి, గురువు గారికి,
  ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 34. అయ్యా! చిన్న సందేహము - శ్రీ ఊకదంపుడు కలము పేరుగా గల మిత్రమా!

  మీ పేరు ఇంగ్లీషులో వూ తో మొదలౌతున్నది. కాని అది ఊ తో మొదలవాలని మా భావము.

  ఎందుకో మీకు చెప్పాలనిపించినది.

  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 35. నా పూరణ ......

  పట్టుబడితి నేను పదునైదు వందలు
  ‘ఫైను’ కట్టవలెను; బండికిఁ దగు
  కాగితములు లేవు; కలవు నా జేబులో
  నైదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 36. శ్రీ శంకరయ్యగారూ, నమస్తే
  నిజమే పాదం మధ్యలో అచ్చురాకూడదన్న విషయం తెలిసినదే.పొరపాటు. దిద్దుతాను ఇలా

  అయ్యలందబోవ రైదేసి వరహాలు
  చెల్లబోవు పప్పు బెల్లములును
  నేటితీరు చూడ నీయగా మామూళ్ళు
  ఐదువంద లనిన నల్పమెగద

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 37. అరి దళమ్ము పైన నాగ్రహమ్మును బూని
  భండనమున దూకి చెండు నపుడు
  వీర ఖడ్గమునకు విదళిత శీర్షమ్ము
  లైదువందలనిన నల్పమె కద !!!

  రిప్లయితొలగించండి
 38. గురువుగారు,
  ధన్యవాదములండి.
  థీమ్ గురించి స్పందించారు. గురువుగారు, చంద్రశేఖర్ గారు మీరు చెప్పింది నిజమే. వీలు కలిగినప్పుడు మాత్రమే వచ్చేవారికి ఇది కుదరదు. పైగా అప్పుడప్పుడు వచ్చి వారు మెరుపులు మెరిపించి వెళుతుంటారు. నిజమే.
  అయితే మనం ఈ థీమ్స్ ఏదైనా ప్రత్యేక సందర్భంగా అయితే తీసుకోవచ్చేమో ....ఒక పండుగ వేళ లేదా ఇలా ఐదు వందలు పూర్తి అయిన వేళ ....అలా ..

  రిప్లయితొలగించండి
 39. అర్థ సహస్రాధిక పద్య పాద ఫణములపై పద్య పూరణా మణులతో వెలుగొందుచున్న" శంకరాభరణ " మునకు -
  ఓర్పు, నేర్పు తో నేర్పుచు పద్య రచనను ప్రోత్సహించుచున్న శంకరార్యులకు - నమస్కారములు.ఈ యజ్ఞము ఇలాగే నిరాటంకముగా కొనసాగి తెనుగు సాహితీ చరిత్రలో ఒక నూతనాధ్యా యముగా నిలవాలని కోరుకుంటూ.....

  వంద వంద నములు, పద్య పాదంబుల
  నైదు వందలిడిన యార్య మీకు
  వేల వేల నిచ్చు విబుధుండ వీవుండ
  నైదువంద లనిన నల్పమె కద!

  రిప్లయితొలగించండి
 40. బంధువుల పెండ్లి లో భార్య భర్త తో...

  పెండ్లి కొడుకు చూడ పెదనాన్న కొడుకాయె
  చాలు పిసిని బుద్ది చాలు లెండి !
  చాలు వేయి నాకు చదివింపు లకునిమ్ము
  ఐదువంద లనిన నల్పమెగద !!

  రిప్లయితొలగించండి
 41. దీక్షతపముజేసి మోక్షంబువొందగ
  పుణ్యమూర్తులకును పూర్వ జన్మ
  లెన్నిగలవొ గాని యీనాటితరమున
  కైదువందలనిన నల్పమె కద.

  ఎన్నో రకములైన పాపకర్మములను ( తెలిసి కొన్ని, తెలియక కొన్ని ) అనునిత్యము చేస్తున్నటువంటి ఈ తరము మనుష్యులకు ముక్తి రావడానికి 500 సంవత్సరములే అంటే తక్కువే కదా గురువు గారూ!!

  రిప్లయితొలగించండి
 42. అంగడికి బోవ శ్రీమతి అడిగె నన్ను
  సొమ్ము నొక కొంత కావలె నిమ్మనుచును
  వేగ తీసి యిచ్చిన నోట్ల విసరి కొట్టె
  ఐదు వందలే యనినచో అల్పమెగద

  తేటగీతగా పూరించినందుకు మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 43. మాస్టారూ, మీ రెండో పూరణ చూస్తుంటే యెప్పుడో (చిన్నప్పుడనుకొందాం) మీరు రైల్లో టికెట్ లేకుండా పట్టుబడ్డఅనుభవం వున్నట్టనిపిస్తోంది (నవ్వుతూ). విద్యార్థులుగా వున్నప్పుడు సిటీ బస్ కొనకుండా తిరగటం గొప్ప. మా గ్రూప్లో ఎవడైనా టికెట్ కొంటే వాణ్ని వుతికేసేవాళ్ళు. అలా నేను చాలా సార్లు మా గ్రూప్ కి దొరికిపోయేవాడిని. అయినా ticket లేకుండా తిరగటం అదో మజా లెండీ.

  రిప్లయితొలగించండి
 44. హనుమచ్చాస్త్రిగారూ, మా గొప్ప తెలుగు పెళ్లి సీను గుర్తుకు తెచ్చారు. "వాళ్ళు పది వేలు చదివిచ్చారు, మనం కనీసం రెండు వేలైనా చదివించక పొతే ఏం బాగుంటుంది చెప్పండీ" అనే పెళ్ళాలు కొందరైతే, " ఆ! యెమీ చదివిన్చక్కరలేదు, పర్సు జేబులో పెట్టండి ప్రతిదానికీ నేనున్నానని బయల్దేరుతారు" అని విసుక్కొనే పెళ్ళాలు కొందరు. ఏం చేస్తాం చెప్పడి!

  రిప్లయితొలగించండి
 45. పూరణములు జేయు పుణ్యాత్ము లందరికి
  వాగ్దేవి వర పుత్ర భాగ్య మబ్బె
  అష్ట శతస హస్ర యవధానములు జేయ
  ఐదు వంద లనిన నల్ప మెకద !

  రిప్లయితొలగించండి
 46. కంది వారి దయను పొందిన కాణాచి
  బ్లాగు నందు నాకు జాగ దొరికె
  వంద నమ్ము లివియె నందరికిని నాదు
  ఐదు వంద లనిన నల్ప మె కద

  రిప్లయితొలగించండి
 47. రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ
  "పూరణములు జేయు పుణ్యాత్ము లందరికి
  వాగ్దేవి వర పుత్ర భాగ్య మబ్బె"
  బాగుంది.

  రిప్లయితొలగించండి
 48. శంకరాభరణము బ్లాగుకి విజయోస్తు అనుచూ ఒక చిన్న పద్యము:

  మనమలరించు రీతి జనమాన్యులు సద్రసబంధురంబుగా
  నొనరుచునుండ ప్రక్రియల నూహల మించిన యూహలొప్పగా
  ననుపమ శబ్ద సంపదల, నర్థ విశేషములన్ వెలార్చుచున్
  దనరెడు శంకరాభరణ నామ్ని జయప్రకరంబు గాంచుతన్

  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 49. అమ్మా! రాజేశ్వరి గారూ!
  సీస పద్య పాద గణ భంగము కాకుండా, మరియు స్త్రీ పురుష భేదము లేని అన్వయము కొరకు మీ పద్య పాదమును ఇలా సవరించుదాము:

  పూరణములు జేయు పుణ్యాత్ములకునెల్ల
  వాగ్దేవి వాత్సల్య భాగ్యమబ్బె

  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 50. గురువు గారూ.,
  ధన్యవాదములండీ ...

  మందాకిని గారూ..,

  కాదండీ -- ఉన్నమాటే - రాత్రి భోజనానంతరం కూర్చుంటే - ఒక్కోసారి తేదీ మారినా కూడా పద్యం పూర్తవదు..

  పండిత నేమాని గారూ.,
  మీరు చెప్పిన మాట నిజమే నండి.. ఐతే - "U"తో మొదలుపెడితే యూక అని చదువుతారు .. "ooka" అని రాయటానికి ఇష్టం లేకపోయింది .. ఆంగ్లాక్షరం "O" సున్న లా ఉండటం తో - సున్నా తో మొదలుపెట్టటమ్ భావ్యం కాదని... అందువల్ల - ముందు "v" తగిలించాను ..

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ..,
  516 కు వ్రాయవలిసిన పూరణ ఇప్పుడే వ్రాసారు.., బహుశః 16 రూపాయల చిల్లర ఆ భార్య దగ్గర ఉన్నదేమో .. :)
  మీరు మా జట్టు సచిన్ టెండుల్కర్ అయ్యారు .. విద్యుత్ వాడు అనుగ్రహిస్తే ఓపెనెర్ గా వస్తారు .. లేకుంటే - మిడిలార్డర్!!!

  వర ప్రసాద్ గారు..,
  మీకు నేను తోడున్నాను .. కొనసాగించండి.. విజయోస్తు!!!

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 51. శంకరాభరణ సృష్టికర్తకు అభినందనలు.

  పొరుగుటింటిలోని పొలతికి తనభర్త
  పట్టు చీర కొనెను పండుగకని
  కోరినానె నేను చీరకు వేవేలు?
  ఐదు వంద లనిన నల్ప మె కద!

  రిప్లయితొలగించండి
 52. చంద్ర శేఖర్ గారూ! ఊక దంపుడు గారూ ! ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి