"శంకరాభరణం"
కవి మిత్రులకు, హితులకు, బ్లాగు వీక్షకులకు, మార్గదర్శకులకు
విజయదశమి శుభాకాంక్షలు!
కం.కవి మిత్రులకు, హితులకు, బ్లాగు వీక్షకులకు, మార్గదర్శకులకు
విజయదశమి శుభాకాంక్షలు!
వశమయ్యెను మీ స్నేహమ
యశము గడించినది ‘శంకరాభరణము’ బ్లాగ్
దిశలన్నిట నిండి, విజయ
దశమి శుభాకాంక్షలివె సదా మీ హితుడన్!
సీ.
పండిత నేమాని! ప్రణిపాతములు మీకు;
రామకృష్ణారావు! ప్రాంజలింతు;
హితుఁడ! యాచార్య ఫణీంద్ర! జోహారులు;విష్ణునందన! మీ కివే ప్రణతులు;
నరసింహ మూర్తి! ప్రణామముల్ చేతు; వసంత కిశోర్! మీకు చాగిలింత;
గోలి హనుమచ్ఛాస్త్రి! కొనుము నా కైమోడ్పు;మంద పీతాంబరా! వందనములు;
సంపత్కుమార్ శాస్త్రి! సన్నుతుల్ జేసెద;శ్రీపతి శాస్త్రి! యశేషనతులు;
సన్నతులు జిగురు సత్యనారాయణ!సామీచు లిత్తు మిస్సన్న! మీకు;
చంద్రశేఖర! నమస్కరణములు; వరప్రసాద్! కేలుమోడ్పులు చక్క నిడుతు;
మందాకినీ! నా నమసలు మీ కివియె; రాజేశ్వరి! మీ కివె యేటికోళ్ళు;
ఊఁకదంపుడు! స్నేహ మొప్పు చేమోడ్పులు;కోడిహళ్ళి మురళి! కొలుపు లివియె;
సదయ! కామేశ్వర శర్మ! జోతలు మీకు;అజ్ఞాతల కివె హస్తార్పణములు;
తే. గీ.మరచిపోయిన కవులార! యొరిగ లివియె;
బ్లాగు సందర్శకులకు సలాము లివియె;
పేరుపేరునఁ దెలిపెద విజయ దశమి
పర్వదిన శుభాకాంక్షలు సర్వులకును.
బుధజన విధేయుఁడు
కంది శంకరయ్య.
కంది శంకరయ్య.
మీ పలుకులు ఆశీస్సులు గా శిరోధార్యము.
రిప్లయితొలగించండిమీకు, మీ ఆత్మీయులందరికీ, కవిమిత్రులందరికీ దసరాశుభాకాంక్షలు.
గురువు శ్రీ శంకరయ్య గారికి, కవిమిత్రులకు పండితులకు ,వీక్షక మహాశయులకు దసరా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశారద కృపతోడ సాహిత్య రుచితోడ
రమణీయ పద్య పూరణలతోడ
ఆటవెలదితోడ తేటగీతులతోడ
నలరించు కందపద్యములతోడ,
చంపకమ్ములతోడ శార్దులములతోడ
మత్తేభ నుత్పల మాలతోడ,
కవిపండితులతోడ కావ్య చర్చల తోడ
గుణులైన వీక్షక గణముతోడ,
శంకరార్యుని సాహిత్య సౌరభమ్ము
పరిమళమ్ముల విరజిమ్ము ప్రతిదినమ్ము
విబుధ వర్యులకెల్లను "విజయదశమి"
పర్వదిన శుభాకాంక్షలు భవ్యముగను !!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిమిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !
____________________________________
పుణ్యాత్ముడ వీవయ్యా
మాన్యులలో పేరు గొనిన - మాన్యుడ వీవే !
ధన్యుడ నైతిని శంకర !
జన్యువు సతి చల్లని దయ - జల్లును నీపై !
____________________________________
తొలి ప్రొద్దు వేళలో తొణికిన కిరణాల
రిప్లయితొలగించండితోరణమ్మే "గోలి" పూరణమ్ము,
ఒక్క సమస్యకే పెక్కుపూరణములు
చక్కగాజెప్పు వసంతశోభ,
భావము భాషయు భవ్యరీతినజెప్పు
మిస్సన్న పూరణల్ లెస్సగావె,
వినయ విద్వన్మణి విష్ణునందనుగారి
పూరణాపటిమంబు బొగడతరమె,
పండిత నేమాని పద్యమందారాలు
పలుకులరాణికి పదసుమాలు,
ఊకదంపుడుగారి యూహా చమత్కృతి
నుల్లాస భరితమై నొప్పు గాదె,
రామకృష్ణారావు, రాజ రావు కవుల
రసరమ్య పూరణల్ రక్తిగట్టు,
కందిశంకరుగారి కమనీయపద్యాలు
కవిపండితులకు సౌగంధి కాలు,
ముదముగూర్చును నరసింహమూర్తి కవిత,
చక్కగానుండు రాజేశ్వరక్క రచన,
చంద్ర ,మందాకిని,జిగురు చతుర మతులు,
శాస్త్రి శ్రీపతి, సంపతుల్ శబ్ద నిధులు
యెంద రెందరో కవిరాజ చందురులకు
వందనంబులు "దసరా"భినందనములు !!!
పీతాంబరధరా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిలక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిమిమ్మల్ని మరిచి పొరపాటు చేసాను. మన్నించండి!
సలలిత భావమ్ములఁ గవి
తలు సెప్పెడి నిను మరచుట తప్పే! లక్కా
కుల వెంకట రాజారావ్!
కలత పడక నా నుతి గొని క్షమియింపు మయా!
గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిగురువు గారూ
పండిత వర్యులకు గురువరేణ్యులకు సత్కవవులకు చక్కని మిత్రులకు మహనీయులైన సోదర సోదరీమణులకు ఒక చలివేంద్రము సమకూర్చారు.మీకు పాదాభివందనములు. మీకు మన మిత్రులందఱికీ దసరా శుభాకాంక్షలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమధురమైన పద్యం చెప్పి కవిమిత్రులందరికి ఆనందం కలిగించారు. ధన్యవాదాలు. మీ పద్యం చూసి నేను ‘రాజారావు’ గారిని మరచిన విషయం గుర్తించాను. ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పద్యంతో అలరించారు. ధన్యవాదాలు.
పండితోత్తములకు కవివర్యులకును
రిప్లయితొలగించండిఒడుపుగా పాఠములఁ జెప్పు యొజ్జలకును
చెలగి కైతలఁ గూర్చెడు శిష్యులకును
సంగతిగ విజయదశమి మంగిడీలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరార్యులకు,
రిప్లయితొలగించండికవి మిత్రులందరకు విజయ దశమి శుభాకాంక్షలు.
చక్కని ' సీసాల్లో' మము ప్రేమతో ఇమిడ్చిన శంకరార్యులకు, పీతాంబరులకు ధన్యవాదములు.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్యగారూ
నమస్కారం
మీకూ మీ ఇంటిల్లిపాదికీ దసరా శుభాకాంక్షలు
శంకరాభరణంలోని కవి పండితులందరికీ శుభాభినందనలు
గట్టులరేనిబొట్టియును, గంగలరాయుని ముద్దుపట్టియున్,
పుట్టుకనిచ్చువానిసతి, పూజలు తాతొలియందువేలు పా
నట్టువరాయుడున్, హరియు, నాల్గుముఖమ్ములవేల్పు, ని
ప్పట్టున శంకరాభరణ పద్దెపుగాండ్లను బ్రోచుగావుతన్
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి వ్యాఖ్య .....
రిప్లయితొలగించండిఅయ్యా: ఎందరో మహానుభావులైన మిత్రులు - అందరికి శుభాకాంక్షలు.
విజయదశమి మీకున్ విందులెన్నెన్నొ గూర్చున్
సుజనవరులు మీరల్ శుద్ధచిత్తుల్ ప్రశస్తుల్
భుజగపనిభ విద్వన్ముఖ్యులౌ మిమ్ము వేడ్కన్
విజయమొదవగా దీవింతు నీ పర్వవేళన్
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి వ్యాఖ్య .....
రిప్లయితొలగించండిఅయ్యా! శుభాశీస్సులు. మీదు మరియు మాదు ప్రయోగములు పూర్వ కవులు చేయలేదు.
అవి అసాధువులని మా గురువులు చెప్పేరు. మీ పద్యమును ఇలా మార్పు చేస్తే:
వశమయ్యెను మీ స్నేహము
యశము గడించినది శంకరాభరణము బ్లాగ్
దిశలన్నిట నిండి, విజయ
దశమి శుభాకాంక్షలివె సదా మీ హితుడన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. సవరించాను.
వంక లెన్నొ బోవు 'శంకరా భరణమ్ము' (పాము)
రిప్లయితొలగించండివెలుగు చుండు దాని తలను మణియె
వంకలేమి లేక ' శంకరా భరణమ్ము' (బ్లాగు)
వెలుగు తానె మణిగ, వేడ్క సాగు.
శంకరాభరణ పద్యక్రీడ లో పాల్గొనుచున్న క్రీడాకారులందరకూ అందరకూ మరియు దర్శకసమూహానికి, దార్శనికులకూ,దసరా శుభాకాంక్షలు. రోజురోజు కు అభివ్రుధ్ధి చెందుతూ అభిమానులను పెంపొందించుకొనుచూ తెలుగు సాహిత్యామతల్లికి తమవంతు గా ఇతోధిక సేవచేస్తున్నతువంటి ఔచ్ఛాహికులందరకు నమస్సుమాంజలులు. శ్రీనివాస్ HYD
రిప్లయితొలగించండిచంద్రశేఖర్:
రిప్లయితొలగించండిమాస్టారు గారివి మరియు కవిమిత్రుల పద్యాలు చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. మంచి యెక్కడో లేదు మన మధ్యే వుంది అన్న సత్యాన్ని తలపించిందీ మాలిక. ఆదిభట్ల వారి అచ్చతెలుగు పద్యం తట్టి మరీ చెప్పింది, నాకు తెలిసిన తెలుగు తక్కువ, తెలుసుకోవసింది ఇంకా ఎక్కువని. "పద్దెపుగాండ్లు" పద ప్రయోగం మెచ్చదగింది. కాలప్రమాణంలో మీరు మాకంటే ముందు గాబట్టి ముందు మీకే విజయదశమి, మీ వెనుక మాకు విజయదశమి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వేజనాస్సుఖినో భవంతు.
పూజ్యులు,గురువర్యులైన శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గారికి, పూజ్యులు చింతా రామకృష్ణా రావుగారికి మరియు తోటి కవి మిత్రులందరికి పేరు పేరునా నా మన: పూర్వక దశరా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి
శంకరయ్య గారూ మీకూ , మీ భాషా సేవా తత్పరతకూ సదా విజయ సంప్రాప్తి కలగాలని ఆశిస్తూ ,
రిప్లయితొలగించండిసార్థక్యంబు మదీయ పద్య పఠనోత్సాహంబు ; నేడిట్లు వా
గర్థంబుల్ పెనవేసికొన్న కవితా గంధమ్ము పైజిమ్మె ; ని
స్వార్థంబైన త్వదీయ సత్కవన భాషాసేవ శ్లాఘింతు ; సం
ప్రార్థింతున్ మది శారదాంబ గృప సంరక్షింపగా మిమ్ములన్ !!!!
తక్కిన కవి బృందానికి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు ! మంద పీతాంబర్ గారి సీస పద్యాలు ప్రత్యేక ప్రస్తావనార్హాలూ ; ప్రశంసనీయాలూనూ . చిన్న చిన్నసవరణలు వినా శ్రీనాథుని శైలిలో నడిచాయి పద్యాలు - అభినందనలు పీతాంబర్ గారూ !!!
కంది శంకర వర్యులు సుందరముగ
రిప్లయితొలగించండిపద్య కవితను మెచ్చిరి బ్లాగు హితుల!
తెలుగు భాషామ తల్లికి వారు చేయు
సేవ కొనసాగు గావుత శ్రీకరముగ.
మంద పీతాంబరధరా ! దసరాభినందన మందారాలు.!
రిప్లయితొలగించండిగురువులకూ, పెద్దలకూ, తోటి కవిమిత్రు లందరికీ విజయదశమీ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువు గారికి, కవి మిత్రులకు దసరా శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండినేను పంపిన పద్యములో మూడవపాదములో ఒక పదం వ్రాయటం మరిచిపోయేను.
“నట్టువరాయుడున్ హరియు నాల్గు ముఖమ్ముల వేల్పు కూర్మి ని”
అని ఉండాలి. దయచేసి సవరిస్తారా
ప్రణతుల్ జేసెద సత్కవీశ్వరులకున్, ప్రజ్ఞా వివేకాది స
రిప్లయితొలగించండిద్గుణ శోభాయుత కీర్తిమంతులకు, భక్తుల్ శారదామాతకున్
మణిమాణిక్య సమాన భావకవితా మాధుర్యమైనొప్పుచున్,
గణనీయంబగు పద్యమాలికల సంగ్రాహించిరీ బ్లాగునన్.
కంది శంకరయ్య కమనీయ సీసంబు
రిప్లయితొలగించండిమాలికగవరలుచు మదులు తాకె.
విజయ దశమి శోభ వేవురికందించి
వెలుగు మీకు శుభము కలుగు గాక.
గురువుగారూ,
రిప్లయితొలగించండిపొద్దుటి నుంచీ చాలా పర్యాయాలు చదివానండీ - మీ పద్యాలనూ, కవి పండితుల స్పందనలనూ..
ఏమి చెప్పాలో కూడా తెలియటం లేదు....
ఈ బడిలో ( ఇంచుమించు) నిత్యవిద్యార్ధినవ్వటం నా అదృష్టం..
సరస్వతీ మూర్తులందరికీ వందనాలు, కృతజ్ఞతాంజలులు.
భవదీయుడు
ఊకదంపుడు
అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన
రిప్లయితొలగించండిమందాకిని గారికి,
మంద పీతాంబర్ గారికి,
వసంత కిశోర్ గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
రవి గారికి (మరచినందుకు మన్నించాలి),
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
పండిత రామజోగి సన్యాసి రావు గారికి,
శ్రీనివాస్ గారికి,
(మనతెలుగు) చంద్రశేఖర్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
డా. విష్ణునందన్ గారికి,
మిస్సన్న గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
చింతా రామకృష్ణారావు గారికి,
ఊకదంపుడు గారికి,
దసరా శుభకాంక్షల ప
ద్య సరణి మెచ్చి యిచ్చి యానందోత్సా
హ సుధలు గురిసి మనంబున
వసియించెడి మీకు ధన్యవాదమ్ము లివే!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ మంద పీతాంబర్ గారికి, యితర కవిమిత్రులందరికి కృతజ్ఞతలు. పద్యములు వ్రాయుటకన్నా, మీవంటి మహామహులు వ్రాసిన పద్యాలు చదువుతూ వుంటే నాకు ఎక్కువ ఆనందం కలుగుచున్నది. మీ వూహలలో నాకు గుర్తింపు లభించినదులకు చాలా సంతోషము.