3, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -481 (అలుక విభూషణము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
అలుక విభూషణము సుజను లగువారలకున్.

45 కామెంట్‌లు:

  1. ఇలలో సుందరమగు రా
    తలు, కవి భూషణము. సుజనులగు వారలకున్
    పలువుర మెప్పులు నప్పును.
    కలలగు నాభరణములిక కన్యల కెల్లా.

    అలు ని రాతలు గా చేయకూడదేమో అని సందేహము. మరొక పూరణ చేయటానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    మంచి ప్రయత్నం. అభినందనలు.
    ‘రాతలు’ అనకూడదు. దానివల్ల యతి తప్పుతున్నది. అక్కడ ‘విద్యలు’ అంటే యతి సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  3. తొలి వలపుల యందు చెలియ
    కలుక విభూషణము. సుజను లగువారలకున్
    చెలువపు కవనపు సొబగుల
    పలుకులె భూషణము. తగవు పరుషపు మాటల్.

    గురువుగారు, సవరణకు ధన్యవాదములు.
    ఇప్పుడు కూడా చెలియకు+అలుక - చెలియకలుక అనవచ్చునా అని సందేహము.

    రిప్లయితొలగించండి
  4. గురువు గారి సవరణలకు ధన్యవాదములు
    గాలి సొదరులు సి బి ఐ వారికి సమాదానములివ్వ కుండెను, అది మంచిదను కొనుచుండెను
    -------------------
    పలుకు బలకకుండెను లే
    బలువుర తోడ మనగాలి పదుగురెదుట దా
    పలుకుబడి పలుచనై, నే
    డలుక, విభూషణము సుజనులగు వారలకున్|

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, అక్టోబర్ 03, 2011 1:14:00 PM

    పిలిచిన బ్రేమగ బలుకుచు
    సలలితసంభాషణాది చాతుర్యములన్
    సలిపెడి సతికడ నెయ్యపు
    టలుక విభూషణము సుజనులగువారలకున్.

    నెయ్యపుటలుక = ప్రణయకలహము
    నెయ్యము + అలుక = నెయ్యపుటలుక

    రిప్లయితొలగించండి
  6. కలలే పండగ పాకను
    వల అల్లిక తడిక నిలిపి వాకిట మ్రుగ్గున్
    జిలుకగ గోమయమున తా
    మలుక, విభూషణము సుజను లగువారలకున్

    రిప్లయితొలగించండి
  7. నా పూరణలు ....
    (1)
    తలిదండ్రుల గురువులఁ బె
    ద్దలఁ బూజించుచు, నిధనుల దయఁ జూచుచు, దు
    ష్టులపైఁ జూపెడి ధర్మపు
    టలుక విభూషణము సుజను లగువారలకున్.
    (2)
    (మందాకిని గారి మొదటి పూరణ స్ఫూర్తితో ...నిజానికి ఇది సరైన పూరణ కాదని నా అభిప్రాయం)
    ఇల నరసింహాఖ్యుఁడు రా
    యలు కవి; భూషణము సుజనులగు లగువారలకున్
    వెలయఁగను విష్ణుచిత్తీ
    య లలిత కావ్యపఠన మది; యాతని కృతియే.

    రిప్లయితొలగించండి
  8. "అలుక విభూషణము సుజను లగువారలకున్." అన్నప్పుడు లాక్షణికంగా సరిగానే ఉంది గాని కందపు నడక యేమాత్రం రాలేదు. తెలుగు పండితుడిగా అనుభవం దండిగా ఉన్న మీకు ఇలా చెప్ప వచ్చునో లేదో తెలియదు.

    రిప్లయితొలగించండి
  9. "శ్యామలీయం" గారూ కందం నడక రాలేదని అన్నారు. మీరు ఇదే భావాన్ని, వీలైనంతవరకు ఇదే పదజాలాన్ని వాడి దానికి ఉదాహరణ ఇవ్వమని ప్రార్థన.
    ఈ బ్లాగుకి చిరకాల మిత్రుడు,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. "పలక" బడిలోబుడుతలకు,
    "గిలక" పెరటి బావులకును, గెలచెట్టులకున్
    "పిలక" యుభూసురుతలలకు
    "నలుక" విభూషణము సుజనులగువారలకున్!!!

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణలు ....

    (1)
    అలిగె మహాత్మా గాంధీ
    నిలిచె భరత జాతియెల్ల నేతకు తోడై
    గెలిచె స్వతంత్రోద్యమమున
    నలుక విభూషణము సుజనులగు వారలకున్
    (2)
    పలు నగలు కావ్య కన్యకు
    సలలిత శబ్దార్థములు రసమ్మును ధ్వనియున్
    తలపగ కవితల నట్టి హొ
    యలు కవిభూషణము సుజనులగు వారలకున్

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    కులుకులు కోమలవతులకు
    పలుకులు పండిత వరులకు - వరములు గావే !
    అలివేణుల ప్రణయములో
    అలుక విభూషణము సుజను - లగువారలకున్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  13. కాశీలో వ్యాసుడు :

    02)
    _________________________________

    మలమల మాడుచు నెండను
    ఇలునిలు భిక్షకు దిరుగుచు - నిహ భోగముకై
    కళవళ నొందెడి తరి, కా
    దలుక విభూషణము సుజను - లగు వారలకున్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  14. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

    అలిగియె సత్యా దేవియు
    నలిగియు సత్యావిధేయు నమ్మియు సత్యన్
    ఇల వగచిరి కావున కా
    దలుక విభూషణము సుజను లగువారలకున్

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘చెలియ కలుక’ అనడంలో ఏ దోషమూ లేదు.
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    మౌనమే అలంకరమంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ ‘నెయ్యపు టలుక’ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అలుకకు ఉన్న అర్థభేదాన్ని చక్కగా వినియోగించుకొని మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ‘కేయూరబాహు చరిత్ర’లోని క్రింది పద్యం స్ఫూర్తితో ఈనాటి సమస్యను సిద్ధం చేసాను.
    చెలిమి శిలాక్షర మెప్పుడు
    నలుక జలాక్షరము సుజను లగువారలకుం,
    జెలిమి జలాక్షర మెప్పుడు
    నలుక శిలాక్షరము కుజను లగువారలకున్.
    పై పద్యంలోని 2,4 పాదాల నడక చూసారా? రెండవ పాదంలో ‘జలాక్షరము’ అన్నచోట ‘విభూషణము’ చేర్చాను. అంతే!

    రిప్లయితొలగించండి
  16. చిలుకకు తీయని పలుకులు,
    నెలతకు వలపుల తలపులు ,నేతకు చేతల్
    కులుకుల నడకలు నెమిలికి
    నలుక విభూషణము సుజనులగువారలకున్.

    రిప్లయితొలగించండి
  17. **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    ఏదో పెద్దబాలశిక్షలోని పద్యాన్ని చదివినట్లుగా ఉంది. చక్కని నడకతో మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    కాని ‘అలుక సుజనులకు అలంకారం’ అనడంమే ఇబ్బందిగా ఉంది. మూడవ పాదాన్ని ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
    "పిలక" తలకు, దుష్టులపై
    యలుక .....
    (పూర్వం ‘పిలక’ బ్రాహ్మణులకే కాదు సర్వవర్ణాల వారికి తప్పని సరి యట!)
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    ‘సత్యాగ్రహాన్ని’ ప్రస్తావించిన మొదటి పూరణ, ‘కవిభూషణము’లను వివరించిన రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యం గలిగి ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని ‘సత్యాదేవి, సత్య’ అని పునరుక్తి ? ముందు పంపిన పూరణలో కైక ప్రస్తావన బాగుంది. అక్కడ ‘కైకాదేవియు’ అనకుండా ‘కేకయపుత్రిక’ అంటే సరిపోయేది. మీరు సవరణ పంపారు కదా అని తొందరపడి దానిని తొలగించాను.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  18. మంద పీతాంబర్ గారూ,
    వృత్యనుప్రాసాలంకార శోభితమై మీ రెండవ పూరణ అలరించింది. అభినందనలు.
    కాని మొదటి పూరణలో చెప్పిన అభ్యంతరమే ఇప్పుడు కూడా!
    ‘కులుకులు నెమలికి, నెయ్యపు
    టలుక .... ’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  19. అలిగియె నలివేల్ మంగమ
    వెలసెను కొండను దిగి విభునితొ కినుకన్ !
    చిలిపిగ సతితో నెయ్యపు
    టలుక విభూషణము సుజనులగు వారలకున్ !

    రిప్లయితొలగించండి
  20. వలపుల ఝడిలో తడిసిన
    చెలియకు నలుగుట సహజము చెన్నుని కైనన్ !
    చెలువముగ చిలిపి పలుకుల
    అలుక విభూషణము సుజనులగు వారలకున్ !

    తమ్ముడూ ! ఒకటైనా రైటవుతుందేమో అని ?

    రిప్లయితొలగించండి
  21. 1.
    తెలియక రఘు రాము ఘనత
    బలమది చాలదని పలికె పంక్తి రథుండే!
    అలిగెను గాధేయుడపుడు
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    2.
    అలిగిన కైక పరుషముగ
    పలికెను వనవాసము రఘు వరునకు ననుచున్
    తెలియ తరమె తరుణి తలపు?
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    3.
    వెలది ధరణిజను తాటకి
    ఫలమ్ము వలె మ్రింగఁ దలచి పైబడు వేళన్
    కలహించె లక్ష్మణుడపుడు
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    4.
    నెలలు గడిచినను వెదక త
    రలి రారు కపులు రఘు వర రమణి ధరణిజన్
    కలతనలిగె సౌమిత్రుడె
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    5.
    అలయక సంద్రము గెంతిన
    బలవంతుని వాలమునకు వహ్ని రగల్చన్
    వెలింగించె లంకను హనుమ
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    6.
    కలనమున మేటి యనుజుడె
    నిలువగ మూర్చిల్లెననుచు నీరము కంటన్
    జలజల కారంగనలిగె
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    రిప్లయితొలగించండి
  22. చంద్రశేఖర్ గారికి అభివాదాలు. ఇదే పదజాలాన్ని పూర్తిగా వాడితీ యిదే అవుతుందికదా. కొంచెం మార్చక తప్పదు కదా.
    అలుక విభూషణము సుజను లగువారలకున్ అనటం కన్నా అతిసులువుగా యిలా అనవచ్చును.
    అలుకయు భూషణము సుజను లగువారలకున్. ఇప్పుడు నడక మరింత బాగా కుదురింది కదా.

    అలుక శిలాక్షరము కుజను లగువారలకున్. అన్నచోట విరుపులకీ అలుక విభూషణము సుజను లగువారలకున్ అన్నచోట విరుపులకీ బేధం ఉందని నా అభిప్రాయం. నిజానికి క్ష, ష లు రెండూ లఘువులే కాని, క్ష అనేది కొంత ద్విత్వస్వభావాన్ని చూపటం వలన పలుకుబడిలో నడక తేడా వస్తున్నది. స్వల్పంగానే. కాని, కందం నడక ప్రధానమైన జాతిపద్యం. దానికి మనం గణాలు పట్టుకుంటున్నాంకాని నడకే కందానికి అందం.

    రిప్లయితొలగించండి
  23. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారు సూచించిన మార్పులతో వారి పూరణ .....

    అలిగియె కేకయపుత్రిక
    యలిగియు నా సత్యభామ యా పిదపను తా
    మిల వగచిరి కావున కా
    దలుక విభూషణము సుజను లగువారలకున్.

    రిప్లయితొలగించండి
  24. గన్నవరప నరసింహ మూర్తి గారి పూరణ + వ్యాఖ్య ...

    అలికుల వేణుల కిలలో
    నలుక విభూషణము ,సుజనులగు వారలకున్
    దెలియద ? తిమ్మన జెప్పెగ
    పలు బాసల పారిజాత ప్రస్తావమునన్ !

    శ్యామలీయము గారికి వందనములు. వివిధ చతుర్మాత్రా గణములతొ పరుగెడుతూ ఆరవ గణములొ జ గణము గాని నలము గాని ఉండే కంద పద్యాలకు ఒకే నడక ఉండా లంటే సాధ్యమా ? కందములు మర్కటాలు ! ఎలాగైనా గెంతుతాయి. పరుగెడుతాయి.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! ధన్యవాదములు.
    నా అభిప్రాయం ప్రకారం ప్రతి పద్యం లోనూ ప్రత్యేకమైన గణముల అమరిక వుంటుంది కనుక నడక గురించి ప్రత్యేకంగా ఆలోచించ వలసిన పనిలేదు. గణ దోషములు, యతి ప్రాస దోషములు లేకుంటే సరి.

    రిప్లయితొలగించండి
  26. చంద్రశేఖర్:
    వలచి వలపించునా పొల
    యలుక విభూషణము సుజను లగువారలకున్
    తొలిపక్కము మలుపక్కము
    కలువలదొర పట్టువిడుపు కాదేమి ప్రియా!
    మనవి: ఈ రోజు యెందుకో mood రసికత వైపు మళ్ళింది. బహుశ: వారాంతంలో విశ్వనాధ వారి "ఏకవీర" నవల చదవటం వల్లనేమో! అది ఒక రసావిష్కరణ. స్నేహానికీ ప్రేమకీ మధ్య వుండే సంఘర్షణని యెంత సునిశితంగా లాక్కొచ్చారో, అందుకే ఆయన సాహితీ విశ్వనాధ.

    రిప్లయితొలగించండి
  27. **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి, అభినందనలు.
    మొదటి పూరణలో అది ‘అలివేల్’ కాదు ‘అలమేల్’. రెండవ పాదంలో గణదోషం ... నా సవరణ ...
    ‘అలిగియె నలమేల్ మంగమ
    వెలసెను కొండ దిగివచ్చి విభుపై కినుకన్ ....’
    రెండవ పూరణలో ‘ఝడి’ని ‘జడి’ చేస్తే సరి!
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    శ్రీరాముని చారిత్రము
    నారింటను జిగురు సత్యనారాయణ! నీ
    వీరీతి చెప్పితివి; నీ
    పూరణములు సర్వులకును మోద మ్మొసఁగున్.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పారిజాత ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    శ్యామలీయం గారి వ్యాఖ్యకు స్పందించినందుకు ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  28. (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యరచనా నైపుణ్యం తొలిపక్కంలో శుక్లపక్ష చంద్రు డౌతున్నది. సంతోషం!
    మధురమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. శ్యామలీయం గారూ, అందుకే "వీలైనంత మటుకు" అని ముందే విన్నవించుకొన్నాను. మీ వివరణలోని పాయింట్ అర్థం అయింది. ధన్యవాదాలు.
    కందపద్యం నడక గురించి మా మిత్రులు డా.మూర్తి గారు చక్కగా సెలవిచ్చారు. అయితే "కందములు మర్కటాలు" అన్నారు. మరి అవి కూడా "బ్రహ్మచారు" లేమో :-)

    రిప్లయితొలగించండి
  30. మాస్టారూ,
    కేయూరబాహు చరిత్ర నుంచి చక్కని పద్యం చెప్పారు. personality development కోసం కుర్రాళ్ళు వేలకి వేలు తగలేస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి పద్యాలు నాలుగు చదివి జీర్ణంచేసుకొంటే చాలు. management techniques బోధించే పద్యాలు మన సాహిత్యంలో యెన్ని వున్నాయో చెప్పలేము. అందుకే ఒకాయన జోకు చేస్తూ అన్నాడు, "మన పూర్వీకులు మన ఐడియాలన్నీ కొట్టేశారండీ, ప్చ్ ఏం చేస్తాం...". వ్యాస, వాల్మీకి తాత గార్లు మానవ జాతికి లక్ష గ్రంథాల పెట్టు, వారికి మనం యెన్తో ఋణపడివున్నాము.

    రిప్లయితొలగించండి
  31. అలిగినవేళనె చూడాలి - తారకరాముని అందాలు-
    విగ్రహాలు పోయిన తరువాత త్యాగరాజు:

    అలుకేమిబూనితివొ,యిన
    కులతిలకా!త్యాగరాజుకుఁ దెలుపకఁ జనన్
    తిలకింపనైతినినపుడు- ( నిన్-అపుడు)
    అలుక విభూషణము సుజను లగువారలకున్.

    ఇంతలోనే :-
    కలనైన నీదు రూపమె-
    తెలియుము నిలిపితిని నిన్ను తిరమని నమ్మీ
    ఇలుజేరుము రామా!కా
    దలుక విభూషణము సుజను లగువారలకున్

    రిప్లయితొలగించండి
  32. **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    మంచి విషయం ప్రస్తావించారు. ధన్యవాదాలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    మీరు సవ్యసాచులు. అలుక మంచిదీ, చెడ్డదీ అంటూ చక్కని పూరణలు చెప్పారు. బాగున్నాయి. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  33. ఊకదంపుడు గారూ,
    రెండవపూరణ రెండవ పాదంలో ‘నమ్మీ’ అని వ్యావహారిక పదం వేసారు.
    ‘నిన్ను తిరమని నమ్మీ’ అన్నదానిని ‘నీవె తిరమంటిని నా / యిలు జేరుము ...’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  34. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, అక్టోబర్ 04, 2011 12:44:00 AM

    గురువు గారూ,

    ఇంత రాత్రిలో కూడా అలుపెరగక మీరు చేస్తున్న యీ తెలుగు భాషా సేవ మహోన్నతమైనది. మీకు నా జోహార్లు.

    అభివాదములు.

    రిప్లయితొలగించండి
  35. నా మూడవ పూరణలో పొరబాటున శూర్పణఖ స్థానాన్ని తాటకి కబ్జా చేసింది.
    సవరణ:-
    కలబడి శూర్పణఖ యెగిరి
    గళము పడిసి మ్రింగఁ సీత పైబడు వేళన్
    కలహించె లక్ష్మణుడపుడు
    అలుక విభూషణము సుజను లగువారలకున్!!

    రిప్లయితొలగించండి
  36. జిగురు వారూ,
    అర్ధరాత్రి నిద్రముంచుకొస్తున్న తరుణం ... ఎదురుగా ఉన్నది తాటకో, శూర్పణఖో నేను గమనించలేదు :-)

    రిప్లయితొలగించండి
  37. గోలి హనుమచ్ఛాస్త్రి గారు నడక గురించి ప్రత్యేకంగా ఆలోచించ వలసిన పనిలేదు. గణ దోషములు, యతి ప్రాస దోషములు లేకుంటే సరి అని చెప్పారు.. వారితో యేకీభవించలేకపోయినందుకు క్షమించాలి. నిజానికి కందమైనా వృత్తమైనా నడకే అందం. అయితే వృత్తాలకు నిర్దిష్టమైన గణ నియమం ఉంది. తెలుగు వాళ్ళం యతిప్రాసలు కూడా నియమించుకున్నాం - అది వేరే సంగతి. కందం జాతి పద్యం. సంస్కృతం యెక్క ఆర్యావృత్తాన్ని అనుకరిస్తుంది. కందానికి, ముందే మనవి చేసినట్లు గణాలు నడకను బట్టి సరిపోల్చుకుని నియమించుకున్నాం. వృత్తాలకు గణాలు నిమితాలయనా, కందానికి సాధించుకున్నవయినా సరయిన పద్యంలో నడక కుదరనప్పుడు గణాలు సరిగ్గా ఉన్నా, యతి ప్రాసలు బాగున్నా చక్కగా ఉండవు. ఔత్సాహికులు గణాలు కూర్చుకుంటూ గణ దోషములు, యతి ప్రాస దోషములు లేకుండా వ్రాసినా చదువరులకు చేయితిరిగిన కవి పద్యాలకు తులతూగలేక పోవడం స్పష్టంగా తెలిసిపోతుంది కదా. నా యుద్దేశం ఇక్కడ సమస్యాపూరణాలు చేస్తున్న అనాకానేక ఔత్సాహిక మిత్రులని కించపరచడం కానేకాదు సుమా. ఉదాహరణకు ఒక సమర్ధుడైన చిత్రకారుడు అలవోకగా గీసిన రేఖాచిత్రానికీ, నాబోటి వాడు జాగ్రతగా గీతలు చేర్చుకుంటూ వేసిన చిత్రానికీ తేడా యెక్కడ వస్తుందంటే రేఖల నడకలోనే మొదట. కందానికి గలవిలక్షణమైన నడక గురించి పూర్వమే కొందరు కొన్ని చమత్కార ప్రయోగాలద్వారా కొత్తదనాల కోసం ప్రయత్నించడం గమనార్హం. నారాఐణరెడ్డిగారైతే 'మాకందం' అంటూ ఒక ప్రయత్నం చేసినట్లు గుర్తు లోగడ. యతిప్రాసల విషయానికి వస్తే బెంగాలీ వాళ్ళకు కూడా యివి ఉన్నట్లుంది - యెందుకంటే పూర్వం మైఖేల్ మధుసూదన దత్ యతిప్రాసలు విడిచిపెట్టి 'మేఘనాధ వధ' వ్రాసి సంచలనం సృష్టించాడు. ఇదంతా యెందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే పిడి నియమాలలో కన్నా పద్యం అనేదానికి నడక అనే దానిలోలే ప్రాణం ఉంటుందని విన్నవించడానికే. ఇకపోతే శంకరయ్య గారన్నట్లు కందములు మర్కటాలు ! ఎలాగైనా గెంతుతాయి. పరుగెడుతాయి. ఇందులో సందేహంలేదు. నా మాటకూడా అదే. సడక కుంటితే కుంటికోతులవలే జాలి పుట్టిస్తాయి గాని బాగుండవనే నే చెప్పేది. చివరగా ఒకమాట. కందమయేది వృత్తమయేది మరొకటయేది యెలా నడిపించుకోవాలనేది నిరంకుశుడైన కవి యిష్టం - జనాదరణ సాధించడం కవి సమర్ధతమీది ఆధారపడిన విషయ.

    రిప్లయితొలగించండి
  38. అయ్యా, ‘శ్యామలీయం’ గారూ,
    ‘కందాలు మర్కటాలు’ అన్నది నేను కాదు. గన్నవరపు నరసింహ మూర్తి గారు. గమనించమనవి.
    ‘అలుక శిలా-క్షరము సుజను లగువారలకున్’
    ‘అలుక విభూ-షణము సుజను లగువారలకున్’
    పై రెండింటి నడకలో నాకైతే ఏమాత్రం తేడా క(వి)నిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  39. ఆర్యా ! శ్యామలీయం గారూ !నేను నడక గురించి ప్రత్యేకంగా ఆలోచించ వలసిన పనిలేదు అని మాత్రమే అన్నాను. మొదట తప్పటడుగులు పడకుండా సరిగా నడవటం నేర్చుకుంటే నడక దానంతటదే అలవడుతుందని నా ఉద్దేశ్యం. అది మనిషి మనిషికీ మారుతుంది.మీరు చెప్పినట్లు నడక బాగుంటే అందం ఇనుమడిస్తుంది సందేహం లేదు.
    మీలాటి వారి సద్విమర్శలతో మాలాటి ఔత్సాహికులకు విషయము విస్తారముగా తెలుసుకొనే అవకాశం కలుగు తుంది.ఓపికగా వివరముగా తెలిపినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  40. ఉలుకుచు నెప్పుడు మనమున
    పలుకక మధురమగు మాట పామరులనుచున్
    కులుకిన కినుకలు నచ్చని
    యలుక విభూషణము సుజను లగువారలకున్

    రిప్లయితొలగించండి
  41. సులువుగ గెల్చెద నేనని
    కులుకగ బెంగాలి దీది కుందెను కడకున్...
    వలువలు విప్పగ వోటరు
    లలుక విభూషణము సుజను లగువారలకున్

    రిప్లయితొలగించండి