ప్రముఖ నేత్రవైద్యులు
శ్రీ వద్దిరాజు శ్రీకాంత్ గారి
షష్టిపూర్తి మహోత్సవము
ది. 13-10-2011 నాడు జరిగిన సందర్భమున సమర్పించిన
సన్మాన నవరత్నాలు
శ్రీ వద్దిరాజు శ్రీకాంత్ గారి
షష్టిపూర్తి మహోత్సవము
ది. 13-10-2011 నాడు జరిగిన సందర్భమున సమర్పించిన
సన్మాన నవరత్నాలు
శ్రీ ప్రసన్నాంజనేయు విశిష్టదయను
వీరభద్రుని సుకటాక్షవీక్షణమున
గురువరుండు దత్తాత్రేయు కరుణవలన
కలుఁగు సర్వశుభములు శ్రీకాంత నీకు!
తే. గీ.
వద్దిరాజు వంశాబ్ధి విభాకర! నర
సింహ రావు సరోజిని చెన్ను మీఱు
దంపతులు, వారి సుతుఁడవై తనరి, వైద్య
విద్యలో గడించితివి ప్రావీణ్య మీవు!
తే. గీ.
ఉత్తమేంద్రియమై నేత్ర మొప్పు ననుచు
తచ్చికిత్సలో నైపుణ్యతను గడించి
వైద్యమును వృత్తిగా పొంది వరలి, యుచిత
నేత్రవైద్య శిబిరముల నిర్వహింతె!
తే. గీ.
వాసి గాంచిన ఆలూరి వంశమందు
రాణ కెక్కె లక్ష్మీపతి రావు ఘనుఁడు
శారదా దేవి యాతని సతియు, వారి
తనయ శర్వాణి నీకయ్యె ధర్మపత్ని.
కం.
గర్వము నెఱుంగక నుమా
శర్వుల సేవించు, వైద్యశాస్త్రజ్ఞతలో
సర్వులు మెచ్చు ప్రతిభగల
శర్వాణి హిత సహదర్మచారిణి యయ్యెన్.
తే. గీ.
వయసు పైఁబడి ప్రేమను బాసి కుములు
వృద్ధులకు సేవచేయు సత్కృప నయితివి
కార్యదర్శి; వృద్ధాశ్రమ మార్యజనులు
మెచ్చగా నిర్వహించెడి మేటి వీవు!
తే. గీ.
అనయము లయన్సు క్లబ్బు కధ్యక్షుఁడ వయి
పేద విద్యార్థులకు సర్వవిధములైన
హితము గావించియు సమాజహితము గోరి
చిరము సంసేవకార్యముల్ చేసినావు.
కం.
‘అరు’ ణనెడి జ్యేష్ఠపుత్త్రుఁ డ
మెరికాలో నింజనీరు, మఱి యశ్విని యం
దరు మెచ్చు కోడ లయ్యెను;
‘కిరణు’ ద్వితీయుండు వెజ్జు కీర్తింపఁబడున్.
కం.
ఘనుఁడవు శ్రీకాంత్! కూరిమి
చనువు గలిగి మెలగునట్టి శర్వాణి! సదా
యనుకూలదంపతులుగా
జననుతులై పొందుఁడు సుఖసంతోషములన్.
రచన, సమర్పణ
బాల్యమిత్త్రుడు
కంది శంకరయ్య.
బాల్యమిత్త్రుడు
కంది శంకరయ్య.
శంకరార్యా ! నవ రత్నాలు నవనవలాడుచు భాసించు చున్నవి.
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నమస్కారములు
రిప్లయితొలగించండినా చిన్నప్పుడు అన్ని శుభ కార్య ములకు ,మంచి మంచి పద్యాలను ఇలాగే " పంచ రత్నములు ,నవరత్నములు ,రాగ మాలికలు ,లాంటివి వ్రాసి కానుకగా ఇచ్చేవారు. మధ్యలో నాకు తెలియలేదో లేక కొంత మరుగున పడిందో తెలియదు .మళ్ళీ ఇప్పుడు మన బ్లాగుల్లో చూస్తున్నాను. పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నందుకు చాలా ఆనందం గా ఉంది. వ్రాసిన వారు , వ్రాయించు కో గలిగిన అదృష్టవంతులు ధన్యులు .చాలా బాగున్నాయి.