6, అక్టోబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -484 (ద్వాదశి తిథి మంచి దగును)

కవి మిత్రులారా,
విజయ దశమి శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ద్వాదశి తిథి మంచి దగును దసరా చేయన్.

14 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  కాదది నెవ్వరు జెప్పిరొ
  ద్వాదశి తిథి మంచి దగును - దసరా చేయన్ !
  సాదరముగ దుర్గమ్మకు
  పాదార్చన దశమి నాడు - వలయును జేయన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 2. సాదర పారణమునకున్
  ద్వాదశి తిథి మంచి దగును; దసరా చేయ
  న్నాదశమియె సరి జమ్మిని
  ఛేదించి విజయోత్సవములు చెంగున జరుపన్!

  రిప్లయితొలగించండి
 3. కాదందురు కొందరుమరి
  ద్వాదశితిథిమంచి! దగును దసరా చేయ
  న్నీదశమినాడు, జూడగ
  నాదశమే నేడువచ్చె నశ్వీజమునన్!!!

  రిప్లయితొలగించండి
 4. మీదట ఏకాదశి ? ఏ
  కాదశి ముందున్న దశమి కార్యము కెటులౌ?
  ఈదరి పులి ముసుగెందుకు ?
  ద్వాదశితిథి - మంచి దగును - దసరా చేయన్.

  రిప్లయితొలగించండి
 5. పాదార్చన శ్రీ జననికి
  సాదరముగ దశమి వరకు, సర్వుల కౌనే-
  కాదశి, పారణమునకున్
  ద్వాదశి తిథి ! మంచి దగును దసరా చేయన్.

  రిప్లయితొలగించండి
 6. రాదని తెలిసెను జీతము
  మోదమలర దశమి నాడు మోజులు తీర్చన్
  పేదకు జీతము వచ్చిన
  ద్వాదశి తిథి మంచి దగును దసరా చేయన్!!

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

  వాదించిరివ్విధమ్మున
  నేదో పాశ్చాత్య రీతి నెరిగిన వారల్
  వేదమిదే పాటించుడి
  ద్వాదశి తిథి మంచిదగును దశరా చేయన్

  రిప్లయితొలగించండి
 8. కంది శంకరయ్య కమనీయ సీసంబు
  మాలికగవరలుచు మదులు తాకె.
  విజయ దశమి శోభ వేవురికందించి
  వెలుగు మీకు శుభము కలుగు గాక.

  రిప్లయితొలగించండి
 9. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  మోదమున మేము సేతుము
  వాదించక పండుగలను వారాంతములో
  కాదనరు పురోహితులును !
  ద్వాదశి తిథి మంచి దగును దసరా చేయన్ !!

  రిప్లయితొలగించండి
 10. ఈ రోజుల్లో ఏ పండగ ఏ తిధిన వస్తుందో ఎవరికి తెలుసండీ - కాలెండర్ లో ఎర్రరంగు లో ఉన్న తేదీలు చూసుకోవటమే


  కాదే దయనీయమిదే?
  నాదేశమునందునేడునవతరమకటా!
  కాది,దసత్యమనదు, విని:
  "ద్వాదశి తిథి మంచిదగును దశరా చేయన్"

  [కాది,దసత్యమనదు : కాదు.ఇది అసత్యము. అనదు]

  రిప్లయితొలగించండి
 11. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కాదది + ఎవ్వరు + చెప్పురొ’ అన్నప్పుడు ‘కాదది యెవ్వరు సెప్పిరొ’ అవుతుంది.
  **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  మంచి విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చివరి పాదంలో గణదోషం. ‘విజయోత్సవములు’ను ‘జయోత్సవములు’ అంటే సరి!
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘దశమి + ఏ’ అన్నప్పుడు సంధి లేదు. ‘దశమియె’ అంటే సరి!
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  జిగురు సత్యనారాయణ గారూ,
  వాస్తవాన్ని మీ చక్కగా వివరించారు. అభినందనలు.
  నేనే ఉదాహరణ. సమ్మెవల్ల పెన్షన్ రాలేదు. అప్పు ఇస్తానన్న మిత్రుడు మొహం చాటేసాడు. దాంతో కొత్త బట్టలు లేకుండానే ఒక విధంగా నాకు దసరా చప్పగానే గడిచింది.
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
  ఇంకా నయం! ద్వాదశినాడైనా చేసుకోమన్నారు. అసలే వద్దనలేదు. సంతోషం!
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  అయితే మీ పూరోహితులూ అమెరికా పద్ధతులనే పాటిస్తారన్న మాట!
  మా అబ్బాయి మిత్రుడు ‘వేణుమాధవ్’ చదువు అబ్బలేదు. ఒక సంవత్సరం అయ్యప్ప మాల వేసి నేను గురుస్వామిగా అయ్యప్ప పడిపూజలు చేయిస్తుంటే నాకు ‘అసిస్టెంటు’గా ఉండి పూజావిధానం కొంత నేర్చుకొని, తర్వాత వీసా సంపాదించి అమెరికా వెళ్ళి అక్కడ ‘పౌరోహిత్యం’ చేస్తున్నాడు!
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 12. ఏదిశలో పయనించిన
  నాదిశలోనుండు దుర్గ, నమ్మితి నిదియే;
  ఏదీ తెలియని నాకిల
  ద్వాదశి తిథి మంచి దగును దసరా చేయన్

  రిప్లయితొలగించండి