11, అక్టోబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -489 (పువ్వులోన రెండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పువ్వులోన రెండు పువ్వు లమరె!

50 కామెంట్‌లు:

 1. అమ్మవారి జూడ నాముఖము పద్మమ్ము
  ఆమె కళ్ళు జూడ అందమైన
  కలువ పూల వోలె కనుపించ, నిటు తోచె
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 2. అమ్మవారి ముఖమె యదియొక పద్మమ్ము
  ఆమె కళ్ళు జూడ అందమైన
  కలువ పూల వోలె కనుపించ, నిటు తోచె
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  శాస్త్రీజీ బావుంది !

  మీ బాట లోనే నేనూను!

  01)
  _________________________________

  పువ్వు బోడి ముఖము - పూర్ణబింబముగాగ
  పూల వలెను కనులు - పూర్ణ మందు
  పుణ్య చరిత యైన - పుడమి పట్టి గనరె
  పువ్వులోన రెండు - పువ్వు లమరె!
  _________________________________

  రిప్లయితొలగించండి
 4. 02)
  _________________________________

  చిన్ని పాప యొకతె - చిత్రము వేయుచు
  సున్న నొకటి చుట్టె - తిన్న గాను
  సున్న లోన రెండు - సున్నాలు పెట్టంగ
  పువ్వులోన రెండు - పువ్వు లమరె!
  _________________________________

  రిప్లయితొలగించండి
 5. కన్ను గీటి కదలె కలువల రేరాజు
  నిండు పున్న మందు మెండు ప్రేమ
  గుండె ఝల్లు మనగ కులికెడి రేరాణి
  పువ్వులోన రెండు పువ్వు లమరె
  ------------------------------------
  పూల బాల లన్ని బేలలై తలవంచి
  నరులు వచ్చి రనుచు విరులు త్రుంచ
  సొగసు లన్ని కరిగి సోలి పోవలె నింక
  పువ్వులోన రెండు పువ్వు లమరె

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ ....

  మధుప మిష్టపడెను మధువున్న దని మంచి
  పువ్వులోన; రెండు పువ్వు లమరె
  దాని ప్రక్కనే ముదమ్ము గూర్చెడి యంద
  మున్న తేనె లేక యొప్పదయ్యె!

  రిప్లయితొలగించండి
 7. 03)
  _________________________________

  పూల తోడ దైవ - పూజ సేయు వేళ
  పుండరీక మందు - రెండు బుల్లి
  మల్లె పూలు పడెను - జల్లు చుండ నపుడు
  పువ్వులోన రెండు - పువ్వు లమరె!
  _________________________________

  రిప్లయితొలగించండి
 8. కుసుమే కుసుమోత్పత్తిః దృశ్యతే న చ శ్రూయతే |
  ప్రియే తవ ముఖాంబోజే ద్రష్టుమిందీవరద్వయమ్ ||

  పై శ్లోకం నుండి గ్రహించినట్టున్నారు. ఆ శ్లోకం వెనుక కథ కూడా తెలుపండి.

  రిప్లయితొలగించండి
 9. కొమ్మ సొగసు మోము తమ్మినిబోలును,
  కలికి కన్ను గవయు కలువనేలు;
  నలువ సృష్టియందు నాణ్యంబు జూడగా
  పువ్వు లోన రెండు పువ్వు లమరె !

  రిప్లయితొలగించండి
 10. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

  పంచశరుడు వేయ పదునైన కోలలు
  మదిని మూడు తగిలె హృదిని రెండు
  అంబుజమ్మె హృదియు నంబులు సుమములౌ
  పువ్వు లోన రెండు పువ్వు లమరె !

  రిప్లయితొలగించండి
 11. నా రెండవ పూరణ ....

  దైవపూజ కొఱకు తరుణి పూవులు కోయ
  తోటలోని కేగె నీటుగాను
  మేలుగా సుమములఁ గేలు దామరఁ బట్టె
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యుల స్ఫూర్తితో :

  04)
  _________________________________

  పూల కీట మొకటి - పుష్ఫద్రవము ద్రాగ
  పూను కొనెను వ్రాలి - పువ్వు లోన !
  రెండు పువ్వు లమరె - కొండొక వైపున
  పూను కొనదు లేమి - పుష్ఫరసము !
  _________________________________

  రిప్లయితొలగించండి
 13. శ్రీగురుభ్యోనమ:

  శివుని శిరము పైన శీతల గంగమ్మ
  సుమము వోలె తాను సొగసు గూర్చె
  గంగ కురుల లోన కలువ పూవులు రెండు
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 14. రవి గారూ,
  నిజమే! సరిగానే పట్టుకున్నారు. ధన్యవాదాలు.
  అయితే ఆ శ్లోకంలోని ద్వితీయార్ధమే నాకు తెలుసు. పూర్తి శ్లోకం చూడడం ఇప్పుడే. దాని నేపథ్యమూ తెలియదు. (జ్ఞాపకాల దొంతరల అడుగున ఏదో కదలిక .. విన్నట్టే! కాని గుర్తుకు రావడం లేదు). తెలిసిన మీరు వ్యాఖ్యగా పెడితే అందరం సంతోషిస్తాము.
  పై శ్లోకానికి నా అనువాదం ....

  పువ్వునుండి పూలు పుట్టుట కనలేదు
  వినుటకూడ లేదు; ప్రేయసి! ముఖ
  కమలమందు రెండు కల్హారములఁ గంటి!
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 15. శంకరార్యుల రెండవ స్ఫూర్తితో :

  05)
  _________________________________

  పూల తోట లోన - పూబోణి విరిసిన
  పూలు కోయ దొడగె - పూజ కొఱకు !
  పువ్వు వంటి చేత - పూలను బట్టిన
  పువ్వు లోన రెండు - పువ్వు లమరె !
  _________________________________

  రిప్లయితొలగించండి
 16. శంకరార్యుల మూడవ స్ఫూర్తితో :

  06)
  _________________________________

  పూవు నుండి పూవు - పుట్టుట పూర్వము
  కనము వినము నెచట - గాని ,యిచట
  కమల నయన మోము - కల్హార మైయొప్ప
  పువ్వు లోన రెండు - పువ్వు లమరె !
  _________________________________

  రిప్లయితొలగించండి
 17. మూర్తి గారి స్ఫూర్తితో :

  07)
  _________________________________

  పూల బాణు డేయ - పూబోణి పై రెండు
  పుష్కరములు నాటె - మోము నందు
  పద్మమంటి ముఖము - పత్ర పుష్పాల్గాంచ
  పువ్వు లోన రెండు - పువ్వు లమరె !
  _________________________________
  పుష్కరము = పత్రము = బాణము

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతిశాస్త్రి గారి స్ఫూర్తితో :

  08)
  _________________________________

  పురహరుని శిరమున - పుణ్య భాగీరథి
  పుండరీకము వలె - పూని నిలువ
  భువన పావనమున - పూసిన కలువలు
  పువ్వు లోన రెండు - పువ్వు లమరె !
  _________________________________
  భాగీరథి = భువన పావని = గంగ

  రిప్లయితొలగించండి
 19. 09)
  _________________________________

  పులుగు మీద నున్న - పురుష వరుని మోము
  పుడమి వెలుగు నిచ్చు - పుణ్యు లైన
  పూర్ణమసుడు మరియు - పూషు లిద్దరి జూడ
  పువ్వు లోన రెండు - పువ్వు లమరె !
  _________________________________
  పురుష వరుడు = విష్ణువు
  పూర్ణమసుడు = చంద్రుడు
  పూషుడు = సూర్యుడు

  రిప్లయితొలగించండి
 20. వసంత కిశోర్ గారి తొమ్మిదవ పూరణ స్ఫూర్తితో .....

  పూర్ణపురుషుఁ డైన మురవైరి విశ్వరూ
  పమ్ముఁ జూప నతని పద్మముఖము
  నందు కన్నులౌ సుధాంశార్కులు తొగలు
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 21. మల్లికమ్మ వెడలె తల్లితో వైద్యుని
  కడకు, చూచి చెప్పె గర్భ మందు
  కవల పిల్ల లనుచు కడకుయా డాక్టరు
  "పువ్వు, లోన రెండు పువ్వు లమరె!"

  రిప్లయితొలగించండి
 22. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, అక్టోబర్ 11, 2011 4:05:00 PM

  పద్మనాభు యందు పద్మసంభవుడయ్యె
  బ్రహ్మ, యతని వాక్కు పలుకు బోడి
  యయ్యె, దీని విధము నారసి చూడగా
  పువ్వు లోన రెండు పువ్వు లమరె.

  రిప్లయితొలగించండి
 23. నేటి పూరణమ్ము నిది యట గనుడిక-
  "పువ్వులోన రెండు పువ్వులమరె."
  చూడ వచ్చువారు జోడగు పువ్వుల
  నెన్ని గనిరి! తోట నిండి పోయె.

  పుష్యమాసమందు భోగి సంక్రాంతుల
  నాడు మగువ పెట్టె నమ్మ పువ్వు
  ముగ్గు! మగడు పెట్టె పువ్వుల నచ్చట-
  పువ్వులోన రెండు పువ్వులమరె.

  రిప్లయితొలగించండి
 24. వసంత కిశోర్ గారూ మీరెంత సునాయాసంగా వ్రాయగలరండి. మీ కవితా స్ఫూర్తికి నాజోహారులు

  రిప్లయితొలగించండి
 25. ఒకే పూవులో అందముగా రెండు పువు లమర్చుచున్నమిత్రులందరకు అభినందనలు.

  పద్మ వదన తాను పద్మాక్షియే తాను
  పద్మ నాభు చెంత పాదములను
  చేరి వత్తు చుండ చిలిపిగా హరి పలికె
  "పువ్వులోన రెండు పువ్వులమరె".

  రిప్లయితొలగించండి
 26. కంది వారి తోట బంధాలు పెంచగా
  పువ్వు లన్ని విరిసి నవ్వు లాయె
  మమత లన్ని కలసి మల్లెలై విరియగా
  పువ్వులోన రెండు పువ్వు లమరె

  రిప్లయితొలగించండి
 27. అల్ల నల్ల కలువ, అర్థ నారీశ్వర
  సిగను జూడ నాకు మిగుల తోచె
  రెండు పూల తోడ నిండుగా నర్చించ
  "పువ్వులోన రెండు పువ్వులమరె".

  రిప్లయితొలగించండి
 28. చంద్రశేఖర్:
  చెలువ మాల గట్టె చేమంతి కనకాంబ
  రములు గలుపుచు కడు రమ్య ముగను
  కనకము లమరికన కానగ చేమంతి
  పువ్వులోన రెండు పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 29. చింతా వారు మన్నింతురు గాక. ( 'చింత' అని వ్రాసినందులకు )

  పద్య సుమము లెన్నొ పరికించి చూడగ
  'చింత' వారి బ్లాగు వింత దోచె
  కంద చంపకమ్ము గర్భ సీసమొకటి
  "పువ్వులోన రెండు పువ్వులమరె".

  రిప్లయితొలగించండి
 30. వేసి పూవు మ్రుగ్గు వెలది గుమ్మడి పూవు
  మధ్య నుంచ మనుచు మనుమరాలి
  పంప నచట నిలువ, పడతి యిట్లనియెను
  "పువ్వులోన రెండు పువ్వులమరె".

  రిప్లయితొలగించండి
 31. చేరి హరిని లక్ష్మి సేవజేయుచు పట్టె
  కరకమలము తోడ కలిపి పాద
  పద్మ ములను, ఆట పట్టించె శ్రీ హరి
  "పువ్వులోన రెండు పువ్వులమరె".

  రిప్లయితొలగించండి
 32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ
  "పద్మ వదన తాను పద్మాక్షియే తాను"
  బాగుంది.

  రిప్లయితొలగించండి
 33. జాజు లన్ని కలసి జాబిల్లితో జేరి
  సౌరు జిమ్ము చుండ మరుని పైన
  కులుకు రాణి కలువ కలవర పడెగాన
  పువ్వు లోన రెండు పువ్వు లమరె

  రిప్లయితొలగించండి
 34. ధన్యోऽస్మి!
  ఈరోజు బ్లాగులో పూరణల పూలజల్లు కురిసింది. మహదానందంగా ఉంది. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  ఏమి నాదు భాగ్య మీదినమ్మున మన
  శంకరాభరణము చక్కనైన
  పువ్వు గాఁగ నిండె పూరణ పుష్పముల్;
  పువ్వులోన ‘పెక్కు’ పువ్వు లమరె!

  రిప్లయితొలగించండి
 35. **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నా లెక్కకు మీవి ఏడు పూరణలు తేలాయి. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
  అమ్మవారి ముఖపద్మంలో కలువపూలవంటి రెండు కలువల (సవరించిన) మొదటి పూరణ ‘రవి’ గారు పేర్కొన్న శ్లోకానికి చక్కగా సరిపోతున్నది.
  కవలపిల్లల రెండవ పూరణ బాగుంది. ‘కడకు యా డాక్టరు’ను ‘కడకు నా డాక్టరు’ అందాం.
  మీ మూడవ పూరణ ‘చిలిపి’ భావంతో అలరారుతున్నది. ‘చిలిపిగా హరి పలికె’ అన్నచో గణదోషం. ‘చిలిపిగా హరి పల్కె’ అంటే సరి!
  రెండు పూల అర్చనతో నాల్గవ పూరణ బాగుంది.
  ‘చింతా’ వారి గర్భకవిత్వ ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించిన ఐదవ పూరణ అద్భుతం. అందులో వారు డాక్టరేట్ చేస్తే మనం ఇంకా ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలోనే ఉన్నాం.
  మీ ముగ్గుల ఆట అయిన ఆరవ పూరణ అందంగా ఉంది.
  మూడవ పూరణలోని భావమే ఏడవ పూరణలో పునరుక్తమైనా దేనికదే బాగుంది.
  మొత్తానికి ఈరోజు మీరు వసంత కిశోర్ గారితో పోటీపడి విజృంభించారు. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 36. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  మీ తొమ్మిది పూరణలూ నవరత్నాలై శోభిస్తున్నాయి. ధన్యవాదాలు.
  సీతావర్ణనతో మీ మొదటి పూరణ అలరించింది.
  పాపతో చిత్రం గీయించిన మీ రెండవ పూరణ ‘చిత్రం’గానే ఉంది.
  స్వభావోక్తితో మీ మూడవ పూరణ బాగుంది.
  నా మూడు పూరణలకు మెరుగులు దిద్దినట్టున్నాయి మీ నాల్గవ, ఐదవ, ఆరవ పూరణలు.
  మూర్తి గారి స్ఫూర్తితో వ్రాసిన ఏడవ పూరణ బాగున్నది. కాని మూడవ పాదాన్ని ‘పద్మముఖము పైన పడిన పువ్వుల గాంచ’ అంటే బాగుంటుందని నా సలహా.
  శ్రీపతి శాస్త్రి గారి స్ఫూర్తితో వ్రాసిన ఎనిమిదవ పూరణ చక్కగా ఉంది.
  నాకు స్ఫూర్తి నిచ్చిన మీ తొమ్మిదవ పూరణ ఉత్తమంగా ఉంది.
  అభినందనలు!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 37. కంది శంకరయ్య గారూ

  శంకరాభరణం అనే
  పువ్వులోన ‘పెక్కు’ పువ్వు లమరె!"

  చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 38. **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  మీ నాలుగు పద్యాలూ బాగున్నాయి అభినందనలు!
  నాల్గవ పద్యంలో యతి తప్పింది. ‘సౌరు జిమ్ముచుండ మారు పైన’ అంటే సరి!
  **********************************************************************
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మధురంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చక్కని ఊహ. వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  కాని ‘మది - హృది’ వేరువేరా? మనస్సు, గుండె అనే అర్థాలు స్వీకరించాలా? కార్డియాలజిస్టులు మీకే తెలియాలి.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  అందమైన పూరణ. బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ ఫూరణ బాగుంది. అభినందనలు.
  ‘పద్మనాభు యందు’ను ‘పద్మనాభు నందు’ అందాం.
  **********************************************************************
  మందాకిని గారూ,
  నిజమే! ఈరోజు శంకరాభరణం పూలతో నిండిపోయింది.
  మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  **********************************************************************
  రవి గారూ,
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 39. గన్నవరపు నరసింహ మూర్తి గారీ వ్యాఖ్య + పూరణ .....

  గురువు గారూ ధన్యవాదములు.
  మీ పూల తోట బహు చక్కగా విరబూచింది. మీరా ప్రశ్న వేస్తారని ఊహించా. ఏదైనా హృదయాన్ని కలగించే విషయము చూడగానే మనస్సు ఆలోచించే లోపల గుండె స్పందించి చివుక్కు మంటుంది. ఆ తర్వాత మదిలో ఆలోచనలు వస్తాయి. అందుచే హృది,మది వేరే! వైజ్ఞానికంగా వేగస్ ( మెదడు నుంచి వచ్చే 10 వ నాడి, గుండెకు ,కడుపుకి,ప్రేవులకు వెళుతుంది.అసంకల్పికముగా దాని వలన ఆ అవయవాలు స్పందిస్తాయి. గుండె వేగముగా కొట్టుకోవడము, కడుపులో తెలియని బాధ కలగడము ఆ నరము వల జరిగే ప్రక్రియలు.
  శ్రీ చింతా వారి మీద నేనో పద్యము అల్లి పెట్టాను. ఆ ఊహ శ్రీ గోలి వారికి కూడా కలింది. నా పద్యము;

  శిల్పి ( చిలిపి )రామకృష్ణ చిత్ర కవిత లల్లి
  సరసిజమ్ముఁ జెక్కె చక్క గాను
  సరసి గర్భమందు సరసులు గన విరుల్
  పువ్వు లోన రెండు పువ్వు లమరె !

  రిప్లయితొలగించండి
 40. మిత్రులందరి పూరణలూ బహు ముచ్చటగా నున్నవి !

  శ్రీపతి శాస్త్రిగారూ ! ధన్యవాదములు !
  మీ , మీ , ఆలోచనలకే అక్షరాలు మార్చాను ! అంతేగదా !
  గొప్పతనమంతా మీదే !
  ఆలోచన రావడానికే ఆలస్యమంతా !
  దాన్ని అక్షరాల్లో పెట్టడం ఎంతసేపు !

  శంకరార్యా ! ధన్యవాదములు !
  ఈ రోజు మన బ్లాగు మీద పూలవాన కురిసింది !
  రంగు రంగుల పూల పరిమళాలతో హృద్యాతిహృద్యంగా యున్నది !

  మూర్తీజీ ! ఆ సందేహం నాకూ కలిగింది !
  మీ వివరణతో అఙ్ఞానం తొలగింది !

  రిప్లయితొలగించండి
 41. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ......

  గురువు గారూ నమస్కారములు.
  మధ్యాహ్నము విరామ సమయములో' మది',' హృది' గురించి వ్యాఖ్య పెట్టాను. హృదయము కడుపులో ఉన్న ప్రేవులు అసంకల్పితముగా స్పందించడములో సింపథెటిక్ నెర్వస్ సిస్టము పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టములు భిన్న దిశలలో పని చేస్తాయి. వేగస్ నాడి పారా సింపథెటిక్ సిస్టములో పని చేస్తుంది. వాస్తవానికి వాగస్ నరము స్పందిస్తే గుండె వేగము తగ్గుతొంది. సింపథెటిక్ నెర్వస్ సిస్టము వలన గుండె వేగము పెరగడము, ఒంటికి చెమట పట్టడము వంటి ప్రక్రియలు కలుగుతాయి.

  వీధిలో ఎవరో అరటి పండు తొక్కపై కాలు జారి పడితే వెంటనే పకపకా నవ్వడము హృదయ స్పందన. ఆ వ్యక్తికి కాలు విరిగిందని తెలుసు కొన్నాక జాలి కలిగి విచారించడము మది స్పందన.

  రిప్లయితొలగించండి
 42. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య .....

  శ్రీ చింతా వారిపై నా పూరణకు సవరణ ......


  శిల్పి ( చిలిపి )రామకృష్ణ చిత్ర కవిత లల్లి
  సరసిజమ్ముఁ జెక్కె చక్క గాను
  సరసిజమ్ము నందు సరసులు గన విరుల్
  పువ్వు లోన రెండు పువ్వు లమరె !

  రిప్లయితొలగించండి
 43. శంకరార్యా ! శంకరాభరణ బ్లాగు పూదోట లోన ఇన్ని పూవు లమర్చుటకు అవకాశ మిచ్చిన మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 44. వసంత కిశోర్ జీ వసంతము తెచ్చిబెట్టారు మీ పూల జల్లుతో !హనుమఛ్ఛాస్త్రి గారూ సౌగంధికా పరిమళాలతో గంధవాహుని బాంధవ్యము జ్ఞప్తికి దెచ్చారు ! అక్కయ్య గారూ మీ పద్యాలు అదిరాయి. శ్రీ అవధాని పార్వతీశ్వర శర్మ గారి పూరణ మధురముగా ఉంది.

  రిప్లయితొలగించండి
 45. కట్టుకథ

  అనగనగా ఓ రాజు సింహళ దేశాన్ని పాలిస్తున్నాడు. ఆ రాజు, ఓ రోజు ఒక వేశ్యదగ్గరకు వెళ్ళాడు. ఆమెతో గడిపి, తర్వాత రోజు ఆమె ఇంట్లో గోడపై ఇలా వ్రాశాడు.

  "కుసుమే కుసుమోత్పత్తిః దృశ్యతే న చ శ్రూయతే|"

  (పువ్వునుండి పువ్వు పుట్టటం కనివిని ఎరుగము కదా).

  ఆ సమస్య పూరించిన వారికి మంచి బహుమానం ఉంటుందని చాటింపేశారు. కొంతకాలానికి ఆ రాజు ఫ్రెండొకాయన ఇండియానుండి సింహళానికి బయలుదేరి వెళ్ళాడు. ఈయనా ఆ వేశ్య దగ్గరకెళ్ళాడు. గోడమీద రాత చూసి రెండవపాదం ఇలా వ్రాశాడు.

  బాలే! తవ ముఖాంబోజే ద్రష్టుమిందీవరద్వయమ్ |

  (అమ్మాయీ! నీ ముఖకమలం లో రెండు నల్లకలువలు కనిపించాయి)

  ఆ అమ్మాయి పొంగిపోక, దూ(దు)రాలోచన చేసి, ఆ కవిని మర్డర్ చేయించి, ఆ పూరణ తనదేనని రాజువద్దకెళ్ళింది. ఆ రాజుకేదో అనుమానం వచ్చి నిజానిజాలు కనుక్కుంటే తన ఫ్రెండు మర్డర్ చేయబడ్డాడని తెలిసింది. ఆ యువతికీ అదే శిక్ష పడింది.

  ఆ రాజు పేరు కుమారదాసు.
  ఆయన ఫ్రెండు పేరు కాళిదాసు!

  రిప్లయితొలగించండి
 46. ముదిత ముద్దు మోము ముద్దమందారమ్ము
  చిరు గులాబి పూలు చెంపలందు
  నారి నవ్వు లొలుకు నవ్వేటి పువ్వురా
  పువ్వు లోన రెండు పువ్వు లమరె!!!

  రిప్లయితొలగించండి
 47. మంద పీతాంబర్ గారూ మీ పద్య పూరణ

  "ముదిత ముద్దు మోము ముద్దమందారమ్ము"

  చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 48. **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.
  ‘చింతా’వారి చిత్రకవిత్వంపై మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  రవి గారూ,
  మీరు చెప్పిన (కట్టు)కథ బాగుంది. ధన్యవాదాలు.
  ఏదో రాజసభలో రాజు శ్లోక పూర్వార్ధాన్ని చదివితే, ఒక కవి ఉత్తరార్ధాన్ని పూరించిన కథ చదివినట్లు గుర్తు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  మధురంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి