23, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 501 (అంతర్ధానముఁ జెందె)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం
డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
ఈ సమస్యను పంపిన
ఊకదంపుడు గారికి
ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

  1. **********************************************************************
    కవిమిత్రులకు మనవి ...
    ఈవారాంతపు సమస్య ‘అంతర్ధానమయెన్ మగండలుకుతో నర్ధాంగి కాల్మ్రొక్కగన్’. ఇందులో ‘అయెన్’ ప్రయోగం వ్యాకరణ విరుద్ధమనీ, ‘అయ్యెన్, ఆయెన్’ సాధురూపాలనీ శ్రీ విష్ణునందన్ గారు తెలియజేసారు. వారి సూచన కనుగుణంగా సమస్యను అర్థంభంగం కలుగకుండా మార్చాను. మీ మీ పూరణలలో నాల్గవపాదాన్ని మార్చి మళ్ళీ ప్రకటించి, ముందువాటిని తొలగించాను. ఈ మార్పు వల్ల పూరణలో మీ భావవ్యక్తీకరణకు ఏమైనా ఆటంకం కలిగిందేమో? మీ పూరణలు నా మెయిల్ బాక్స్ లో సురక్షితంగా ఉన్నాయి. వాటితో పోల్చి మీ పూరణలపై ఒకటి రెండు రోజుల్లో స్పందిస్తాను. ఎలాగూ ఇది వారాంతపు సమస్యాపూరణం కదా! ఈలోగా మీ అభ్యంతరాలు కాని, వివరణలు కాని ఉంటే తెలియజేయండి. మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుణ్ణి!
    **********************************************************************
    పండిత నేమాని గారి పూరణ .....

    కాంతారత్నము సూర్యకాంతనిభయై కన్ పట్టు సంసారమం
    దంతా యామె మహాధికార బలమే యట్లయ్యు నయ్యింతికిన్
    చింతల్ కల్గెను మారె నామె పతినే సేవింప భావింపగా
    అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    **********************************************************************
    మందాకిని గారి పూరణ .....

    చింతాక్రాంతుడయెన్ మగండిటుల "నిస్సీ! నాదు పత్నిట్టులన్
    సుంతైనన్ తన యత్తమామ యెడ దా జూపించ దే భక్తి నిన్"
    కాంతా పుత్రుల ప్రేమలన్ తనకు సాకారంబ యెన్ స్వార్థముల్,
    అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ........

    సంతోషీ వ్రతమంచు నేడు తమకున్ చప్పన్ని బోనమ్మనిన్
    సంతానోద్ధతిగల్గు నేడుసలుపన్ సద్బ్రహ్మచర్యమ్మనిన్
    ఇంతీరత్నమువేయు శిక్షలకు తానెంతో వ్యధన్ జెందుచున్
    అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    **********************************************************************
    వెంకట రాజారావు . లక్కాకుల గారి పూరణ ......

    కాంతున్ గప్పుర హారుతుల్ దిగిచి ,పై గంధాక్షతల్ జల్లి ,తా
    జెంతన్ జేరి ,నిరంత రాయ విధులన్ శిక్షించుటన్ - చిత్త వి
    భ్రాంతున్ జేసెడి పూజలన్ బెదిరి యా భార్యా విరాగుండు తా
    నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ......

    నేను వ్రాసిన "ఇంతీరత్నము" అనుమాట సబబేనా?? పెద్దలు వివరించ ప్రార్ధన. ఇంతి అనునది తెలుగు పదం, రత్నం సంస్కృతం. తెలుగు పదం ముందుంచి సంకృత పదం దానిపక్కగా సమాసం చెయ్యడం తప్పుకాదేమో కదా?
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ .....

    సంతోషంబున నింతి జేయ దొడగెన్ సంతోషి మాతా వ్రతం
    బంతన్ పూర్తిగ పూర్తి యాయె ననగా "బాస్ ఫోను- మీటిం గనెన్"
    సుంతా గండిక భోజనానికనగా చూద్దాము " నాట్ నౌ " వనె
    న్నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ .......

    కాంతాకోర్కెల దీర్చలేక, సతియేకాంతంబునందుండగా
    చెంతన్ జేరి వినమ్రుడై నిలిచి దాసీసేవ జేయంగ నా
    ప్రాంతంబందెనయించుచున్ తమమునా ప్రత్యక్షదైవంబు తా
    నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.
    మగడు దాసి లాగ సేవ జేస్తూ, భార్యయొక్క కాలు మ్రొక్కిన సంధర్భములో సూర్యుడు అంతర్ధానమైనాడు అనే భావన. ( అంటే ఎవరూ లేని సంధర్భములో భార్యకు మ్రొక్కినాడనే అంతరార్థములో )
    తమము = చీకటి
    ఎనయించు = ప్రవేశపెట్టు,
    ప్రత్యక్షదైవంబు = సూర్యుడు, పతి ( సూర్యుడు అంతర్ధానమై చీకటిని ఇచ్చినాడని, సతి కోర్కెల దీర్చలేక పతిగా తాను అంతర్ధానమైనాడని )
    **********************************************************************
    పండిత నేమాని వారి వ్యాఖ్య .....

    అయ్యా సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
    మీ పద్యములో కాంతాకోర్కెలు తీర్చలేకకు బదులుగా కాంతా వాంఛితమీయలేక అని మారిస్తే సరిపోతుంది.
    **********************************************************************
    పండిత నేమాని వారి వ్యాఖ్య .....

    అయ్యా ఆదిభట్ల వారూ!
    ఇంతీరత్నము వ్యాకరణ విషయము ఎలాగ ఉన్నా వినుటకు ఇంపుగా లేదు.
    చప్పన్ని, బోనమ్మనిన్, బ్రహ్మచర్యమ్మనిన్ అనే ప్రయోగాలు సాధువులు కాదేమో అనుకుంటున్నాను.
    శ్రీ శంకరార్యులు వివరించ గలరు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణతో..

    సంతోషంబున నింతి జేయ దొడగెన్ సంతోషి మాతా వ్రతం
    బంతన్ జక్కగ పూర్ణమాయె నపుడే "బాస్ ఫోను-మీటింగనెన్"
    సుంతాగుండిక భోజనంబుకనగా " సో సారి నాట్ నౌ " వనె
    న్నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.

    రిప్లయితొలగించండి
  3. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, అక్టోబర్ 23, 2011 8:29:00 PM

    శ్రీ నేమాని గురువర్యా,

    మీ సవరణకు సర్వదా కృతజ్ఞుడిని.

    రిప్లయితొలగించండి
  4. కాంతారత్నము పూనె నల్క, మదిలో కంపమ్ము హెచ్చాయె, తా-
    చింతంజేరెను తిమ్మనార్యు నపుడా శ్రీకృష్ణ రాయం డనె-
    న్నంతన్నా కవి "పాదవందనమె మేలౌ, సత్య కోపమ్ము నా-
    డంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్".

    రిప్లయితొలగించండి
  5. చింతాక్రాంతుడు నాథుడిట్లనియె"నిస్సీ! నాదు పత్నిట్టులన్
    సుంతైనన్ తన యత్తమామ యెడ దా జూపించ దే భక్తి నిన్"
    కాంతా పుత్రుల ప్రేమలన్ తనకు సాకారంబ యెన్ స్వార్థమే
    అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం డర్ధాంగి కాల్మ్రొక్కగన్.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ,
    తప్పులతో కూడిన సమస్య సూచించినందులకు క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి

  7. చింతారాముడు భార్య మాట లకు కించిత్తైన మాఱాడకన్
    పంతంబెప్పుడు చేయకన్ మరియు కోపంబెప్పుడున్ చూపకన్
    శాంతాకారపు రూపుడై వెలుగుచున్ ! సాయుజ్యమున్ పొంద తా
    నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుండర్ధాంగి కాల్మ్రొక్కగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సవరణ:

    శంకరాభరణం సమస్య - 501

    "అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం
    డర్ధాంగి కాల్మ్రొక్కగన్"

    పంతంబట్టుచు మూడు మాసములుగా పక్కింటి రాణెమ్మతో
    శాంతాబాయిది పాట క్లాసునను నే సంతోషమున్ జేరగా
    సంతాపమ్మును నాదు తీర్చి విను నా సంగీత పాఠమ్మనన్
    అంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుం
    డర్ధాంగి కాల్మ్రొక్కగన్

    (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

    రిప్లయితొలగించండి