3, అక్టోబర్ 2011, సోమవారం

పండిత నేమాని వారి సరస్వతీస్తుతి

సరస్వతీ!

శ్రీసరోరుహ గర్భసంభవు జిహ్వ లాలిత రత్న సిం
హాసనమ్ముగ నొప్పు దేవత! హంసవాహన! భారతీ!
భాసమాన దయామయీ! వరివస్య జేయుదు భక్తితో
వాసవాది సురాళి వందిత! వందనమ్ము సరస్వతీ!


సకల వేద పురాణ శాస్త్ర రస ప్రసార విలాసినీ!
సుకవి సంస్తుత భవ్య లక్షణ శోభితా! భువనేశ్వరీ!
శుక విరాజిత పాణిపల్లవ! శుద్ధ మానస మందిరా!
ప్రకట వాగ్విభవ ప్రదాయిని! వందనమ్ము సరస్వతీ!


మల్లెలంచలు కప్పురంబుల మంచి చాయల నొప్పుచున్
చల్లనౌ కను జూపులొప్పగ జల్లుచున్ కృప మాయెడన్
తల్లి మమ్ముల బ్రోచుచుందువు తమ్మిచూలికి నుల్లమున్
బల్లవింపగ జేయు కోమలి! వందనమ్ము సరస్వతీ!


సరస మంజుల సత్ఫలప్రద సత్య సూక్తుల సాదృతిన్
నిరతమున్ బలికింప జేయుము నెమ్మి మా రసనమ్ముచే
పరమ పావన భావనా! శ్రుతి వందితాద్భుత వైభవా!
పరమ విద్య ననుగ్రహింపుము వందనమ్ము సరస్వతీ!


వీణె మీటుచు వేదనాదము విశ్వమంతట నింపునో
వాణి పల్లవపాణి మంజులవాణి పద్మజురాణి గీ
ర్వాణి బంభరవేణి నీ పద పద్మ సన్నిధి వ్రాలి నే
పాణి యుగ్మము మోడ్చి మ్రొక్కెద వందనమ్ము సరస్వతీ!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

5 కామెంట్‌లు:

  1. వందనమ్ము సరస్వతీ యని పంచ రత్నము లొప్పుగా
    సుందరమ్ముగ వ్రాసినట్టి సుశోభితాద్భుత సత్కవీ!
    డెందమందు సరస్వతిన్ గనుటే మహాద్భుత శక్తిగా!
    వందనంబులు మీకు నద్భుత భక్తి భాగ్య! శుభంకరా!

    రిప్లయితొలగించండి
  2. అవధాన సరస్వతుల చరణార విందములకు శిరసాభి వందనములు.

    రిప్లయితొలగించండి
  3. మ్రొక్కి రమ్మకు పల్కులంబకు మోద మొప్పగ పండితా!
    మిక్కు టమ్మగు భక్తితోడుత మీరలీ నవ రాత్రులన్
    చక్కనైన తెనుంగు పద్యపు సామగానమునన్ కవీ!
    నిక్క మామె త్వదీయ రస్నను నిలచి యున్నది! సాజమే.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారూ,
    ధన్యవాదాలు.

    దేవి నవరాత్రులందు వాగ్దేవి పూజ
    నేడు చేసిన విద్యార్థి నివహమునకు
    మీ సరస్వతీస్తోత్రమ్ము మేలు గూర్చు
    ననుచు ముద్రించి పంచితి ననఘచరిత!

    (ఈరోజు మా ‘ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం’లో దేవీనవరాత్రులలో భాగంగా విద్యార్థులచే సరస్వతీ పూజ చేయించారు. నేను మీ సరస్వతీస్తోత్రాన్ని ముద్రించి, నాకు తోచినంతలో అర్థవివరణ చేసి ఆ ప్రతులను వారికి పంచాను. అందరు ఎంతో ఆనందించారు)

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారూ,
    చెప్పడం మరిచాను. ఆ దేవాలయం ‘శ్రీసీతారామాంజనేయ సంవాదము’ అనే అధ్యాత్మరామాయణాన్ని రచించిన పరశురామపంతుల లింగమూర్తి కట్టించింది! అక్కడే వారి సమాధి ఉండేది (ఇప్పుడు లేదు!). సమీపంలోనే వారు నివసించిన ఇల్లు ఉంది. వారి వంశజులే ఉంటున్నారు.
    విద్యార్థులకు మీ గురించి, మీ రామాయణం గురించి చెప్పాను.

    రిప్లయితొలగించండి