14, ఏప్రిల్ 2012, శనివారం

సమస్యాపూరణం - 677 (కరము కరము మోద)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కరము కరము మోదకరము గాదె!

ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. ఉత్సాహ:
    పరమ పూరుషుండు శివుడు పార్వతీవిభుండు శం
    కరుడు విశ్వగురువరుండు జ్ఞానవైభవుండు సుం
    దరుడు శూలపాణి అభయదాయియైన వాని శ్రీ
    కరము కరము మోదకరము గాదె సారధీనిధీ!

    రిప్లయితొలగించండి
  2. అంగారము అంగారము పురోహితము గాదె
    బంగారము బంగారము భాగ్యహితము గాదె
    అంతరము అంతరము ధర్మహితము గాదె
    కరము కరము మోదకరము గాదె !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. పెండ్లి మంటపమున వెలుగొందు ముత్యాల
    సేసలొకరి కొకరు వేసి మురియు
    భూమిజాత యొక్క రామచంద్రుని యొక్క
    కరము కరము మోదకరము గాదె

    రిప్లయితొలగించండి
  4. విఘ్నములను తొలగ వేడుకొనుము బాల,
    నెల్లవేళలందు;నెల్ల పనుల.
    విఘ్నపతినభయము వేడ; జూపును శుభ
    కరము కరము; మోదకరము గాదె!

    "పోరు నిశ్చయమ్ము, నిలిచి పోర శక్తి నొసగుమా!
    ధీర వీర శూర! దారి తెలుపు నాకు మిత్రమా!"
    శౌరి గాంచి వేడె సవ్యసాచి; చేరె సుందరా
    కారు కరము, కరము. మోదకరము గాదె క్రీడికిన్.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యాలు చాల బాగున్నవి. ఆటవెలది 2వ పాదములో "నెల్ల వేళ లందు" లో మొదటగా నుగాగమము రాదు - యడాగమము చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిశనివారం, ఏప్రిల్ 14, 2012 8:37:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    హరితపత్రములకు నాహారమౌ భాను
    కరము, కరము మోదకరము గాదె
    కరికి జూడ, భాగ్యకరము మానవులకు
    హరి పదముల జూపు యభయ కరము

    "మోక్షము కొరకు నా పాదములనాశ్రయించుమ"ను శ్రీవెంకటేశ్వరుని అభయ హస్తము మానవులకు భాగ్యకరము.

    రిప్లయితొలగించండి
  7. 1.
    సతము హాయియొసగు సంతోషమందించు,
    శాంతమూర్తియగుచు కాంతులొసగు,
    చేరి సత్వమంద జేయుశీతకరుని
    కరము కరము మోదకరము గాదె.

    2.
    అర్థులరుదెంచి యాచింప ననవరతము
    నాస్తి శబ్దంబు పలుకక వస్తుతతిని
    కొసరి సంతోషమందుచు నొసగెడునర(నృప)
    వరునికరము కరము మోదకరము గాదె.

    రిప్లయితొలగించండి
  8. అయ్యో , ఔనండీ. పదమొకటి మార్చాక చూసుకోలేదు. పొరపాటుకు మన్నించండి.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  9. సత్యనారాయణ మూర్తి గారు,
    నమస్కారములండి. మీ ఆశీస్సులు ఆనందకారకాలు.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము భావము బాగున్నవి. మొదటి పాదము హరిత పత్రములకు ఆహారమౌ భాను అని అన్నారు - నా సలహా: హరిత పత్రములకు ఆహారమిడు భాను అంటే బాగుంటుందేమోనని. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. వేడు కొనిన నీ శు వినయంబు తోడన
    శక్తి బుద్ది బలము రక్తి మఱియు
    అభయ హస్త మీ యు నశ్వరు శుభ కర
    కరము , కరము మోద కరము గాదె !

    రిప్లయితొలగించండి
  12. చిరము భాగ్యనగరమందు తిరిగి యాతపార్తులై
    దరినిజేరి సేదదీర దలచి టేంకుబండుపై
    స్థిరత గోరు వారి కా హుసేనుసాగరంపు శీ
    కరము కరము మోదకరము గాదెసంధ్యవేళలన్. (ఎల్లవేళలన్)

    రిప్లయితొలగించండి
  13. బలి:
    కోరి రావ దేవకోటికి వరకోటి
    నిచ్చువాడు, దాన మేనిడుటను
    క్రిందగుట గనంగ శ్రీభూవిభునిదివ్య
    కరము , కరము మోద కరము గాదె.

    రిప్లయితొలగించండి
  14. రామ కృష్ణ గారు,
    కోరి వచ్చె / కోరి రాగ అంటే బాగుంటుందేమో...!

    రిప్లయితొలగించండి
  15. కరము కరము మోద కలహంబులే హెచ్చు
    కరము కరము కలుప కలియు మనసు
    కలహ మునకు గాక కలియుటకు గలుప
    కరము కరము మోద కరము గాదె

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ మూర్తి గారూ! శుభాశీస్సులు.
    మీరు ఉత్సాహ వృత్తము 1వ పాదములో ప్రాసయతి వేసేరు. మార్చండి. ఉత్సాహ వృత్తానికి ప్రాసయతి వేయరాదు. ప్రాస నియమము గల పద్యములకు ప్రాసయతి వేయరాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. గురుతుల్యులు శ్రీనేమాని పండితులవారికి నమస్కారములు.
    ఉత్సాహంగా ఉత్సాహాన్ని వ్రాయటం ఇదే మొదటిసారి. అనుమానంగానే ప్రాసయతి వేయటం జరిగింది. దోషాన్ని మీరు తెలియజేస్తారనే అనుకున్నాను. శతాధిక ధన్యవాదాలు. మొదటి పాదాన్ని ఈ క్రింది విధంగా సరిచేస్తున్నాను. మీ మార్గదర్శనకు సర్వథా కృతజ్ఞతలు.
    "అరసి భాగ్యనగరదీప్తు లాతపార్తియుక్తులై"
    దరిని జేరి సేదదీర దలచి టేంకుబండుపై
    స్థిరతగోరు వారికా హుసేనుసాగరంపు శీ
    కరము కరము మోదకరము గాదె సంధ్యవేళలన్(ఎల్లవేళలన్)

    రిప్లయితొలగించండి
  18. మరుని నాతి వోలె మరువంగ లేనట్టి
    విరుల బోడి వచ్చి అర నగవున
    కర కమలము చాచి కర చాలనముఁజేయ
    కరము కరము మోదకరము గాదె!

    రిప్లయితొలగించండి
  19. గుండా సహదేవుడు గారి పూరణ....

    కలిమిలేము లిలను కడు సహజమ్మని
    తోటివారి సేవ తృప్తి యనుచు
    ఆర్తు లైన వారి నాదుకొనగ నెత్తు
    కరము కరము మోదకరము

    రిప్లయితొలగించండి
  20. అయ్యా శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
    మీ పద్యము 4వ పాదములో యభయకరము అని యడాగమము చేసేరు కదా, దానిని నుగాగమముగా సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  21. అంగ వికలురకిడు నరశాత పరిమితిన్
    కొలువు దొరకె తుదకు కలికి వినుము
    కుంటి వాడ గాని కూరిమి నాయవ
    కరము కరము మోదకరము గాదె!

    రిప్లయితొలగించండి
  22. అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
    మీ పద్యములో 2వ పాదములో తోటి వారి సేవ తృప్తి యనుచు అనుటలో యతి మైత్రి లేదు. ఋకారమునకు ఇ, ఈ, ఎ. ఏ, ఋ, ౠ లతో యతి సరిపోతుంది. సరిచేయండి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ సరస్వత్యై నమః :
    మిత్రులారా!
    ఈనాటి పూరణలు వివిధ కోణములలో వెలుగు జిమ్ముచున్నవి.

    1. శ్రీమతి లక్ష్మీదేవి గారు 2 విధాలుగా పూరించేరు.
    (1) శుక్లాంబరధరం విష్ణుం
    (2) శౌరి సహకారము కోరిన క్రీడి.
    మంచి మంచి భావాలు - పద్యములు బాగున్నవి.

    2. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: సూర్యకిరణాల ఉపయోగమును మరియు శ్రీ వేంకటేశ్వరుని అభయహస్తమును వర్ణించేరు. బాగున్నది.

    3. ....మూర్తి గారు: 3 పద్యములు (1) శీతాంశు కిరణములు
    (2) వదాన్యుడైన రాజు చేయి
    (3) హుసేను సాగరు శీకరము
    పద్యాలు, భావములు బాగున్నవి.

    4. శ్రీ సుబ్బారావు గారు: శివుని శుభప్రద హస్తము గురించి చెప్పేరు - బాగున్నది.

    5. శ్రీ రామకృష్ణ గారు: వామనమూర్తి హస్తమును అభివర్ణించేరు. మంచి పద్యము.

    6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: కలహానికి గాక సరసానికి అందించిన చేయి గురించి చెప్పేరు - బాగున్నది.

    7.శ్రీ జిగురు సత్యనారాయణ గారు: రతీదేవిని బోలిన కాంతతో కరచాలనము గురించి చెప్పేరు. బాగున్నది. పాణిగ్రహణము అయితే ఇంకా బాగుంటుంది కదా.

    8. శ్రీ సహదేవుడు గారు: ఆపదలలో ఆదుకొనే హస్తమును గురించి చెప్పేరు - బాగున్నది.

    9. శ్రీ మిస్సన్న గారు : అంగ వైకల్యము ఉన్న లేకున్నా వాళ్ళకి కాకుండా పెద్ద దొరలే భోంచేస్తున్న సౌకర్యముల గురించి చెప్పేరు. బాగున్నది. బకాసురుడి హస్తము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ సరస్వత్యై నమః:

    మిత్రులారా!

    అందరూ అనేక ప్రక్రియలలో పద్యములను వ్రాయాలి శంకరాభరణములో వానిపై ప్రశంసలు రావాలి అని నా ఆకాంక్ష. ఈ దిశలో శ్రీమతి లక్ష్మీదేవి గారు తొలి ప్రయత్నము చేసేరు. కృతకృత్యులు అయ్యేరు. ఇక్కడితో ఆమె ఆగిపోరాదు. అలాగే మిగిలిన మనమంతా అదే బాటలో నడచి వీలైనన్ని పద్యములను శంకరయ్య గారికి పంపుచుందాము ఒక దినచర్య గా. శ్రీమతి లక్ష్మీదేవి గారికి మరొక మారు శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. ఆర్యా!
    నమస్కారములు
    శంకరాభరణం బ్లాగులో ప్రచురణకు పద్యాలు వ్రాసి పంపే విధానాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  26. Sri H.V.S.N.Moorti garu!
    you may send the poems to the email address: Shankarkandi@gmail.com for consideration and publishing in Shankaranandam blog. Regards

    రిప్లయితొలగించండి
  27. ఆర్యా! ధన్యవాదములు
    అంబేడ్కర్ జయంతి సందర్భముగా వ్రాసిన మూడు పద్యములు మెయిల్ చేశాను.
    మరోసారి ధన్యవాదములతో
    మూర్తి.

    రిప్లయితొలగించండి
  28. వరము లిచ్చు తల్లి వరలక్ష్మి యెదపైన
    ప్రీతి మెఱయు కరము పింగ ళాక్షు
    కరుణ జూపి నాదు శిరముపై ముదమార
    కరము కరము మోద కరము గాదె !
    -----------------------------------------------
    భక్త జనుల పాలి పరమేశు డేతెంచి
    ముక్తి నియగ వారి భక్తి మెచ్చి
    అభయ హస్త మిచ్చి యాదు కొను వేళల
    కరము కరము మోద కరము గాదె !

    రిప్లయితొలగించండి
  29. కాళ్ళు కడిగి హేమ ఘటమందు జలముతో
    దనుజ లోక నాధు తమక మొంది
    దాన మీయ గోరు దాతగ నేనైతి
    కరము కరము మోద కరము గాదె !

    రిప్లయితొలగించండి
  30. పెద్దలందరికీ నమస్కారం.
    ఈ ఉత్సాహ -- అంటే పద్య రచన ఎలా ఉంటుందో కొంచెం వివరించ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  31. అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
    మీరు వ్రాసిన పద్యములలోని భావమును నాకు అర్థమయిన రీతిలో అన్వయించుకొని, నేను పద్యముల రూపములో నుంచుటకు నొక చిన్న ప్రయత్నము చేసితిని.

    వరములిచ్చు తల్లి వరలక్ష్మి ప్రీతితో
    నురముపైని నొప్పుచుండు శౌరి
    నాకు రక్ష యగుచు నా తలపై నుంచు
    కరము కరము మోదకరము గాదె?

    భక్తుల కరుణించి ముక్తి నిచ్చెడు వేల్పు
    పరమశివుడు మెచ్చి శిరముపైని
    అభయ హస్తమును సమాదృతి నుంచ నా
    కరము కరము మోదకరము గాదె?

    కాళ్ళు కడిగి హేమకలశ జలమ్ముతో
    హరికి దానమిచ్చు నట్టి వేళ
    దనుజనాథు కరము కనదే యశమ్ము నా
    కరము కరము మోదకరము గాదె?

    రిప్లయితొలగించండి
  32. శ్రీ వామనకుమార్ గారూ!
    శుభాశీస్సులు:
    ఉత్సాహ అనే పద్యము లక్షణములు:

    1. 7 సూర్య గణములు 1 గురువు ప్రతి పాదములోను ఉండవలెను
    2. 1వ అక్షరమునకు 5వ గణము తొలి అక్షరమునకు యతి సరిపోవలెను
    3. ప్రాస నియమము కలదు

    పోతనగారి భాగవతములో అనేక ఉత్సాహ వృత్తములు కలవు. చదవండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. వామన కుమార్ గారు,
    మీ ఉత్సాహమును గమనించి చెపుతున్నాను.
    నాకు తెలిసినంత వరకూ, ఉత్సాహ కు ఏడు సూర్యగణములు, ఒక గురువు ఉంటాయి. ప్రాసనియమము ఉంది. అంటే ప్రతిపాదములో రెండవ అక్షరము ఒకటే ఉండాలి. మొదటి అక్షరము లఘువు/ గురువు ఏదైనా అన్ని పాదాల్లో ఒకేరకంగా ఉండాలి.
    మొదటి అక్షరమునకు, ఐదవ గణము మొదటి అక్షరమునకు యతి.నాలుగు పాదాలుంటాయి.
    ఇంకేమైనా వివరాలుంటే పెద్దలు చెపుతారు. ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  34. పండితుల వారిచ్చు ప్రోత్సాహమునకు ఎంతైనా కృతజ్ఞురాలను.

    రిప్లయితొలగించండి
  35. నమస్కారములు
    గురువు గారి సహనమునకు ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి