5, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1103 (భరతునిఁ జంపె రాఘవుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్.
("అవధాన పద్మ సరోవరం" గ్రంథం నుండి)

26 కామెంట్‌లు:

  1. వరబల విక్రమోన్నతుని వాసవముఖ్య సురార్తి కారకున్
    పరమ శివార్చనారతుని పంక్తిముఖున్ స్మరబాణ బాధితున్
    పరవనితారతున్ భయద భండన రంగమునందు దుర్మదే
    భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమానివారూ!నమస్కారములు.
    శివార్చనారతుడైన రావణుణ్ణి పరవనితా రతునిగా దుర్మదేభ రతుని గా జూపి చక్కని పూరణ చేశారు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు మా సంతోషమును తెలియజేయుచున్నాను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  4. శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను వెళ్ళిపొమ్మనెన్
    మరణము లేదు నాకననుచు మానవులెంతని మేదినీ సుతన్
    కొరకొర జూచి కామమున, కొట్టగ వచ్చెను పోరనా విజృం
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  5. ధరణిజ హర్తనున్, సుర వితాన నియంతను, దైత్యభూపునిన్,
    వరబల గర్వితున్, శివుని భక్తుని, నష్ట దిశేశ శత్రునిన్,
    వరముని బాధకున్, దనుజ వంశ వినాశకు, రావణాఖ్యు, రం
    భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  6. నిరతము విష్ణుసేవలను నిర్మల మానసుడైన భృత్యునిన్,
    త్వరితము స్వామి సన్నిధిని తానునుఁ జేరగ నెంచు వానినిన్,
    పొరబడి పొందె శాపమ,ది పోవగ సంగరమిచ్చు ముక్తి లాభ
    రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  7. నిరతము విష్ణుసేవలను నిర్మల మానసుడైన భృత్యునిన్
    త్వరితము స్వామి సన్నిధిని తానునుఁ జేరగ నెంచు వాని, నా
    పొరబడి పొంద శాపమది పోవగ సంగరమిచ్చు ముక్తి లాభ
    రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరు విజృంభరతుడు అని వాడేరు. విజృంభణారతుడు అని వాడుట సాధువు. పరిశీలించండి.

    అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
    మీరు రంభరతుడు అని వాడేరు. రంభారతుడు అనుట సాధుప్రయోగము. పరిశీలించండి.

    అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీరు వానినిన్ అన్నారు. దానికి బదులుగా నాతనిన్ అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. నరికెను రామశీర్షమును తాఁజనకాత్మజకళ్ళముందె దా
    శరథిగతానెమారెను దశానను జానకిజూడనిట్టివౌ
    పరిపరి మాయలన్ సలిపి మైథిలిఁబాధలఁబెట్టినట్టి దం
    భరతునిఁజంపె రాఘవుడు భామినికైసురకోటిమెచ్చగన్ ||

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ రఘురాం గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో 1, 3 పాదములలో వేసిన అక్షరములకు యతి మైత్రి కుదురుట లేదు. సాధారణముగా ఏ వర్గమునకు చెందిన అక్షరములకు ఆ వర్గము చివరి అనునాసికముతో యతి చెల్లదు. కాని ఆ వర్గాక్షరములు బిందుపూర్వకములైనపుడు మాత్రము ఆ అనునాసికములతో యతి చెల్లును. స్వస్తి

    రిప్లయితొలగించండి
  11. గురుతుల్యులు పండిత నేమానివారికి నమస్కారములు. సాధుప్రయోగము కాకున్నను ప్రయోగించవలసివచ్చినది. తెలిపినందులకు ధన్యవాదములు. రంభకు బదులు దంభ, లోభ వ్రాయవచ్చుననుకొందును. సవరించినచో...

    ధరణిజ హర్తనున్, సుర వితాన నియంతను, దైత్యభూపునిన్,
    వరబల గర్వితున్, శివుని భక్తుని, నష్ట దిశేశ శత్రునిన్,
    వరముని బాధకున్, దనుజ వంశ వినాశకు, రావణాఖ్యు, దం
    భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యమునకు కొన్ని మార్పులు చేస్తూ వ్రాసేను - చూడండి:

    ధరణిసుతాపహర్తను, నధర్మపరాయణు, రాక్షసేశ్వరున్,
    వరబల గర్వితున్, గిరిశభక్తుని, దిక్పతివైరినిన్, మునీ
    శ్వరగణ బాధకున్, త్రిదశశాసను, దుర్మదు, రావణాఖ్యు, దం
    భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. బ్లాగు సోదర సోదరీ మణులకు నమస్కారములతో వ్రాయునది .. మన గురువులు శ్రీ శంకరయ్య గారు
    గ్రామాం తరమునకు ప్రయాణమై వెళ్ళు చున్నారుట . రేపు ఉదయము వచ్చుదురట . ఈ విషయము
    బ్లాగు నకు తెలియ జేయవలసినదని నాకు యిప్పుడే మెసేజి పంపిరి . గమనించ ప్రార్ధన .

    రిప్లయితొలగించండి
  14. పొరపడి నాగ్రహించి తగు పోరునుజేయగ నెంచి లేచు సో
    దరునికి జెప్పె కూడదని ,తారకరాముడనుగ్రహించె నా
    భరతుని ; జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
    పరమపవిత్ర జానకిని పట్టుకువెళ్లిన పాపి రావణున్ !!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.
    నేను సాధరణముగా చేయుచున్ననూ, ఎప్పుడూ గమనించని కొన్ని తప్పులను ఎంతో ఓపికతో సరిదిద్దుతున్న నేమాని మాష్టారుకు, శంకరయ్య మష్టారు గారికి ఎన్నో ధన్యవాదములు.

    సరిచేసిన పూరణ:

    నరికెను రామలక్ష్మణులనాజనకాత్మజ కళ్ళముందె దా
    శరథిగా తానెమారెను దశానను జానకిజూడనిట్టివౌ
    పరిపరిమాయలల్లి తనభార్యను బాధలఁబెట్టుచున్న దం
    భరతుని జంపెన్ రాఘవుడు భామినికై సురకోటిమెచ్చగన్ ||

    రిప్లయితొలగించండి
  16. విరతుల, మౌని ముఖ్యులను,విప్రులను బ్రోచెడి ధీరు డాత డే
    శరణను వారి రక్షగను చాపము దాల్చిన వీరు డై ధరన్
    పరమ ధర్మ రూపమున పాలన చేసి వరాంధు డైన దం
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  17. అయ్యా,
    మీ సవరణ బాగున్నది. అట్లే మారుస్తాను.
    సుబ్బారావు గారు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. సురగణ పూజితుండును ద్విజోత్తమ రక్షకుడైన రామచం
    దురు డలనాడు రాజ్యమును ద్రోసి యయోధ్యకు జేసి రాజుగన్
    భరతుని ; జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
    వరబల గర్వితుండగు నవారిత రాక్షస రాజు రావణున్.

    రిప్లయితొలగించండి
  19. ఆర్యా ! ధన్యవాదములు. సవరణ చేయుఛున్నాను.


    శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను వెళ్ళిపొమ్మనెన్
    మరణము లేదు నాకననుచు మానవులెంతని మేదినీ సుతన్
    మరి మరి చేరగోరు ఘన మందుడు నౌ పర దార సౌఖ్య లా
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  20. తరతమ భేద మెంచకను దారుణ హంతకు రావణా సురున్
    నరికిన పాప మంటదట నాదర మొప్పక రాజసమ్మునన్
    సరస వినోద మంచు సరసాంగిని పొందుట మోదమన్నయా
    భరతుని జంపె రాఘవుడు భామినికై సుర కోటి మెచ్చగన్ !

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో 3వ పాదమును ఇలాగ మార్చుదాము:

    "మరి మరి చేరగోరు విష మానసు రావణు భావజాత లా
    భరతుని......"

    రిప్లయితొలగించండి
  22. శ్రీనివాస్ గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో మొదటిలో ఒక లఘువు తక్కువగానున్నది. పరమకి బదులుగా వరమతి అని మార్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. చక్కని సవరణ సూచించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు...

    శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను వెళ్ళిపొమ్మనెన్
    మరణము లేదు నాకననుచు మానవులెంతని మేదినీ సుతన్
    మరి మరి చేరగోరు విష మానసు రావణు భావజాత లా
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులకు నమస్కృతులు...
    నిన్న రోజంతా ప్రయాణంలో ఉండడం వల్ల బ్లాగును చూసే అవకాశం లభించలేదు. రాత్రి 2.30 ఇల్లు చేరాను.
    చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు..
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గూడ రఘురామ్ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    ‘శీనా’ శ్రీనివాస్ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మిత్రుల పూరణ గుణదోషాలను పరామర్శించి, సవరణలను సూచించిన పండిత నేమాని వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. మురియుచు నూత్న సూత్రమున ముచ్చట మీర విభూతి మెత్తుచున్
    వరలుచు హైందవమ్మునను పాఠము నేర్చుచు నుల్టపల్టగా
    పరవశుడౌచు రాహులుడు పల్కెను కోవెల నిట్టి తీరునన్:
    "భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్"

    *******************************
    కంది శంకరయ్య గారి స్పందన:

    "ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ సరదా కోసం ప్రాతఃకాలాన పాపం రాహుల్ బలి అయ్యాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇప్పటిదాకా అందరూ ఇటువంటి పూరణలో శకారునో, త్రాగుబోతునో, పిచ్చివాడినో ఆశ్రయించేవారు. ట్రెండ్ మారుతున్నది!"

    రిప్లయితొలగించండి