7, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1105 (తేలును ముద్దులాడి చెలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

15 కామెంట్‌లు:

  1. మేలుగ పెండ్లియాడి మది మెచ్చిన వానితొ ప్రేమయాత్రకై
    చాలప్రదేశముల్ తిరిగి చక్కని తోటను సేద తీరగా
    కేలును జాపగా పతియు కిమ్మనకండను చేరి కౌగిటన్
    తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  2. మేలుగ పెండ్లియాడి మది మెచ్చిన వానితొ ప్రేమయాత్రకై
    చాలప్రదేశముల్ తిరిగి చక్కని తోటను సేద తీరగా
    కేలును జాపగా పతియు కిమ్మనకుండను చేరి కౌగిటన్
    తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  3. లీలగ జెప్పినాడ మన లీలల నన్నిటి తల్లిదండ్రికిన్
    కాలపుతీరుమారెగద కాదనలేరిక పెళ్లిచేయగన్
    చాలనె చాటుమాటు సరసాలు, వివాహపుసంబరాలలో
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నలన్ !!!

    రిప్లయితొలగించండి
  4. లీలగ మోపి వేణువును లేబెదవిన్ నడిరేయి, నాదపుం
    జాలును గూర్చుచున్ పరవశమ్ముగ, కౌగిట జేర్చు వెన్నుడా
    నీలను, పొంగగా వలపు నెమ్మది, ప్రేమ ఝరిన్ మునుంగుచున్
    తేలును ముద్దులాడి చెలి, తియ్యగ నవ్వును, పండు వెన్నెలన్!

    రిప్లయితొలగించండి
  5. పరదేశముఁ జనిన పతి పత్నిని గూర్చి తలపోయుచు.....

    లాలలు పోయుచున్ కథల రమ్యముగా వినిపించుచుండు, తా
    బాలుని సేవలన్ మురిసి ఫక్కున నవ్వుచు , కాచి తెచ్చితిన్
    పాలనుఁ ద్రావుమంచు పసి పాపని లాలనఁ జేయు మోదమున్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  6. పరదేశముఁ జనిన పతి పత్నిని గూర్చి తలపోయుచు.....

    లాలలు పోయుచున్ కథల రమ్యముగా వినిపించుచుండు, తా
    బాలుని క్రీడలన్ మురిసి ఫక్కున నవ్వుచు , కాచి తెచ్చితిన్
    పాలనుఁ ద్రావుమంచు పసి పాపని లాలనఁ జేయు మోదమున్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  7. చేలము దాచి గోపికల చిత్తము దోచిన నల్లనయ్య తా
    పాలను దొంగిలించు మురిపాలను పంచున నెంచి రాధికే
    మేలుగ చెంత చేరె తన మేనును మర్చియు రాసకేళిలో
    తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  8. తేలును మించు యవ్వనపు తేరున మన్మధ బాణఘాతముల్
    వాలుగ తాకినన్ వదనవారిజ దృక్కులు తేలగిల్లగన్
    తేలున మంచి కాలమున తీరము దాటెడి వీచి వోలె తాన్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్!!

    తేలున మంచి కాలమున = కర్కాటక / వృశ్చిక లగ్న సుముహూర్తమున

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘కౌగిట తేలిన’ మీ పూరణ సరసంగా ఉంది. అభినందనలు.
    ‘వానితొ’ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వాంతంగా వ్రాసారు. అక్కడ ‘మెచ్చిన రీతిగ’ అందామా?
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘పెండ్లి సంబరాలలో తేల్చిన’ మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నీలాకృష్ణులను పేమఝరిలో ముంచి తేల్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    పాపను లాలిస్తూ మోదంలో తేలిన తల్లిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శీనా శ్రీనివాస్ గారూ,
    రాసకేళిలో తేల్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పంచున నెంచి’ని ‘పంచగ నెంచి’ అందామా?
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ వృశ్చిక లగ్న పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. లీలగ నొక్క జంట పలురీతుల కమ్మని యాటపాటలన్
    దేలెడు వేళ పల్క పతి తేలును పట్టెద వొక్కొయంచు నీ
    కేలనొ శంకయంచు బలె యెర్రని చక్కెర వంట పాకపున్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండు వెన్నెలన్

    రిప్లయితొలగించండి
  11. రాలెను తారకల్ భువిని రత్నపు రాసులు కుమ్మ రించెనో
    చాలవు కుంద నంపు ఘన సౌరుల వన్నెల సోయ గంబులున్
    బాలుని మోమునందు తన పౌత్రుని తేజము గాంచి మోదమున్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండు వెన్నెలన్ !

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    మీ 'చక్కెర పాకపు తేలు' పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మాస్టర్ గారూ ! మీ సవరణ మెచ్చెడు రీతిగా నన్నది..
    ధన్యవాదములు
    సవరణతో...
    మేలుగ పెండ్లియాడి మది మెచ్చిన రీతిగ ప్రేమయాత్రకై
    చాలప్రదేశముల్ తిరిగి చక్కని తోటను సేద తీరగా
    కేలును జాపగా పతియు కిమ్మనకుండను చేరి కౌగిటన్
    తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  14. వీలుగ పెండ్లి యాడుచును వేదయ పాళెపు సత్రమందునన్
    నాలుగు తల్పులన్ బిగిచి నగ్నము చేయుచు సిగ్గువీడుచున్
    వాలుచు కౌగిలందునను భర్తను ఛాతిని పచ్చబొట్టునన్
    తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్

    రిప్లయితొలగించండి