8, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1106 (పెండ్ల మయ్యెను బార్వతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

22 కామెంట్‌లు:

  1. ఇరుగునను గల పార్వతి, పొరుగునఁ గల
    విష్ణువును వలచెను; మఱి విష్ణు వటులె
    ప్రేమఁ గొనఁ, బెద్ద లందఱుఁ బెండ్లి సేయఁ,
    బెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు!

    రిప్లయితొలగించండి
  2. ఆ త్రిమూర్తుల జంటల నరసి జూడ
    వాణి పెండ్లాము నలువకు, పార్థివునకు
    పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణువునకు
    పెండ్లమయ్యెను గా లక్ష్మి వేడుకలర.

    రిప్లయితొలగించండి
  3. విరహవేదన తోడ వేగుచునుండగ
    ....రామచంద్రుడు మహారణ్యమందు
    ఆ యార్తినిన్ బాపి యాతని కించుక
    ....యానందమును గూర్తు నని తలంచి
    భూమిజ రూపమున్ బొంది శైలాత్మజ
    ....రామచంద్రునికి దర్శనము నిచ్చె
    నతడు మాయావృతుండగు నంచు సీతగా
    ....భ్రమలోన పడునంచు భ్రాంతిజెంది
    ఆ విధమ్మగు దలపుతో నయ్యెడగన
    పెండ్లమయ్యెను బార్వతి విష్ణువునకు
    కాని రామచంద్రుడు నమస్కారములిడి
    యా జగన్మాతను నుతించె నాదరమున

    రిప్లయితొలగించండి
  4. విశ్వనాధుని దోడన విభవ మొప్ప
    పెండ్లి యయ్యెను బార్వతి, విష్ణువునకు
    లక్ష్మి తోడన జరిగెను లాస్య లాడ
    మేలు జరుగును బుడమి కి చేలు పండి .

    రిప్లయితొలగించండి

  5. శివుడు జెప్పెను వినుమని శివకు నాడు
    క్షీర జలధిని సుధలకై చిలుకు వేళ
    లక్ష్మి జనియించె కలుముల రాణి యగుచు
    పెండ్ల మయ్యెను పార్వతి! విష్ణువునకు.

    రిప్లయితొలగించండి
  6. రాజ్యమును వీడి దశరధ రాముడపుడు
    సీత నెడబాసిన పగిది శీతాద్రి సుత
    సీత గామారె రాముని శీల మెరుగ
    బెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు! ( ఇది ఒక పురాణాంత ర్గత మైన గాధ )

    రిప్లయితొలగించండి
  7. భువనమోహనునకు ఫణి భూషణునకు
    పరమ శివునకు పరితాపహరునకు తగు
    పెండ్ల మయ్యెనుబార్వతి:విష్ణువునకు
    మునిజనసురగణమునకు మోదమలర!!!

    రిప్లయితొలగించండి
  8. విష్ణు వేషము వేసెడు వేణునకును
    గౌరి పాత్రను ధరియించు గౌతమికిని
    పెండ్లి జరిగెను వారికి ప్రేమ కుదుర
    బెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు!

    రిప్లయితొలగించండి
  9. అరయ భేదము లేదట హరిహరులకు
    వాని భార్య వీనికి కాదె భార్య యనుచు
    కల్మషంబుతో వ్రాసెడి కవనమందు
    పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు!!

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారూ,
    పార్వతీవిష్ణులను ఇరుగుపొరుగు వారిగా చిత్రించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    విరుపుతో చక్కగా పూరించారు. అభినందనలు.
    కానీ ‘పార్థివుడు’ అంటే శివుడనే అర్థం ?
    *
    పండిత నేమాని వారూ,
    పూరణాశం యొక్క పూర్వపరాలను కథాసంగ్రహంగా చక్కని సీసవద్యంలో వివరించిన మీ నైపుణ్యం కొనియాడదగినది. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పార్వతి శబ్దాన్ని సంబోధనగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    మీరూ నేమాని వారి బాటనే పట్టి, వారు పెద్ద పద్యంలో చెప్పిన విషయాన్ని చిన్న పద్యంలో చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    పార్వతీ విష్ణులనే నటులకు పెండ్లి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    అధిక్షేపాత్మకమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మండు నేత్రము ఫాలమందుండు దొరకు
    వెండి కొండపై కొలువుండు దండి దొరకు
    పెండ్ల మయ్యెను బార్వతి :విష్ణువునకు
    విశ్వజనులకు మోదమౌవిధముగాను

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. యుగయు గమ్ముల కొకరీతి యోగ మాయ
    యవత రించెడి దేవత లనగ వారు
    అర్ధ నారిగ తానుండు భర్త శివుడు
    మోహినిగ మారి భ్రమి యించె మోద మలర
    పెండ్ల మయ్యెను పార్వతి విష్ణువు నకు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    =======*=======
    బ్రహ్మ విష్ణు శివులు వరులై నిలిచి యుండ
    వరుసగ వరియించె వాణి,దను ది
    గంబరునకు పెండ్ల మయ్యెను బార్వతి,
    విష్ణువునకు లక్ష్మి వేడ్క తోడ

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    ======*=========
    బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ వరము నొంది
    వాణిని వరియించె బ్రహ్మ,వాల్ల కాడు
    నందు వసియించు రేడు దిగంబరునకు
    పెండ్ల మయ్యెను బార్వతి,విష్ణువు నకు
    రయమున వర మాలను వేసె లక్ష్మి,సకల
    ముని గణములు పెండ్లిని జేసె పుడమి పైన,
    విశ్వ జనులెల్ల మెచ్చెడి విధము గాను
    కవులు వ్రాసిరి మెండుగ కవనమందు

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలోని లాజిక్ బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ (మొదటిది, తరువాతి విస్తరణ?) బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.

    బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అత్యుత్తమమైన స్థానములలో ఉంటారు. వారిని ఎల్లరిని సమాన భావముతో వర్ణించవలెను. బ్రహ్మ విష్ణులను మామూలుగా వర్ణించుచు శివుని వల్లకాడునందు వసియంచు రేడు దిగంబరుడు అనుట ఉచితముగా నాకు తోచుట లేదు. మన తలపులు, వాక్కులు, వ్రాతలు ఎంత పవిత్రముగా నుంటే అంత మనకే మంచిది. గ్రహించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. హబ్బో ....గురువులకు బోలెడు ధన్య వాదములు
    ప్రతి రోజూ ఫలితాలను భయం భయంగా చూస్తాను ఎన్ని తప్పులు ఉంటాయో ?? ....అని ....అందుకే ...ఈ రోజు బోలెడు ఆనందం

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకర గురువర్యులకు..త్వరపాటులో పార్థివ అను మాట పరమేశు అర్థములో ఉపయోగించాను ..తప్పే.. క్షంతవ్యుడను..సవరించుచున్నాను. ధన్యవాదములు.

    ఆ త్రిమూర్తుల జంటల నరసి జూడ
    వాణి పెండ్లాము నలువకు, పశుపతికిని
    పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణువునకు
    పెండ్లమయ్యెను గా లక్ష్మి వేడుకలర.

    రిప్లయితొలగించండి